ఆ ఎనర్జీ షాద్‌నగరే ఇచ్చింది

ఆ ఎనర్జీ షాద్‌నగరే ఇచ్చింది

‘ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా, ఎన్ని దేశాలు చుట్టొచ్చినా.. ఆహా! సొంతూరిలో దొరికే ఎనర్జీయే వేరు’ అంటాడు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. తారాజువ్వలా దూసుకొచ్చిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ‘ఆంజనేయులు’,’తీన్మార్’, ‘గబ్బర్‌సింగ్’, ‘బాద్‌షా’, ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి పెద్ద సినిమాలు తీసి.. సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నా.. సొంతూర్లో దొరికే గుర్తింపు, గౌరవం మరెక్కడా దొరకదు అంటున్న ఆయన.. తన ఊరైన షాద్‌నగర్ గురించి చెప్పుకొచ్చాడు ఇలా..
“అప్పుడెప్పుడో 37 ఏళ్ల క్రితం…నాకు ఊహ తెలియని వయసులో వ్యాపారరీత్యా మా నాన్న షాద్‌నగర్‌లో అడుగుపెట్టాడు. రెండు వేల కోళ్లతో పౌల్ట్రీఫామ్ తెరిచాడు. ఇప్పుడది పది లక్షలకు చేరింది. వ్యాపారం బాగా జరుగుతోంది. షాద్‌నగర్‌లో మాకో భరోసా దొరికింది. వచ్చిన కొత్తలో వ్యాపారం నడుస్తుందా? అసలు బతగ్గలమా ఇక్కడ? అని నాన్న చాలాసార్లు భయపడిన సందర్భాలు లేకపోలేదు. కాని ఒక్క ఏడాది తిరిగేలోపు మా జీవితం అద్భుతమైన మలుపు తిరిగింది. వ్యాపారంలో మేము పెట్టిన ఒక్క రూపాయి కూడా నష్టపోలేదు. నేను పుట్టింది గుంటూరు జిల్లా పొన్నూరుకు దగ్గర్లో ఉండే తెలగాయపాలెం అనే చిన్న గ్రామంలో. కాని నాకు సొంతూరు అనే బంధం షాద్‌నగర్‌తోనే ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తరువాత ఆ ఊరికి రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. ఎప్పుడో ఒకసారి వెళ్తాం. అది కూడా తప్పనిసరి అయితేనే. నా మూలాలు ఎక్కడివైనా జీవితం ఇక్కడిది. నేను హైదరాబాద్ వచ్చి 25 ఏళ్లు అవుతోంది. వరుసగా మూడు రోజులు షాద్‌నగర్‌ను మిస్సయిన సందర్భమేదీ లేదు. అయితే, ఇప్పుడు అందరికీ తెలిసిన షాద్‌నగర్‌కు నేను చిన్నప్పుడు చూసిన షాద్‌నగర్‌కు ఎంతో తేడా ఉంది. అప్పట్లో అది కూడా సింగిల్ రోడ్ విలేజే. మహా అయితే ఊరు మొత్తం మీద ఒక కారు ఉండేదేమో.

సెలవు కోసం తపిస్తూ…
నాదంతా అల్లరి క్యారెక్టర్. అప్పుడప్పుడూ ఓ యాభై రూపాయలు కావాలంటే నాన్న జేబును వాడుకునేవాణ్ణి. నా చిన్నప్పటి నుంచే మా ఇంట్లో స్కూటర్ ఉండేది. ఇప్పటికీ గుర్తు… ఏబీకే 9543 దాని నెంబర్. అప్పుడప్పుడు నాన్నకు తెలియకుండా దానిపై తిరగడం సరదా. నాన్న పేరు నాగేశ్వరరావు. చాలా జాగర్త కలిగిన మనిషి. అమ్మ బహు నెమ్మది. ఏదైనా తప్పుచేస్తే కొట్టేవాడు నాన్న. ఫలానా విషయంలో కొడతాడు అని నాకనిపిస్తే ఆ రోజు ఆయన కంటికి చిక్కకుండా తిరిగేవాణ్ణి. పాపం.. అన్నయ్య మాత్రం దొరికిపోయేవాడు. నాన్నంటే భయమున్నా కొన్ని పనులు చేయక తప్పేదికాదు. నాకు స్కూల్ అంటే పడకపోయేది. ఎంతసేపు స్కూలుకు ఎలా డుమ్మాకొట్టాలా అనే కాన్సెప్టుతోనే బతికాను. నా తెలివినంతా దానికే ఉపయోగించేవాణ్ణి. వ్రతాలకు, పూజలకు కూడా సెలవు కావాలని తోటి విద్యార్థులను రెచ్చగొట్టి మరీ హెడ్మాస్టర్‌కు ఓ లెటర్ రాసి సెలవు సంపాదించేవాణ్ణి. కొన్నిసార్లయితే మ«ధ్యాహ్నమే ఇంటికి చెక్కేయడం అలవాటు. దారిలోనే లంచ్‌బాక్స్ తిని, నడుచుకుంటూ రావడం వల్ల సరిగ్గా స్కూల్ వదిలేసే టైమ్‌కు ఇంటికి చేరేవాణ్ణి. దాంతో ఇంట్లో వాళ్లకు నా మీద సందేహం వచ్చేది కాదు. ఇలాంటి కథలు బోలెడు!

