మధురగాయకుడు మన్నాడే మరి లేరు!

అనారోగ్యంతో బెంగళూరులో కన్నుమూత
అక్కడే అంత్యక్రియలు పూర్తి.. ప్రముఖుల సంతాపం
బెంగళూరు, అక్టోబర్ 24 : మహమ్మద్ రఫీ.. ముకేష్.. కిషోర్ కుమార్.. మన్నాడే… హిందీ చలనచిత్ర చరిత్రలో సంగీతానికి స్వర్ణయుగంగా చెప్పుకొనే 1950-70ల నడుమ ఒక వెలుగు వెలుగిన ఈ నాలుగు స్తంభాల్లో ఆఖరు స్తంభం ఒరిగిపోయింది! ప్యార్ హువా ఇక్‌రార్ హువా (శ్రీ 420, 1955), యె మెరీ జొహ్ర జబీన్.. తురెnు మాలూమ్ నహీ (వఖ్త్, 1965.. ‘సరిగమలాపవయా.. సరసకు చేరవయా’ పాటను ఒకసారి గుర్తుచేసుకోండి), ఎక్ చతుర నార్ బడి హోషియార్ (పడోసన్, 1968), యే భాయ్ జర దేఖ్ కే చలో (మేరా నామ్ జోకర్, 1970) యారి హై ఈమాన్ మేరా యార్ మేరీ జిందగీ (జంజీర్, 1973).. క్లాసికల్, రొమాంటిక్, కామెడీ ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా విభిన్నమైన పాటలతో సినీ సంగీతాభిమానులను రసడోలలూగించిన మన్నాడే (94) మధుర స్వరం మూగబోయింది!! నాలుగునెలలుగా ఊపరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన తీవ్రఅనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 3.50 గంటలకు కన్నుమూశారు.
ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం గురువారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా ఇక్కడి రవీంద్ర కళా క్షేత్రలో ఉంచి.. అభిమానులు అంతిమ నివాళులు అర్పించిన పిమ్మట బెంగాలీ సంప్రదాయం ప్రకారం బెంగళూరు హెబ్బాళ్ హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మన్నాడేకు ఇద్దరు కుమార్తెలు షురోమా, సుమిత ఉన్నారు. గురువారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమిస్తోందని ఆయన చిన్న కుమార్తె సుమితకు తెలియజేయగానే వెంటనే ఆమె ఆస్పత్రికి చేరుకున్నారని, తన తండ్రి అంతిమ ఘడియల్లో ఆయన పక్కనే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పెద్ద కుమార్తె షురోమా అమెరికాలో ఉంటున్నందున చాలాకాలంగా ఆయన బెంగళూరులో చిన్న కుమార్తె వద్దనే ఉంటున్నారు. మన్నాడే భార్య సులోచన కుమరన్ 2012 జనవరిలో కేన్సర్‌తో కన్నుమూశారు. సులోచన అంటే మన్నాడేకి ప్రాణం. ఆమే తన విజయాలకు స్ఫూర్తి అని ఎప్పుడూ చెబుతుండేవారు.
చిన్నవయసు నుంచే…
మన్నాడే అసలు పేరు ప్రబోధ్ చంద్ర డే. 1919 మే 1న పూర్ణచంద్ర డే, మహామాయా డే దంపతులకు కోల్‌కాతాలో జన్మించారు. సంగీతాచార్యుడైన తన బాబాయి కృష్ణచంద్ర డే, ఉస్తాద్ డబీర్ ఖాన్, ఉస్తాద్ అమన్ అలీ ఖాన్, ఉస్తాద్ అబ్దుల్ రహమాన్‌ఖాన్‌ల వద్ద చిన్న వయసునుంచే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. పదో ఏట నుంచే బాలగాయకుడిగా స్టేజీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. కాలేజీ రోజుల్లో రెజ్లింగ్, బాక్సింగ్ కూడా నేర్చుకుని కుస్తీపట్లు పట్టినా.. పాటను మాత్రం ఏ దశలోనూ వదల్లేదు. వరుసగా మూడేళ్లపాటు అంతర్‌కళాశాలల పాటల పోటీల్లో విజేతగా నిలవడమే ఇందుకు నిదర్శనం. తొలుత బారిస్టర్ కావాలనుకున్న మన్నాడే.. తన బాబాయి సలహాతోనే సంగీతాన్నే జీవికగా మలుచుకున్నాడు. ఆయనకు ‘మన్నా డే’ అనే పేరు పెట్టింది.. 1943లో తమన్నా చిత్రంలో సురయ్యాతో సూపర్‌హిట్ యుగళగీతాన్ని ఆలపించే అవకాశాన్ని ఇచ్చిందీ కృష్ణ చంద్ర డేనే కావడం విశేషం.
ప్రముఖుల సంతాపం: మన్నాడే మరణవార్త ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచింది. బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ గాయని లతామంగేష్కర్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ తదితర ప్రముఖులు ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇంకా.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, బంగ్లా దేశ్ ప్రధాని షేక్ హసీనా తదితరులు సంతాపం తెలిపారు. ఆ మహాగాయకుడు పశ్చిమబెంగాల్‌కే గర్వకారణమని, ఆయన భౌతికకాయాన్ని కోల్‌కాతా తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నించానని.. కానీ, ఆయన కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో కుదరలేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అన్నారు. అయితే, తన తండ్రి మరణవార్త తెలిపినా కూడా మమత సరిగా స్పందించలేదని, దేశం గర్వించదగ్గ మహాగాయకుడిని ఆ రాష్ట్రం విస్మరించడం.. కర్ణాటక సర్కారూ పట్టించుకోకపోవడం ఆవేదన కలిగించిందని, మన్నాడే కుమార్తె సుమిత విలపించారు.
ఆ టోపీ.. అభిమాని కానుక
మన్నాడే అనగానే అందరికీ గుర్తుకొచ్చే ట్రేడ్ మార్క్.. ఆయన తలపై ఉండే ఫర్ క్యాప్. ఆ టోపీని కాశ్మీర్‌కి చెందిన ఒక అభిమాని ఆయనకు బహూకరించాడు. ఒకసారి డిసెంబర్ నెలలో కాశ్మీర్‌కి వెళ్లి ప్రదర్శన ఇస్తున్న సమయంలో స్టేజీపైనే చలికి గజగజలాడుతుంటే.. ఆ అభిమాని వేదిక మీదకు వచ్చి తన క్యాప్‌ని తీసి ఇవ్వడంతో ఉపశమనం పొందిఅద్భుతమైన ప్రదర్శన ఇవ్వగలిగారట. అప్పటి నుంచి జీవితాంతం ఆ క్యాప్‌ని అభిమాని గుర్తుగా ధరిస్తూనే ఉన్నారు.

