రోమ్‌లో ‘రాట్న’ సందేశం – సుధీంద్ర కులకర్ణి

ఇటలీ రాజధాని రోమ్ నగరం ఒక అఖండమైన నగరం. అది ఎప్పుడూ మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. అయితే రోమ్‌లో ఈ మధ్యకాలం సరికొత్త ఆలోచనలు ముసురుతున్నాయి. ఆర్థిక మాంద్యం, మాజీ ప్రధాని సిల్వియా బెర్లూస్కొనీ తదితర అవినీతి రాజకీయ నాయకుల కారణంగా తలెత్తిన రాజకీయ అనిశ్చితి, వాటికన్ కొత్త పోప్ ఈ నగరాన్ని పర్యటించడం వంటి మూడు అంశాల కారణంగా ఈ వినూత్న భావాలు చిగురించాయి.
రోమ్, పోప్ కౌన్సిల్‌లోని మతాంతర చర్చా వేదికపై ‘రాట్న సంగీతం-ఇంటర్నెట్ యుగానికి మహాత్మా గాంధీ సందేశం’ అన్న నా పుస్తకం గురించి మాట్లాడేందుకు వచ్చాను. ‘విశ్వసించే సాహసం: మతాలు, సంస్కృతుల మధ్య చర్చ’ అన్న ప్రధాన అంశంపై ఏర్పాటైన అంతర్జాతీయ శాంతి సమావేశంలోనూ నేను పాల్గొంటున్నాను. పేదలకు సహాయం, మత విశ్వాసాల మధ్య సామరస్యం, వివాద-పరిష్కారం అన్న మూడు ప్రధాన కార్యకలాపాల లక్ష్యంగా పనిచేస్తున్న ఒక ధార్మిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆ సమావేశం జరుగుతోంది. మహాత్మా గాంధీకి ఆత్మీయమైన ఆ మూడు అంశాలపై చర్చ జరుగుతోంది.
ఇటలీకి చేరుకోవడానికి ముందే, మొత్తం ప్రపంచం నేడు మాట్లాడుతున్న విషయానికి సంబంధించి, పోప్ ఫ్రాన్సిస్ చేసిన ఒక ఉపన్యాసంపై నేను సోషల్ నెట్‌వర్క్ సైట్ ‘ట్విట్టర్’ నా అభిప్రాయాన్ని వెల్లడించాను. నైతికతలేని అర్థ శాస్త్రాన్ని గాంధీజీ తిరస్కరించినట్లే, సమకాలీన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హృదయ మందిరంలో ‘డబ్బు అనే విగ్రహ’ ప్రతిష్ఠ జరిగిందే కానీ ప్రజలకు స్థానంలేదని పోప్ చేసిన వ్యాఖ్యానాన్ని ప్రముఖంగా పోలుస్తూ ట్వీట్ రాశాను. సర్దీనియాలో హాజరైన నిరుద్యోగ యువతను ఉద్ధేశించి పోప్ ఆశువుగా చేసిన ఉపన్యాసంపై పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వచ్చాయి. అప్పటి నుంచి ఆయన పేదల పోప్‌గా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చారు. ‘డబ్బు విగ్రహారాధనకు వ్యతిరేకంగా మనమందరమూ పోరాడాల్సిందే. నైతికత కుప్పకూలి ప్రతి విషయంలో డబ్బే ప్రధానంగా రాజ్యమేలుతున్న స్థితికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలి. ఇలాంటి విగ్రహారాధన వ్యవస్థను రక్షించడంలో భాగంగా బలహీనులను, వృద్ధులను, నిరాశ్రయులను మనం నిర్లక్ష్యం చేశాము. చివరికి యువకులను సైతం మనం నిర్లక్ష్యం చేసి, తలదించుకు బతికేలా చేశాము’ అని ఆయన ప్రసంగించారు.
