కష్టపడే తత్వం అక్కడే నేర్చుకున్నాను : పరుచూరి హనుమంతరావు

కష్టపడే తత్వం అక్కడే నేర్చుకున్నాను : పరుచూరి హనుమంతరావు

P

ప్రింటింగ్‌లో అత్యున్నత ప్రమాణాలకు పెట్టింది పేరయిన ‘ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్’నే తన ఇంటి పేరుగా మార్చుకున్న తొంభయ్యేళ్ల పెద్దమనిషి పరుచూరి హనుమంతరావు. ఆయనను ‘మీ ఊరేది’ అని కొద్దిగా కదిలిస్తే చాలు.. తొమ్మిదేళ్ల చిన్నపిల్లాడైపోయి, ‘పొలం పనులు చేసుకోవడం, బర్రెల్ని మేపుకోవడం, చెరువు ఒడ్డున చెక్కభజనలు చెయ్యడం, ఊరంతా బలాదూరు తిరగడం…’ అంటూ తాను పుట్టిపెరిగిన ‘చిట్టూర్పు’ గురించిన మైమరుపులోకి వెళ్లిపోతారు. ఆయన చెబుతున్న సొంతూరి విశేషాలే ఈ వారం ‘మా ఊరు’.

“1936లో కాలువలు వచ్చాక మా ప్రాంతమంతా మాగాణిగా మారిపోయిందిగాని, అంతకుముందు మా దివిసీమను అబిసీనియా అనేవారు. మా ప్రాంతానివీ, మనుషులవీ రూపురేఖలు అలా ఉండేవన్నమాట. కృష్ణా జిల్లా దివి తాలూకాలోని చిట్టూర్పు అనే గ్రామం మాది. తాలూకాలు రద్దయ్యి మండలాలు వచ్చాయి గనక మా ఊరు ఘంటశాల మండలంలో ఉందని చెప్పాలి ఇప్పుడు. నాకు ఊహ తెలిసేసరికి మా ఊళ్లో 200 – 300 ఇళ్లుండేవనుకుంటాను. దాదాపు అందరూ వ్యవసాయదారులు, కమ్మ కులస్తులే. ఇతరులు చాలా తక్కువ. ఊరెప్పుడూ ప్రశాంతంగా ఉండేది. ఎవరి పని వాళ్లు చేసుకోవడం తప్ప పొరపొచ్చాలు, గొడవలు ఏవీ ఉండేవి కావు.

మా నాన్నకు కట్నం
మా నాన్న నరసయ్య, అమ్మ శ్రీరామమ్మలిద్దరికీ చదువు రాదు. ఉన్న రెండున్నర ఎకరాల్లో పగలనక రాత్రనక కష్టపడేవాళ్లు. మెట్ట పొలాల్ని దున్నడం, విత్తనాలు జల్లడం, వేరుశెనగ పంట పీకడం, కాయ ఒలవడం – ఎప్పుడూ ఇవే పనులు చేస్తూ ఉండేవారు. ఇంట్లో నేను, మా అక్క ఇద్దరమే సంతానం. మా అమ్మ మరీ కష్టజీవి. పైన చెప్పిన పనులన్నీ చేస్తూనే రాత్రిళ్లు రాట్నం వడికేది. వచ్చిన నూలుతో నాకు బట్టలు కుట్టించేది. మా అమ్మానాన్నల పెళ్లయిన చాలాకాలానికి, అంటే నాకు ఊహ తెలిసిన తర్వాతే మా మేనమామలొచ్చి మా నాన్నకు కట్నంగా నాలుగు వందల రూపాయలు ఇవ్వబోయారు. మా నాన్న ‘నాకొద్దు, తీసుకోను’ అని మొండికేశాడు. అప్పుడు ఆ సొమ్మును మా అమ్మ తీసుకుంది. ఆ సమయంలోనే చల్లపల్లి సమీపంలోని అడవిని పొలాలుగా అమ్ముతారనే వార్త వచ్చింది. ఈ సొమ్ము పెట్టి, అక్కడ అడవిలో ఎకరం ఏభై రూపాయల చొప్పున భూమి కొంది మా అమ్మ. ఆ అడవిని చదును చెయ్యడం, దున్నడం – ఆ కష్టమంతా మళ్లీ వాళ్లిద్దరే పడ్డారు. అసలు మా చిన్నప్పుడు వరి అన్నం తింటారని కూడా మాకు తెలియదు. మొక్కజొన్న అన్నం, దానిలో వెన్నపూస, కారం వేసుకుని తినేవాళ్లం. మూడుపూటలా అదే.