నేను చదువుకున్నది మొగలిగిద్దలోని జిల్లాపరిషత్ స్కూల్‌లో. అది షాద్‌నగర్‌కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ స్కూల్‌కు మంచి చరిత్ర ఉంది. ప్రొఫెసర్ హరగోపాల్, మర్రి చెన్నారెడ్డి వంటి ప్రముఖులు చదువుకున్నారందులో. అదేంటో కానీ నాకు మాత్రం అనుకున్న రేంజిలో చదువు అబ్బలేదు.

అది బీభత్సమైన ప్లాన్…
అప్పటిదాకా మొగలిగిద్ద స్కూల్లో చదువుకున్న నేను పదో తరగతికి మాత్రం షాబాద్‌కు మారాను. అక్కడ సీటు లేదంటే పైరవీలు చేసి మరీ సంపాదించుకున్నా. ఇక్కడ సార్లు చదువు మంచిగ చెప్పట్లేదని చెప్పి ఇంట్లో వాళ్లను ఒప్పించాను. కానీ, నా ఫ్రెండ్స్‌కు విషయం తెలియలేదు. అసలు సీక్రెట్ ఏంటంటే.. మొగలిగిద్దలో టెన్త్‌లో చాలామంది డీబార్ అవుతున్నారు. షాబాద్‌లో కాపీయింగ్ బాగా నడుస్తోంది. మనకు కావాల్సింది అదే కదా. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ చేరాను. పదోతరగతి పాసయ్యాను. ఇంటర్మీడియట్ షాద్‌నగర్‌లోనే. ఆ మాత్రం చదువుకే ‘ఈ చదువు ఎప్పుడైపోద్దిరా బాబూ’ అని చాలాసార్లు అనుకున్నానంటే నమ్మండి. ఆదివారం వస్తే నాకు పండగ. స్కూల్ సెలవు కదా. మధ్యాహ్నం వరకు పౌల్ట్రీలో పనిచేసి ఆ తరువాత బయటపడేవాళ్లం. కాసేపు ఆటలు, షాద్‌నగర్‌లోనే ఓ సినిమా చూసి ఇంటికి వచ్చేవాళ్లం. మిగతా రోజుల్లో కూడా నేను ఇంట్లో ఉన్న సమయం చాలా తక్కువ. ఎప్పుడూ బయట తిరగడం అలవాటు. ఊళ్లో వినాయకుడి పండగ గ్రాండ్‌గా జరిగేది. నేను డ్యాన్సులు ఇరగదీసేవాణ్ణి. ఆ తొమ్మిది రోజులు పండగే పండగ. ఎవరూ ఇళ్లల్లో పడుకునేవాళ్లం కాదు.. మంటపాల్లోనే మకాం.

ట్రెయిన్ సరదా…
రైల్వేస్టేషన్‌లో గడపడమంటే ఇష్టం. ఎందుకంటే ట్రెయిన్‌ను చూడటం నాకో సరదా. అప్పట్లో షాద్‌నగర్ స్టేషన్‌కు ఎప్పుడో ఓ సారి ట్రైయిన్ వచ్చేది. ఎంతసేపైనా వెయిట్ చేసి దాన్ని చూసి సంబరపడేవాళ్లం. చిన్నప్పుడు చీకటి పడుతోందంటే నాకు చాలా భయం. ఆ టైమ్‌లో అమ్మ స్నానం చేయిస్తూ.. ఆ రోజంతా ఏమేం తప్పులు చేశానో గుర్తు చేసేది. గుర్తు చేస్తే ఫరవాలేదు కానీ, తప్పులన్నీ లెక్కచెబుతూ ఒక్క మగ్గు నీళ్లతో పాటు ఒక దెబ్బ వేసేది. నాన్నతో కూడా చాలాసార్లు దెబ్బలు తిన్నాను. ఒకసారి ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు 60 కిలోల మెక్కజొన్నల బస్తా ఎత్తుకున్నాను. అప్పటికీ నాన్న వద్దని మొత్తుకుంటున్నాడు. రెండడుగులు వేశానో లేదో కింద పడ్డా. నాన్న పరుగున వచ్చాడు. హమ్మయ్య కాస్త ఓదార్పు దొరుకుతుందనుకున్నా కానీ నన్ను పైకి లేపి విపరీతంగా కొట్టాడు. వద్దన్న పనిచేస్తావా అని!

