ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -40-
17-పోస్ట్ -ఇంప్రషనిస్ట్ ఫ్రెంచ్ పెయింటర్ – పాల్ సిజేన్ (Paul Cezanne)-2
పారిపోయి పల్లెటూరి అమ్మాయితో రహస్యం గా పెళ్లి
1870 లో ఫ్రాన్స్ కు ప్రష్యా దేశానికి జరిగిన యుద్ధం అందర్నీ యుద్ధ సైనికులుగా చేసింది .ఈ బాధ భరించలేక సిజనే ఎస్తేనే అనేచిన్న టౌన్ కు పారిపోయాడు .అక్కడ తన అసమాన చిత్రకళా నైపుణ్యం తో ఆకళకు అమరత్వం సిద్ధింప జేశాడు .అక్కడే మోడల్ గా పని చేసిన హార్తెన్స్ ఫికేట్ తో సాన్నిహిత్యం పెరిగి వివాహం చేసుకొన్నాడు .ఆమె జూరా ప్రాంత రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి .ఆమెకు 19ఏళ్ళు .మన పైంటర్ కంటే 11 ఏళ్ళు చిన్నది .రెండేళ్లకు కొడుకు పుట్టాడు .వాడికి తనపేరు పాల్ అని పెట్టుకొన్నాడు .తన ప్రేమ వ్యవహారానికి తండ్రి ఉగ్ర నరసింహం అవుతాడేమో నని భయపడి ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాడు .తండ్రివి డేగ కన్నులు .వ్యవహారం పసిగట్టాడు .అగ్గి మీద గుగ్గిలమై కొడుక్కు ఇచ్చే అలవెన్స్ డబ్బు కట్ చేసేశాడు . అమెతోకాపురం చట్ట సమ్మతం చేయటానికి ,కుటుంబాన్ని ఒప్పించటానికి ఆమెను పది హేడేళ్ళపరిచయం తర్వాత పెళ్లి చేసుకొన్నాడు .అయినా ఆమె పై ప్రేమ క్రమంగా తగ్గిపోయింది .ఆమెతో అరుదుగా గడుపుతూ సిటీ జీవితానికి అలవాటు పడిపోయాడు . ఆమె నుంచి తప్పించుకోవటానికి తరచుగా ప్రయాణాలు చేసేవాడు .దీనికి సాకుగా ‘’మా ఆవిడ స్విట్జర్లాండ్ ను ,నిమ్మకాయాలను మాత్రమె అతి జాగ్రత్తగా చూసుకొంటుంది ‘’అని చెప్పాడు .
క్రమబద్దత లేని జీవితం
పెళ్లి కాక పూర్వం నుంచీ కూడా సిజనే మామూలు జీవిత సౌఖ్యాలకు దూరంగా ఉండటం అలవాటు చేసుకొన్నాడు .అతని అలవాట్లు లాగానే అతని స్టూడియో కూడా అస్తవ్యస్తంగా ఉండేది .అంటువ్యాధుల కూడలిగా ఉండేది .30 వ ఏట చాలా పొడవుగా , బుజాలు కొద్దిగా ఒంగి, చిన్నగద్దముక్కు తో ,మోసం చేసేట్లుండే కళ్ళతో కనిపించేవాడు .కొత్తగా వచ్చిన వారికి గట్టిగా మాట్లాడినట్లు ఆ మాటలు గుబురు నల్ల గడ్డం లోంచి వస్తున్నట్లు గా ఉండేది .40 ఏళ్ళు వచ్చేసరికి మనిషి చిరుబురులాడుతూ దుస్టుడేమో అని పించేవాడు .
