నా దారి తీరు -45
స్పాట్ లో పదనిసలు
బందరు స్పాట్ లో తమాషా విషయాలెన్నో ఉన్నాయి .తెలుగు పండితులు రోజు సాయంత్రం పూట అయిపోగానే అందరు ఒక రూమ్ లో సమావేశమై ఏదోఒక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించేవారు .స్వంత కవిత్వాలు విని పించేవారు .మంచి గ్రంధాలను సమీక్షించే వారు వీలైనప్పుడల్లా నేను కూడా వెళ్ళే వాడిని .అందులో పామర్రు తెలుగు సీనియర్ పండిట్ శ్రీ నల్లూరి బసవ లింగం అందర్నీ తన వాక్చాతుర్యం తో అలరించే వారు .ఆయన కంఠ స్వరం అతి మధురం గా ఉండేది అన్ని స్తాయిలలోను పాటలూ ,పద్యాలు ఆలాపించే వారు మేమందరం ఆయన్ను’’అపర ఘంట సాల’’ అనే వాళ్ళం .ముఖ్యం గా తిక్కన రాసిన పద్యాలు భీష్మ సినిమాలోవి అద్భుతం గా పాడేవాడు .హరికధలూ బాగా చెప్పేవాడు.రేడియో ఆర్టిస్ట్ కూడా .ఆనేక కవి సమ్మేళ నాలలో పాల్గొనే వాడు చిక్కని కండగల పద్యం చెప్పే వాడు మైసూర్ విశ్వ విద్యాలయం లో కన్నడం నేర్చి ఆ భాషనూ ఇక్కడి విద్యార్ధులకు బోధించే వాడు దానికి ఆయనకు స్పెషల్ అలవెన్స్ ఇచ్చేవారు నాకు మంచి దోస్తు .మా సాహిత్య సభలకు కవి సమ్మళనాలకు ఆహ్వానించే వాళ్ళం వచ్చి సుసంపన్నం చేసే వాడు .
శంకరాభరణం లో ఆండాళ్ళకు సఆధునిక కర్ణాటక సంగీతాన్ని పాఠాలు చెప్పే దాసు, అప్పుడు వచ్చిన శంకారాభరణం శంకర శాస్త్రి అన్న మాటలు సంగీతం గురించి చెప్పిన విషయాలు యదా తదం గా ఒక్క అక్షరం పొల్లు పోకుండా చెప్పేవాడు అందులోని పాటలన్నీ మహా సుందరం గా పాడేవాడు .వీటికోసమే ఆయన్ను ప్రతి స్కూల్ కు పిలిచి పాడించి సన్మానించేవారు నేను అడ్డాడ హైస్కూల్ హెడ్ మాస్టార్ని అయిన తర్వాతా రెండు మూడు సార్లు పిలిచి ఒక సారి ఆయన్ను పిలిచి ఘన సన్మానం చేశాను చాలా పొంగిపోయాడు .నూట పదహార్లు తాంబూలం లో పెట్టి అందించాను . చాలా విశాల హృదయుడు బసవలింగం .ఆయన స్పెషల్ ఒకటి ఉంది .అది ‘’కళా పూర్ణోదయం’’ప్రబంధం లోని కధలను పుస్తకం చూడకుండా అవసరమైన పింగళి సూరన పద్యాలను ఉ దహరిస్తూ అలవోకగా ధారా వాహికం గా కమ్మని స్వరం తో హృదయ రంజకం గా విని పించేవాడు దీనిని ఆకాశ వాణి విజయ వాడ కేంద్రం వారు రేడియోలో ధారా వాహిక గా చెప్పించారు చాలా సభల్లో రోజుల కొద్దీ దీన్ని విని పించారు .అదీ బసవ లింగం ప్రత్యేకం అది ఆయన శైలి కూడా.కళ్ళు మనసు అప్పగించి అలా అనిమేషం గా వింటూ కూర్చునే వాళ్ళం ఎక్కడా తడబాటు ,పొరబాటు ఉండేది కాదు .మామూలుగా కళా పూర్ణోదయం కదా విధానం గందర గోళం గా ఉంటుందికదా .ఒక కద లోంచి ఇంకో కధలోకి గెంతు తుంది పూర్వాపరాలను గుర్తుంచుకొని మళ్ళీ ట్రాక్ లోకి రావటం ఎంతో ఏకాగ్రత ఉన్న వారికే సాధ్యం .దాన్ని సాధించాడు బసవ లింగం .అది ఆయన పూర్వ జన్మ సుకృతం సంస్కారం .