దేవుళ్లకు చిత్రాభిషేకం

ఒకవైపు దుర్గా నవరాత్రులు, మరోవైపు తిరుమల దేవుడి బ్రహ్మోత్సవాలు… వెరసి దేవుళ్లందరూ భూమ్మీదికి దిగొచ్చేశారేమో అన్నంత కళగా ఉంది ఎటువైపు చూసినా. ఈ సమయంలో ఇష్టదైవాలను రకరకాలుగా పూజించి, శక్తి మేరకు కానుకలు సమర్పించుకుంటారు భక్తులు. విజయవాడకు చెందిన నందమూరి లతారాణి తాను స్వయంగా చిత్రించిన తంజావూరు కళాఖండాలతో దేవుళ్లకుఅర్చన చేస్తున్నారు.
దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన నాయక రాజుల కాలం నుంచి, అంటే కనీసం నాలుగు శతాబ్దాల కాలం నుంచి ప్రచారంలో ఉంది తంజావూరు చిత్రకళ. అందమైన లేత రంగులు, వాటిమీద అద్దే పల్చని బంగారు రేకులు, రవ్వలు, మంచి రత్నాలతో గొప్పగా తయారయ్యే ఈ చిత్రాలను ఒకసారి చూస్తే చూపు తిప్పుకోవడం కష్టం. ‘ఇరవయ్యేళ్ల క్రితం విజయవాడలోని ఒక ఎగ్జిబిషన్‌లో తంజావూరు చిత్రాలను చూసినప్పుడు నేను అలాగే నిలబడిపోయాను. వాటిలోని అందం, హుందాతనం నన్నెంత ఆకట్టుకున్నాయంటే, ఒకటి కొనుక్కు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే సరిపోదనిపించింది. వాటిని గియ్యడం, బంగారు రేకుల తాపడం – వాటన్నిటినీ నేర్చుకుని నేను సొంతంగా చేస్తే తప్ప మనసుకు సంతృప్తి లభించదని అర్థమైపోయింది…’ అని చెప్పారు లతారాణి. ఆ ప్రదర్శనలో పాల్గొన్న తంజావూరు కళాకారులను అభ్యర్థించి పదిహేను రోజుల పాటు ప్రాథమిక విషయాలను నేర్చుకున్నారు. పట్టు వదలకుండా ప్రయత్నిస్తూ ఆ కళలో నిష్ణాతురాలయ్యారు.
కొండంత కానుక
‘ఈ చిత్రాలు చెయ్యడానికి కావలసిన పల్చటి బంగారు రేకులు, విలువైన రవ్వలు – అన్నిటినీ చెన్నై నుంచి తెచ్చుకుంటాను. ఏడాది రెండేళ్లు తిరిగేసరికి నేను తయారుచేసిన తంజావూరు చిత్రాలతో ఇల్లంతా నిండిపోయింది. వాటినేం చెయ్యాలో తోచలేదు. అమ్మడం అనేది నా దృష్టిలోనే లేదు. దాంతో ఇంటికొచ్చిన బంధువులు, స్నేహితురాళ్లకు, కుటుంబ మిత్రులకు కానుకలుగా ఇవ్వడం మొదలెట్టాను. కొన్నిటిని మా అబ్బాయి పెళ్లికి ఆహ్వానపత్రికలతో పాటు బహుమతులుగా ఇచ్చాం. బాగున్నాయని అందరూ మెచ్చుకున్నారు. నేను పూజలు కూడా ఎక్కువగానే చేస్తుంటా. అలాంటప్పుడే – ఈ చిత్రాలను దేవుడికి కానుకగా ఎందుకివ్వకూడదు? అనే ఆలోచన నాలో మెదిలింది…’ అంటున్న లతారాణి, వెంటనే దాన్ని అమల్లోకి పెట్టేశారు. తెలుగువాళ్లకు దేవుడంటే తిరుమల వేంకటేశ్వరుడే. “వేంకటేశ్వరుణ్ని మామూలు క్యాలెండర్లో చూసినా తనివి తీరదు.
అలాంటిది ఆయనను తంజావూరు శైలిలో చిత్రిస్తే, ఇక ఆ వైభవాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు’ అనుకున్నారామె. భక్తిభావంతో మనసంతా నిండిపోయినప్పుడు కొండంత దేవుడికి కొండంత పూజ చెయ్యాలని ఎవరికైనా అనిపిస్తుంది. లతారాణి కూడా దీనికి మినహాయింపేమీ కాదు. దాంతో ఆమె పెద్దపెద్ద చిత్రాలను రూపొందించడం ప్రారంభించారు. 10 ్ఠ15, అంతకుమించిన సైజుల్లో ఆమె రూపొందించిన బొమ్మలను స్వామికి సమర్పించడం ప్రారంభించారు. అలా ఆమె వేసిన వేంకటేశ్వర కల్యాణ దృశ్యాలు క్యూలైన్‌లో భక్తులకు కనిపించేట్టు రంగనాథ మంటపం చుట్టూరా పెట్టారు. బ్రహ్మోత్సవ దృశ్యాలు వైభవస్వామి మంటపంలో కొలువుతీరాయి. ఇంకొన్ని చిత్రాలను తిరుపతి మ్యూజియమ్‌లో ప్రదర్శనకు ఉన్నాయి.
