ఇప్పటికీ అవే గాయాలు : కొలకలూరి ఇనాక్

పశువుల కాసే ఓ కుర్రాడు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కావడాన్ని ఊహించ గలమా? అలాంటి అసాధ్యాన్ని నిజం చేసిన వారు కొలకలూరి ఇనాక్. అంటరానితనం కారణంగా ఎదురయ్యే అన్ని అవమానాలూ భరిస్తూనే అనుకున్న లక్ష్యం దిశగా అడుగు ముందుకేశారాయన. పిహెచ్.డి లో సీటు రావడానికి ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయో, వైస్ చాన్స్‌లర్ కావడానికి కూడా అన్ని అవాంతరాలు ఎదుర య్యాయి ఆయనకు. ఇప్పటికి 72 పుస్తకాలు రచించారు. 75 ఏళ్ల వయసులోనూ ఆయన కలం నుంచి ఏటా ఒక పుస్తకమైనా విడుదలవుతూనే ఉంటుంది. ఆచార్య కొలకలూరి ఇనాక్ జీవన ప్రస్థానంలోని కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’
అడుగడుగునా అణచివేత కు గురైన ఒక మనిషి అన్నిటినీ అధిగమించి ముందుకు సాగడం అంటే ఎంత కష్టమైన పని? ఆడుతూ పాడుతూ తిరిగే బాల్యంలో అంటరానివాడివి అంటూ తన వయసు వారంతా ఆరడుగుల దూరం నిలబడితే ఎలా ఉంటుంది? నన్నయితే ఎప్పుడూ ఏదో ఒంటరితనం వెంటాడుతున్నట్లే ఉండేది. అందుకే అస్తమానం చెట్లూ చేలు పట్టుకుని తిరుగుతుండే వాణ్ని. చేలల్లో దొరికే సద్దకంకులు, జొన్న కంకులు, పెసరకాయలు, కందికాయలు, దోసకాయలు ఇలా ఏవి దొరికితే అవి తింటూ రోజంతా గడిపేవాణ్ని. మాది గుంటూరు జిల్లాలోని వేజెండ్ల. గ్రామంలోని పాఠశాలకు మమ్మల్ని రానివ్వరు. అందువల్ల మా మాదిగపల్లిలోనే బాప్టిస్టు మిషన్ వాళ్లు ఒక స్కూలు ప్రారంభించారు. నేను ఆ స్కూల్లో మూడవ తరగతి సగం దాకా చదువుకున్నా. ఈ లోగా మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి.
మా నాన్నగారు పెద్ద జీతగాడిగా పనిచేసే దొరగారి వద్దే నన్ను చిన్న జీతగాడిగా పెట్టారు. అప్పటికి నాకు 8 ఏళ్లు ఉంటాయేమో! ఓరోజు పశువుల్ని మేపుతున్న సమయంలో తెనాలి నుంచి గుంటూరు వెళుతున్న రైలు మీదికి నేను, నా తోటి పశుల కాపర్లము పక్కనున్న గుంటలోంచి బురద తీసి కొట్టాం. ఒక ఆటలా ఏదో తమాషాగా చేశాం. అయితే ఆ తర్వాత రైల్లో పోలీసులు వచ్చారట. వాళ్లు వచ్చేసరికే మేము పశువుల్ని తోలుకుని ఊళ్లోకి వ చ్చేశాం. పోలీసులు మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చారని తెలిసి నేను పొలాల్లోకి పారిపోయా. పోలీసులు నాతోటి పశువుల కాపర్లు ఇద్దర్ని పట్టుకున్నారు. మా ఇంటికి కూడా వచ్చారట. మా అమ్మ వాళ్ల మీద తిరగబడినా, మా నాన్న ఏదో సర్దిచెప్పి పంపేశారట. ఆ తరువాత నేను పని మానేశా. నేను పెద్ద దుండగీడుగా మారిపోతున్నానన్నది అమ్మ ఆవేదన.
