అపర భగీరధీయం—4 డొక్కా సీతమ్మ గారి లంకల గన్నవరం వద్ద ‘’ ఆక్విడేక్ట్ ‘’

అపర భగీరధీయం—4

డొక్కా సీతమ్మ గారి లంకల గన్నవరం వద్ద ‘’ ఆక్విడేక్ట్ ‘’

గోదావరి సెంట్రల్ డెల్టా లో వసిష్ట గోదావరికి ,దాని పాయ అయిన వైనతేయ నదికి మధ్య’’ నగరం అనే సార వంత మైన భూఖండం’’ ఉంది .దీన్ని ‘’గోదావరి ఉద్యానం ‘’అని ముద్దుగా పిలుచుకొంటారు .1851నాటికి నగర ఖండం లో ఎలాంటి సాగు నీటి సౌకర్యం లేక ,రవాణా సౌకర్యాలు లేక బాగా వెంక బడి ఉంది వరదకాలం లో నిండుగా ప్రవహించే నది నీటిలో నాటు బోట్ల  పైనే ప్రయాణం చాలా భయంకరం గా ఉండేది .ఎన్నో ప్రమాదాలు తరచుగా జరిగి ప్రాణనష్టం అపారం గా జరిగేది .వేసవిలో కాలి నడకన ఇసుకలో మండు టెండలో వెళ్ళాల్సి వచ్చేది  బొబ్బలెక్కిన కాళ్ళ తో ఏటికి అడ్డం గా నడవాల్సిన దుస్తితి ఉండేది .ఎవరికైనా జబ్బు చేస్తే ఇంతే సంగతులు .వైద్య సదుపాయం లేక ప్రాణాలు హరీ మనేవి Inline image 1

ఆ కాలం లో లంకల గన్నవరం లో డొక్కా సీతమ్మ గారు భర్త జోగన్న గారు ఉండేవారు .ఈ దంపతులు ఎంతో మంది అతిధి అభ్యాగతులకు నిరతాన్న దానం చేసి గొప్ప కేర్తి పొందారు. సీతమ్మ గారిని’’ అపర అన్నపూర్ణ ‘’గా ఆరాధించే వారు .ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ,పురుళ్ళు వచ్చినా సీతమ్మ గారు చేతికి ఎముక లేకుండా విరాళాలు ఇచ్చి ఆదుకొనే వారు .అర్ధ రాత్రి కూడా అతిధులేవరైనా వస్తారేమో నని లాంతరు పట్టుకొని ఏటి ఒడ్డుకు వెళ్లి చూసి వచ్చి అప్పుడు నిద్ర పోయేవారు .సీతమ్మ గారి ఈ సేవా తత్పరతకు అబ్బుర పడ్డ ఆ నాటి బ్రిటిష్ చక్ర వర్తి ఏడవజార్జి ఆమెకు 1908జనవరి ఒకటవ తీదీన కలెక్టర్ తో  సన్మానింప జేసి ‘’ప్రసంశా పత్రం ‘’అంద జేశాడు .ఏ విరాళాలు ఆమె స్వీకరించక స్వచ్చందం గా తనకున్న దానితో ఈ సేవలను కొనసాగించిన ఉత్తమా ఇల్లాలు సీతమ్మ తల్లి .Inline image 1

