అపర భగీరధీయం –2 ఆనకట్ట నిర్మాణ పనులు షురూ

                             అపర భగీరధీయం –2

ఆనకట్ట నిర్మాణ పనులు షురూ

రాజ మంద్రికి నాలుగు కిలో మీటర్ల దూరం లో ఉన్న ధవళేశ్వరం వద్ద ఆనకట్టనిర్మాణా నికి అనువైన స్థలం గా భావించారు .దీనికి ఎగువన నదిని ‘’అఖండ గోదావరి ‘’అంటారు .ఆనకట్ట ప్రాంతం వద్ద గోదావరి ధవళేశ్వరం ,ర్యాలి ,మద్దేశ్వరం విజ్జేశ్వరం అనే నాలుగు పాయలుగా చీలి పోతుంది .దిగువ కొంత దూరం లో ‘’గౌతమి, వసిష్ట’’ అనే మరి రెండు పాయలౌతుంది .ఆనకట్టలు కట్టాల్సిన ఈ నాలుగు పాయల మొత్తం పొడవు 11,945అడుగులు అంటే రెండున్నర మైళ్ళు .మధ్యలో మట్టి కట్ట వేసి ,ఎత్తు పెంచాల్సిన లంకలు నాలుగున్నాయి  .అవే పిచ్చిక లంక ,బొబ్బర్లంక ,మద్దూరు లంక ,చిగురు లంక .వీటి మొత్తం పొడవు ఒకటిన్నర మైళ్ళు అంటే 7,430అడుగులు .నదీ గర్భం లో ఆరు అడుగుల లోతు వరసకు ఇటుక బావులు నిర్మించి ,వాటిపై పన్నెండు అడుగుల ఎత్తు ఆనకట్ట నిర్మించాలి .దాని పై పద్దెనిమిది అడుగుల వెడల్పు రోడ్డు వేయాలి .’’ఇలాంటి ఆనకట్ట అప్పటికి ఇండియా లోనే కాదు ప్రపంచం మొత్తం మీద మరెక్కడా లేదు’’. ఈ బృహత్ నిర్మాణానికి కావలసింది అసాధారణ సాంకేతిక నైపుణ్యం తో బాటు ఎన్ని ఓడిదుడుకులోచ్చినా నిలబడే గుండె నిబ్బరం కూడా ఉండాలి  .ఈ రెండు కాటన్ దొరలో పుష్కలం గా ఉన్నాయి .అందుకే ఈ అత్యంత క్లిష్టమైన నిర్మాణం చేబట్టాడు .

 

Inline image 1Inline image 1Inline image 1

 

ధవళేశ్వరం లో ఉన్న డెల్టా క్లబ్ వెనక తాటి దూలాలతో, తాటాకులతో ఒక కుటీరం నిర్మించుకొన్నాడు దొర .అదే దొరగారి బంగాళా .దాని పక్కనే సిబ్బందికి గుడారాలు వేయించాడు .భార్య ఎలిజ బెత్ ,కూతురు బేబీ హాప్ లను కూడా తీసుకొచ్చి ఇక్కడే కాపురం పెట్టాడు .దగ్గరలో ఉన్న కొండ రాయి ఎంతోనాణ్య మైనదిగా భావించాడు .ఇటుకలు తయారు చేయటానికి కావలసిన మంచి మట్టి ,కాల్చటానికి సున్నపు రాయి దగ్గరలోనే ఉన్నాయి .లాకులకు తూములకు పనికొచ్చే ప్రశస్తమైన టేకు ప్రక్కనే ఉన్న అడవిలోనే ఉంది .అన్ని వనరులు ఉన్న ప్రదేశం గా భావించాడు కాటన్ .సున్నపు బట్టీలు ఇటుక ఆవములు తయారయ్యాయి .క్వారీలో పగల గొట్టిన రాయి తేవటానికి రైలు మార్గం ఏర్పడింది .అక్కడి నుండి నదిలోకి వీటి నన్నిటిని చేర్చటానికి ‘’ఫంటు ‘’అంటే బల్లకట్టు నిర్మాణం చేయించాడు .రాళ్ళను సైజులో చెక్కటం ,ఆనకట్టల మధ్య ఉన్న లంకల ను ఎత్తు చేయటం ,వాటిని బల పరచటం చక చకా సాగిపోయాయి .జూన్ నెలాఖర్లో వచ్చే గోదావరి వరదలకు ముందే ఈ పనులన్నీ పూర్తీ చేయాలని కాటన్ లక్ష్యం   గా పెట్టుకొని చురుగ్గా పర్య వేక్షించి పనులు పూర్తీ చేశాడు

