‘రంగస్థలం’ కోసమే జీవితం అంకితం

‘రంగస్థలం’ కోసమే జీవితం అంకితం

July 22, 2013

  మాజీ ఐఏఎస్ అధికారి గుమ్మళ్ల బలరామయ్య ప్రభుత్వంలో వివిధ హోదాలను నిర్వహిస్తూనే, తాను స్వయంగా పాత్రలో పోషిస్తూ, రంగస్థల అభివృద్ధికి, ప్రాచుర్యానికి పెద్దయెత్తున కృషి చేశారు. రిటైరైన తరువాత మరింతగా ఈ రంగం అభివృద్ధికి నడుం బిగించారు.

నాటక రంగంపై అనంతమైన మమకారంతో పాటు, అభినయ పాటవం కూడా పెంచుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి గుమ్మళ్ల బలరామయ్య ఈ రంగం మీద ఇక మరింతగా శ్రద్ధ చూపించబోతున్నారు. ఇటీవల పదవి విరమణ చేసిన బలరామయ్య వీలయినంతగా రంగస్థలాన్ని అభివృద్ధి చేయడానికి పథకాలు సిద్ధం చేస్తున్నారు. అత్యున్నతమైన స్దాయి పదవీ బాధ్యతలు నిర్వహిస్తూనే నాటకాలలో వివిధ పాత్రలు పోషించిన ఈ మాజీ ఐఏఎస్ అధికారి తన జీవిత కాలంలో రంగస్థలం మీద అందుకున్న అవార్డులకు లెక్కే లేదు. నిజానికి ఓ ఐఏఎస్ అధికారిగా నాటకాల్లో పాత్రలు ధరించడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఆయన సుమారు 55 ఏళ్లుగా నాటకాలలో కొన్ని వందల పాత్రలు పోషించారంటే అందులో అతిశయోక్తేమీ లేదు. అ«ధికారానికి అతీతమైన కళాప్రతిభతో వేలాదిమంది అభిమానులను కూడగట్టుకున్న ఆయన తన అనుభవాలను వివరించారు. ఆయన అనుభవాలు, విశేషాలు ఆయన మాటల్లోనే….

చిత్తూరు జిల్లాలో మారుమూల ఉన్న మధుమాల పల్లెలో పుట్టి పెరిగిన నాకు మామూలు బడిలో కూడా చదువుకునే అవకాశాలు లేకుండా బాల్యం గడిచిపోయింది. అప్పట్లో చదువుకు అవకాశాలు లేకపోయినా, నాటకాలలో పాత్రలు ధరించడం మాత్రం బాగానే ఒంటబట్టింది. ఎలాంటి ఆస్తిపాస్తులూ, చదువులూ లేని ఇంట్లో అయిదుగురిలో ఆఖరి అబ్బాయిగా పెరిగాను. మా అమ్మ నన్ను బాగానే గారాబం చేసేది. చిన్నబడిలో కూడా చదువుకునే స్తోమత లేకపోవటంతో ఎలాగైనా ఎంతో కొంత చదువుకునేలా చేయాలన్న ఆమ్మ ఆరాటంతో మేనమామల ఊరు పూడిలో వీధి బడిలో ఓనమాలు నేర్చుకునే అవకాశం దక్కింది. అక్కడ తెలుగు పంతులుగారు సూరి చెప్పిన అక్షరాలు, ఆయన చెప్పే పద్యాలు నాకు తెలియకుండానే నాలో సంగీతం, అభినయాల పట్ల కూడా ఆసక్తి పెంచాయి.

