ఇన్‌స్టెంట్’ కిల్లర్స్!
రెండు నిమిషాల్లో వేడివేడిగా, ఘుమఘుమలాడుతూ నోరూరించే ఆ నూడిల్స్.. నెమ్మదిగా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఎందరికి తెలుసు? తెలిసినా పట్టించుకునేవాడేడి? ప్రపంచవ్యాప్తంగా ఇంటిల్లిపాదికీ అప్పటికప్పుడు, చిటికెలో తయారయ్యే రుచికరమైన ‘ఇన్‌స్టెంట్ నూడిల్స్’ అంటే చచ్చేంత ఇష్టం. అయతే ప్రమాదకరమైనవని ఇప్పుడు తేటతెల్లమవుతోంది. నిజానికి నూడిల్స్ మంచి ఆహారమే. కానీ, రుచిని పెంచడానికి వాటి తయారీలో వాడే రసాయనాల పరిమాణం పెరిగితే అది మనిషి ఆరోగ్యానికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలా ప్రమాదకర రసాయనాలతో తయారైన మ్యాగీ నూడిల్స్‌పై ఇపుడు దేశవ్యాప్తంగా వివాదం రేగింది. ‘ఆకలి రుచి ఎరుగదు…నిద్ర సుఖమెరుగదు’ అన్నది అలనాటి సామెత. కానీ, ‘ఆకలి రుచిని కోరుతోంది.. ప్రాణాలతో చెలగాటమాడుతోందన్న’ది నేటి సామెత. ఇపుడు సర్వత్రా చెలరేగిన మ్యాగీ నూడిల్స్ వివాదం ఇదే చెబుతోంది. ఒక్క నూడిల్స్ గురించే ఎందుకు చెప్పుకోవాలి. ‘జంక్ ఫుడ్’గా భావించే ఆహార పదార్థాలన్నీ ఆ కోవలోకే వస్తాయి. కూల్‌డ్రింక్స్, మినరల్ వాటర్ బాటిల్స్‌లో పురుగుమందులు, ఐస్‌క్రీములు, చాక్లెట్లు, పాలపొడి ఒకటేమిటి? నాగరికపు ఆహార పదార్థాలైన బర్గర్లు, పిజ్జాలలో రుచి పెరిగేందుకు వాడే ఎంఎస్‌జి (మోనో సోడియం గ్లుటామేట్) వంటివి దర్శనమిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ‘ప్రాసెస్‌డ్ ఫుడ్’లో పరిమితికి మించి వాటిని వాడుతూనే ఉన్నారు. *** నూడిల్స్…ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినోటా విన్పిస్తున్నమాట. నిన్నమొన్నటివరకు దేశంలో దాదాపు ప్రతి వంటింట్లో ఘుమఘుమలాడిన ఈ నూడిల్స్‌పై ఇప్పుడు ధుమధుమలాడేవారు ఎక్కువయ్యారు. మానవుడి ఆరోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాల పరిమాణం ఎక్కువగా ఉన్నాయంటూ అత్యంత జనాదరణ పొందిన మ్యాగీ నూడిల్స్ దేశంలో సంచలన వార్తాకథనాలు వెల్లువెత్తాయి. చాలా ప్రాంతాల్లో వీటిపై నిషేధం విధించారు. వేల ఏళ్ల క్రితమే నూడిల్స్ తయారీ ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఇన్‌స్టెంట్ ఫుడ్‌లో నూడిల్స్‌దే సింహభాగం. వీటిని కనిపెట్టింది చైనా. ఇప్పటికీ వాటి తయారీలోను, వాడకంలోనూ ఆ దేశానిదే అగ్రస్థానం. చైనాలోని ఎల్లో రివర్ ప్రాంతంలో పురాతత్వ శాస్తవ్రేత్తలు 2002లో జరిపిన తవ్వకాల్లో నూడిల్స్‌తో ఉన్న ఓ బౌల్ దొరికింది. అందులో నిండుగా నూడిల్స్ ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత పురాతన నూడిల్స్‌గా రికార్డు సాధించాయి. శాస్తవ్రేత్తల అంచనా ప్రకారం 206 బిసిఇ- 220 సిఇలో నూడిల్స్ వాడుకలోకి వచ్చాయి. టాంగ్ రాజవంశం పరిపాలించినప్పుడు ఇవి బహుళ వ్యాప్తిలోకి వచ్చినట్లు