మనిషి ఆత్మగౌరవాన్ని పరిరక్షించడమే ఏసుక్రీస్తు, మహాత్మా గాంధీల బోధనల సారాంశం. వారిరువురి తాత్వికతను పోప్ తన ఉద్వేగభరిత ప్రసంగంలో అద్భుతంగా వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతున్న శాంతి సమావేశంలో బెర్లూస్కొనీ మద్దతుదారుల ముట్టడితో అస్థిరతకు గురైన ఇటలీ సంకీర్ణ ప్రభుత్వ ప్రధాని ఎన్రికో లెట్టా కూడా ప్రసంగించారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాద-పరిష్కారానికి ప్రయత్నించాలన్న గాంధీ బోధనను ఆయన తన ఉపన్యాసంలో ప్రధానంగా ప్రస్తావించారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చిన లెట్టా ఈ సమావేశానికి హాజరయ్యారు. సిరియాపై అమెరికా దాడిని అంతర్జాతీయ సమాజం ఆ సమావేశంలో గర్హించిందని ఆయన తెలిపారు. సిరియా సంక్షోభంపై ఐక్యరాజ్య సమితిలోని కీలక దేశాల మధ్య సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభం అయింది. దాంతో అమెరికా సైనిక దాడి వల్ల యావత్ ప్రపంచంలో ఏర్పడబోయే తీవ్ర పరిణామాల ప్రమాదం తృటిలో తప్పడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయని ఆయన అన్నారు. యుద్ధం చేయకుండా సిరియాలో రసాయనిక ఆయుధాలను నిర్మూలించాలని కీలక దేశాలు ఒక అంగీకారానికి రావడం ఒక ‘అద్భుతం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం ఐక్యరాజ్య వ్యవస్థ హుందాను, గౌరవాన్ని, ఉపయుక్తతను ‘ఎట్టకేలకు సంరక్షించింద’ని ఆయన అభివర్ణించారు. లెట్టా ఉపన్యాసం విన్న ప్రేక్షకులు సుదీర్ఘ హర్షధ్వానాలతో అభినందించారు.
ఇటలీలోనే కాకుండా యావత్ యూరప్‌లో వినూత్న ఆలోచనలు నేడు పరివ్యాప్తమవుతున్నాయని నేను అంటాను. ఆ దేశాలలోని ఆర్థిక, రాజకీయ వ్యవస్థల మధ్య ఏర్పడిన శూన్యత అక్కడి ప్రజల జీవితాలను నియంత్రించడం వారి మనసుల్లో ప్రతిబింబించడంతో నూతన భావాలు ఏర్పడ్డాయి. యూరోపియన్ దేశాలలోనే కాకుండా సుదూర దేశాల్లోనూ సర్వత్రా దైన్యం, విద్వేషం ప్రబలుతోంది. యూరప్‌లోని, ప్రపంచంలోని నైతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు దూరం కావడం వలన ఏర్పడిన విధ్వంసకర పరిణామాలను ఆ ప్రజలు గుర్తిస్తున్నారు. కొత్త పోప్ చేసిన ప్రవచనాలు వాటకన్ సంప్రదాయానికి భిన్నంగా సాగాయి. ఆయన తన ప్రవచనాల్లో మతాన్ని కొత్త కోణంలో దర్శించే ప్రయత్నం చేశారు. తమ మత విశ్వాసాలు, తాత్వికత, సంప్రదాయాలు గొప్పవనే ఆధిపత్య, వ్యతిరిక్త ధోరణికి భిన్నంగా ఇతర మతాల పట్ల గౌరవాన్ని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కొత్త పోప్ ప్రవచనాలు సాగాయి. వైవిధ్యభరితమైన ఈ ప్రపంచంలోని ఇతర మత విశ్వాసాల నుంచి, సంప్రదాయాల నుంచి నేర్చుకోవాలన్న ధోరణి ఆయన ప్రసంగంలో కనపడింది.
రోమ్ శాంతి సమావేశంలో నెలకొన్న ఇలాంటి ఆశాజనక వాతావరణంలో గతంలో గాంధీజీ రోమ్ పర్యటన విశేషాలు నా స్మృతి పథంలో మెదిలాయి. 1931 డిసెంబర్‌లో లండన్‌లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమైన అనంతరం భారత్‌కు తిరుగు ప్రయాణమైన గాంధీజీ మార్గమధ్యంలో ఇటలీని సందర్శించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఫలప్రదం కాదన్న విషయం గాంధీజీకి ముందే తెలిసినప్పటికీ, ఆయన యూరప్‌లో విస్తృతంగా పర్యటించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ పర్యటన ద్వారా సత్యం (ఆయన భావనలో యథార్థ మత సారాన్ని వెలికితీయడం), అహింస, విశ్వమానవ సౌభ్రాతృత్వం, మానవ ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేసేందుకు. అందరికీ న్యాయం అందించేందుకు అనువుగా అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో మౌలిక మార్పు రావాలన్న సందేశాన్ని ప్రచారం చేయాలని గాంధీజీ సంకల్పించారు. తన పర్యటనలో భాగంగా యూరప్‌ను రెండవ ప్రపంచ యుద్ధ మేఘాలు ఆవరించిన ఉన్న తరుణంలో, చాలా మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇటలీ నియంత ముసోలినీని ఆయన కలిశారు. నియంతలు, క్రూరులతో సైతం ఒక నియమబద్ధమైన చర్చ ద్వారా శాంతిని సాధించగలమన్న విశ్వాసానికి కట్టుబడి ఆయన ముసోలినీతో చర్చించారు.