ఇదొక పూజ
దేవాలయానికి వెళ్లేప్పుడు అందరూ పువ్వులు తీసుకెళతారు. లతారాణి మాత్రం ఏ దేవాలయానికి వెళ్లినా, ఆ దేవుడి చిత్రాన్ని తీసుకెళ్లి సమర్పించడం అలవాటుగా పెట్టుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మను దేవీ నవరాత్రుల్లో పది రకాల రూపాల్లో అర్చిస్తారు. వాటన్నిటినీ భారీ చిత్రాలుగా రూపొందించి ఇచ్చారు లతారాణి. మన రాష్ట్రంలోని శ్రీశైలం, భద్రాచలం, సింహాచలం, అన్నవరం, మంగళగిరి వంటి క్షేత్రాలకే కాకుండా, తమిళనాడులోని చిందబరం, కంచిలతో పాటు వైష్ణోదేవి మందిరానికీ తంజావూరు చిత్రాలను బహుమతిగా ఇచ్చారామె. అంత భారీ చిత్రాలను రూపొందించడానికి కనీసం రెండు నెలలైనా పడుతుంది. చిత్రీకరణకు “వాటిని చిత్రిస్తున్నప్పుడు మాటల్లో చెప్పలేని ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతుంటాయి.
ఆ దేవీదేవతలు స్వయంగా వచ్చి కూర్చుని నాతో చిత్రిస్తున్నట్టు తాదాత్మ్యం చెందుతుంటాను..” అని చెబుతున్నారు లతారాణి. చిత్రాలను దేవాలయాలకు ఇచ్చేముందు ఇంట్లో పూజచేసి పట్టువస్త్రాలు, నైవేద్యం సమర్పిస్తారామె. ‘ దైవం ఆనందంగా స్వీకరించిన అనుభూతి కలుగుతుంటుంది ఆ సమయంలో… ఏ తల్లికైనా పిల్లలు పట్టుచీర పెడితే ఆమె ఆనందంగా ఆశీర్వదించదూ, దేవుడు నా బహుమతి స్వీకరించిన అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను” అని కూడా చెప్పారామె. చిత్రించడం ఒకెత్తు అయితే వాటిని అక్కడవరకూ చేర్చడం మరొక ఎత్తు. దానికి చిత్రాలకైనంత ఖర్చు, శ్రమ అవుతుంటాయి. అయితే దేనికీ వెరవరు ఆమె. ఈ తరహాలో మొత్తం వెయ్యి చిత్రాలను వివిధ దేవాలయాలకు సమర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు లతారాణి.
– అరుణ పప్పు
ఫోటోలు : ఎన్. సాంబశివరావు, విజయవాడ
దాచుకో, నేచేసిన పూజలివి
“భగవంతుడి పట్ల భక్తిని ప్రదర్శించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క పద్ధతి. అన్నమయ్య 32వేల సంకీర్తనలను రాసి కృతార్థుడయ్యాడని మనకు తెలుసు. ‘దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి…’ అన్నాడు కదా ఆయన. నేను మరీ వేలకొద్దీ చెయ్యలేనుగాని, కనీసం 32 తంజావూరు చిత్రాలను వేంకటేశ్వరస్వామికి సమర్పించగలిగితే, నా జన్మ ధన్యమైనట్టే భావిస్తాను. దానిలో భాగంగానే కల్యాణ క్రమాన్ని, బ్రహ్మోత్సవాల్లో స్వామి అధిరోహించే పది రకాల రథాలు, పది అవతారాలను చిత్రించి సమర్పించాను. చివరి శ్వాస వరకూ చిత్రిస్తూనే ఉంటాను.”
వీటికి కాస్త చోటిస్తే….
నందమూరి లతారాణి రత్నశాస్త్రాన్ని బాగా చదువుకున్నారు. భారతీయ హస్తకళలంటే ఆమెకు చాలా గౌరవం. తెలుగులోగిళ్లలో వాటికి తగినంత చోటు కల్పించాలన్న ఉద్దేశంతో విజయవాడలో కొన్నాళ్లు ‘కళావర్షిణి’ అన్న షోరూమ్‌ను నడిపారు. ‘రోజ్‌వుడ్ ఇన్‌లే, తంజావూరు పెయింటింగ్స్, రాజస్థానీ మార్బుల్ ఆర్ట్, శాండల్‌వుడ్ కార్వింగ్… ఇవి ఐదూ మన దేశంలో శతాబ్దాలుగా విలసిల్లుతున్న సంపదలు. మైసూర్ మహారాజ భవనం కానివ్వండి, రాజస్థాన్ కోటలు కానివ్వండి – ఎక్కడైనా ఈ ఐదు హస్తకళలూ తప్పక కొలువుదీరి కనిపిస్తాయి. కాని ఇప్పుడందరూ వాటిని నిర్లక్షం చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ధరించే నగలకు ఖర్చుపెడతారు తప్ప, ఫర్నిచర్‌కు పెట్టరు. నగ ల్లాగా ఈ కళాకృతులు కూడా హోదాకు చిహ్నాలే అని గుర్తించాలి. ఆర్థిక స్థాయిని బట్టి కుదిరితే పెద్దపెద్దవి, లేకపోతే కనీసం చిన్నచిన్న కళాకృతులనైనా ప్రతి ఇంట్లోనూ పెట్టుకుంటే – ఆ కళలను, వాటిని రూపొందించే కళాకారులను మనం కాపాడుకున్నట్టే కదా…’ అంటున్నారు లతారాణి.