చరిత్రకారులు చెబుతారు. నూడిల్స్‌లో ఏముంటుంది? నిజానికి పురాతన పద్ధతి ప్రకారం తయారు చేసిన నూడిల్స్‌లో అన్నీ పోషక పదార్థాలే వాడేవారు. ముఖ్యంగా మొక్కజొన్న పిండి లేదా వరి, గోధుమ పిండి, పామ్ ఆయిల్, కాస్తంత ఉప్పు కలిపి వీటిని తయారు చేసేవారు. వందలాది సంవత్సరాల పాటు ఇవే పదార్థాలు వాడేవారు. తీగలుతీగలుగా వీటిని పేని, ముక్కలుగా, రకరకాల ఆకారాల్లో విరిచి వండేవారు. రెండో ప్రపంచయుద్ధం ముగిసేవరకు అదే పరిస్థితి. సేమియా, పాస్తావంటివి ఆ తరువాత నూడిల్స్‌కు మరోరూపంగా తయారయ్యాయి. ఇక నూడిల్స్‌లో సన్నగా తరిగిన కాయగూరలు, ఇతర ఆహార పదార్థాలను కలిపి వండుకోవడం ఆ తరువాత మొదలైంది. ‘ఇన్‌స్టంట్’ ప్రభంజనం రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఓటమిపాలైన తరువాత సైనికులు, సాధారణ పౌరులు ఆకలితో అలమటించిపోయారు. ధరల పెరుగుదల, క్షామం, ఉపాధి లేమి వంటి పరిస్థితుల్లో వారు ఆహార పదార్థాలను కొనుగోలు చేసుకోలేక ఆకలితో అలమటించారు. తప్పనిసరి పరిస్థితిలో అమెరికా నుండి బ్రెడ్‌ను జపాన్ దిగుమతి చేసుకుంది. కానీ, జనం ఆకలి తీర్చలేకపోయింది. అ బాధలు చూసిన తైవాన్-జపనీస్ వ్యాపారవేత్త మొమొఫుకు ఆండో నిమిషాల్లో తయారయ్యే ఆహార పదార్థం, చౌకగా అందించేలా తయారు చేయాలని భావించాడు. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ఇన్‌స్టెంట్ నూడిల్స్. నీటి ఆవిరితో సగం ఉడికించి లేదా పామాయిల్‌తో సగం వేయించి ప్యాక్ చేయించి మార్కెట్‌లోకి వదిలాడు. 1958లో ఇది జరిగింది. తొలిసారిగా వచ్చిన చికెన్ రామెన్ నూడిల్స్ మొదట్లో ఖరీదు ఎక్కువగాను, అది ఓ హోదాకు చిహ్నంగా ఉన్నా అనతికాలంలో అతిచౌకగా, పేదలకు అందుబాటులోకి వచ్చి ఆదరణకు నోచుకుంది. ఇక నిమిషాల్లో తయారయ్యే నూడిల్స్ అంటే లోకం పడి చచ్చిపోతోందన్న పరిస్థితి నెలకొంది. ఇక 1971లో కప్ నూడిల్స్‌నూ ప్రవేశపెట్టాడు. ఆ తరువాత వాటికి రకరకాల ప్లేవర్స్, నాన్‌వెజిటబుల్ నూడిల్స్, వెజిటబుల్ నూడిల్స్ మొదలయ్యాయి. అతడు జపాన్‌లో ప్రవేశపెట్టిన తొలి ఇన్‌స్టెంట్ నూడిల్స్ పేరు ‘రామెన్ నూడిల్స్’. ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువ అమ్ముడయ్యే నూడిల్స్ ఇవే. ఆ తరువాత అమెరికాలో వినియోగదారుల ఇష్టాయిష్టాలను గమనించి మరికొన్ని మార్పులతో రకరకాల నూడిల్స్ తీసుకొచ్చాడు. 2007లో అతడు మరణించినా నూడిల్స్ ప్రస్తావన వస్తే మొమొ పేరు స్ఫురణకు రాక తప్పదు. జపాన్‌లో అతడి పేరుమీద, రామెన్ నూడిల్స్ పేరుతోను రెండు మ్యూజియంలు నెలకొల్పారు. ఇప్పుడెందుకు సమస్య ఇన్‌స్టెంట్ నూడిల్స్ రుచికరంగా ఉండటానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కొన్ని రసాయన పదార్థాలు వాడతారు. ముఖ్యంగా మోనో సోడియం గ్లుటామేట్, సీసం (లెడ్) ఉపయోగిస్తారు. మోనో పొటాషియం