గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -17

  గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -17

ఖగోళ విజ్ఞాని –కాంట్

కాంట్ మహా తాత్వికుడు మాత్రమె కాదు మహా విజ్ఞాని కూడా .1755 లో కాంట్ ప్రతి పాడించిన ఖగోళ సిద్ధాంతాన్ని ‘’నేబ్యులర్ హైపాధిసిస్ ‘’అంటారు .ఈ మహా విశ్వం లో మహా ధూళి తో  కూడిన మేఘాలుకుదించుకు పోవటం వల్ల  సౌరగ్రహాలు ఏర్పడ్డాయని కాంట్ ప్రతి పాదించాడు .దీన్ని ఎవరూ మొదట్లో పట్టించుకో లేదు .1796 లో ఫ్రెంచ్ భౌతిక శాస్త్ర వేత్త ‘’లాప్ లెస్ ‘’స్వయం గా ఇదే సిద్ధాంతాన్ని మరిన్ని సాక్ష్యాలు ,రుజువులతో ప్రతి పాదించాడు .లాప్ లెస్ సిద్ధాంతమే ఇప్పటికీ అందరి ఆమోద యోగ్యమైంది .తర్వాత కాంట్ రాసిన గ్రంధం వెలుగు చూడటం టో దాన్ని ‘’కాంట్ –లాప్లేస్ ధియరీ ‘’గా ఆ ఇద్దరి పేర గౌరవం గా పిలుస్తున్నారు

కాంట్ క్రమంగా ఫిజిక్స్ నుంచి మెటా ఫిజిక్స్ వైపుకు సాగి పోయాడు .అయన కొనిగ్స్ బర్గ్ వదిలి  వెళ్ళనప్పటికి ఆయన మేధస్సు విశ్వ వ్యాప్తమైంది .విశ్వ రహస్యాలను  చేదిం చ టానికి జీవితాన్ని అంకితంచేసిన మహా మేధావి , ..క్రాంత దర్శి  కాంట్ ..అప్పటి వరకు ఉన్న వేదాంత విషయా లను ఒక సారి గుర్తుకు తెచ్చుకొంటేనే గాని కాంట్ విశిష్టత మనకు తెలియదు .జాన్ లాక్ అనే ఆయన పదార్ధం ,మనసు రెండూ ఉన్నాయని చెప్పాడు .బర్క్లీ మహాశయుడు పదార్ధం అనేది లేదని ,మనస్సు ఒక్కటే ఉందని అన్నాడు .హ్యూమ్ మాత్రం లాక్ తో ఏకీభవించాడు .ఫ్రెంచ్ తత్వ వేత్త వోల్టైర్ రీజన్ అంటే వివేచనఒక్కటే అందరికి దారి చూపిస్తుంది అన్నాడు .దీన్ని కాదంటూనే రూసో తత్వ వేత్త ఫీలింగ్ అంటే అను భూతి నే నమ్ముకోవాలన్నాడు .కాంట్ ద్రుష్టి పెట్టక ముందు ఇదంతా నానా కంగాళీ గా ఉంది .బుర్రలు బద్దలు కోవాల్సిన పరిస్తితి. ఒకరి మాట ఇంకొరికి గురిగా లేని స్తితి ..

మానవుడు దేనిని నమ్మాలో దేన్నీ ఆచరిన్చాలో తేల్చుకోలేని కంగారు స్తితి .వేదాంతం అనే నడి రోడ్డు మీద దిక్కు లేని స్తితి లో ఆ నాడు సాధారణ మానవుడు ఉండి  పోయాడు .ఎటూ తేల్చుకో లేక పోతున్నాడు .అసలు ప్రపంచానికి అర్ధం ,పరమార్ధం ఉన్నాయా ?ఉంటె ఎలా అర్ధం చేసుకోవాలి ?అనేవి అందరిని వేధిస్తున్న సమస్యలు .హ్యూమ్ రచనలు చదివిన కాంట్ తను ‘’తాత్విక మౌధ్యం ‘(డాగ్మాటిక్ స్లంబర్ నెస్ ‘)’నుంచి మేల్కొన్నట్లు చెప్పుకొన్నాడు .మనస్సు ఉందని ,మనస్సు ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటానికి సహక రిస్తుందని కాంట్ చెప్పాడు కొత్తగా .ఈ విధి విధానాన్ని నిర్ణ యించేది మనస్సు అని నిర్ద్వందం గా ప్రకటించాడు .