నాకు అప్పట్లోనే నాటకాల పట్ల అభినివేశం మరీ మితి మీరి ఉండేది. 1953లో పుట్టిన నాకు 60-70 దశకంలో వచ్చిన నాటకాలలో ఏదో ఒక పాత్ర ధరించేలా అవకాశాలు వచ్చేవి. మొదట్లో పూడి గ్రామ పరిసరాల్లోని కళాకారులతో సన్నిహిత పరిచయాలు పెరిగాయి. గురప్ప పిళ్లె అనే పెద్దాయన ఆ రోజుల్లో చిత్తూరు జిల్లాలో బాగా పేరున్న కళాకారుడు. ఆ చుట్టుపక్కల చాలా మందికి నాటక రంగ గురువు. ఆయనే నాకు అభినయ పాఠాలు, పద్ధతులు నేర్పారు. అక్కడ జరిగే నాటకాలు అందులో పాత్రలు ధరించేవాళ్లు పరిచయం కావటంతో అందులోని లోతుపాతులు క్రమక్రమంగా అవగతం కావడం ప్రారంభించాయి. నేను మనసుపెట్టి నటించిన ‘రాతిమనిషి’ నాటికలో ఉత్తమ నటనకు బహుమతి వచ్చింది. హైస్కూలు చదువు పూర్తి చేసుకుని, శ్రీకాళహస్తిలో కళాశాలలో ప్రవేశించే నాకు ఓ రంగస్థల నటుడిగా పేరు వచ్చేసింది. అప్పటికే నాకు ఇబ్బడిముబ్బడిగా బహుమతులు కూడా వచ్చాయి.

చిన్నప్పటి నుంచే…
జిల్లాలో జరిగే పరిషత్తు నాటకాల్లో పాల్గొనడం, ఒక్కొక్కసారి బయటి ప్రాంతాలకు కూడా వెళ్లడం నాకు బాగా అలవాటైపోయింది. మా కాలేజీలో విద్యార్థుల సాంస్కృతిక సంఘానికి నాయకుడిగా ఉండేవాడిని. ఆ రోజుల్లో బాగా పేరున్న నాటకాలన్నీ మా బృందం ద్వారానే వేదికల మీద కనిపించేవి. పౌరాణిక నాటక రాజం శ్రీకృష్ణరాయబారం వేయటానికి 40తో కూడిన బృందం మా ప్రాంతంలో ఉండేది. అలా నాటకాలు వేయటంతో పద్యగానంతో పాటు సంగీతంలో కూడా పట్టు దొరికింది. ఏ మాత్రం స్వర దోషాలు లేకుండా ఆలపించేవాడిని. సాంఘిక నాటకాలు, నాటికల్లో ఎంతెంత దూరం, సుడిగుండం, చూడు చూడు నీడలు వంటి వాటిని అద్భుతంగా ప్రదర్శించాం. ఈ నాటకాలన్నీ నాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.

ఆ రోజుల్లో అందరూ ప్రతిష్ఠాత్మకంగా పరిగణించిన నెల్లూరు నెఫ్జా పోటీల్లో పాల్గొనటమే గొప్పగా ఉండేది. అందులో కూడా మేము ఉత్తమ బహుమతులు గెలుచుకున్నాం. తెలకం రాఘవయ్య అనే పెద్దాయన ఆ ప్రాంతంలో రంగస«్థల ప్రముఖుడు. ఆయన మమ్మల్ని మెచ్చుకుని ఎంతగానో ప్రోత్సహించేవారు. వరసగా నాకు ఉత్తమ నటుడుగా బహుమతులు రావటంతో నాటక రంగంలో ఇంకా పట్టు పెంచుకోవాలన్న తృష్ణ పెరిగింది. వీటి గురించి లోతుగా చదవటంతో పాటు కొత్త ప్రక్రియలపై కూడా దృష్టి పెట్టాను. నాకు బాగా ఇష్టమైన రచయిత్రి బీనాదేవి రాసిన ‘డబ్బు డబ్బు డబ్బు’ కథని ఏకపాత్రాభినయంగా మలిచాను. అందులో ఓ ఆటో డ్రైవర్ సొమ్ముల చుట్టూ తిరుగుతున్న మనుషుల జీవితాల్ని ఏకరువు పెడుతూ, చుట్టూ ఉన్నవాళ్లకి క«థలు కథలుగా చెపుతాడు. ఉత్తరాంధ్ర యాసలో ఆ పాత్ర మాటల్ని చిత్తూరు జిల్లా పలుకుబడికి అలవాటు పడ్డ నేను చెప్పి చూపించేవాడిని.