కావేరి పై కట్టిన ‘’గ్రాండ్ ఆనకట్ట’’ను నిశితం గా పరిశీలించిన కాటన్ అక్కడ ఉపరితలం పై వాడిన సున్నపు పూతకు బదులు ఇక్కడ చెక్కిన రాయి ని ఉపయోగిస్తే ఆనకట్ట బలం మరింత పెరుగుతుందని నిర్ణయించాడు .ఇలాంటి చెక్కుడు రాయి పని వాళ్ళు రాజ మండ్రి జిల్లా మొత్తం మీద ఎక్కడా దొరక లేదు .ఉన్న వాళ్ళతోనే పని సాగిస్తే నిర్మాణం మరో ఏడాది ఆలస్యం అవుతుంది. దీనికి ఇష్టపడలేదు దొర .అందుకని వ్యూహం మార్చాడు .తూములు ,లాకులు మొదలైన ముఖ్య భాగాలకే చెక్కుడు కొండరాయి ఉపయోగించాలని రాయి వాడకాన్ని పరిమితం చేశాడు .

1847 ఏప్రిల్ లో ఆనకట్ట నిర్మాణం ప్రారంభ మైంది .ఆ నాడు కాంట్రాక్ట్ తీసుకొని చేసే సంస్థలు లేవు .క్వారీలలో కొండ రాయి పగల గొట్టటం ,సున్నపు రాయి కాల్చి గానుగ ఆడి  సున్నం తయారు చేయటం ఇటుకల్ని కాల్చటం మొదలైన పనులకు ప్రభుత్వం 12మంది అధికారుల్ని ,కొందరు సహాయకుల తో బాటు1300మంది కూలీలను ఏర్పాటు చేసింది .కూలీలు నదిలో పనికి ముందు భయపడ్డా ఒక వారం లో మంచి ఉత్సాహం తో ఇది తమ పని అని తమ కోసమే ఆనకట్ట అని పని చేశారు .ఆ తర్వాత చాలా మంది కూలీలు వచ్చి చేరారు .అధికారులు కూడా వారిని ఎంతో దయతో చూసేట్లు చేశాడు దొర. అప్పుడు మగ కూలీకి రోజుకు ఒక అణా అంటే ఇప్పటి ఆరు పైసలు ,ఆడకూలీకి తొమ్మిది పైసలు అంటే ఇప్పటి నాలుగున్నర పైసలు .తాపీ ,వడ్రంగం కమ్మరులు మొదలైన నాణ్యమైన పని వారికి  రోజుకూలీ రెండు అణాల,మూడు పైసలు అంటే నేటి పద్నాలుగు పైసలు .ఆదివారం సెలవు అయినా ,ఆ రోజు కూలి కూడా కలిపి వారానికి మొత్తం శనివారానికే డబ్బు చెల్లించే ఏర్పాటు చేశాడు కాటన్ .రోజు పని మొదలు పెట్టటానికి, ,ముగియ టానికి గుర్తుగా ఫిరంగి మోగించే వారు .

ఇక్కడ జరుగుతున్నా జల యజ్ఞం చూసి కూలీలు విపరేతం గా వచ్చి చేరుతూ సంఖ్యను పది వేలకు చేర్చారు .ఐదు వందల మంది వడ్రంగులు ,మరో అయిదు వందల కమ్మర్లు ,వెయ్యి మంది రాతి చెక్కుడు వాళ్ళను నియమించి వేగం గా పనులు చేయించాడు కాటన్ .రోజుకు అయిదు వందల టన్నుల కొండ రాయి కొట్టి సిద్ధం చేసే వారు .ఈ రాయి సున్నం ఇటుక నది ఒడ్డుకు చేర్చే రైలు మార్గమూ తయారై పోయింది .నాలుగు క్రేనులు పదహారు రైల్వే వాగన్లు తయారయ్యాయి .వీటిని నదిలోకి చేర్చటానికి పద్దెనిమిది ఫంట్లు వచ్చేశాయి .