దీనికి ప్రతి ఫలా పేక్ష కూడా కోరడు .విని అర్ధం చేసుకొనే రసజ్నులుంటే చాలు అదీ ఆయన వైఖరి .అంత మాత్రం చేత ఎవరూ ఆయన్ను నిరాశ పరచలేదు నాకు తెలిసినంత వరకు..వీలైనప్పుడల్లా ఉయ్యూరుకు మా ఇంటికి వచ్చే వాడు వచ్చినప్పుడల్లా భోజనం చేయమని బల వంతం చేసి భోజనం చేయించి ఏదో తోచిన తాంబూలం ఇచ్చి పంపేవాడిని .ఉన్న సమయం లో ఘంటసాల పాటలు ,పద్యాలు పాడి రంజనం చేసేవాడు .నవ్వుతూ మాట్లాడటం బసవ లింగం మరో ప్రత్యేకత .
బందరు బెజవాడ ,పామర్రు గుడివాడ మొదలైన చోట్ల నడి రోడ్డు మీద ఆహ్వానం మేరకు హరి కధలు చెప్పి మెప్పించే వాడు .రిటైర్ అయిన తర్వాత ఏలూరు మొదలైన చోట్ల కాలేజీ లో తెలుగు లెక్చరర్ గా పని చేశాడు కాని ఎక్కడా నిలవలేక పోయాడు .అప్పుడూ నాతో ఫోన్ లో మాట్లాడేవాడు ఉయ్యూరు వచ్చి కష్టసుఖాలు చెప్పుకోనేవాడు రిటైర్ అయిన డబ్బుతో బళ్ళారి ప్రాంతం లో పొలాలు కొని స్వంత వ్యవసాయం చేసి చేతులు కాల్చుకొని నస్టపోయాడు అచ్చి రాని తెలియని ఆపని చేశాడు తెలివి తక్కువగా .కొడుకు కూడా అందిరాలేదు .దాదాపు ఏడెనిమిది ఏళ్ళ క్రితం మరణించాడు మిత్రుడు బసవలింగం .
బందరు స్పాట్ లో కవిత్వం విని పించిన వారిలో చింతల పాటి పూర్ణ చంద్ర రావు ఆయన తమ్ముడు మురళీ కృష్ణ లు కూడా ఉన్నారు .కమ్మని కవిత్వం వ్రాసే నేర్పు వారిద్దరిది .పూర్ణ గారు పద్య శతకాలు రాశారు మురళి నా ఆత్మీయులు, కుటుంబ స్నేహితులు కధకులు ,భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ,బందర్లో లెక్కల మేష్టారు అయిన ఆర్ ఎస్.కే.మూర్తి గారి అల్లుడు .భార్యా భర్త లిద్దరూ ఉపాధ్యాయులే ఇద్దరూ హెడ్ మాస్టర్లు అయ్యారు .ఈ సోదరులిద్దరు కూచి పూడి, మొవ్వ ,కోసూరు, చల్ల పల్లి ప్రాంతాలలో సాహిత్య సభలు అయిదారేళ్ళు నిర్వహించారు నన్ను ఎప్పుడూ పిలిచే వారు వెళ్ళే వాడిని .ఈ ఐద్దరు కలిసి పద్మాకర్ శతావధాని చేత చల్ల పల్లి లో అష్టావధానం ఆ తర్వాత శతావధానం చేయించారు .ఈ రెండిటిలో నేను ప్రుచ్చకుడిని .శాతావదానానికి మాడుగుల నాగ ఫణి శర్మ గారు కూడా వచ్చి ఆశేర్వ దించారు ప్రముఖ సాహితీ వేత్తలేందరో పాల్గొన్నారు .రాళ్ళ బండి కవితా ప్రసాద్ కూడా వచ్చారు రావి రంగారావు వగైరాలన్దర్నీ తప్పక పిలిచే వాడు .మురళి రిసెర్చ్ చేసి పి.హెచ్.డి సాధించాడు .ఈ నెల ఇరవై ఏడున బందరులో అతని ‘’సిరి మల్లెలు ‘’పద్య కావ్య ఆవిష్కరణ ఉంది .ఉయ్యూరు సాహిత్య సభలకు సోదరు లిద్దరూ వచ్చేవారు .కవి సమ్మేళనం లో పాల్గొనే వారు .పూర్ణ రేడియో లో ‘’సమస్యా పూరణం ‘చాలా సార్లు నిర్వహించాడు ,రిటైర్ అయింతర్వాత కూడా నిర్వహిస్తూనే ఉన్నాడు .మంచి మిత్రులు ఇద్దరూ నాకు .ఇప్పటికీ ఫోన్ లో మాట్లాడుకొంటాం .