నాకు చిన్నప్పటి నుంచి ఎన్టీరామారావు అంటే చాలా ఇష్టం. వీరాభిమానిని. మా చిన్నప్పుడే శ్రీకృష్ణ పాండవీయం విడుదల అయింది. చాలా కష్టాలు పడి ఇష్టంగా చూసేవాడిని. ఆ ప్రభావంతో నేను స్వయంగా సుయోధన సార్వభౌమ, అశ్వద్ధామ పాత్రలను ఏక పాత్రాభినయాలుగా రూపొందించుకున్నాను. కాలేజీ స్థాయి నుంచి యూనివర్సిటీలో ఎం.ఎ చదవటం దాకా నాటక రంగం లో నా గమనం కూడా పెరిగింది. 1970 ప్రాంతాల్లో విస్తృతంగా వేదికల పైకి వచ్చిన ‘సంఘం చెక్కిన శిల్పాలు’, ‘ఆగండి కొంచం ఆలోచించండి’, ‘ఛాయ’ వంటి నాటకాలు మా మిత్ర బృందం అద్భుతంగా ప్రదర్శించింది. ఈ నాటకాలన్నిటిలోనూ నేను చక్కని పాత్రలు ధరించాను. అలా ఎన్నెన్నో నాటకాలు, అనుభవాలతో నా రంగస«్దల మైత్రి పెనవేసుకుపోయింది.

నటిస్తూనే, పోటీ పరీక్షలకు వెళ్లా…
ఆ కాలంలో అగ్ర స్థాయి పరిషత్తుగా పేరు సంపాదించిన రాజమండ్రి ఎల్.కె.ఎమ్‌లో నాటకం వేయటంతో పాటు అక్కడ అన్ని ప్రాంతాల నుంచి వచ్చే రంగస్థల ఉద్దండులతో కలిసిమెలిసి తిరగటం వల్ల నాకు చాలా విషయాలు ఆకళింపుకు వచ్చాయి. మరో వైపు చదువు పూర్తయి పోయి బతుకు దారిలో ముందడుగు వేసే ప్రయత్నాలు చేస్తుంటే గ్రూప్ 4లో సర్వీసు కమిషన్ ద్వారా ఎంపిక వర్తమానం వచ్చింది. సచివాలయంలో గుమాస్తాగా పని చేసే సమయంలోనే సిద్దప్ప నాయుడు. డిఎస్.ఎన్. మూర్తి, ఎర్రంనేని చంద్రమౌళి, రాధాకృష్ణమూర్తి వంటి వారి నాటకాలు చూడటం అలవాటు అయింది. అప్పటి రోజుల్లో కొడాలి గోపాలరావు రాసిన చైర్మన్, అప్పలాచార్య రాసిన మంచం మీద మనిషి వంటి నాటకాల్లో నేను ప్రధాన పాత్రలు పోషించాను. ఒక వైపు ఉన్నత ఉద్యోగాల కోసం పోటీ పరీక్ష లకు వెడుతుండడం, మరో వైపు నాటకాలలో నటించడం దాదాపు జమిలిగా సాగాయి. సర్వీసు కమిషన్ ద్వారా ముందుగా గ్రూప్ 1 సెలక్షన్, ఆ తరువాత ఐఎఎస్‌కు ఎంపిక కావడం జరిగిపోయాయి.