అంగలూరు మాస్టారొచ్చారు
నేనెప్పుడు పుట్టానో నాకు సరిగ్గా తెలియదు. కాని 1924 జనవరి 16 అని బడి రికార్డుల్లో నమోదయింది. అంతే అనుకుంటాను. ఆనాటికి మా ఊళ్లో బడి లేదు. అందువల్ల నేనూ అమ్మానాన్నలతో పాటు వ్యవసాయప్పనులు చేసేవాణ్ని. ఎక్కువగా వేరుశెనగ పీకడం, కాయ ఒలవడం వంటివి చేసేవాణ్ని. ఈ పనుల్లేనప్పుడు మా బర్రెల్ని మేపేవాణ్ని. మాకు మంచి ఎడ్లు కూడా ఉండేవి. ఒకసారి వాటిని బండికి పూన్చి, బండి నిండా బస్తాలేసుకుని ఊరి వైపు వస్తున్నా. ఆ రోజు అట్లతదియ అనుకుంటా. మా ఇంటి నిండా ఆడవాళ్లున్నారు. తెలియక ఎవరో ఎడ్లను అదిలిస్తే అవి పరుగందుకున్నాయి. దాంతో నేను బండి మీద నుంచి కిందపడి స్పృహ తప్పిపోయాను. ఊళ్లో పిల్లలెవరికీ చదువు అబ్బడం లేదని అంగలూరు నుంచి ఒక ఉపాధ్యాయుణ్ని తీసుకొచ్చారు. ఆయన ఇంటింటికీ వచ్చి పాఠాలు చెప్పేవారు. తర్వాత నేను చల్లపల్లి బడిలో నాలుగో తరగతిలో చేరాను. మా తాతగారింట్లో ఉండేవాణ్ని. దగ్గర్లోని వక్కలగడ్డలో బోడి నారాయణరావు అనే ఆయన ఇంగ్లీషు బాగా చెప్పేవారు. ఘంటశాలపాలెం అక్కడికి దగ్గరే. ఆ ఊళ్లో అందరూ బాగా ధనవంతులనుకుంటాను, దాదాపు అందరూ డబ్బు వడ్డీలకిచ్చేవారు. మా ఆవిడ సీతాలక్ష్మిది ఆ ఊరే. చిన్నప్పుడు నేను ఆమెకు లెక్కలు చెప్పేవాణ్ని.

