మరుగున పడిన మతాలు –మతాచార్యులు -37

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -37

జాన్ లాక్

జాన్ లాక్ ఇంగ్లాండు దేశం లో బ్రిస్టల్ నగరం దగ్గర రింగ్ టన్ లో  1632ఆగస్ట్29 న జన్మించాడు .వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చదివి ఇరవై వ ఏట ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో చేరాడు కాని పూర్తీ చేయలేదు వైద్య ,మోడరన్ సైన్స్ల మీద ద్రుష్టి సారించాడు .ఆష్లీ రాజు గృహ వైద్యుయ్యాడు .రాజు తో పరిచయం రాజకీయాలు దారి తీసింది .ఒక వర్తక సంస్తకు కార్య దర్శి గా పని చేశాడు .మూడేళ్ళు ఫ్రాన్స్ దేశం లో ఆరోగ్యం బాగు పర్చుకోవటానికి ఉండి పోయాడు .1679 లో ఇంగ్లాండ్ కు మళ్ళీ వచ్చాడు .శాఫ్త్స్ బరీ రాజు సహచరుడు గా ఉండటం వాళ్ళ తీవ్ర వాదిగా అనుమానింప బడ్డాడు .రాజు1682లో  హాలండ్ కు పారి పొతే లాక్ కూడా అక్కడికే చేరాడు .1689 లో విలియం రాజు మేరీ రాణి సింహాసనం అధిష్టించే దాకా అక్కడే ఉండి పోయాడు .సర్ ఫ్రాన్సిస్  సుశాం తో ఓ.ట్స్ వద్ద నివాసం ఉన్నాడు .1704 లోఅక్టోబర్28 న  72ఏళ్ళ వయసులో అక్కడే చని పోయాడు .”ఫాదర్ ఆఫ్ క్లాసికాల్ లిబరలిజం ”అని లాక్ ను గౌరవం గా పిలుచు కొంటారు . బ్రిటిష్ మేధా పరంపరలో లాక్ ఒకడు .రాజకీయ వేదాంతాన్ని ,ఎపిస్ట మాలజి  ని వ్యాప్తి చేసిన చింతనా పరుడు.  ”continuation of consciousness తో వ్యక్తిత్వాన్ని రుజువు చేసి మొదట వ్యాప్తి చేసినవాడు లాక్ అతని ప్రభావం కాంట్ ,రూసో హ్యూమ్ ల పై అధికం . వోల్టైర్ ,రూసో భావాలకు స్కాటిష్ ఎన్ లైటేన్మెంట్ థింకర్స్ కు అమెరికన్ రివల్యూష నరీలకు లాక్ భావాలే ప్రేరకాలైనాయి అమెరికా లో డిక్లరేషన్ ఆఫ్ ఇండి పెండెంన్స్ పై లాక్ ప్రభావం ఉంది

Inline image 2  An Essay Concerning Human Understanding (1689)  A Letter Concerning Toleration (1689)   Some Thoughts Concerning Education

John Locke Signature.svg

జ్ఞానం ఉత్పత్తి ,నిశ్చయత్వం పరి మితి అనే విషయాల మీద చింతన చేశాడు జాన్ లాక్ .An essay concerning human understanding ‘’అనే ఉద్గ్రంధం రాశాడు మొదట్లో ఏమీ లేకుండా ఉండే మనస్సు తను గ్రహించిన భావాలను దాని పై రాసుకొంటుంది .భావం అంటే ఆలోచించేటప్పుడు అతని బోధకు ఏది విషయం అవుతుందో అది అన్నాడు .భావాలు అంతర్భావాలు ,అంతర్భూత తత్వాలను సత్యాలను నిరాకరించాడు .మనస్సు మూడు రకాలుగా భావాలను గ్రహిస్తుంది .ఇంద్రియాల ద్వారా ,గ్రహిస్తుంది .రెండు సంశయించటం , తో ఆలోచించటం అనే ‘’అను చింతన ‘’ద్వారా గ్రాహిస్తుంది.మూడు –ఒక వస్తువు ఇంకో దాని పై మార్పు తెచ్చినప్పుడు అంటే ‘’ప్రత్యక్ష అనుచిన్తన’’ద్వారా గ్రహిస్తుంది అంటాడు లాక్ .