విమర్శకుల దారుణ విమర్శ
ఇంప్రెషనిస్ట్ లంటే అభిమానం పెరిగింది .కాని పత్రికలు విమర్శల చేన్నాకోల్ తో ఝడిపించేవి .ఆతని చిత్రాలు పల్లెటూరి మూర్ఖుడి చిత్రాలని ,అతనొక మాంసం కొట్టే బుచర్ అనీ అతని పెయింటింగ్స్ చిన్నపిల్లలు ఆకతాయి తనం తో సీతాకోక చిలకలను పట్టుకొని జిగురుతో పుస్తకం లో అంటించి నట్లున్నాయని ఈసడించారు . అతనంటే ద్వేషం పెరిగిపోయింది .ప్రాచుర్యం పోయింది .మూడవ ఇంప్రెషనిస్ట్ ప్రదర్శన లో విమర్శకులు అరుపులు కేకలు నిరసనలతో హోరెత్తించారు .ఈ సంఘటనపై జోలా ‘’హాండ్ కర్చీఫులు అడ్డం పెట్టుకొన్నా నవ్వులు పెదిమలలోంచి పగిలి బయటికొచ్చాయి ,రెచ్చిపోయిన కుర్రకారు పై చొక్కాలు విప్పేసి అట్టహాసాలతో కోపాన్ని ప్రదర్శించారు .చర్మాన్ని మాంసం రంగు తో ఆకుపచ్చ ,,పసుపు షేడ్ లతో చిత్రించటం ఎవరూ హర్షించలేకపోయారు .సేజనే ఒక అపస్మారక స్థితిలో ఉ౦డి వీటిని పెయింట్ చేశాడేమో అని ఎద్దేవా చేయటమేకాక గర్భిణీ స్త్రీలను సేజనే చిత్రాలు చూడవద్దు అని కూడా చెప్పారు .చూస్తె వాళ్ళకుపుట్టే పిల్లలు ఒళ్లంతా మచ్చలతో పుడతారని ఝడిపించారు కూడా అంత వ్యతిరేక ప్రచారం జరిగింది .
సిజనే వర్ణాలపై చేస్తున్నప్రయోగాలను చూసి హర్షించిన మరో విమర్శకుడు ‘’విజ్లర్ ‘కూడా విమర్శిస్తూ ‘’ఒక ఆరేళ్ళ పిల్లాడు సేజనే లాగా వాళ్ళ చెల్లెల్ని చిత్రిస్తే ,అతని తల్లి మంచి తల్లి అయితే అతడిని కొట్టిపారేసేది ‘’అన్నాడు .యాభై ఏళ్ళ తర్వాత ఒక లక్ష డాలర్లకు అమ్ముడుపోయిన సిజనే లాండ్ స్కేప్ చిత్రాలు ఆనాడు నలభై నుంచి ఎనభై ఫ్రాంకు లకు మించి ఎవరూ కొనలేదు .అదీ మన చిత్రకారుని సమకాలీన సమాజపు విపరీత వింత పోకడ .అసలు వీటి నెవరూ పట్టించుకోను కూడా పట్టించుకోలేదు ప్రదర్శనలో .’’ఒక లుక్ వేద్దాం ‘’అని కూడా ఎవరూ అనుకోకపోవటం దారుణం అంటారు .
ఇలాంటి తిరస్కారాలకేమీ స్పందించకుండా సిజనే తన పనేదో తానూ చేసుకు పోతున్నాడు . ఇంప్రెషనిజం టెక్నిక్కులు వాడాడు .తర్వాత వారితో విభేదించినా వారి సిద్ధాంతాలను అంగీకరించాడు . ‘’ప్రకృతిలో గీతలు అనేవి లేనేలేవు .’’అని సిజనే నిశ్చితాభిప్రాయం .‘’.ప్రతిదీ లైట్ అండ్ షేడ్ ల ఏర్పాటే .రంగులమార్పిడి భావ వ్యక్తీకరణాలే ‘’అంటాడు ‘’the main thing is the modeling –and a better word for modeling is modulation ‘’అని అతని నిర్వచనం .చారిత్రాత్మక ,పౌరాణిక జానపద గాధల చిత్రాలను ‘’bad literature ‘’ అనేశాడు .ఎట్టకేలకు 1882లో అతని 43 వ ఏట సిజనే గీసిన ఒక చిత్రాన్ని ‘సెలూన్’’ అంగీకరించింది .ఇదికూడా ఒక కుట్రలో భాగమే ,వంచనా శిల్పమే .అంటోన్ గిలిమేట్ అనే స్నేహితుదు సెలూన్ లో జూరీ మెంబర్ .అతను ఒక విద్యార్ధి చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తూ ,ఆ ప్రదర్శనా చిత్రాల కేటలాగ్ లో ‘’Cezanne –a pupil of Guillimet ‘’అని పేర్కొన్నాడు .