గోదావరి డెల్టాకంతటి కి ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా సాగు నీటి సౌకర్యం కల్పించిన కాటన్ దొర నగర ఖండానికి ఏమీ చేయలేక పోయానే నని తీవ్రం గా మధన పడ్డాడు. పుష్కలం గా నీరు లభించే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని సంకల్పించాడు .దీనికి పరిష్కారం ఇక్కడి వైనతేయ నది పై ‘’ఆక్విడేక్ట్’’నిర్మాణం ఒక్కటే సరైనది అని భావించాడు .దీని వల్ల  నగర ఖండం లోని 45వేల ఎకరాల సార వంత మైన భూమికి సాగు నీటి వసతి కల్పించాలని ఆలోచించాడు .ఈ బాధ్యతను యువ ఇంజినీర్ అయిన లెఫ్టి నెంట్ హేగ్ కు అప్పగించాడు .మొదటి అంచనాలో ఆక్వి డేక్ట్ పొడవు 600గజాలు ,39ఆర్చి స్తంభాలు ,గా తీసుకొని ఖర్చు 73,200రూపాయలు అవుతుందని ప్రభుత్వానికి కాటన్ దొర  1851ఆగస్ట్ లో ప్రతి పాదనలు పంపించాడు .డిసెంబర్ లో ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .అయితే నది వెడల్పు పెరిగినా ,ప్రవాహ వేగం తగ్గి ,నిర్మాణం సాఫీ గా జరుగుతుందని అనుకొని ప్రాజెక్ట్ స్థలాన్ని కొంచెం దిగువ వైపుకు జరిపాడు .దీని వల్ల  ఆక్వి డేక్ట్ పొడవు 750గజాలు ,ఆర్చి స్తంభాలు 49తొమ్మిదికి పెరిగి నిర్మాణ వ్యయం 1,60,395రూపాయలకు పెరిగింది .శ్రేష్టమైన ఒండు మట్టి ఇక్కడ లభించటం వల్ల  రాతికి బదులు పద్దెనిమిది అంగుళాల పొడవు ,ఆరు అంగుళాల వెడల్పు ,మూడు అంగుళాల మందం ఉన్న ప్రత్యెక ఇటుకలను తయారు చేయించి ఉపయోగించాడు ఇవి బాగా కాలటానికి గారెలకు మధ్యలో చిల్లి చేసినట్లు మధ్యలో అరంగుళం వ్యాసం కల బెజ్జం పెట్టించాడు .దీని వల్ల అతి నాణ్యమైన,దృఢమైన  ఇటుకలు తయారయ్యాయి .ఇవన్నీ కాటన్ ఊహ తో చేసినవే .1853 లో బెంగాల్ ఇంజినీర్ కల్నల్ బెర్డ్ స్మిత్ ఆక్వి డేక్ట్ ను పరిశీలించటానికి వచ్చి, కాటన్ నిర్మాణ కౌశల్యానికి అబ్బుర పడి ఎంతో మెచ్చుకొన్నాడు .కాటన్ ఇక్కడ చేబట్టిన నిర్మాణ విధానాన్ని స్మిత్ తాను చేస్తున్న గంగా నది పనుల్లో ఉపయోగించుకొన్నాడు.అదీ కాటన్ స్పూర్తి .

గన్నవరం ఆక్వి డేక్ట్ లో ఇరవై రెండు అడుగుల వెడల్పు గల ఒక కాలువ ,దానికి ఒక వైపు పడవ సరంగులు ,ఇతరులు నడవ టానికి వీలుగా తొమ్మిది అడుగుల వెడల్పున్న కాలి బాటను ఏర్పాటు చేయించాడు .ఆక్వి డేక్ట్ నిర్మాణం కేవలం పది హీను నెలల్లో పూర్తీ చేశాడు కాటన్ దొర .సరి లేరు తన కెవ్వరూ అని రుజువు చేశాడు .కాని నిర్మాణ వ్యయం అంచనాలకు మించి పోయిందని ప్రభుత్వం హేగ్ ను సంజాయిషీ కోరింది .అప్పటికే మద్రాస్ కు చీఫ్ ఇంజినీర్ గా ప్రొమోషన్ తో వెళ్ళిన కాటన్ తగు వివరాలతో ప్రభుత్వానికి  నచ్చ జెప్పి ,జరిగిన అదనపు వ్యయాన్ని కూడా వచ్చేట్లు చేసి తన మీద ఉన్న నమ్మకాన్ని మరో సారి రుజువు చేసుకొన్నాడు. తన సమర్ధత ను చాటాడు .గన్నవరం ఆక్వి డేక్ట్ ఇండియాలోనే మొట్ట మొదటి ఆక్వి డేక్ట్ .దీని ‘’రూప శిల్పి కాటనే’’ ఆయన ఆలోచనలతో నే సాకారమైంది .దీనితో నగర భూఖండం సస్య శ్యామలమై సర్వతో ముఖాభి వృద్ధి చెందింది .ఈ ఆక్వి డేక్ట్  తర్వాత ‘’డొక్కా సీతమ్మ  ఆక్వి డేక్ట్ ‘’‘’గా పేరొందింది