అదే సమయంలో తగరపు దేవదాసు అనే ఓ యువకుడు ఏసీ కాలేజ్‌లో బిఏ చేస్తూనే అటు స్కూలుకు పోకుండా ఎక్కడా పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్న పిల్లలందనీ పోగు చేసుకుని మా మాదిగపల్లిలో ట్యూషన్లు చెప్పడం మొదలెట్టాడు. ఆయన వద్దకు వెళి ్ల’నేనూ ట్యూషన్‌కు వస్తాను మాస్టారూ!’ అన్నా. నేను జీతానికి ఉన్నానని అక్కడున్న పిల్లలంతా అరిచారు. నేను మానేశానని చెప్పా. ఆయన మా ఇంటికి వెళ్లి మా అమ్మను ఒప్పించి ట్యూషన్‌లో చేర్చుకున్నారు. నాకు లెక్కలు అవీ బాగా రావడం చూసి, నన్ను ఒక ఎంట్రన్స్ పరీక్ష రాయించి నే రుగా ఆరవ తరగతిలో చేరేలా చేశారాయన. ఆ రోజు ఆయన నాలో వేసిన బీజాలే నేను ఈ స్థితికి రావడానికి దారి తీశాయి. తెలిసీ తెలియని వయసులో చేసే ఒకటి రెండు ఆకతాయి పనుల ఆధారంగా పిల్లల భవిష్యత్తు వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదని నా జీవితమే నాకు నేర్పింది. అందుకే పసి పిల్లల పెడధోరణుల ఆధారంగా వారి భవిష్యత్ జీవితాన్ని అంచనా వేసే ప్రయత్నం నేనెప్పుడూ చేయను.
నిలబెట్టేవీ ఉంటాయి
బి.ఏ ఆనర్స్ ఉండేది. అది ఎం.ఏ కు సమానం. తెలుగు మాతృభాష కావడం వల్లనో, తెలుగు అయితే సులువుగా చదువుకోవచ్చన్న భావనో తెలియదు గానీ, నేను తెలుగు బి.ఏ లో చేరా. ఆ రోజుల్లో బి.ఏ ఆనర్స్‌లో చేరిన వారిలో మాదిగ విద్యార్థులెవరూ లేరు. మా టీచర్లంతా అగ్రవర్ణాలకు చెందిన వారే. వాళ్లకు నేను క్లాసులో ఉండడం కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. బాపిరెడ్డి అనే వ్యక్తి రోజూ చాక్‌పీస్, డస్టర్ తెచ్చిపెట్టేవాడు. ఒకరోజు నేను వెళ్లి ఆఫీసు రూము నుంచి ఆ రెండూ తీసుకొచ్చి పెడితే “నువ్వెందుకు తెచ్చావురా” అన్నాడు మాస్టారు. “బాపిరెడ్డి రాలేదు సార్” అన్నాను. “బాపిరెడ్డి రాకపోయినా నువ్వు తేవద్దు”అన్నాడు ఎంతో కటువుగా. నేను తెచ్చిన డస్టర్ గానీ, చాక్‌పీసు గానీ ఆయన ముట్టుకోలేదు. ఇది బి.ఏ ఆనర్స్‌లో చేరాక ఎదురైన అనుభవం. రోజులు గడిచే కొద్దీ నేను చదువుకోవడం మా మాస్టర్లకు ఇష్టం లే దని బోధపడింది. దీనికి తోడు నాతో మాట్లాడితే తక్కువ మార్కులు వేస్తారని, వేధిస్తారని నా క్లాస్‌మేట్స్ ఎవరూ నాతో మాట్లాడేవారు కాదు. దాంతో గొంతు పట్టేసినట్లు ఉండేది. నాకు అంటరానితనం సంపూర్ణ స్వరూపం అప్పుడే బాగా తెలిసింది. తెలిసో, తెలియకో నేను అందులో చేరడమనే ఒక మహా నేరం చేశానని అర్థమైంది. కాకపోతే ఆ రోజుల్లో పరీక్షల్లో ప్రతి పేపర్‌కీ రెండు వాల్యుయేషన్‌లు ఉండేవి. ఒక వాల్యుయేషన్ మా సొంత మాస్టర్లు చేస్తారు. మరో వాల్యుయేషన్ వేరే మాస్టర్లు చేస్తారు. అందువల్ల ఫస్ట్ క్లాసు నాకు ఎలాగూ రాదు కానీ, సెకండ్ క్లాసు మాత్రం రాకుండా పోదు అనే నిర్ధారణకు వచ్చా. ఆ నమ్మకమే చదువు కొనసాగేలా చేసింది. మనల్ని కూలదోసే అంశాలను గుర్తించడంతో పాటు, మనం నిలదొక్కుకోవడానికి ఉన్న మార్గాల్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి. లేకపోతే మనల్ని మనం కూలదోసుకునే దిశగా మన అడుగులు పడవ చ్చునని నాకు అనిపిస్తుంది.