మునసబు చెప్పిన కిటుకు
దసరా వస్తోందంటే చాలు, మాకు పండగే పండగ. ‘పిల్లవాళ్లకు చాలు పప్పుబెల్లాలు, అయ్యవార్లకు చాలు ఐదు వరహాలు….’ అని బోలెడన్ని దసరా పాటలు, పద్యాలు పాడుకుంటూ ఇల్లిల్లూ తిరిగేవాళ్లం. ఎవరింటికెళ్లినా ఏదో ఒకటి చేతిలో పెట్టకుండా పంపేవారు కాదు. తినుబండారాలన్నీ తింటూ, చిల్లరకాసులు దొరికితే సంబరపడుతూ ఆ పదిపదిహేను రోజులూ ఆటవిడుపుగా గడిపేసేవాళ్లం. మా ఊళ్లో మునసబుగారని ఒకాయన ఉండేవాడు. ఆయన నాకు బాగా డబ్బు సంపాదించే మార్గం ఏమిటో ఒకసారి చెప్పాడు. ‘అబ్బాయ్, మనూళ్లో బాగా డబ్బున్నవాణ్ని చూసి ఒక పది రూపాయలు అడిగి తీసుకో. ఖర్చు చెయ్యకు. ఇస్తానని చెప్పిన రోజుకు తీసుకెళ్లి ఇచ్చేయ్. తర్వాత వంద రూపాయలు తీసుకో. మళ్లీ ఇచ్చెయ్యి. తర్వాత వెయ్యి, ఆ తర్వాత పదివేలూ తీసుకో. ఎప్పటిదప్పుడు చెప్పిన గడువుకు రెండు రోజుల ముందే ఇచ్చెయ్…’ అన్నాడు. ‘వాడుకోని దానికి డబ్బు అడిగి తీసుకోవడం ఎందుకు? అయినా ఇలా చేస్తే మనకు డబ్బెట్టా వస్తుంది’ అని అడిగాను. ‘అదే చెబుతాను వినరా. చివర్లో లక్ష రూపాయలు అడుగు. నువ్వు ముందు తీసుకున్నవన్నీ తిరిగిచ్చావుగనక అడగ్గానే లక్ష ఇస్తారు. అది పట్టుకుని ఊరు విడిచి మరో చోటికి పారిపో’ అన్నాడాయన నవ్వుతూ. అప్పటిదాకా నిజంగా ఏదో వ్యాపారం చెప్పేస్తున్నాడని జాగ్రత్తగా వింటున్నవాణ్నల్లా ‘చాల్చాల్లే పొండి. గొప్ప కబుర్లు చెబుతారు…’ అని నవ్వుకుంటూ వచ్చేశాను. కాని ఇప్పుడు ఎంతోమంది ఈ పద్ధతినే పాటించి మోసాలు చెయ్యడం చూస్తుంటే మా ఊరి మునసబు ఎంత తెలివైనవాడో అనిపిస్తుంటుంది.

చెరువు కతలు ఎన్నో…
మా ఊరి చెరువులో మేమంతా ప్రతిరోజూ చేసే స్నానాల దృశ్యాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. స్నానం తర్వాత పిల్లలంతా కలిసి చెరువు ఒడ్డునే చెక్కభజన చేసేవాళ్లం. తల్చుకుంటే ఇప్పటికీ భలే సంతోషమనిపిస్తుంది. నా చిన్నప్పుడు ఒకసారి ఏమైందంటే – మా ఊళ్లో ఒకేరోజున ముప్ఫైమందికి పూనకం వచ్చింది. ముందు మా ఊరి కోమటి భార్య గంగానమ్మ గుడికి వెళితే ఆమెకు వచ్చింది. గంటలోపే మిగిలిన వాళ్లందరికీ వ చ్చేసి తెగ ఊగిపోయారు. అది ఎలా జరిగిందో ఎంతాలోచించినా అప్పుడు అర్థం కాలేదు, ఇప్పటికీ ఆ వింతేమిటో అంతుబట్టదు. ఈ తొంభయ్యేళ్ల వయసులో కూడా ఆ దృశ్యాన్ని గుర్తుచేసుకుంటే భయం వేస్తుంది. ఒకసారి చల్లపల్లి దివాన్‌గారు మా ఊరొచ్చారు. ఊళ్లో చెరువును వేలం వేసి, ఆ డబ్బును దివాణానికి తరలించాలన్నది ఆయన ఆలోచన. ‘చెరువు ఊరిది. అందువల్ల ఆ డబ్బు మా ఊరికే ఉపయోగపడాలి. అలా కాదంటే వేలం పాడ్డానికే వీల్లేదు’ అని అడ్డుకున్నాన్నేను. ఊళ్లో అందరూ ‘నీకెందుకురా ఇలాంటి విషయాలన్నీ? చిన్నవాడివి, గమ్మునుండు’ అన్నారు. నేను వింటేనా? మొత్తానికి నా పంతమే నెగ్గింది. చెరువు వేలంపాటలో వచ్చిన సొమ్ముతో మా ఊళ్లో రవీంద్రుడి పేరు మీద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం. దానికి ఏభయ్యేళ్లు పూర్తయినప్పుడు నన్నూ మా ఆవిడనూ ఆహ్వానించి అక్కడో పూజ చేయించారు. మామూలుగానైతే నేను పూజలు చెయ్యను. కానీ మా ఊరివాళ్లు పట్టుపడితే కాదనలేక ఆ ఒక్కసారీ పూజలో కూర్చున్నాను. ఆ గ్రంథాలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. దాన్ని పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నాను.