వాటికన్ నగరానికి తీర్థయాత్రగా వెళ్ళడమనేది గాంధీ ఇటలీ పర్యటనలో కీలకమైనది. ఆశ్చర్యమేమంటే, గాంధీని కలిసేందుకు పోప్ నిరాకరించారు. క్రైస్తవ మత సారాంశం నుంచి వాటికన్ చర్చి పరాయికరణ చెందిందనేందుకు ఈ సంఘటన ఒక దృష్టాంతంగా నిలుస్తుంది. విశేషమేమంటే, వాటికన్ నగర మహత్వం గాంధీని పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. అయితే సిస్టైన్ చాపెల్‌లో దైవ పీఠంపై శిలువపై ఉన్న ఏసుక్రీస్తు శిల్పం చూసి గాంధీ మంత్రముగ్ధుడయ్యారు. ఇటలీ పర్యటనలో గాంధీకి సహకరించిన ఆయన విశ్వాసపాత్రుడైన అనుచరుడు మీరాబెన్ ఈ పర్యటన విశేషాల గురించి రాశారు. ‘వాటికన్‌లో శిలువ వేసిన ఏసుక్రీస్తు శిలను చూసినపుడు కలిగిన గాఢమైన అనుభూతి, ఈ పర్యటన మొత్తంలో ఎక్కడా నాకు కలగలేదు’ అని గాంధీ వ్యాఖ్యానించినట్లు మీరాబెన్ తెలిపారు. ఆ పర్యటన తర్వాత 17 ఏళ్ళకు గాంధీ తుపాకీ గుళ్ళకు బలి అయ్యారు. వాటికన్ ఏసుక్రీస్తు శిలువ చూసినపుడు తన బలిదానానికి చెందిన ప్రబోధనం ఆ విధమైన అనుభూతిగా ఆయనలో బయటపడిందా?
ఆనాడు వాటికన్ ప్రెస్ గాంధీ పర్యటనను గర్హించింది. అయితే, దశాబ్దాల అనంతరం, 1986లో న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద గాంధీజీ సమాధిని పోప్ జాన్‌పాల్ 2 సందర్శించినపుడు ‘నేను మానవ వీరుడు, మహావ్యక్తి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించేందుకు ఒక శాంతి తీర్థ యాత్రికుని ఇవాళ వచ్చాను. మహాత్మా గాంధీ జీవిత కృషి ఆంతర్యం, ఆతని రూపం మానవ జాతి చైతన్యాన్ని లోతుగా ప్రభావితం చేసింది’ అని పోప్ ప్రశంసించారు. ఇటలీకి చెందిన ప్రముఖ విద్యావేత్త మేరియా మాంటిస్సోరీ ఇటలీలో గాంధీ పర్యటన గురించి చాలా అందంగా, అద్భుతంగా, గొప్పగా అభివర్ణించారు. ‘గాంధీజీ స్ఫూర్తి మహా శక్తిమంతమైనది. వ్యక్తుల్లోని అంతరంగాన్ని, సూక్ష్మగ్రాహ్యతను అది సున్నితంగా స్పృశించి వారిని ఐక్యం చేస్తుంది.
ఆయనలోని ఈ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన శక్తిని ‘ప్రేమ’ అని పిలుస్తారు. ఆయన స్వదేశానికి ప్రయాణమవుతూ మార్గమధ్యంలో రోమ్‌లో కొన్ని రోజులు గడిపినప్పుడు ఈ విషయాన్ని నేను లోతుగా అనుభూతి చెందాను. ఈ పర్యటన సమయంలో ఆయన నేల మీద కూర్చొని రాట్నం వడికారు. ఆయన చుట్టూతా పిల్లలు చాలా ఆసక్తితో, నిశ్శబ్దంగా కూర్చొనేవారు. ఈ సందర్భంలో పెద్దలు సైతం కదలకుండా మౌనంగా ఆయన్ని చూస్తూ అనుభూతి చెందారు. ఆ సమయంలో అలా ఒక దగ్గర అందరూ గుమికూడి ఉండడమే విశేషం. గంభీరమైన ఉపన్యాసాల అవసరమే లేదు. ఈ ఆధ్యాత్మిక ఆకర్షణ గురించి మనం తప్పక ఆలోచించాలి. మానజాతిని సంరక్షించే శక్తి ఇది. ఇహపరమైన కోరికలకు కట్టుబడి పోకుండా, ఆధ్యాత్మికంగా పరస్పరం అనుబంధించే ఆకర్షణను అనుభూతి చెందే విధానాన్ని మనం నేర్చుకుంటే చాలు.’ అని మాంటిస్సోరీ రాశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న బ్రహ్మాండమైన సవాళ్ళను రోమ్‌లోని అంతర్-విశ్వాస శాంతి సమాశంలో చర్చిస్తున్న సమయంలో గాంధీజీ అద్భుత శక్తి ఈ పరిసరాల్లోనే ఉన్నట్లు నాకు అనుభూతమవుతోంది.
– సుధీంద్ర కులకర్ణి
(నేడు గాంధీ జయంతి)