స్పాట్ లో సాధారణం గా పేపర్లు దిద్దేటప్పుడు నేను చాలా ఉదారం గ వ్యవహరిస్తాను మార్కులు తగినన్ని వేస్తాను .నేను దిద్దిన దాన్ని చీఫ్ చూసినా మార్పు చేయలేనట్లు ఉంటుంది ఇది చాలా సార్లు జరిగింది దిద్దేటప్పుడు నేను ముందుగా పద్దేమిది పేపర్ల బండిల్ లో ‘’రాండం’’ గా కొన్ని పేపర్లు సాంపిల్ గా తీసి ,దిద్ది చీఫ్ కు చూపి ఆ తర్వాతా నా ధోరణిలో నేను రూల్స్ ప్రకారమే దిద్దేసే వాడిని అది ఫిజికల్ సైన్స్ పేపర్లు అయినా నేచురల్ సైన్స్ వి అయినా ఇంగ్లీష్ మొదటి పేపరైనా రెండవ పేపర్ అయినా నా స్పీడ్ నాదే .అయితే మిగతా వాటి కంటే ఇంగ్లీష్ పేపర్ వన్ కు కొంచెం ఎక్కువ సమయం పట్టేది అంతే .ప్రతి పేపర్కు క్వేస్చిన్ వార్ ,పేజ్ వార్ టోటల్స్ వేయాలి .బిట్ పేపర్ మార్కులు మెయిన్ మార్కుల పక్కన వేసి కూడి అసలు టోటల్ మార్కులు వేయాలి కింద సంతకం పెట్టాలి .అక్షర రూపం లో తోటల్స్ రాయాలి మా అసిస్టంట్ ఎక్సామినర్ నంబర్ కూడా వేయాలి స్పెశాల్ అసిస్టంట్ చెక్ చేసిన తర్వాతా ,మార్కు లిస్టు లను ప్రిపేర్ చేయాలి మొదట్లో ఒక కాగితం మీద నంబర్ వేసి ప్రక్కన మార్కులు వేసి టోటల్స్ వేయాల్సి వచ్చేది తర్వాత జిరాక్స్ పేపర్ల లలో వేయాల్సి వచ్చేది .పద్దెనిమిది బండిల్ వచ్చియా తర్వాత కంప్యూటర్ మార్క్స్ లిస్టు నంబర్ తో సహా వచ్చింది దానిలో మార్కులు తప్పులు కేకుండా పోస్ట్ చెయ్యాలి ఒక వేళ తప్పులు పడితే ఎన్ని ఉన్నాయో రాసి సంతకం పెట్టాలి దీనికి అడ్డ వరుసా ,నిలువ వరుస టోటల్స్ వేయాలి అవి సరి పోవాలి అప్పుడు ఆలిస్టు మొత్తం మార్కులువేయాలి ఇదీ పధ్ధతి ఒక వేళ లిస్టు పాడైతే జిరాక్స్ లిస్టు తీసుకొని అందులో నంబర్లు వేసి మార్కులు ఇది వరకు లానే చెయ్యాలి . ఇదంతా అయిన తర్వాతా చెకర్ ఓకే చేస్తే చీఫ్ కు చూపించి హాండ్ ఓవర్ చేయాలి
సాధారణం గా స్పాట్ లో ఎవరి పట్లా పక్షపాతం నాకు ఉండేది కాదు నిష్పక్ష పాతం గా ఉండే వాడిని కాని నా వ్రతానికి ఒక సారి భంగం కలిగింది..అప్పుడు నేను హిందూ హైస్కూల్ లో ఇంగ్లీష్ రెండవ పేపర్ దిద్దు తున్నాను .నా చీఫ్ నా గురుతుల్యులు ,మా హెడ్ మాస్టర్స్ర్ అసోసియేషన్ కు పెద్ద దిక్కు ,రూల్స్ అన్నీ బాగా తెలిసి రూల్స్ పుస్తకాన్ని మాకోసం హాండ్ బుక్ గా రాసిన వారు అయిన హెడ్ మాస్టర్ సోమంచి రామం గారు అని పిలువబడే సోమంచి రామ చంద్ర మూర్తి గారు మంచి కధకు లు .బాల సాహిత్యాన్ని రాసిన వారు .మా లాంటి వారెందరికో ‘’గాడ్ ఫాదర్ ‘’