ఎంత పెద్ద దేశమో…
1939లో అనుకుంటాను, మద్రాసులో ఆలిండియా స్కౌట్స్ సమావేశం జరిగింది. అదే మొట్టమొదటి సారి నేను రైలెక్కి మరో ఊరికి వెళ్లడం. ఆ సంబరాన్ని మాటల్లో వర్ణించలేను. రైలు ఏయే ఊళ్ల గుండా వెళుతోందో, ఏయే స్టేషన్లలో ఆగుతోందో – అవన్నీ పెద్ద యాత్రావిశేషాల్లాగా ఒక పుస్తకంలో ఎప్పటికప్పుడు రాసిపెట్టుకున్నా. ఆ సమావేశానికి దేశంలో అన్ని మూలల నుంచి విద్యార్థులు రావడంతో ‘మన దేశం ఇంత పెద్దదన్న మాట, ఇన్ని భాషలు, ఇన్నేసి సంస్కృతులు ఉన్నాయన్నమాట…’ అని తొలిసారి నాకు అర్థమైనది అప్పుడే. నా ఆశ్చర్యానికి అంతు లేదు.

బీజం అక్కడే పడింది
ఊళ్లో చిన్నప్పుడు నాకో కోమట్లబ్బాయి స్నేహితుడిగా ఉండేవాడు. వాడి పేరు సుబ్బారావు. మా ఇద్దరికీ ఒప్పందం ఏమంటే – వాడు నాకు రోజూ బెల్లమ్ముక్క పెట్టాలి. లేకపోతే కొడతానని భయపెట్టేవాణ్ని. అందుకని వాడు నాకు రోజూ బెల్లం పెట్టేవాడు, అది లేనప్పుడు ఇంకేమైనా అప్పచ్చులు పెట్టేవాడు. అలా చెయ్యడం తప్పని కూడా తెలియదప్పుడు. చిన్నప్పుడు ఊరంతా తెగ బలాదూర్ తిరిగేవాణ్ని. మా ఊళ్లో నన్ను కొందరు ముద్దుగా, కొందరు చిరాగ్గా ‘చిట్టూర్పు ఆంబోతు’ అనేవాళ్లు. వేములపల్లి రాఘవయ్య అనే మా ఊరాయన ఒకరు సాహిత్యం బాగా చదువుకున్నారు. ఆయన పద్యనాటకాలు రాసి, పదిమందిని పోగుచేసి వాటిని ఆడించేవారు. అలా ఆయన రాసిన హరిశ్చంద్ర నాటకంలో నాకు లోహితుడిగా వేషం ఇచ్చారు. చాలా రోజుల పాటు రిహార్సల్స్ వేసినా, చివరికి ఏవో పరిస్థితుల వల్ల మేమా నాటకాన్ని వెయ్యనేలేదు. ఆయన నాలో నాటిన విత్తనం తర్వాత చాలా పెరిగి పెద్దయింది. నాటకాలంటే ఇష్టం ఏర్పడింది. పాఠశాల రోజుల నుంచీ బుర్రకథలు, నాటకాలు వేసేవాణ్ని. పెద్దవుతున్నకొద్దీ నేను ఎస్ఎఫ్ఐలోను, ఇప్టా (ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్)లోనూ క్రియాశీలకంగా ఉండేవాణ్నంటే అది మా ఊరి చలవే. తర్వాత ప్రజానాట్యమండలిలో చురుగ్గా పాల్గొనడానికీ బీజం అక్కడే పడింది.