కాంట్ రాసిన మూడు మహా గ్రంధాలు

కాంట్ మహాశయుడు తన సిద్ధాంతాల నన్నిటిని మూడు మహా గ్రంధాలలో నిక్షిప్తం చేశాడు .మొదటిది ‘’క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ ‘’,రెండోది ‘’క్రిటిక్ ఆఫ్ ప్రాక్టికల్ రీజన్ ‘’,మూడవది ‘’క్రిటిక్ ఆఫ్ జడ్జి మెంట్ ‘’.ఇందులో మొదటిది చాలా ముఖ్యమైనది .దీని పునాది మీదనే మిగిలిన రెండు నిర్మించాడు .కాంట్ తాత్విక చింతన చాలా జటిలం .గజి బిజీ గా అనేక మెలికలు తిరుగుతూ నడుస్తుంది .కాంట్ భావాలతో బాటు ఆయన వాడిన భాష కూడా ఒక పట్టాన కొరుకుడు పడేదికాదు .అన్నీ కొత్త సిద్ధాంతాలే .అన్నీ కొత్త పారి భాషిక పదాలే .సంక్షిప్తత అనేది కాంట్ రచనల్లోకనినపించదు .మొదలు పెట్టి నప్పుడు చెప్పిన సత్యాలు మధ్యలోనే వదిలేస్తాడు .ఎప్పుడు ఎక్కడ ఎలా తేలుస్తాడో తెలీని గందర గోళం లో పడి  పోతాం ..అని ఆ నాడు అందరూ అనుకొన్న మాటే .’’జర్మన్ తత్వ వేత్తలు ‘ఎడమ చెవి దురద పెడితే కుడి చేత్తో గోక్కుంటారు ‘’అనే జోక్ ప్రచారం లో ఉంది .కష్టం గా చెప్పటానికి వీలుంటే సులభ మార్గం ఎందుకు /అని విసుక్కొనే వారట జర్మన్ తత్వ వేత్తలు  ..కాంట్ తన గ్రంధాన్ని ఓకే సమకాలీన తత్వ వేత్త కు ఇచ్చి చదవ మంటే సగం చదివి ,బుర్ర పోగొట్టుకొని తిరిగి ఇచ్చేశాడని చెబుతారు .కాని కాంట్ గ్రందాల పై వచ్చి నన్ని వ్యాఖ్యాన గ్రంధాలు ఇంక ఎవరి గ్రందాల మీదా రాలేదంటే కాంట్ గోప్పతనమేమిటో  తెలుస్తుంది

కాంట్ జీవిత చరమాంకం లో మతి పోయింది ,జ్ఞాపక శక్తి పోయింది .మానసిక ఆందోళన కు గురైనాడుకూడా .ఇన్ని అడ్డంకులు ఎదురైనా ‘’కాంట్ గ్రంధ దుర్గమ సౌధం లోకి  దారి వెతుక్కొంటూ ప్రవేశిస్తే ,మిరు మిట్లు గొలిపే సత్య దర్శనం చేస్తాం’’అన్నారు ‘’విశ్వ దర్శనం’’ రచయిత స్వర్గీయ నండూరి రామ మోహన రావు  .కాంట్ కు వ్యాప్తి లో ఉన్న తత్వ శాస్త్రం వేరు .ఆ తర్వాత వచ్చింది వేరు .వందేళ్ళకు పైగా తాత్విక జీవులను ప్రబావితం చేసిన ఘనత కాంట్ దే ..కాంట్ ప్రభావానికి గురైన వారిలో హెగెల్ ,మార్క్స్ ,బెర్గ్ సన్ ,జేమ్స్ ,జీన్ పాల్ సాత్రే ల వంటి మహా మేధావులెందరో ఉన్నారు .ఒక రకం గా చెప్పా లంటే అలనాటి గ్రీక్ తత్వ వేత్త లైన ప్లేటో ,అరిస్టాటిల్ తర్వాతి స్తానం నిస్సందేహం గా ఇమాన్యుయల్ కాంట్ దే .

మనిషి సహజ ధోరణి లో మంచి పనులు చేసినంత మాత్రాన అవి నైతిక చర్యలు అని ముద్ర వేయలేము .ఏది కర్తవ్యమో ,ఏది విధి నిర్నయిన్చిందో ,ఏది ధర్మమో తెలుసుకొని స్వేచ్చగా నిర్ణయాలు తీసుకొని చేసేదే నైతిక చర్య అని పిలువాబడుతుంది ‘’ఏ నీతి  సూత్రం విశ్వ జనీన నీతి  సూత్రం గా అంగీకరింప బడాలని వ్యక్తీ బావిస్తాడో ,ఆ నీతి  సూత్రం ప్రకారమే వ్యక్తీ ప్రవర్తించాలి .’’అనేది కాంట్ ప్రతి పాదించిన ‘’కేట గారికల్ ఇంపరేటివ్ ‘’.దీనికి తిరుగు లేదు .దీని వల్ల  వ్యక్తికొక నీతి, సూత్రం ,సమాజానికొక నీతి సూత్రం అనేది ఉండదు .అప్పుడే మానవు లందరి స్వేచ్చా ,సమానత్వాలను వ్యక్తీ అంగీకరించి నట్లు అవుతుందని కాంట్ భావించాడు

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-8-13-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.