అందరూ ఉన్నా ఏకాకి జీవితమే –చుక్కల్లో చంద్రుడు
వయసు పెరిగిన కొద్దీ అంతర్ సంఘర్షణలకు సిజనే ఎక్కువగా లోనయ్యాడు .ఈ విషయాలపై విన్ ట్రాప్ సార్జంట్ రాస్తూ ‘’ he painted women both as portraits and as nudes ,yet he was so frightened by women that he often could not bear to remain in the same room with his female models ‘’అని చెప్పాడు. ఆ రోజుల్లో ఉన్న సెలూన్ పెయి౦టర్స్ అంటే సిజనే కు ఈర్ష్య ఎక్కువ .కాని వారి ఆమోదం కోసమే ఎదురు చూసేవాడు .అతను పూర్తిగా కేధలిక్ మతానికి చెందినవాడు .కాని ప్రీస్ట్ ల చెడుప్రవర్తనపై నిప్పులు కక్కేవాడు .సమాజం అంటే భయపడేవాడు తోటివారు ఏదో ప్రలోభపెట్టి తనను గేలాలతో బంధించి వారితో లాక్కు పోతారనే భయం బాగా ఉండేది . ‘’humanity was horrible .Nature was reassuring but it was loveliest when it was inanimate ‘’ఇదీ సిజనే మనస్తత్వం .కాని ఎమిలీ జోలా అంటే చాలా అభిమానం అతనికి విధేయుడుగా ఉండేవాడు .జోలా రాసిన నవల ‘’L’oeuvre’’లో హీరో గా తననే చిత్రి౦చాడేమోననే అనుమానం ఉండేది .అందులో హీరో అపజయాల పెయింటర్ ,పిరికి ,.తనను తాను విశ్వజనంతో కలుపుకోకుండా ఏకాకి గా ఉండేవాడు .కాని తనలాంటి వారు చాలా అరుదని చెబుతూ ‘’ప్రతి శాసన సభలో రెండు వేల మంది శాసన సభ్యులు ఉండవచ్చు . కాని సిజానే లాంటి వాడు రెండు శతాబ్దాలకు ఒక్కడు మాత్రమె ఉంటాడు’’ అని ఘంటాపధం గా చెప్పగల ధీరుడు సిజనే .
పీచే మూడ్
1895 తర్వాతా మాత్రమె 20ఏళ్ళ చిత్ర కళా జీవితం లో నాలుగు మాత్రమె ప్రదర్శనలు ఏర్పాటు చేశాడుసిజనే .అప్పటికి వయసు 56 .వోలార్డ్ అనే డీలర్ చాలా చిత్రాలు పెట్టాడు కాని అప్పటికీ పబ్లిక్ అతన్ని తిరస్కారం తోనే చూశారు .సానుభూతి ఎక్కడా రాలేదు .సెలూన్ సామ్రాట్టులూ పెదవి విరిచారు .ఇక పారిస్ మీద విసుగు పుట్టి తన స్వగ్రామం చేరుకున్నాడు .అక్కడే తల్లితో కాలం గడిపాడు .స్నేహితులు అంటే అసహ్యమేసింది సిగ్గుపడి వారికి మొహం చూపించ లేక పోయాడు .హింస ఫోబియాలో ఉండిపోయేవాడు ‘’ఈ ప్రపంచం నన్ను అర్ధం చేసుకోవటం లేదు .నేను కూడా ప్రపంచాన్ని అర్ధం చేసుకోలేక పోతున్నాను .అందుకే దానికి దూరంగా ఉండిపోతున్నాను .మనుషుల చీచ స్వభావం చూసి సహించలేక పోతున్నా వారితో ఏకీభ వించ లేక పోతున్నా . జీవితం భయ పెడుతో౦ది నన్ను ‘’ అని కొడుకుకు ఉత్తరం రాశాడు .మానసిక భయం బాగా పట్టుకొని పీడించింది .డిప్రెషన్ నుండి బయట పదాలని విశ్వ ప్రయత్నం చేశాడు .’’సెరిబ్రల్ టెన్షన్ ‘’అతన్ని పీడిస్తోంది. ఏ పని అయినా భరించలేక పోయాడు .అయినా’’ఫారం ,కలర్’’లపై పోరాటం మానలేదు .I am old and ill –but I am determined to die painting ‘’అని కలవరించేవాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-15- ఉయ్యూరు