బెజవాడలో కృష్ణా నది పై ఆనకట్ట నిర్మాణం

కృష్ణా నదిపై బెజవాడ వద్ద ఆనకట్ట నిర్మించాలని చాలా కాలం గా ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నా నెరవేర లేదు .1792లోసర్వేయర్  మేజర్ జెనరల్ అలేక్సాండర్ బీట్సన్- మైకేల్ టాపింగ్ అనే ఖగోళ శాస్త్రజ్నుడినిసర్వే చేసి నివేదిక పంపమని  ఆదేశించాడు .ఆయన అన్నీ చూసి బెజవాడ వద్ద ఆనకట్ట చాలా అవసరం అని రాశాడు 1832-33లో వచ్చిన ‘’నందన క్షామం ‘’కృష్ణా గోదావరి మండలాలను అతలా కుతలమ్ చేసి, కరాల నృత్యం చేసి, రెండు లక్షల పశువులు, మూడు లక్షల మనుష్యులు మృత్యు వాత పడ్డారు .కోట్లాది రూపాయల రెవిన్యు కు నష్టం జరిగినా ప్రభుత్వం ఏమీ పట్టించుకోక నిర్లిప్తం గా ఉండి పోయింది .1839లో  ఎడ్వర్డ్ బకుల్ అనే ఇంజినీర్ ఆనకట్ట విషయం మరో సారి ప్రభుత్వ దృష్టికి తెచ్చాడు .బేజ వాడ వద్ద కృష్ణ పై 3,900 అడుగుల వెడల్పైన ఆనకట్ట ఇరుకైన లోయలో నలభై అడుగుల ఉవ్వెత్తుగా ఎగసి పడే వరద ప్రవాహం లో అసాధ్యం అని ‘’బుట్ట  దాఖలు’’ చేసింది ప్రభుత్వం .ప్రజలు పట్టు

వదలని విక్రమార్కుల్లా ప్రభుత్వం వెంటా పడ్డారు చివరికి గత్యంతరం లేక ఇక్కడ సాగునీటి సౌకర్యాలను కృష్ణా డెల్టాకు ఎలాచేయవచ్చో వివరణ తో కూడిన నివేదిక ఇవ్వమని సివిల్ ఇన్జినీర్  హెచ్ ఏ లేక్ ను ఆదేశించింది .

అప్పటికే గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి జగద్విఖ్యాతి చెందిన కాటన్ దొరను లేక సంప్రదించి నదీ గర్భం లో ఇసుకలో పదకొండు అడుగుల లోతు పునాది బావుల్ని దింపి ,దాని పై పది హీను అడుగుల ఎత్తున ఆనకట్ట గోడను ,దాని పై రోడ్డు ను నిర్మించాలని ,గోదావరి డెల్టా కాలువలతో ,ఏలూరు వద్ద కృష్ణా డెల్టా కాలువను కలిపి ,పడవల రాక పోకలకు అనుగుణం గా త్రవ్వాలని  ప్రభుత్వానికి ప్రతి పాదన పంపాడు .ఇక్కడి ప్రభుత్వాదికారుల్లో భిన్నాభి ప్రాయాలేర్పడ్డాయి. అప్పుడు ప్రభుత్వం దీనిలో ప్రావీణ్యం ఉన్న కాటన్ దొర సలహాను కోరింది .కాటన్ నదీ ప్రవాహానికి ఇసుక పునాదులు కదిలి పోకుండా రాతి చప్టా పేర్చి జాగ్రత్త తీసుకొంటే ప్రమాదం ఉండదుఅని  సూచించాడు వ్యయం కూడా అనుకున్నంత ఎక్కువ ఏమీ కాదని ఇక్కడ ఆనకట్ట బహుళ ప్రయోజనం అని గట్టిగా చెప్పాడు .