అలాంటి రామం గారు ఒక రోజు పేపర్లు దిద్దే సమయం లో నెమ్మదిగా నన్ను బయటికి పిలిచి చాలా లో వాయిస్ లో ‘’ప్రసాదూ !నా ఫ్రెండ్ ఒకాయన కొవ్వూరులో హెడ్ మాస్టర్ అతని కొడుకు ఇప్పటికి నాలుగు సార్లు ఎస్ ఎస్ సి లో ఇంగ్లీష్ లో తప్పాడు ఇప్పుడు వాడు పాస్ కాక పోతే వాడికి దిక్కుండదు .కనుక ఆ పేపర్ మన దగ్గరికే వచ్చిందినీకే ఆ బండిల్ ఇచ్చాను నువ్వే వాడినిఎలగో అలా గట్టేక్కించాలి ఇది ఆజ్ఞా కాదు ,ఆదేశం కాదు నా పెర్సనల్ రిక్వెస్ట్ .సాటి హెడ్ మాస్టర్ మనో వేదన ‘’అన్నారు .నేను ‘’మాస్టారూ !సాధ్యమైనంత వరకు స్పెషల్ కేర్ తో దాన్ని దిద్దుతాను.నేను చూసింతర్వాత మీరు చెక్ చేసి ఓకే చేస్తానంటే నాకేమి అభ్యంతరం లేదు ‘’అన్నాను ఆయన ‘’సరే అలానే చేద్దాం ‘’అని చెప్పారు .
నిజం గానే ఆ పేపర్ నా దగ్గరకే వచ్చింది .తీసి దిద్దటం మొదలు పెట్టాను .కుర్రాడిపేపర్ లో సరుకేమీ లేదు మొదట్లో దిద్దితే పది మార్కులే వచ్చాయి .పాస్ కావాలంటే కనీసం పద్దెనిమిది మార్కులు రావాలి .ఇంకో పేపర్ కూడా ఉంది అది ఏ కేంద్రానికి వెళ్లిందో తెలీదు కనుక దాన్లో వాడు పొడి చేస్తాడనే గ్యారంటీ లేదు కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వీడికి కనీసం ఇరవై దాటి మార్కులు వెయ్యాలి . తప్పుల్ని సరి చేశా .లెటర్ ఉంటుంది పది మార్కులకు .అదీ ఈ వెధవ యెమేఎ గిలక లేదు . కనీసం అయిదారు లైన్లు రాసినా ఏదో ఒకటి చేసి మార్కు లెయ్య వచ్చు .మరి ఏం చేయాలో బుర్రగీక్కున్నా .కాని నాకే తట్టింది మాక్సిమమం మార్కులు వేశాను మాచింగ్ ఏదో ఉంది .దాన్ని కూడా నేనే సరి చేశా.మొత్తం మీద తిమ్మిని బ్రాహ్మి బ్రహ్మిని తిమ్మి చేసి ఇరవై రెండు మార్కులు వేశాను చీఫ్ రామం గారికి చూపించా .ఆయన సంతృప్తి పడి ఏమీ మాట్లాడకుండా స్క్రూటినీ చేసి నట్లు పచ్చ ఇంకు తోరైట్లు కొట్టి నేను చేసిన దాన్ని ఎండార్స్ చేసి మిత్ర సుపుత్రుడిని గట్టున పడేశారు .ఇదే నా మొదటి చివరీ వ్రత భంగం కధ .ఆ తర్వాతెప్పుడో రామం గారు కలిసి ఆ కుర్రాడు పాసైనట్లు తండ్రి తనకు ఫోన్ చేసి చెప్పాడని చెప్పారు. హాపీ గా సుఖాంతం అయింది