గ్లుటామేట్, ఆటోలైజ్డ్ ఈస్ట్, అజినోమోటో, సోడియం కేసినైట్ అని పిలిచే ఎంఎస్‌జి సాంద్రత నిజానికి 0.01 పిపిఎం ఉండాలి. మనదేశంలో ఈ మధ్య మార్కెట్లో లభ్యమైన మ్యాగీ నూడిల్స్‌లో ఈ పరిమితి ఆరురెట్లు అధికంగా ఉందన్నది అధికారిక ఆరోపణ. అది నిజం కాదని, తమ పరిశోధనల్లో అంతా సవ్యంగానే ఉందని చెబుతున్న మ్యాగీ నూడిల్స్ ఉత్పత్తిదారు నెస్ట్లే యాజమాన్యం వినియోగదారుడి మనసు నొప్పించకుండా ఉండేందుకు ఆ స్టాక్‌ను వెనక్కి రప్పించుకుంది. ఎంఎస్‌జి అంటే… మోనో సోడియం గ్లుటామెట్ అనేది రుచిని అందించే లవణం. దానిని 1909లో జపాన్‌కు చెందిన అజినొమొటో కంపెనీ అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదులకు తోడుగా దీన్ని ఏడో రుచిగా చెప్పుకుంటారు. ఎంఎస్‌జిని తయారు చేసిన అజినోమోటో కంపెనీ పేరుకు ‘ఎసెన్స్ ఆఫ్ టేస్ట్’ అని అర్థం. భారతీయ వంటకాల్లో దీని వాడకం ఎక్కువే. ఆహార పదార్థాల్లో వీటిని వాడితే రుచి పెరుగుతుంది. కొన్నాళ్లు చెడిపోకుండా నిల్వ ఉంటుంది. ఒక్కోచోట ఒక్కో పేరు భారతదేశంలో నూడిల్స్ అంటే నెస్ట్లే ఉత్పత్తి చేసే మ్యాగీయే గుర్తొస్తుంది. కానీ వివిధ సంస్థలు ఇన్‌స్టెంట్ నూడిల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. మనదేశం సహా బ్రెజిల్, బంగ్లాదేశ్, నేపాల్, ఇండియా, పాకిస్తాన్, సింగపూర్, మలేసియా, బ్రూనే, కొన్ని పాశ్చాత్య దేశాల్లోనూ మ్యాగీదే పైచేయి. జపాన్‌లో రామెన్ నూడిల్స్‌కే జనం పట్టం గట్టారు. హాంకాంగ్‌లో సాన్‌టావో, దక్షిణకొరియాలో షిన్‌రామెన్, ఇండోనేషియాలో ఇండోమీ, థాయ్‌లాండ్‌లో మామ, నేపాల్‌లో గండకి నూడిల్స్ అంటే జనానికి పిచ్చి. మారిషస్‌లో అపోలో నూడిల్స్‌కు ఆదరణ ఎక్కువ. ఇవన్నీ జనాదరణ పొందిన బ్రాండ్లు. ఆయా దేశాల్లో మరికొన్ని ఇతర బ్రాండ్లు ఉన్నా వాటికి ఆదరణ అంతంతమాత్రమే. భారత్‌లో మ్యాగీది అగ్రస్థానం కాగా ఐటిసి కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ‘యప్పీ’ ఈ మధ్య కాలంలో గణనీయంగా మార్కెట్‌ను పెంచుకుంది. విషతుల్యం అదొక్కటే కాదు… ప్రజలు ఆరగిస్తున్న ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లో కేవలం నూడిల్స్‌లో మాత్రమే పరిమితికి మించి ఎంఎస్‌జి ఉందని చెప్పలేం. చాలా పదార్థాల్లో అనేక నిషేధిత పదార్థాలు కన్పించాయి. వివాదాలూ రేగాయి. మనదేశంలో లభ్యమయ్యే కోకోకోలా సహా 12 రకాల కూల్‌డ్రింక్స్‌లో క్రిమిసంహారక మందులు ఉన్నట్లు చాలాకాలం క్రితమే ఆరోపణలు వచ్చాయి. ఉండవలసిన పరిమాణం కన్నా 17 రెట్లు ఎక్కువగా డిడిటి కోకోకోలాలో ఉందని పరీక్షల్లో తేలింది. ఆహార పదార్థాల్లో ఆయా రసాయనాల వాడకాన్ని నిషేధించే లేదా ఉత్పత్తిదారులపై చర్య తీసుకునే ఫుడ్‌సేఫ్టీ వ్యవస్థ ఈ ఏడాది ఏర్పడింది. అలాగే వివిధ కంపెనీలు విక్రయిస్తున్న పనె్నండు రకాల తేనెలో పరిమితికి మించి