నిరతాన్నదాత బందా పరదేశి గారు ( 1700 – 1785 )

                                           నిరతాన్నదాత బందా పరదేశి గారు  ( 1700 – 1785 ) 
      శ్రీ బందా పరదేశి గారు  17వ శతాబ్దం వారు , శ్రీ  వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారి సమకాలికులు , వీరి స్వస్థలం వేటపాలెం, వృత్తి కరిణీకం, భక్తి ప్రపత్తులతో భగవదర్పితముగా  పనులు చేయటం వీరి ప్రవృత్తి , ఏకాదశీ వ్రత నిష్టాపరుడు  , అతిధి సత్కారము చేయని దినము ఆయన జీవితములో లేదనిన అతిశయోక్తి కాదు . పన్నెండు సంఖ్యకు తక్కువ కాకుండా – నూటయెనిమిది సంఖ్యకు మించకుండా ద్వాదశి పారణ చేయటం , ( ఏకాశి నాడు ఉపవాస ముండి మరునాడు  భోజన సంతర్పణ చేయటం ) వీరి నియమం .దీనికి తోడు నిత్యాన్నదాన వ్రతం నిరాటంకంగా కొనసాగుతూ వుండేది .వీరికి తోడు వీరి అర్ధాంగి కమలాంబ భర్తకు అనుగుణంగా నడచుకునేది , విసుగు విరామం లేకుండా వండి వార్చేది ,ఇంటికి వచ్చిన అతిధులు  ఆనందంగా వెళ్ళుతుంటే –  వారిని వదలలేక కన్నీళ్ళతో సాగనంపెడివారు ఆ దంపతులు .
        రాబడి తక్కువ ఖర్చు ఎక్కువ అయినపుడు  కొండలైనా తరిగిపోక తప్పదు కదా , చేతికి ఎముక లేకుండా చేసిన అన్నదానాల వలన దినం గడపటమే కష్టమైన పరిస్థితి వచ్చినది , భార్య మెడలోనికి పసుపు కొమ్ము తాడు వచ్చింది , మరునాటి అతిధి సత్కారమెట్లో అంతుబట్టని స్థితి ,అచట నిలువ బుధ్ది కాలేదు ,చీకటి పడిన తరువాత యెవరి కంటా పడకుండా బాపట్ల చేరుకున్నారు , అచట గల తూర్పు సత్రంలో ఒక మూల వొదిగి కూర్చున్నారు .
       ఆ సమయంలో, గుడ్డి దీపం వెలుగులో  అచటనే బసచేసి వున్న ఒక  స్త్రీ తన పిల్లలతో  బస చేసి వుండటం – ఆమె తన పిల్లలతో అన్న మాటలు ఆ దంపతులిద్దరి చెవుల్లోనూ  పడ్డాయి .ఈ శనగ పప్పు తిని మంచినీళ్ళు తాగి పడుకోండి ,రేపు వేటపాలెంలో పరదేశిగారింట కడుపు నిండా అన్నం తిందురుగాని  అని ఓదారుస్తున్నది ., నిశ్శబ్దంగా అచట నుండి లేచి స్వగ్రామం దిక్కుగా  నడిచారు ఆ దంపతులు .తమపై నమ్మకంతో ఆ బిడ్డలను ఓదారుస్తున్న  ఆ మాతృమూర్తి ఆశలను నిజం చేయాలనుకున్నారు , ఇక కర్తవ్యం నుండి పారిపో బుధ్దికాలేదు , తెల్లవారేసరికి ఇల్లు చేరుకున్నారు .దొడ్లో వున్న పెద్ద రుబ్బు రోలును  ఓ రెండు రూపాయలకు  శ్రీ బొమ్మిశెట్టి సుందరరాజయ్య శ్రేష్టికి అమ్మి కావలసిన వస్తు సామగ్రి తెచ్చి వంట చేసి అతిధుల రాక కోసం ఎదురు చూడ సాగారు .ఆ తరువాత వచ్చిన అతిధులను తృప్తి పరచి సాగనంపారు .
             నాటి సాయంత్రం శ్రేష్టిని పిలచి రోలు తీసుకొని పొమ్మని కోరారు పరదేశి దంపతులు , శ్రేష్టి వచ్చి రోలును తీసుకునే ప్రయత్నంలో రోలును కదిపి దొర్లించగానే  – ఆశ్చర్యకరంగా ఆ రోటి క్రింద  బంగారు మొహరీలు నిండి వున్న  బిందె కలబడినది , తాను కొన్నది రోలు మాత్రమేనని , మొహరీల బిందెను పరదేశి గారికి  అప్పజెప్పాడు ధర్మాత్ముడైన శ్రేష్టి ..ఇక చేసేది ఏమీ లేదని , తమ అన్నదాన వ్రతానికి ఎటువంటి అవరోధం కలుగకుండా  భగవంతుడీవిధంగా అనుగ్రహించాడని సర్ది చెప్పుకున్నారు ,
              అసూయాపరులు కొందరు రాజుగారికి ఫిర్యాదు చేసారు , వీరి విషయము సంపూర్ణముగా తెలిసి వుండుట చేత రాజా వేంకటాద్రినాయుడుగారు  పట్టించుకోలేదు . పరదేశిగారి కీర్తి దేశమంతా వ్యాపించింది , శ్రీ వేంకటాద్రినాయుడుగారు తమ గురువైన పాపయారాధ్యులవారితో  క్రీ.శ. 1770లో గంగా పుష్కరాలకు వెళ్ళారు , అచట యధావిధిగా దానాలు , సంతర్పణలూ చేసారు ,  “ఆహా నిరతాన్నదాతయగు బందా పరదేశిగారి దేశాన్ని పాలించే ప్రభువు ” అని అచట నున్న ప్రజానీకం  పొగడటం విన్నారు నాయుడుగారు .సంతోషమేకదా  ! తిరిగి వచ్చిన తరువాత గురువుగారితో చర్చించి – వారి అనుమతితో  బందా పరదేశిగారి కీర్తి ఎల్లకాలం  నిలచి వుండేటట్లు చేయాలని అనుకున్నారు , పరదేశిగారికి అధికారికంగా  కబురు పెట్టారు .తమ అంగీకారం  లేకుండా స్వగ్రామం వెళ్ళరాదని ఆంక్ష విధించారు …….  ( మొదటి భాగం)
                                                                                              పరిశోధన , రచన : బందా వేంకట రామారావు
                                                                                                                              సెల్ .9393483147,
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

2 Responses to నిరతాన్నదాత బందా పరదేశి గారు ( 1700 – 1785 )

  1. ఈ వృత్తాంతం యథాతధంగా శ్రీమదాంద్ర మహా భక్త విజయము పుస్తకంలో ఉంది.

    Like

  2. PLN RAJU's avatar PLN RAJU says:

    ఇలా మరుగు పడిన మహనీయులేందరో భరతజాతి సొత్తు….
    వారిని చాలా శ్రమతో వెలికి తీస్తున్నందుకుకు మీకు అభినందనలు….
    ఎంతసేపూ ముసుగుమాతను తమ ఆదర్శంగా చెప్పుకునేవారి మన మహనీయలను గుర్తించి వారిని ఆదర్శంగా పెట్టుకుంటారని ఆశిస్తాను…..
    తదుపరి భాగాన్ని త్వరలోనే మాముందుంటుందని ఆశిస్తున్నాను….
    వారి (బందా పరదేశి గారి) చిత్రం లభించ లేదా….

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.