స్పాట్ లో లో నాతో పాటు ఇంగ్లీష్ పేపర్లు దిద్దే గోపాల రావు అనే హిందూ హైస్కూల్ లెక్కల మేష్టారు నాతో ఎప్పుడూ పోటీ .ఒక అయిదు నిముషాలు తేడాతో ఎన్ని పేపర్లయినా దిద్ది పారేసి బయట పడే వాళ్ళం నవ్వుకుంటూ .ఆ తర్వాత కాసేపు గాసిప్ కొట్టేవాళ్ళం అతను రిటైర్ అయి ఈ మధ్యనే చని పోయాడని తెలిసింది .ఇంకో పోటీ దారుడు పమిడి ముక్కలసూర్య నారాయణ అనే సైన్స్ మేష్టారు .అతనూ స్పీడ్ గానే దిద్దేవాడు పమిడి ముక్కాలా వాడు సినీ నటుడు చంద్రమోహన్ డి ఆ ఊరే అతను చంద్రమోహన్ కు బంధువు కూడా .మాతో పాటు హెడ్ మాస్టర్ కూడా అయ్యాడు .
కొందరు విద్యార్ధులు ఆన్సర్ పేపర్ల లో ఏమీ రాయకుండా ‘’సార నన్ను పాస్ మార్కులేసి పాస్ చేయండి .అని రాస్తే కొందరు ప్రశ్న పత్రాన్నే మక్కీకి మక్కీ ఎక్కించేవారు మరీ ముడుర్లు అయితే బూతులు రాసి మార్కులు వెయ్యక పోతే చచ్చి పోతామని చంపేస్తామని రాసెవారు. ఇవన్నీ నవ్వుకొంటూ చీఫ్ కు, తదితర అసిస్తంట్లకు చెప్పుకొంటూ దిద్దే వాళ్ళం వాళ్ళ మీద కోపం ఉండేది కాదు .కొన్ని సెంటర్ల వాళ్ళు ఫాక్టు కాపీలు కొట్టేవారు .ఒకడికి ఎన్ని మార్కులొస్తే మిగిలిన వారికీ దాదాపు అన్నే వచ్చేవి దీన్ని చీఫ్ కు కాంప్ అసిస్టంట్ కు చెప్పి రికార్డ్ చేయించ వచ్చు కాని దేశం అంతా అదే తీరు కనుక నోరు మూసుకొనే వాళ్ళం .రికార్డ్ చేయిస్తే కేస్ పెడితే స్వంత ఖర్చులతో హైదరాబాద్ వెళ్ళాలి వాయిదాలు తిరగాలి ఈ బాధ ఎవరూ పడరు ఉపాయం గా అపాయం నుంచి తప్పించుకోవటమే .రోజూ కాంప్ లోని మార్క్స్ లిస్టు లు హైదరాబాద్ కు స్పెషల్ మేసేన్జేర్ తో పంపించేవారు .తెలుగు మేస్టార్లు చాలా చాదస్తం గా దిద్దే వారు పావు ఇకటి బై ఎనిమిది మార్కులు వేసి,కూడా లేక చచ్చేవారు .వారిది ఎప్పుడూ ఆలస్యమే .అదిపోయి అర మార్కు కంటే తక్కువ వెయ్య రాదనే నియమం వచ్చింది ..
మరిన్ని స్పాట్ విశేషాలు ఈ సారి
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-13 –ఉయ్యూరు

