జ్ఞానపీఠ భరద్వాజ ఇకలేరు

ఆకలి అమ్మ అయింది. ఆమె నేర్పిన పాఠం అక్షర యాత్రకు సిద్ధం చేసింది. కలలు చెదిరిన కాలాన్ని కాలం దన్నుగా రావూరి భరద్వాజ చిత్రీకరించారు. ప్రపంచం బాధను తన బాధ చేసుకొని, తన వేదనను సమాజ సంక్షోభంలో వెతుక్కొని దుర్భర దారిద్య్రాన్ని.. ఓ జీవిత సత్యంగా దృశ్యమానం చేశారు. వెలుగునీడల రాపిడిలో ‘పాకుడురాళ్ల’పై పడిలేచే బతుకులను సాహిత్యంలోకి తెచ్చి, సంచలనం రేపారు. విశ్వనాథ, సినారెల తరువాత..దాదాపు మూడు దశాబ్దాలకు రాష్ట్రానికి జ్ఞాన పీఠ అందించారు. తీరా ఆ ఆనందాన్ని తెలుగు సాహిత్య లోకం ఆస్వాదించకముందే దుఃఖంలో ముంచి పోయారు.
హైదరాబాద్, అక్టోబర్ 18 (ఆంధ్రజ్యోతి) : ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ (87) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన మధుమేహం, హైపర్‌టెన్షన్, కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గత సోమవారం ఆయనను హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గుండె, కిడ్నీ, కాలేయం పనితీరు మందగించాయి. ఆయనను కాపాడేందుకు వైద్యులు శతథా ప్రయత్నించినా..శుక్రవారం రాత్రి 8.35 గంటలకు రావూరి భరద్వాజ తుదిశ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. మరణించడానికి వారం రోజుల ముందే ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు. వీల్ ఛేర్‌లో ఒక చేతిలో సెలైన్ బాటిల్ పట్టుకొని భరద్వాజ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యం పూర్తిగా చెరిగిపోకముందే.. ఆయన సాహితీ లోకాన్ని వదిలిపెట్టారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, ప్రముఖ కవి సి. నారాయణరెడ్డిల కోవలో రాష్ట్రానికి మూడోసారి జ్ఞానపీఠ అందించిన ఖ్యాతిని చిరస్థాయిగా నిలుపుకున్నారు. ఆయన భౌతికకాయానికి శనివారం అంత్యక్రియలు జరగనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
‘ఆకలి’ అక్షరశిల్పి
” ఆకలి నా రచనలకు ప్రేరణ” అని ప్రకటించుకున్న రావూరి భరద్వాజ 1925లో కృష్ణాజిల్లా పరిటాల జగీర్ మోగులూరు గ్రామంలో జన్మించారు. తల్లి మల్లికాంబ, తండ్రి కోటయ్యలపై ఆయన తన తొలి పద్యం చెప్పారు. చురుకైన విద్యార్థిగా పేరు పొందినా, ఆర్థిక పరిస్థితు ల వల్ల ఏడో తరగతితోనే చదువు ఆగిపోయింది. ఆకలి బాధను మరిచిపోవడానికి అక్షరానికి దగ్గరయ్యారు. ఒకవైపు పండో, నీళ్లో తాగి ఆకలి తీర్చుకుంటూ, మరోవైపు దొరికిన పుస్తకమల్లా చదువుతూ సాహిత్య దాహం తీర్చుకునేవారు. గ్రంథాలయం సంవత్సర చందా మూడు రూపాయలు కాగా, దాన్నీ కట్టలేకపోయేవారు. పగలంతా దొరికిన పని చేస్తూ, రాత్రయితే దేవాలయంలోని దీపం వెలుతురులో లైబ్రరీ పుస్తకాలను మధించేవారు. ప్రపంచ సాహిత్యాన్నంతా పఠనం చేస్తూ ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపారు. ఆలపాటి రవీంద్రనాథ్ పని కల్పించడంతో 1946లో మకాం తెనాలికి మార్చారు. తెనాలి జీవితం ఆయన సారస్వత వ్యక్తిత్యాన్నే మార్చి వేసింది.
చలం ప్రభావంతో తొలి రచనలు చేసిన ఆయన.. 1950లో ‘రాగిణి’ వెలువరించారు. ‘కొత్త చిగుళ్లు’లోని విభిన్న శైలి తెలుగు సాహిత్యం దృష్టిని ఆకర్షించింది. 1948లో కాంతం గారితో ఆయన వివాహం జరిగింది. “సంపన్నురాలైనా నా లేమిని, విద్యాహీనతను, నిరుద్యోగాన్ని చాలా దయగా భరించింది. అమాయకుడైన బిడ్డను తెలివైన తల్లి ఎలా చూ స్తుందో ఆ బంగారు తల్లి నన్నలా చూసుకుంది. అందుకే ‘కాంతమ్మ’ అనేవాణ్ని” అని చెబుతున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యేవారు. ఈ కాలంలో ఆయన జమీన్ రైతు పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. వృత్తిగానూ, ప్రవృత్తిగానూ కలం చేతబట్టారు. తెనాలిలోనూ, ఆ తరువాత చెన్నైలోనూ అనేక పత్రికల్లో పనిచేశారు. ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికతో ఆయనకు చెరగని బంధం ఉంది. 1959లో ఆలిండియా రేడియోలో జూనియర్ స్క్రిప్టు రైటర్‌గా విధులు నిర్వహించారు. ” అప్పట్లో త్రిపురనేని గోపిచంద్ ఆలిండియా రేడియోలో ఉన్నారు. ఆయన ఉద్యోగం అడిగాను, ఏడో తరగతి కూడా పూర్తి చేయని వాడికి ఏమి పని ఇవ్వాలని ప్రశ్నించారు. అప్పటికే అచ్చయిన నా పుస్తకాలను చూపించాను. వెంటనే ఉద్యోగం ఇచ్చారు” అని భరద్వాజ గుర్తు చేసుకునే వారు.