ఆటంకాలకు లెక్కేముంది?
ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ ఈ రెండే పీహెచ్‌డి ఇవ్వగలిగేవి. నేను ఎన్‌సిసి ఆఫీసర్‌గా చేస్తూనే ఆంధ్రా యూనివర్సిటీలో పీహెచ్‌డి కోసం దరఖాస్తు పెట్టుకున్నా. నాకు రాలేదు. పీహెచ్‌డీ సీట్ అనేది అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ప్రకారం ఇచ్చేది కాదు. ఈ వ్యక్తి పీహెచ్‌డీ చేయగలడు అనుకుంటే ఆ మాస్టారు ఇవ్వవచ్చు. కానీ, ఏ మాస్టారు నాకు ఇవ్వడానికి ఆమోదం తెలుపలేదు. అందుకే నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి, తెలుగు డిపార్ట్‌మెంట్ హెడ్ దివాకర్ల వెంకటావధానిని అడిగా. దరఖాస్తు ఇవ్వండి అన్నాడాయన. దరఖాస్తు ఇచ్చాను. గైడ్‌గా ఏ ప్రొఫెసరూ మిమ్మల్ని తీసుకోలేదు అన్నాడు. మరుసటి సంవత్సరం మళ్లీ దరఖాస్తు ఇచ్చా. గైడ్‌గా ఉండడానికి సమ్మతించిన వ్యక్తి సంతకం తీసుకురండి అన్నారు. కానీ, ప్రొఫెసర్లలో ఏ ఒక్కరూ సంతకం చేయలేదు.
ఒక దశలో బోయి భీమన్న గారి వద్దకు వెళ్లి విషయం చెప్పా. నేను అవధాని గారికి ఫోన్ చేసి చెబుతా నువ్వు వెళ్లు అన్నారు. చెప్పారు. కానీ, దానికీ ఏదో తిరకాసు సమాధానం చెప్పి తప్పించుకున్నారు. చివరికి బోయి భీమన్న గారే అప్పటి ముఖ్యమంత్రి సంజీవయ్యగారి వద్దకు వెళ్లమని చెప్పారు. నేను వెళ్లి కలిశా. ఆయన వెంటనే స్పందించి అవధాని గారికి ఫోన్ చేశారు. “మీరు చెబితే కాదనేదేముంది? వెంటనే పంపించండి” అన్నారు. ఆ తర్వాత కూడా అదుగో ఇదుగో అంటూ వాయిదా వేసి నాకు సీటు ఇవ్వనే లేదు. ఆ విషయం సంజీవయ్యగారికి చెబితే ఆయన నిస్సహాయంగా ఉండిపోయారు. నేనింక సెలవు తీసుకుని వెళ్లిపోయా.