సాంఘిక చిత్రం మారింది
నా చిన్నప్పుడు సమాజం ఎలా ఉండేదో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు – మా ఊళ్లో ఒకమ్మాయికి చిన్నప్పుడే పెళ్లవడం, భర్త పోతే వితంతువు కావడం జరిగాయి. అప్పట్లో ఆమె కుటుంబ సభ్యులు పూనుకుని ఆమెకు మళ్లీ పెళ్లి చేశారు. దాంతో ఊరంతా ఆ కుటుంబాన్ని వెలి వేసింది. ఒక ఏడాదిపాటు వాళ్లింటికి చాకలి, మంగలి, కుమ్మరితో సహా ఎవరూ వెళ్లలేదు. తర్వాత నెమ్మదిగా మళ్లీ కలుపుకున్నారు. పరిస్థితి క్రమంగా మారుతూ వచ్చింది. మరొకసారి ఏమైందంటే – మా ఊళ్లో మల్లిపెద్దివారని, వాళ్లింట్లోని ఆడపిల్లకు పెళ్లి పెట్టుకున్నారు. మగపెళ్లివారు బండ్లు కట్టుకుని తరలివచ్చాక ఏదో గొడవ రేగింది. ‘పెళ్లయ్యాక చెబుదాం వీళ్ల సంగతి, ఆ పిల్లను రాచిరంపాన పెడదాం, వీళ్లేం చేస్తారో చూద్దాం’ అని మగపెళ్లివారు అనుకోవడం ఆడపిల్లవారికి తెలిసింది. ‘పెళ్లీ లేదు గిళ్లీ లేదు, చేసిన భోజనాలు చాలు. మా పిల్లనివ్వం మీకు. వచ్చిన దారినే తిరిగిపొండి..’ అని బెదిరించి పంపేశారు వీళ్లు. వాళ్లు తోకముడిచి వెళ్లిపోయారు. అంతా వెళ్లిపోయాక, ‘మన హనుమంతరావు ఏడున్నాడో చూడండ్రా…’ అని నాకోసం వెతికారు. ఎందుకంటే ఆ పిల్లనిచ్చి పెళ్లి చేద్దామని! ఆ విషయం పొక్కగానే నేను ఊళ్లో ఉండకుండా పారిపోయాను!!

మొదట్నుంచీ కమ్యూనిజమే
నేను చల్లపల్లి స్కూల్లో స్కౌట్ లీడర్‌గా ఉండేవాణ్ని, బాస్కెట్‌బాల్ బాగా ఆడేవాణ్ని. ఒకసారి మా తరగతి గోడ మీద ‘స్వతంత్ర భారత్‌కీ జై’ అని ఎవరో రాశారు. అలా రాసిందెవరో చెప్పాలని మా ప్రిన్సిపాల్ నన్ను నిలదీశారు. చెబితే ఆ విద్యార్థిని స్కూలు నుంచి తీసేస్తారని నాకు తెలుసు. అందుకని ‘నాకు తెలుసు. అయినా నేను చెప్పను…’ అన్నాను. దాంతో నన్ను స్కూలు నుంచి బైటికి పంపేశారు. నాయుడుగారని ఒకాయన చదువు ఏమీ లేకపోయినా మంచి మెకానిక్. ఆయన మా ఇంటికొచ్చేవాడు. ఆయన తీసుకెళ్లి నన్ను మచిలీపట్నం స్కూల్లో చేర్చారు. తర్వాత నా చదువంతా అక్కడే సాగింది. మా నాన్న నాకిచ్చిన పొలాన్ని అమ్మి హైదరాబాద్ సమీపంలో పొలం కొన్నాను. అక్కడికి వెళ్లినప్పుడు అచ్చం మా పల్లెలో ఉన్నట్టే ఉంటుంది. ఇప్పటికీ మా ఊరితో నాకు సత్సంబంధాలున్నాయి. అక్కడ జరిగే శుభకార్యాలన్నిటికీ వెళ్లొస్తూనే ఉంటాను.