కత్తుల వంతెన
తెనాలి జీవితం ఆకలి లోతుపాతులను పరిచయం చేయగా, చెన్నైలో బతుకు కటువైన వాస్తవాల కత్తుల వంతెనపై నడిపింది. తాను పని చేస్తున్న పత్రిక కోసం సినీ పరిశ్రమతో ఆÄ ున పరిచయం పెట్టుకున్నారు. తెర వెనక, మేకప్పు తొలగిన జీవితాల్లోని చీకటిని, చేదును నేరుగా చూసి అక్షర రూపమిచ్చారు. అదే పాకుడురాళ్లు నవల. 1950-60 మధ్య, ఒక దశాబ్దం పాటు అంతర్ బహిర్ సంఘర్షణలకు లోనై ఎట్టకేలకు నవలను పూర్తిచేశారు. 1967లో ఈ నవల హిందీలోకి అనువాదమైంది. “మద్రాసులో సుప్రసిద్ధ కథారచయిత ధనికొండ హన్మంతరావు జ్యోతి, అభిసారిక, చిత్రసీమ అనే పత్రికలు పెట్టారు. వాటిలో ‘చిత్రసీమ’ పని నాకు అప్పజెప్పారు. తారలను కలిసి, మాట్లాడి, రాయడం నా పని. ఒకనటి తనకు రావాల్సిన డబ్బు ఎలా తెలివిగా తెచ్చుకున్నది నాకు చెప్పింది. నన్ను ‘బావా’ అని, మా ఆవిడని ‘పిన్నీ’ అనీ పిలిచేది. అదేం వరస అంటే.. ‘సినిమావాళ్లకు వరసలేంటి?’ అనేది. అలాంటి అనుభవాలన్నీ డైరీలో రాసుకునేవాణ్ని. వాటి ఆధారంగా ‘మాయ జలతారు’ కథ రాశాను. మల్లంపల్లి సోమశేఖరశర్మ చదివి.. నవలగా మార్చాలని కోరారు.
తర్వాత.. కృష్ణా పత్రిక ముదిగొండ సుబ్రహ్మణ్యం సీరియల్ రాయమన్నప్పుడు ఈ కథ చెబితే రాయమన్నారు. దీనికి ‘పాకుడురాళ్లు’ శీర్షిక పెట్టింది శీలా వీర్రాజు. సీరియల్‌ని నిషే ధించాలని పత్రి కను రాకుండా చేయా లని చాలామంది సినీప్రముఖులు యత్నించారు” అని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌కు ఇచ్చిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఈ నవల కథానాయిక మంజరి పాత్ర.. వాస్తవ జీవితంలో ఎవరనేది ఇంతవరకూ బయటపెట్టని భరద్వాజ.. ” నా డైరీలో ఆమె పేరు ఉంది. నేను చనిపోయిన తరువాతే అదెవరైందీ లోకానికి తెలుస్తుంది” అని ఇదే ఇంటర్య్యూలో చెప్పుకున్నారు. ఈ నవలకే 2012 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ అవార్డు లభించింది. మనిషి తన గతాన్ని ఎన్నడూ మరిచిపోరాదని చెప్పే భరద్వాజ.. ఉచిత పథకాలతో ప్రజలను ఉద్దరించాలనుకోవడం సరికాదని ‘ఓపెన్ హార్ట్..’లో స్పష్టంగా చెప్పారు.
ప్రముఖుల నివాళి
సాహితీ రంగంలో ఎవరెస్టు శిఖరాలను అధిరోహించిన గొప్ప వ్యక్తిగా..భరద్వాజకు గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. సాహి త్య లోకానికి ఆయన మరణం పెద్ద లోటు అని సీఎం కిరణ్ అన్నారు. జీవితంలో ఎన్నో కష్టాలకు వోర్చి, అత్యున్నత జ్ఞానపీఠ అందుకోవడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని టీడీపీ అధినేత చంద్రబాబుకొనియాడారు. బాలల సాహిత్యానికి ఎనలేని సేవలందించారని వైసీపీ నేత జగన్ నివాళి అర్పించారు. సాహితీలోకం ఒక ధృవతారని కోల్పోయిందని బీజేపీ నేత వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. మంత్రి డీకే అరుణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, కెనడాలో భారతీయ సాంస్కృతిక రాయబారి యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, సాంస్కృతిక మండలి మాజీ సలహాదారు రమణాచారి, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, విద్యావేత్త చుక్కారామయ్య, తెరవే నేత గౌరిశంకర్, తెలంగాణవాది అద్దంకి దయాకర్‌లు..కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