ఎస్‌వీ యూనివర్సిటీలో జి ఎన్ రెడ్డి తెలుగు విభాగపు అధిపతి అయ్యాక గానీ, నాకు పిహెచ్‌డీలో సీటు రాలేదు. కోరాడ మహదేవ శాస్త్రి గారు గైడ్‌గా ఉండడానికి సమ్మతించారు. మొత్తంగా చూస్తే పిహెచ్‌డీలో సీటు రావడానికి నాకు తొమ్మిదేళ్లు పట్టింది. నిర్ణీత వ్యవధి కన్నా ముందే నా థీసిస్‌ను సబ్‌మిట్ చేశాను. ఆ తరువాత రీడర్‌నయ్యా, ప్రొఫెసర్‌నయ్యా. ప్రొఫెసర్‌గా చేసిన 16 ఏళ్ల కాలంలో ప్రతి ఏడాదీ అందరూ నేను వీసీని అవుతాన నుకున్న వాళ్లే. కానీ, పలుమార్లు అది వాయిదా పడుతూనే వచ్చింది.
మనిషిగా ఆలోచిస్తేనే….
దళితుల్ని ప్రోత్సహించాలన్న సంకల్పం ఎన్.టి. రామారావు గారిలో చాలా బలంగా ఉండేది. నేను ప్రొఫెసర్ అయిన మూడేళ్లకు అంటే 1987లో నాగార్జున యూనివ ర్సిటీ వీసీ పోస్టు ఖాళీ అయ్యింది. నాకు ఇచ్చిన మాట మేరకు నాగార్జున యూనివర్సిటీకి నన్ను వీసీని చేద్దామనుకున్నారు. ఆనవాయితీగా ఆ పదవి కోసం ముగ్గురి పేర్లను ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి ముందు నోట్ పెట్టారు. మిగిలిన రెండు పేర్లలో జిజెవిజె రాజు అన్న పేరు కూడా ఉంది. ఆ రాజు గారి కోసం భయంకరమైన రాజకీయం జరిగింది. అతని సామాజిక వర్గానికి చెందిన కొందరు మంత్రులు, కొంతమంది ఎంఎల్ఏలు వీసీ పదవి అతనికే రావాలని పట్టుపట్టారు. రామారావు గారి మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. ఎంత కాదనుకున్నా చివరికి అతని పేరునే టిక్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలా నాకు రావలసిన అవకాశం తప్పిపోయింది.
ఆ సందర్భంగా రామారావు గారు నాతో ‘ తమరికి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాం’ అన్నారు. అప్పుడు నేను “వచ్చి ఉంటే సంతోషించే వాణ్నే కానీ, రాలేదన్న దిగులు మాత్రం నాకు లేదు. సార్! ఆయనకిప్పుడు 58 ఏళ్లు. నాకింకా 47 ఏళ్లే. ఆయన వయసు అయిపోతోంది కాబట్టి ప్రస్తుతం ఆ పదవి ఆయనకు రావడమే మంచిది. మీరు అనుకుంటే ఎప్పుడైనా సాయం చేయవచ్చు” అన్నాను ఆయనను ఓదార్చడానికి. “మీరు ఏమైనా చెప్పండి. మాట నిలబెట్టుకోలేక పోయినందుకు మాకు కష్టంగానే ఉంది.” అన్నారాయన. ఆ తర్వాత కూడా అలాంటి ఖాళీలు వ చ్చినా కొన్ని కులాలకు, ప్రాంతాలకు, మతాలకు సంబంధించిన ఒత్తిళ్లు ఏవో వచ్చి నాకు ఇవ్వాలని అనుకున్నా ఇవ్వలేకపోయారు. 87లో తప్పిపోయిన ఆ అవకాశం 98 దాకా రానేలేదు. సినీసామ్రాజ్యంలో ఒక రారాజులా ఉన్న ఆయన రాజకీయాల్లోకి వచ్చాక కొన్ని సందర్భాల్లో ఎంతో నిస్సహాయంగా ఉండిపోవలసి వచ్చేది. చంద్రబాబు నాయుడు నా విద్యార్థి. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక గానీ, వీసీ అయ్యే అవకాశం నాకు రాలేదు. ఎస్‌వీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను అయ్యే నాటికి నా రిటైర్‌మెంట్ ఇక సంవత్సరమే మిగిలింది. కాకపోతే రిటైర్ అయ్యాక కూడా రెండేళ్లు ఆ పదవిలో కొనసాగాను. సామాజిక మార్పు కోసం ఎన్ని చట్టాలు వస్తున్నా, వాటిని నిర్వీర్యం చేసే వ్యవస్థలు ఒక పక్కన పనిచేస్తూనే ఉన్నాయి. పాతకుపోయిన జాడ్యాలను చిదిమేయనిదే, ఒక మానవీయకోణాన్ని నిలబెట్టనిదే అట్టడుగున పడి ఉన్న వారికి అవస్థలు తప్పవని నాకనిపిస్తుంది.
