బాధితుల బాధలను స్వీకరించి అనుభవించిన -యోగిని తెరేసి న్యూమన్
Posted on October , 2013 by విహంగ మహిళా పత్రిక
మనకు ఏ కష్టమో బాధో రోగమో వస్తే మహాను భావులనో యోగుల నో దర్శించి ఇంత విభూతి లేక పవిత్ర జలం,మంత్రం వంటివి పొంది ఉపశమనం పొందటం లోకం లో చూస్తున్న విషయమే .కాని రోగగ్రస్తుల రోగాలను తాను పొంది ఆ బాధలను స్వయం గా అనుభవించి, వారికి ఉపశమనం కల్గించటం మహా యోగులైన కొందరికే సాధ్యం .అలాంటి అరుదైన యోగిని జర్మని కి చెందిన తెరేసి న్యూమన్
జర్మని లోని .బవేరియాలో కొనిస్గేర్ స్యూద్అనే గ్రామంలో తెరేసి న్యూమన్ 1898 ఏప్రిల్ ఎనిమిది న జన్మించింది ఆమె కేధలిక్ మతావ లంబి .జీవితాంతం పుట్టిన ఊరిలోనే గడిపింది ‘’థర్డ్ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ‘’లో సభ్యురాలు .. పేద కుటుంబం .తండ్రికి అధిక సంతానం 1918 లో మార్చ్ పదవ తేదీన ఆమె మేన మామ ఇంట వంట పొయ్యి వెలిగిస్తూ ఒక బల్ల మీద నుంచి కిందపడి పాక్షిక పక్షవాతానికి గురైంది .ఇంకోసారి ఇలాంటి ప్రమాదమే జరిగి కంటి చూపు కూడా మందగించింది .చాలా కాలం మంచం మీదే ఉండటం వల్ల ఆమె శరీరానికి పుళ్లు ఏర్పడి ఎముకలు బయటికి వచ్చి ఎంతో నరకం అనుభ వించింది ఇదంతా ఆమె ఇరవై ఏళ్ళ వయసులోనే జరిగింది . 1919 కి పూర్తిగా గుడ్డిది అయిపొయింది పాపం .కానీ 1923 ఏప్రిల్ 29 ననాలుగేళ్ళకురోమ్ నగరం లో తెరేసి లూసేక్స్ కు బ్యీటిఫికేషన్ మత దీక్ష ఇస్తున్నప్పుడు న్యూమన్ కు అకస్మాత్తుగా చూపు వచ్చేసి అందరికి ఆశ్చర్యం కలిగించింది 1925 లో లూసేక్స్ ను రోమన్ కేధలిక్ చర్చ కి ‘’సెయింట్ ‘’గా ప్రకటించారు .ఆయన దయ వల్లనే తన కంటి చూపు రావటం ‘’బెడ్ సోర్స్’’ నయమవటం జరిగిందని తెరెసి చెప్పుకోంది..ఆమెకు హీబ్రు ,గ్రీక్ లాటిన్ భాషలు తెలుసు
1925 నవంబర్ ఏడు న న్యూమాన్ కు ‘’అపెండి సైటిస్ ‘’వచ్చి మళ్ళీ మంచం ఎక్కాల్సిన పరిస్తితి కలిగింది . ఆమె కు ఆపరేషన్ చేయించాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా వద్దని గట్టిగా అరచి తనను వెంటనే చర్చి కి తీసుకు వెళ్ళ మని కోరింది . అక్కడ ప్రార్ధన చేయ గానే అపెండి సైటిస్ మాయమయిందని ప్రకటించింది .1926 మార్చ్ అయిదు శుక్రవారం ఆమె కు గుండె పైన ఒక చిన్న పుండు ఏర్పడినట్లు అందులో యేసు క్రీస్తు, ఆయన శిష్యులు కన్పించి నట్లు తెలియ జేసింది . మార్చ్ పన్నెండు న మళ్ళీ క్రీస్తు మౌంట్ ఆలివేట్ పై దర్శనమిచ్చి నట్లు చెప్పింది ‘’క్రూసి ఫిక్సేషన్ ‘’కూడా ఆమె కు కన పడింది ఇలా చాలా సార్లు ఆమె క్రీస్తు ను దర్శించిన అను భూతి పొందింది .