అందుకే ఎన్‌సీసీ..
ఒక చదువు తప్ప ఇంకేపనైనా చేయడానికి భలే ఉత్సాహం చూపేవాణ్ణి. క్రికెట్, ఖోఖో అంటే చాలా ఆసక్తి. ఒకసారి వనపర్తిలో ‘ఖోఖో’ పోటీలు జరిగినప్పుడు బహుమతిని కూడా గెలుచుకున్నాను. నేను ఎన్‌సీసీ స్టూడెంట్‌ను కూడా. నిజానికి ఆ పోలీస్ డ్రెస్ వేసుకోవాలనే కోరికతోనే అందులో చేరాను. చదువు రాకపోవడంతో ఎంతసేపు ఏదైనా పని చేయాలని, డబ్బులు సంపాదించాలనిపించేది. తొమ్మిదేళ్లప్పుడే నాన్నతో పౌల్ట్రీ గురించి, రేట్ల గురించి మాట్లాడేవాణ్ణి. ఆయన కూడా ఓపిగ్గా అన్ని విషయాలు చెప్పేవాడు. బతుకుమార్గం మా ఊరే నేర్పించింది.

ఆ క్షణం భయమేసింది…
ఒకసారి వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి తోటలోకి వెళ్లాం. అందరూ బావిలో ఈత కొడుతున్నారు. నన్ను రమ్మన్నారు. నేను వద్దని చెప్పాను. అంతలోకే ఎవరో నన్ను బావిలోకి తోసేశారు. అసలు విషయం ఏంటంటే.. నాకు ఈత రాదు. నా అరుపులు, భయం చూసి మళ్లీ బయటకు తీశారు. అప్పుడు ఎంత భయమేసిందంటే చెప్పలేను. చచ్చిపోతాననుకున్నాను. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నేను వాటర్‌కు దూరంగా ఉండేవాణ్ణి. ఇప్పుడు కూడా తప్పదంటేనే బోట్ ఎక్కుతా. అయితే ఇప్పటికీ నాకు స్విమ్మింగ్ మాత్రం రాదు.

రాఖీతో…
మా ఇంట్లో ఆడపిల్లలు లేరని అమ్మ చాలాసార్లు ఏడవడం నాకు తెలుసు. అమ్మను ఓదార్చడానికి ‘నన్నే ఆడపిల్ల అనుకో అమ్మా’ అని చెబుతుండేవాణ్ణి. ఇక, రాఖీ పండగ వస్తే.. మా చిన్నాన్న కూతురు నాకు రాఖీ కట్టేది. మొదటిసారి కట్టినప్పుడే వెయ్యి రూపాయలు ఇచ్చాను. ఇప్పుడైతే లక్ష! రాఖీ పండగ నెల ముందు నుంచే ‘అన్నా బాగున్నావా? అంటూ టచ్‌లోకి వస్తుంది. మళ్లీ పండగ తరువాత ఫోన్ కట్.. ఒకట్రెండు సార్లు చెల్లిని ఏడిపిద్దామని రాఖీ పండక్కి ఇంటి దగ్గర దొరికేవాణ్ణికాదు. తను మాత్రం నేను ఎక్కడున్నా వెతికి పట్టుకునేది.

ఆ రెండు విషయాల్లో స్పెషల్
మాది ఉమ్మడి కుటుంబం. అమ్మా, నాన్న, మేం ఇద్దరం అన్నదమ్ములం. అందరం కలిసే ఉంటాం. నాకు ముగ్గురు పిల్లలు. ఒక పాప, ఇద్దరు బాబులు (కవలలు). అన్నకు ఇద్దరు పిల్లలు. దీపావళి, అయ్యప్పస్వామి పూజ…ఈ రెండు విషయాల్లో మా ఫ్యామిలీ స్పెషల్. మా చుట్టాలందరివీ పక్కపక్క ఇళ్లే. దీపావళి పండగకు మా బంధువులంతా మా ఇంటికే వస్తారు. షాద్‌నగర్‌లో ఎవరూ చేయని విధంగా దీపావళి జరుపుకుంటాం. ఆ రోజు ఖర్చుకు హద్దు ఉండదు. నేను శివభక్తున్ని. అయ్యప్పమాల వేసేటప్పుడు గురుస్వామితో పెద్ద పూజ నిర్వహిస్తాం. షాద్‌నగర్ మొత్తం మీద ఫస్ట్ పూజ మా ఇంట్లోనే జరుగుతుంది. ఊరివాళ్లంతా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటారు. 2004లో మా గృహప్రవేశానికి చిరంజీవి రావడం వల్ల కూడా షాద్‌నగర్‌లో మా కుటుంబానికి ఒక గ్లామర్ వచ్చింది.