ఆ దుఃఖం వయసెంత?
నేను వీసీగా ఉన్నకాలంలో చేపట్టిన ఇతర చర్యల విషయం అలా ఉంచితే, యూనివర్సిటీ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన మరుసటి నెల ఒకటో తేదీనాటికల్లా పెన్షన్ అందేలా ఒక విధి విధానాన్ని ఏర్పాటు చేశా. అందుకు సంబంధించిన ఒక పత్రం పదవీవిరమణ రోజునే అందచేసే వాణ్ని. వాటితో పాటు ఎల్ఐసి. జిపిఎఫ్, యూనివర్సిటీ నుంచి ఏమేమి రావాలో ఆ మరుసటి నెల ఫస్ట్‌న వచ్చేలా ఏర్పాటు చేశా. ఆ పత్రాలన్నీ వారికి అందించడానికి ముందు వారిని సత్కరించే సంప్రదాయాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేశా. నేనే స్వయంగా ఒక పూలమాల వేయడం, ఒక శాలువా కప్పడం, యూనివ ర్సిటీ ఎంబ్లమ్‌ను ఒక షీల్డ్‌లా చేసి ఇవ్వడం ఇవన్నీ చేశా. ఈ ఏర్పాట్లు జరిగిన సరిగ్గా నెలలోనే రాఘవనాయుడు గారని యూనివర్సిటీ రెక్టార్ రిటైరైతే ఆ సత్కారాలన్నీ చేసి చివరన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నా. అదే రోజున రిటైరైన క్లాస్ ఫోర్ ఉద్యోగి స్కావెంజర్ (పాకీ )రాజు కూడా అదే వేదిక మీద ఉన్నాడు. రాఘవ నాయుడు గారికి మల్లే పూల మాల వేసి, శాలువా కప్పి అతన్నీ ఆలింగనం చేసుకున్నా. ఆ మనిషి నీడైనా పడకుండా దూరం జరిగిపోవడాన్ని బతుకంతా చూసిన ఆయనకు అది ఊహించలేని విషయమైంది. ఆ సమయంలో రాజు దుఃఖాన్ని చూడాలి.. అతడు ఏడుస్తుంటే కొండలు పగులుతున్నట్లనిపించింది. జీవితకాలమంతా భరించిన అవమానాలన్నీ గుండెలో గడ్డకట్టుకుపోయి ఒక్కసారిగా పగిలి పైకి తన్నుకొస్తే అలాగే ఉంటుందేమో మరి! మన దారిన మనం, మన వైఖరితో మనం అలా ఉండిపోతామే గానీ ఎన్ని గుండెలు గాయమవుతున్నాయో చాలా సార్లు ఏమీ ఆలోచించం. అలా అందరూ ఆలోచించగలిగిన్నాడు, ఇన్ని అంతరాలు, ఇన్ని వైషమ్యాలు ఉండవేమో అనిపిస్తుంది నాకు.
-బమ్మెర