ప్రకాశం జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న కాలంలో పాటిబండ్ల ఆనందరావు రచించి, దర్శకత్వం వహించిన ‘పడమటి గాలి’ నాటకం చూడటం, ఆ బృందంతో పరిచయం పెంచుకోవడం జరిగింది. సుమారు 4 గంటలపాటు ఏకబిగిన సాగే ఆ నాటకంలో పాత్ర ధరించాలన్న కోరిక నన్ను మళ్లీ వేదిక మీదకి తెచ్చింది. చిన్న ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆంక్ష లు, పట్టింపులూ లేవు కానీ, ఉన్నతోద్యోగంలో మాత్రం ప్రభుత్వ నియమావళి ప్రతిబంధకం తెచ్చిపెట్టింది.. ఐఎఎస్ అధికారిగా ఉంటూ, నాటకాల్లో పాత్రలు పోషించడానికి నిబంధనలు అడ్డువచ్చాయి. ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే ‘ఇదేం విడ్డూరం’ అంటూ తిరస్కరించారు. నాటకాలవారికి సాంస్కృతిక రంగానికి ఆత్మీయబంధువు అయిన డాక్టర్ కె.వి. రమణకి ఈ విషయం తెలిసి, మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్సితో వాదించి, ఒప్పించి, అనుమతి ఇప్పించారు.

‘పడమటి గాలి’లో వేషంతో ఐఏఎస్ స్థాయిలో నటుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. తిరుమలలో జె.ఇ.ఒగా ఉన్నప్పుడు, ఆ తరువాత వివిధ శాఖల అధిపతిగా ఉన్నప్పుడు నాటకాలలో నటించడమో, వాటికి సన్నిహితంగా ఉండడమో జరుగుతూనే ఉండేది. నేను మే నెలలో పదవీ విరమణ చేసినా తెలుగు రంగస్ద్థలంలో మాత్రం చురుగ్గానే ఉండాలనుకుంటున్నాను. రాష్ట్ర సాంస్కృతిక శాఖకు కార్యదర్శిగా ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో కీలకమైన భాధ్యతలు నిర్వహించే అవకాశం దక్కింది. కె..వి. రమణ, సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్.వి. రమణమూర్తి. తెలుగు అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్దప్రసాద్, సంచాలకుడు కవితాప్రసాద్‌లతో కలిసి పలు ప్రత్యేకతల్ని ఆ సభలకు సంతరించి పెట్టాం. నాటక రంగానికి తగిన ప్రాధాన్యాన్ని కల్పించాం. మన నాటక రంగం ప్రత్యేకతలు, చరిత్ర, ప్రతిభావంతులు ప్రపంచ నాటక రంగానికి ఏ విధంగానూ తీసిపోని స్థితిలోనే ఉన్నట్టు ఖాయంగా చెప్పగలను.

కుటుంబమంతా సమష్టి కృషి
భార్య సుగుణశీల చిత్తూరు జిల్లా పూడి గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కుమార్తె సృజన సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయింది. నా కుటుంబమంతా రంగస్థల అభివృద్ధి పట్ల ఆసక్తి ప్రదర్శిస్తుంటుంది. నాకు నచ్చిన విశేషాలు, నా ఆలోచనలు కలగలిపి, నాకు నచ్చినవారితో కలిసి తెలుగు రంగస్థలానికి పూర్వ వైభవం తీసుకు వద్దామనే ఆలోచనలో ఉన్నాను. మనకున్న అద్భుతమైన సాహిత్య సంపదను రంగస«్థల వికాసానికి సంక్రమించేలా చేయాలని ఉంది. మంచి కథలు, ఇతివృత్తాలను నాటకాలుగా మలచటం బాగుంటుంది. ఆ దిశలో కొందరు సంప్రదిస్తున్నారు. బుల్లి తెరపై నాటకరంగ ప్రమాణాల పెంపుదలకు సాటిగా మేటి ప్రదర్శనలు, సింగిల్ ఎపిసోడ్‌లు వంటివి విస్తృతంగా జనరంజకం చేయాలన్న ఆలోచనలున్నాయి..మంచి రిపర్టరీని అభిరుచిగల కళాకారుల సమన్వయ కేంద్రంగా తీర్చిదిద్దాలని కూడా కొందరు సూచిస్తున్నారు. నాటక వికాసం కోసం నేను చేయగలిగిందంతా చేస్తాను. కలిసివచ్చేవారికి నా ఆహ్వానం. తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నా నాటకం అందివచ్చేలా చేయాలని ఉంది.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.