ఇక్కడ తాటాకు పాకలో ఉన్నప్పుడే కాటన్ కు రెండో కూతురు పుట్టింది .కాని దురద్రుస్ట వశాత్తు ఏడాది మాత్రమె బ్రతికి చని పోయి కాటన్ దంపతులకు తీరని శోకం మిగిల్చింది .మనో వేదన తో తట్టుకో లేక పోయారిద్దరూ .నెమ్మదిగా జన జీవన స్రవంతిలో కలిసి నిర్మాణం పనులు వేగవంతం చేశాడు .పల్లెల నుంచి నిరుపేద స్త్రీలు చంకలో పిల్లల్ని ఎత్తుకొని అర్ధ నగ్నం గా కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా వచ్చి పని చేయటం ఆ దంపతుల్ని కలచి వేసింది బిచ్చ గాళ్ళ బెడద ఉండేది కాదు .కస్టపడి పని చేసి ,దొర మెప్పు సంపాదించుకొన్నారు. తెల్ల దొరలని వీరంతా గౌరవించే వారు. దొరలకు తమ వద్ద ఉన్న కానుక లిచ్చి సంతోష పెట్టె వారు. వాళ్లకు ఇబ్బంది కల్గించకుండా కూలీలు ఏంతో  జాగ్రత్తగా మసలే వారు .

నాలుగు వైపులా కొండను ప్రేలుడు పదార్ధాలతో పగల కొట్టే భయంకర శబ్దాలు, కూలీల పాటలు .మేస్త్రీల అదలింపు ల తో దొర ఇంటి చుట్టూ సందడే సందడి .ఈ గందర గోళానికి దూరం గా కొండ ప్రాంతం లో కి కాటన్ మకాం మార్చాడు .రాయిని మందు సామానుతో పేల్చినప్పుడు రాయి ముక్కలేగిరివచ్చి బంగ్లా పై పడుతూ ఉండేవి .ఈ అదు రుడు కు ఇంటి గోడలు బీటలు ఇచ్చి అందులోంచి గాలి వెలుతురూ ధారాళం గా బంగ్లా లోనికి వచ్చేవి .పాములు బెదిరి ఈ బీటల్లో దూరి భయం కలిగించేవి .పిల్లలు భయ పడే వారు .ప్రజల్లో కాటన్ దొర పై ఆరాధనా భావం ఏర్పడింది .ఆటబొమ్మలు, పంచదార చిలకలు తినే పదార్ధాలు దొర కుటుంబానికి కానుక లు గా ఇచ్చే వారు .

దొర ఇంటి పని వంటపని బట్టలుతికే పనికి ప్రత్యెక సేవకులుండే వారు .ఏకులం వాళ్ళు ఆ పనే చేసే వారు ఒక రోజు ‘’లచ్చి ‘’ అనే ఇల్లు ఊడ్చే పని మనిషి ఎలిజ బెత్ ను బతిమి లాడి అర్ధ రూపాయి జీతం లో అడ్వాన్సుగా అడిగి తీసుకోంది.ఎందుకు అంటే కారణం చెప్పలేదు .లచ్చి వెంటనే రాజ మండ్రి వెళ్లి అర్ధ రూపాయి పెట్టి ఒక చిన్న పాపను కొనుక్కొని తెచ్చుకోంది .పిల్లలు లేకుండా ఒంటరిగా బ్రతకలేనని అందుకే ఈ పిల్లను కొనుక్కోవటానికే అర్ధ రూపాయి అడిగానని చెప్పి పాపను దొరసానికి చూపించింది .ఆమె నిర్వీర్యురాలైంది .ఆడపిల్లల్ని ఎంత కారు చవకగా ఆనాడు అమ్ముతున్నారో అర్ధం చేసుకొని విచారించింది ఎలిజబెత్ .ధవళేశ్వరం ఆనకట్టకు కొన్ని పునాది బావుల నిర్మాణం పూర్తీ అయింది .కాని 1847లో గోదావరికి వచ్చిన వరదలవల్ల పనులు పూర్తిగా ఆగిపోయి కొంచెం నిరాశ కల్గించింది కాటన్ కు ఆనకట్ట నిర్మాణం పూర్తీ అయిన విధానం తరువాత తెలుసు కొందాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-10-13-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.