ఈ స్థాయికి కారణం…
నేను యాక్టర్ కావాలనే లక్ష్యంతో హైదరాబాద్ రావడం… కాస్త గుర్తింపు తెచ్చుకోవడం.. తరువాత నిర్మాతగా మారిన నా ఈ స్థాయికి కారణం కూడా మా షాద్‌నగరే అని నమ్ముతాను. షాద్‌నగర్ నాకు ఎంతో చేసింది. సినిమా పరిశ్రమలో ఇప్పటికీ బండ్ల గణేష్ అంటే షాద్‌గనర్… షాద్‌నగర్ అంటే బండ్ల గణేష్! నాకు జన్మనిచ్చింది తల్లి అయితే బతుకునిచ్చిన తల్లి షాద్‌నగర్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు ఊరటనిచ్చేది మా ఊరే. నేను ఎన్నో దేశాలు తిరిగినప్పటికీ షాద్‌నగర్‌లో దొరికిన ఎనర్జీ నాకు ఇంకెక్కడా దొరకదు”
– మయన్న
ఫోటోలు: రాజ్‌కుమార్, ఎల్. మోహన్‌రెడ్డి

వృద్ధాశ్రమం నిర్మిస్తాను..
నా సినిమాల పిచ్చి వల్ల మా ఊళ్లో సినిమా థియేటర్ కట్టుకోవాలనే కోరిక ఉండేది. అందుకే పరమేశ్వర థియేటర్ కొనుక్కున్నాను. అదొక్కటే కాదు… నేనేం చేసినా మా ఊళ్లోనే చేయాలనిపిస్తుంది. ప్రతి శనివారం మా పిల్లలు షాద్‌నగర్‌లోనే ఉంటారు. ఆ జనం, ఆ కల్చర్ మిస్ కానివ్వం. మీరు నమ్ముతారో లేదో మా అమ్మ.. మా షాద్‌నగర్ అనే ఫీలింగ్ నాది. ఇప్పుడు అమ్మనాన్నల కోరిక మేరకు ఊర్లో ఒక వృద్ధాశ్రమం కట్టించబోతున్నాను. అది కూడా అత్యాధునికంగా ఉండాలనేది నా సంకల్పం. దానికి కాస్త టైమ్ పట్టవచ్చు. ఎప్పటికైనా కచ్చితంగా కట్టి తీరతాను. దానికి ‘అమ్మానాన్న’ అన్న పేరు కూడా నిర్ణయమైపోయింది.

మా ఊరు ఇచ్చిన గిఫ్ట్ ‘పవన్’
‘సుస్వాగతం’ సినిమా నుంచే పవన్‌కల్యాణ్‌తో పరిచయం. ఆ సినిమాలో నేనూ నటించా. ఆయన ఒకసారి షాద్‌నగర్‌లో భూమి కొనడానికి నా సహాయం తీసుకున్నారు. ఆ టైమ్‌లో మా బిజినెస్‌లు అవీ చూసి ‘నిన్ను నిర్మాతను చేస్తా’నని మాటిచ్చాడు. ఆ..చెప్తార్లెండి అనుకున్నాను.. కానీ ఆయన నన్ను ఈ రేంజ్‌కు తీసుకొచ్చాడు. ‘గబ్బర్‌సింగ్’ సినిమాతో నాకో స్థాయి ఇచ్చి మార్కెట్లో నిలబెట్టాడు. నాకనిపిస్తుంది…మా ఊరే లేకపోతే పవన్‌కల్యాణ్‌తో నాకు ఇంత అనుబంధం ఏర్పడేదా? అని. షాద్‌నగరే పవన్‌ను మా వైపు నడిపించింది. అందుకే పవర్‌స్టార్‌ను నాకు షాద్‌నగర్ ఇచ్చిన గిఫ్ట్‌గా భావిస్తాను.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.