ఈస్టర్ఆదివారం నాడు క్రీస్తు పునరుద్ధానాన్ని చూసింది .దీని వల్ల ఆమె లో దైవీ శక్తులు చేరాయని అనుభూతి పొందింది .ఆమె లో వింత కాంతి వ్యక్తమైంది .కొందరు ఇవన్నీ ‘’హిస్టీరియా ‘’లక్షణాలని ,,’’మల్టిపుల్ పెర్సనాలిటి డిసార్దర్ (M.P.D.)అనీ అనుకొన్నారు .ఆమె ఎన్నో మహిమలను ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్య పరచింది
1922 నుండి 1942 లో చని పోయేంత వరకు తెరేసి ‘’పవిత్ర యూకారిస్ట్ ‘’తప్ప ఏ విధమైన ఆహారం తిన నే లేదు .అంటే నలభై ఏళ్ళు నిరాహారం గా ఉందన్న మాట .1926 నుండి మరణించే దాకా అసలు మంచి నీళ్ళు కూడా తాగ కుండా గడిపింది ఆ మాహాత్మురాలు ..ఏమీ తిన నప్పుడు శరీరం శుష్కించి, బొమికల పోగు గా ఉండాలి కదా .కాని ఆమె కు వయసు మీద పడుతున్న కొద్దీ బరువు పెరుగుతోంది ఇది మరీ విడ్డూరం గా అని పించింది డాక్టర్లకు …1927లలో 121 పౌండ్ల బరువుంటే 1935 లో140 ,1950 లో 200 పౌండ్లు ఉంది 1953లో 215 పౌండ్ల బరువుంది . జీవన క్రియలన్నీ సక్రమం గా ఉన్నాయి ఆమె కు ఈ బలాన్ని , ప్రాణ శక్తిని యేసు క్రీస్తు ఇస్తున్నట్లుగా బావించేది
1922 లో ఆమె ను చూడ టానికి గొంతు నెప్పి తో బాధ పడుతున్న యువకుడొకడు వచ్చాడు .అతని బాధ గమనించి తొమ్మిది రోజులు ప్రత్యెక ప్రార్ధన చేసి అతని వ్యాధిని తాను పొంది అతని నేప్పిని పోగొట్టింది .అప్పుడే ఆ కుర్రాడు అక్కడే ఆమె సమక్షం లో మొదటి ప్రార్ధన చేశాడు .ఇలా ‘’ఆమె ఎవరికీ తెలియ కుండా అనేక బాధలు పడేది. అవి ఇన్నీ అన్నీ అని,ఇన్ని రకాలని చెప్పలేము’’ అని ఆమె జీవిత చరిత్ర రాసిన వారు అన్నారు . పేదల ,రోగ గ్రస్తుల ,ప్రమాదాలలో మరణించే వారల ఆత్మ హత్యకు పాల్పడే వారల బాధలను తొలగించి వాటిని తనకు సంక్రమింప జేయ మని ఆమె అను నిత్యం యేసు క్రీస్తు ను ప్రార్ధించేది .అందుకే సాటి మానవుల కోసం అంత యమ యాతన అనుభవించేది .ఇది ఆమె నిత్య కృత్యం అయి పోయింది .ఆ జబ్బులను తానే స్వీకరించేది వారిని విముక్తులను చేసేది .ఇదంతా తానూ ఐచ్చికం గా నే చేస్తున్నాని ఏ ప్రతి ఫలా పేక్ష తనకు లేదని తన ప్రభువుకు విన్న వించు కొనేది .ఇతరులకు చెందిన ఇన్ని బాధలు అనుభ విస్తున్నా తెరేసి కాంతి వంత మైన కన్నులతో, ఏంతో సంతోషం గా చిరు నవ్వు తో చిన్న పిల్ల లాగ అమాయకత్వం గా హాస్య ప్రియం గా ఉండటం ప్రత్యేకత .