పెరుమాళ్లు అలానే నటించాడు…
మా ఇంట్లో మేం నలుగురమే. కాని మా పెదనాన్నది మాత్రం పెద్ద కుటుంబం. మా ఇళ్లు పక్కపక్కనే ఉండే వి. పక్కపక్క ఇళ్లే అయినా మా నాన్న, పెదనాన్న పెద్దగా మాట్లాడుకునేవారు కాదు. ఏదైనా చెప్పవలసి వస్తే మా నాన్న పళ్లు తోముకుంటున్నప్పుడో, ఊరికే అరుగు మీద కూర్చున్నప్పుడో పెదనాన్న అటుగా నడిచి వచ్చి ‘ఫలానావాళ్లు ఫలానా ఊళ్లో పెళ్లని పిలిచారు. రేప్పొద్దున బయల్దేరితే బాగుంటుంది’ అని ఎవరితో చెబుతున్నాడో తెలియకుండా చెప్పేసి వెళ్లిపోయేవాడు. మా నాన్న మర్నాడుదయానికల్లా తయారుగా ఉంటే, ఇద్దరూ కలిసి ఒక్కముక్క మాట్లాడుకోకుండా వెళ్లొచ్చేసేవారు. ఆప్యాయతలున్నా అన్నదమ్ములు ఇలా కూడా ఉంటారని చెబితే ‘కలిసి ఉంటే కలదు సుఖం’ సినిమాలో పెరుమాళ్లు అచ్చం అలానే నటించాడు.

నా జీవితం…
తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ప్రదర్శనల్లో నేను పాల్గొన్నాను. కమ్యూనిస్టునైనందున అప్పటి ప్రభుత్వం రాజమండ్రి జైల్లో బంధించింది. ఆర్నెల్ల తర్వాత కడలూరు జైలుకు మార్చారు. ఏకే గోపాలన్, కడియాల గోపాలరావు, మోటూరి హనుమంతరావు, విశాలాంధ్ర ఎడిటర్ రాజగోపాలరావు వంటివాళ్లంతా అదే జైల్లో ఉండటంతో పరిచయాలు పెరిగాయి. జైలు నుంచి బయటికొచ్చి మద్రాసులో బియ్యే పూర్తిచేశాను. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ సందర్భంగా తరిమెల నాగిరెడ్డి, నార్ల వెంకటేశ్వర్రావు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటివారితో కలిసి పనిచేశాను. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశాలాంధ్ర పత్రికలో పనిచేశాను. తాపీ ధర్మారావుగారబ్బాయి చాణక్యతో కలిసి ‘నాగార్జున ఫిలిమ్స్’ ప్రారంభించి 1957లో హైదరాబాద్ వచ్చేశాను. సినిమాలకు నెగెటివ్ ఫిలిమ్ కొరత ఏర్పడటంతో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ సమయంలో వాసిరెడ్డి సీతాదేవితో కలిసి 1962 సెప్టెంబర్ 1న ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్ ప్రారంభించాను.

-అరుణ పప్పు
ఫోటోలు : లవకుమార్, సురేశ్ (ఘంటశాల)

 

 

Category:

– See more at: http://www.andhrajyothy.com/node/7610#sthash.hEhUplvm.dpuf

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.