 

ఘనత్వం ,విస్తృతి ,ఆకారం ,చలనం అనేవి ద్రవ్యం లోని ప్రతి కణానికి చెందిన గుణాలు అన్నాడు .వీటిని’’ ప్రైమరీ క్వాలిటీస్’’అని పిలిచాడు ద్రవ్యం లో ఇంద్రియ గోచరాలు కాని సూక్ష్మ ద్రవ్య భాగాల నిర్మాణం ఉంది వాటికి చలనమూ ఉంది .వీటి వల్లే రంగు రుచి ధ్వని మొదలైన శక్తులు ద్రవ్యానికి వచ్చాయి అని చెప్పాడు .వీటిని ‘’సెకండరి క్వాలిటీస్’’ అన్నాడు .భౌతిక ద్రవ్యం మానసిక ద్రవ్యాల స్వరూపం మనం తెలుసుకోలేమన్నాడు లాక్. ద్రవ్యం అవిజ్ఞాతం అన్నాడు అది మనలో భావాలను కలగా జేసే శక్తి ఉన్న గుణాలకు అధిష్టానం అని మాత్రమె చెప్ప గలిగాడు .

ఈశ్వర అస్తిత్వాన్ని ఆవిష్కరించటానికి అవసరమైన సత్తా అనే వాదాన్ని లాక్ నిరాకరించాడు మానవ అస్తిత్వమే దేవుని అస్తిత్వం అన్నాడు జాన్ లాక్ .మన భావాల్లోని పరస్పర సంవాదమే వస్తు తత్త్వం యొక్క జ్ఞానాన్ని మనకు అంద జేస్తుంది అన్నాడు .అంటే గుణాలు ప్రకృతిలో స్వంత అ స్తిత్వాన్ని కలిగి ఉంటాయి .గుణాలు ఏ ద్రవ్యం లో ఉన్నాయో అలాంటి ద్రవ్య విషయమై ఇంద్రియాలు మనకు అంద జేసే వాస్తవిక అనుభవాల వలన మనకు వస్తువుల యదార్ధ జ్ఞానం లభిస్తుందని లాక్ అభి ప్రాయం

లాక్ చెప్పిన జ్ఞాన సిద్ధాంతం వల్ల  కీర్తి బాగా పెరిగింది .నైతిక సూత్రాలను రాజ నీతికి ,మతానికి తన సిద్ధాంతాలను అన్వయించటం కోసమే లాక్ జ్ఞానం యొక్క పరిమితి ,ప్రామాణ్యాలను పరిశీలించాడు .నైతిక సూత్రాలకు తార్కిక ఆధారాన్ని కల్పించే ప్రయత్నం చేశాడు .అయితే ఇందులో పెద్దగా ముందుకు వెళ్ళ లేక పోయాడు .ప్రతి మనిషి ఇతరులతో సమ్యక్ బుద్ధి ,అంతరాత్మను కనుగొన గలిగిన ప్రకృతి నియమాల ననుసరించి మెలగితే అందరు మనుషులు సమానం గా భావించి తన ,ఇతరుల ప్రాణాలకు స్వాతంత్ర్యాలకు ఆస్తులను కాపాడటానికి నేర శిక్షను తనకున్న శక్తి యుక్తులను సద్వినియోగం చేసుకొంటే దేశం సుభిక్షం గా ఉంటుంది అన్నాడు లాక్ పండితుడు .రాజుకున్న నిరంకుశ అధికారాన్ని లాక్ ఖండించాడు .సామాన్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాజు చట్టాలు చేసి అమలు చేయాలని కోరాడు .ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం గా ఉన్న చట్టాలను ,,ప్రభువును తిరస్కరించే అధికారం ప్రజలదే అని నిర్ద్వందం గా చాటి చెప్పాడు జాన్ లాక్ మహాశయుడుదీనినే ఉదార వాదం అన్నాడు

మత  విషయం లో కూడా ఈ ఉదార వాదాన్ని వ్యాప్తి చేశాడు లాక్ .దేవుడు వంచకుడు కాదన్నాడు .ఈశ్వర ఆవిష్కారం అంతా సత్యమే అన్నాడు దేవుని అస్తిత్వ ప్రచారం కోసం ఏర్పడ్డ మతసంస్తల ప్రయోజనాలు ప్రభుత్వ ప్రయోజనాలకు భిన్నమైనవి .ప్రభుత్వం అంటే ప్రాణం స్వతంత్రం ఆస్తి హక్కు వంటి పౌర హక్కులను కాపాడే సమాజమే అని నిర్వచించాడు .రాజ కీయ ధర్మాలకు ప్రత్యెక మత విశ్వాసం అవసరం కాక పోయినా ,స్వధర్మాన్ని నిర్వహించటానికి దేవుని పై నమ్మకం చాలా అవసరం అని తేల్చి చెప్పాడు జాన్ లాక్  .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-10-13- ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.