తెర్సి మహిమలను చూచే భక్తుల సంఖ్య మిలియన్లను దాటి పోతోంది .ఇందులో వందలాది డాక్టర్లు ఆమె కేస్ ను అధ్యయనం చేయటానికి వచ్చే వారు 1945 లో నాజీ ప్రభుత్వ పతనం తర్వాత అమెరికా నుండి అనేక స్థాయిలలో ఉన్న వేలాది మంది వచ్చి చూసి వెళ్ళే వారు .ప్రపంచం నలు మూలల నుండి ఎంతో మంది ఉన్నతాధికారులు సైనికులు ‘’జర్మనికి వ్యతిరేకం గా పోరాడిన దేశాల ప్రతినిధులు తీర్ధ యాత్ర లాగా వచ్చి ఆమెను సందర్శించి వెళ్ళే వారు .నాజీ దురాగతాలకు గురి అయిన వారందరికీ ఆమె ఆహారం,మందులు అంద జేసేది ..బాధితులు వస్తే ఓదార్చి ఉపశమనం కల్గించి పంపేది .
1945 ఏప్రిల్ 20 న తెరేసి లేని సమయం లో నాజీ సైనిక సార్జంట్ ఆమె కుటుంబ బంధువులను చంపటానికి ఆమెను తమకు స్వాధీనం చేయమని అడగటానికి వచ్చాడు .కానీ అప్పటికే అమెరికా బాంబుల దాడిలో ఆమె ఆశ్రమం దెబ్బతింది .ఆమెకు ప్రాణాపాయం తప్పింది .కానీ ఆమె దయకు అంతు లేదు కమ్యూనిస్ట్ పాలన లో వున్న వారికి కూడా ఆహార పొట్లాలను, మందులను ఉదారం గా సరఫరా చేయించి మాన వత్వాన్ని చాటుకొన్నది ..
1926 లో ఆమె తలపై కని పించిన తొమ్మిది పుండ్లు ఆమె చని పోయే వరకు అలానే ఉండి పోయాయి పెరగనూ లేదు ఇన్ ఫెక్షనూ రాలేదు .వాసనకూడా రాలేదు .అదీ విడ్డూరం .ఇవి యేసు క్రీస్తు తలపై ముళ్ళ వలన కలిగిన గాయాలుగా ఉన్నట్లు అందరూ భావించే వారు అందుకే ఆమె ను ‘’స్టిగ్మటా ‘’అంటే ‘’పుండ్ల (మచ్చల ) మనిషి’’ అన్నారు . ప్రతి క్షణం దైవీ శక్తి ,ప్రాణ శక్తి ఆమె లో నిండి నిబిడీ క్రుతమ య్యేవి .ఆమె నాలుక పై శక్తి పాతం ఉన్నది అని అందరు భావించే వారు ఆమె మాటలు దైవీ శక్తి పూరితాలుగా ఉండి ఉపశమనం కల్గించేవి
తెరేసి దైవ ప్రార్ధన తో ఎక్కువ కాలం గడిపినా మిగిలిన సమయాలలో ఇంటి పని ,పొలం పని,తోట పని చేసేది .బాధితుల ఉత్తరాలకు జవాబులు రాసేది రాత్రి పూట స్తానిక చర్చ లో నేలను ఊడిచి శుభ్రం చేయటం, పూలను అలంకరించటం చేసేది .విరామం ఎరుగని కర్మ యోగి గా జీవితం గడిపింది .వారం లో రెండు లేక మూడు గంటలు మాత్రమె నిద్రించేది మిగతా కాలం లో క్రీసు ధ్యానం లో రోగుల బాధలను తాను పొంది వారికి ఊరట కల్గించేది
ఇంతటి సార్ధక జీవితాన్ని గడిపి పరోపకారం గా జీవించి బాధితుల పాలిటి అపర దేవ దూత గా నిలిచి,ఎందరికో మార్గ దర్శనం చేసిన తెరేసి న్యూమన్ యోగిని 1962 సెప్టెంబర్18 న 64 ఏళ్ళ వయసులో దైవ దర్శనం పొంది సునాయాసం గా మరణించింది .
– గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
0