దీనిపై 1849 జనవరిలో కెప్టెన్ అలేక్సాండర్ ఆర్ మొదలైన వారితో నిపుణుల సంఘాన్ని ఏర్పరచి అభిప్రాయ సేకరణ చేసింది .ఈ కమిటీ ఇక్కడి ఆనకట్ట ప్రజల జీవన్ మరణ సమస్య అని దీన్ని డబ్బుతో లంకె పెట్ట వద్దని ఘాటుగా చెప్పింది  .కాటన్ పై ఉన్న అచంచల విశ్వాసం తో ఆయన మార్గ దర్శకత్వం లో నివేదికను అధ్యయనం చేసి1851లో ఆమోదించింది .కాటన్ దగ్గర శిక్షణ పొందిన కెప్టెన్ అలేక్సాండర్ పర్య వేక్షణ లో కృష్ణా నదిపై బెజవాడ వద్ద ఆనకట్ట నిర్మాణం ,కాలువల త్రవ్వకం 1852లో ప్రారంభమై మూడేళ్ళ 1855లో పూర్తీ అయింది.ఏ మాత్రం ఆధునిక సాంకేతిక సామర్ధ్యం లేని ఆ కాలం లో నిర్మాణ కాలం లో నీటి ప్రవాహాన్ని మల్లించటం ఎంతో కష్టమైన విషయం అయినా అకుంఠిత దీక్ష తో మూడేళ్ళ లో ఆనకట్ట నిర్మాణం పూర్తీ చేశారు .ఇలాంటి వాటికి అన్ని వనరులున్నా ఇప్పుడు పదేళ్ళు పడుతోంది .మొదట్లో 5,80 ,000ఎకరాలకు మాత్రమె సాగు నీటి సౌకర్యం కలిగించ గలిగారు .1894లో ఆనకట్ట ఎత్తుమరో మూడు అడుగులు పెంచి ,ఆయకట్టు ను ఎనిమిది లక్షల ఎకరాలకు పెంచారు .1925లో అయిదు అడుగుల తలుపులు బిగించి సాగు విస్తీర్ణాన్ని పన్నెండు లక్షల ఎకరాలకు పెంచి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేశారు అప్పటిదాకా ఇక్కడ జొన్న పంట మాత్రమె మెట్టపంట గా పండేది. ఇప్పుడు చెరకు, వరి ప్రత్తి ,పసుపు ,మొదలైన వానిజ్యపంటలు పండించే వీలు కలిగింది .సాళ్వా. దాళ్వా పంటలు కూడా పండాయి

1957లో శిధిలా వస్తకు చేరిన ఆనకట్ట స్థానం లో బారేజి ని నిర్మించి ‘’ప్రకాశం బారేజి ‘’గా నామకరణం చేశారు .కృష్ణాతూర్పు  డెల్టాకు 378కిలోమీటర్లు, పశ్చిమ డెల్టాకు307కిలో మీటర్ల కాలువలు త్రవ్వి సాగు నీటి సౌకర్యం కలిగించారు .లాకులు కట్టి రవాణా మార్గాలనేర్పరచారు .కాటన్ దొర ఈ దేశానికి రాక పోయి ఉంటె కృష్ణా నది పై బేజ వాడ వద్ద ఆనకట్ట నిర్మాణం జరిగి ఉండేది కాదని అందరు అభిప్రాయ పడ్డారు .కృష్ణా డెల్టా ప్రజలు కాటన్ దొరకు ,కెప్టెన్ అలేక్సాండర్ కు రసదా రుణ పడి  ఉంటారు .అందుకే కృతజ్ఞతా భావం తో  బెజవాడ ఆనకట్ట వద్ద కెప్టెన్ ఆర్ శిలా విగ్రహాన్ని  ప్రతిష్టించి స్మరణకు తెచ్చుకొంటున్నారు .

కాటన్ అసమాన ప్రతిభా విశేషాలను తరువాత తెలుసు కొందాం

సశేషం

 

https://www.youtube.com/watch?time_continue=1&v=z7lXt7yirMw

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-13-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.