శ్రీ దేవి భండా సుర వధ లో అంత రార్ధం -7
‘’కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాక్రుతిహ్-మహా పాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికా ‘’
పరమేశ్వరి సృష్టి అతి విచిత్రం గా ఉంటుంది ఆమె చేతుల పది వేళ్ళలో నారాయణుని పది రూపాలుఅయిన మత్స ,కూర్మ వరాహాదులుదేవి చేతి గోళ్ళ నుండే ఉత్పన్నమవుతాయి మానవ శరీరం దేవి గృహమే .అందువల్ల ఆ శరీరం లో ప్రతి అణువు దేవి కాంతి తో నిండి ఉంటుంది .ఆధ్యాత్మిక దృష్టిలో చూసినా మనిషిచేయి అన్నిటి కంటే ఉత్క్రుస్టమైనది. చేతులతోనే పరమాత్మ ను పూజిస్తాం తినటం త్రాగటం పని చేయటం అన్నీ వాటితోనే అంతేకాక ఇవ్వటం తీసుకోవటం భయపెట్టటం బెదిరించటం ఆశీర్వదించటం అభయమివ్వటం మొదలైన వాటికి చేతులే ముఖ్యాంగాలు .మన చేతి అగ్రభాగం లో లక్ష్మీ దేవి ,మధ్య భాగం లో సరస్వతీ దేవి ,మూల భాగం లో మాహేశ్వరి కాపురముంటారని చెబుతారు ‘’కరాగ్రే వసతే లక్ష్మీ- కరమధ్యే సరస్వతి- కర మూలేతు శర్వాణీ(గోవిందః )ప్రభాతే కర దర్శనం ‘’అని నిద్ర లేవ గానే మన చేయిని చూసుకొంటాం
జంతువులన్నిటికి చేతులున్నా మనిషి చేతులకే ప్రత్యేకతలున్నాయి కర్మలు చేయటం తో పాటు ఇవి మనస్వితకు కూడా ఉప యోగ పడతాయి .చేతిని,అరచేతిని తిప్పటం లోనే మనిషి వ్యక్తిత్వం బయట పడుతుంది .ఏ వ్యక్తీ చేతిలో ఎంత పవిత్రత, మనస్విత ,మధురిమ ఉంటాయో అతని వ్యక్తిత్వం అంత దివ్యమైనదిగా భావిస్తారు .మహేశ్వరి దివ్య హస్తం వరద హస్తమై లోకోత్తర భవ్యత ,దివ్యత ల తో నిండి ఉంటుంది .అందుకే ఆమె చేతి వేళ్ళగోళ్ళనుండే సమస్త చరాచర సృష్టి పుడుతుంది .ఆమె శక్తి ముందు మిగిలిన వేవీ సమానం కావు .
భౌతిక ద్రుష్టి లో ప్రపంచం లోని ప్రతి ప్రాణీ పశువే .కాని ఆధ్యాత్మిక దృష్టిలో అతడే పశుపతి నాధుడు కూడా .పశుపతి దయ వల్లనే మనిషి ఆలోచించటం ప్రారంబించి తనను తాను తెలుసుకొంటాడు .. –తనలో పశుపతి భావనను సాక్షాత్కారింప జేసుకొంటాడు .ఈ హిరణ్మయ చేతన అ నుభవం లోకి రాగానే అప్పుడు అజ్ఞానం అంతా తొలగి పోతుంది .నిజమైన జ్ఞానోదయమవుతుంది
భండాసుర సైన్యం అంతా పాశుపతాస్త్ర ప్రయోగం తో సర్వ నాశనమవుతుంది వాడి సారహీన నగరాన్ని ఆ జ్వాలలతో భస్మీపటలం చేస్తుంది శర్వాణి .వాడి మహా నగరం పేరే‘’శూన్య క నగరం ‘’అంటే నగర వైభవం అంతా శూన్యం అన్న మాట .అందులో తత్త్వం అనేది లేదని సారాంశం .భవనాలు సింహాసనాలు అధికారం భోగం వంటివి మనిషిని అమరుడిని చేయలేవు .దీన్ని ఇచ్చేది వాడి ఆత్మ జ్ఞానమే .దీనికి తోడూ బ్రహ్మ భావనా .దానిలోనే ఆనందం ఉంది .ప్రపంచం లోని సర్వ వస్తు సముదాయమూ శూన్యమే .సర్వాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడన్న ఎరుకయే అసలైన ప్రపంచసారం .ఇది సర్వ సంపూర్ణం .దీనికి బయటి సాధనాలు ఉపకరణాలు పని చెయ్యవు .’’అంటే శూన్యం నుంచి పూర్ణం ‘’వైపుకు ఆధ్యాత్మిక ప్రయాణం సాగాలి అని పరమార్ధం .
సశేషం
మూలా నక్షత్ర యుక్త సరస్వతీ పూజ శుభా కాంక్షలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-13- ఉయ్యూరు