యాంటీ బయాటిక్స్ ఉన్నట్లు తేలింది. క్లోరోంఫెనికోల్, సిప్రోఫ్లాక్సాసిన్, ఎరిత్రోమైసిన్ వంటి యాంటీ బయాటిక్స్ అందులో ఉన్నట్లు రూఢీ అయింది. కోళ్ల ఎదుగుదల కోసం యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నట్లు వాటి మాంసాన్ని పరీక్షించినప్పుడు స్పష్టమైంది. మనదేశంలోనే కాదు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉంది. అమెరికా సహా పలు పశ్చిమ దేశాల్లో చికెన్, బీఫ్ నూడిల్స్‌లో గుర్రం మాంసం దర్శనమిచ్చిన సందర్భాలున్నాయి. మన దేశంలో ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ భారత ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాల సాధికార సంస్థ నిబంధనలు రూపొందించింది. ఇప్పుడు మ్యాగీ వివాదంలోకి వచ్చిందికానీ మున్ముందు ప్రాసెస్డ్ ఫుడ్ విక్రయించే ఏ సంస్థ అయినా దోషిగా నిలబడవచ్చు. ప్యాక్‌డ్ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఆ కోవలోకే వస్తాయి. ఇంతకాలం వీటిని పరిశీలించి, పరీక్షించి, నియంత్రించే వ్యవస్థ లేకపోయింది. బహుళజాతి సంస్థల ఉత్పత్తులపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. కాగా దేశీయ సంస్థల ఉత్పత్తులు, స్ట్రీట్‌ఫుడ్, ప్రభుత్వ సంస్థలు విక్రయించే పదార్థాలు ప్రమాణాలకు దీటుగా ఉన్నాయా? అంటే లేదనే చెప్పాలి. రుచికన్నా ఆరోగ్యం ముఖ్యమన్న స్పృహ తినేవారిలో ఉంటే జంక్‌ఫుడ్ జోలికి వెళ్లరు. ఆరోగ్యమే మహాభాగ్యం కనుక మెరుగైన ఆహారమే మేలు. ‘ప్రచారకర్త’లకు బాధ్యత లేదా? చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లు మొదలు భారీ సైజు టీవీలు అమ్ముడుపోవాలన్నా వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు సెలబ్రిటీలు ‘ప్రచారకర్తలు’గా అవతారం ఎత్తాల్సిందే. ప్రకటనల్లో నటించినందుకు భారీగా పారితోషికాలు అందుకునే సెలబ్రిటీలకు మాత్రం సంబంధిత ఉత్పత్తుల నాణ్యతాప్రమాణాలపై ఎలాంటి సంబంధం ఉండదు. ప్రచారం చేయడం వరకే తమ పాత్ర అని, ఉత్పత్తుల విషయమై ఎలాంటి ఫిర్యాదులొచ్చినా తాము బాధ్యులం కామంటూ వారు తెగేసి చెబుతుంటారు. ప్రస్తుతం ‘మ్యాగీ’ నూడుల్స్‌పై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్న సందర్భంలోనూ సెలబ్రిటీలు తమ పాత పాటే వినిపిస్తున్నారు. ప్రజారోగ్యంతో సంబంధం ఉన్న ఆహార ఉత్పత్తులపై ప్రచారం చేస్తున్నపుడు సెలబ్రిటీలు అన్ని విషయాలూ క్షుణ్ణంగా తెలుసుకోరా? వారికి సామాజిక బాధ్యత లేదా? అన్న విమర్శలు వస్తూనే ఉంటాయి. శీతల పానీయాల్లో పురుగుమందుల అవశేషాల వివాదం నుంచి తాజాగా ‘మ్యాగీ’లో హనికర రసాయనాల వరకూ ‘ప్రచారకర్త’లైన మన సెలబ్రిటీలు ఏమీ తెలియని అమాయకులే! ‘మ్యాగీ’కి ఇంతటి ప్రాచుర్యం కల్పించి వాటి విక్రయాలు కోట్లలో పెరగడానికి కారకులైన బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటాలపైనా కేసులు నమోదు చేయాలన్న వాదనలు విన్పించాయి. ‘మ్యాగీ’ వివాదం తీవ్రంగా రాజుకోవడంతో ఆ ముగ్గురిపైనా కొన్ని చోట్ల కేసులు పెట్టడం, నోటీసులు పంపడం చకచకా జరిగిపోయాయి. ‘మ్యాగీ’ ప్రకటనల్లో నటించి చాలాకాలమైందని, ప్రస్తుత వివాదంతో తమకెలాంటి సంబంధం లేదని ఆ సెలబ్రిటీలు సెలవిచ్చారు. అయితే, ఆహారోత్పత్తులకు సంబంధించి ఇకపై ‘ప్రచారకర్త’లుగా బాధ్యతలు నిర్వహిస్తే అన్ని విషయాలూ ఆలోచిస్తామని వారు ప్రకటించారు. ‘ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలతో ప్రచారకర్తలకు సంబంధం లేదా’ అన్న చర్చ అప్పుడప్పుడూ మొదలు కావడం మళ్లీ పాతబడిపోవడం షరామామూలుగానే మారింది. ప్రకటనల్లో నటించినపుడు ఉత్పత్తుల నాణ్యత గురించి ఏ సెలబ్రిటీ కూడా ఆరా తీయడం జరగదు. ఉత్పత్తిదారులు కూడా ఆ విషయాలను ‘ప్రచారకర్త’లకు చెప్పడమూ ఉండదు. తమకు ముట్టజెప్పే పారితోషికం తప్ప మిగతా విషయాలు వారికి అనవసరం. వివాదాలు మరింతగా ముదిరితే, ఆ ప్రకటనలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం తప్ప సెలబ్రిటీలు చేసేది ఏమీ ఉండదు. బాలీవుడ్‌కు సంబంధించి షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అక్షయ్‌కుమార్, బిపాసా బసు, కంగనా రనౌత్, అమీర్ ఖాన్ వంటి ప్రముఖులు నటించిన ప్రకటనలు గతంలో వివాదాస్పదంగా మారాయి. కోకోకోలాలో పురుగుమందుల అవశేషాలున్నట్లు ఆరోపణలు రావడంతో ఇక ఆ శీతల పానీయం కోసం ప్రచారకర్తగా తాను వ్యవహరించేది లేదని ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ గతంలోనే స్పష్టం చేశారు. వరకట్నం ప్రస్తావన ఉన్నందున ఓ కంపెనీ టీవీల ప్రచారానికి కూడా ఆయన దూరమయ్యారు. ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్‌పై ఆరోపణలున్నందున- ఉత్పత్తిదారులిచ్చే రెండు కోట్ల రూపాయల పారితోషికం కోసం తాను నటించలేనని యువనటి కంగనా రనౌత్ తెగేసి చెప్పింది. పొగాకు, మద్యం విక్రయాలకు సంబంధించి తాను ప్రచారకర్తగా వ్యవహరించనని నటుడు జాన్ అబ్రహాం ప్రకటించారు. సామాజిక ప్రయోజనం లేనందున ఓ విలాసవంతమైన కార్లకు ప్రచారం చేసేందుకు సిద్ధంగా లేనని అమీర్ ఖాన్ స్పష్టం చేశాడు. ఇలాంటి నిర్ణయాలతో కొందరు నటీనటులు జనం నుంచి జేజేలు అందుకున్నా, మరికొందరు మాత్రం వివాదాలకు కేంద్ర బిందువులయ్యారు. ‘మాజీ విశ్వసుందరి’, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ఆ మధ్య ఓ నగల కంపెనీ కోసం నటించిన ప్రకటన వివాదం రేపింది. నలుపురంగులో ఉన్న ఓ పేద బాలిక ఐశ్వర్యకు గొడుగు పడుతున్నట్లు చిత్రీకరించిన ఆ ప్రకటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్లు ఆ ప్రకటన ఉందన్న ఆరోపణలు రావడంతో దాన్ని ప్రచారం నుంచి ఉపసంహరించారు. నల్లగా ఉన్నవాళ్లు తెల్లగా మారండంటూ ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ గురించి షారుఖ్ ఖాన్ ప్రచారం చేయడం వివాదాస్పదమైంది. కొందరి మనసులను గాయపరిచే ఇలాంటి ప్రకటనల్లో నటించనని అమీర్ ఖాన్ చెప్పగా, షారుఖ్ మాత్రం ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. నటుడు అక్షయ్‌కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా డెనిమ్ బ్రాండ్ జీన్ ప్యాంట్ల ప్రకటన మరీ అశ్లీలంగా ఉందన్న విమర్శలు వచ్చాయి. 1998లో ఓ బ్రాండ్ లోదుస్తుల ప్రకటనలో నటి బిపాసా, అప్పటి ఆమె ప్రియుడు డినో మోరియా నటనపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. 1991లో పూజా బేడీ, మార్క్ రాబిన్సన్ నటించిన ఓ కండోమ్ ప్రకటన కూడా విమర్శలను మూటగట్టుకుంది. మలైకా అరోరా, ఆర్బాజ్ ఖాన్ నటించిన ఓ కండోమ్ ప్రకటన 1993లో వివాదం సృష్టించింది. నటి కంగనా రనౌత్ ‘లెవిస్’ జీన్స్ ప్రకటనలో మరీ సిగ్గు విడిచి నటించిందన్న విమర్శలు గతంలో వచ్చాయి. లైంగిక విజ్ఞానం గురించి చెప్పడానికి బదులు ‘డూరెక్స్’ కండోమ్ ప్రకటనలో నటుడు రణ్‌వీర్ సింగ్ నటన మరీ శ్రుతి మించిందన్న వ్యాఖ్యానాలున్నాయి. గుట్కా ప్రకటనలో సంజయ్ దత్ నటించడంతో ఎంతోమంది యువకులు ఆయన బాటను అనుసరిస్తున్నారని గతంలో కొందరు వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సినీతారలు యువతకు ఆరాధ్యదైవాలుగా కనిపిస్తున్న నేటికాలంలో వారు నటించే ప్రకటనల ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. ప్రకటనలకు, ప్రచారకర్తలకు సంబంధించి వివాదాలు చెలరేగడం కొత్తేమీ కాకపోయినా- తాము చెప్పే మాటలను జనం సులువుగా నమ్ముతారన్న విషయాన్ని సెలబ్రిటీలు గుర్తుంచుకుంటే వారు విమర్శలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ప్రచారకర్తలుగా బాధ్యతలు స్వీకరించేముందు సంబంధిత ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు, ప్రజారోగ్యం, నైతిక విలువలు వంటి విషయాలను వారు తెలుసుకుంటే మరీ మంచిది. *** అందమైన చిహ్నం…ఆవిరైన నమ్మకం అందమైన పక్షిగూడు….అమ్మ తెచ్చే ఆహారంకోసం నోళ్లు తెరిచి ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్న పిల్లలు, వాటికి ఆప్యాయంగా ఆహారాన్ని ఇచ్చేందుకు వచ్చిన పక్షి…వెరసి ప్రఖ్యాత ఆహార పదార్థాల తయారీ సంస్థ నెస్ట్లే వ్యాపారసంస్థ చిహ్నం. దశాబ్దాలుగా భారతీయుల ప్రేమను పొందిన ఆ సంస్థపై విశ్వాసం ఇప్పుడు పరీక్షకు నిలిచింది. అంతర్జాతీయ ప్రాముఖ్యత పొందిన ఈ సంస్థ ఎన్నో ఇతర ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నప్పటికీ మ్యాగీ పేరుతో ప్రారంభించిన నూడిల్స్ అంతర్జాతీయ ఖ్యాతిని పొంది భారీ మార్కెట్‌ను అందించాయి. ఒక్క భారత్‌లోనే నూడిల్స్ విభాగంలో ఆ సంస్థ 70శాతం మార్కెట్‌ను కొల్లగొట్టింది. ఏటా 8వేలకోట్ల పైబడి రాబడి సాధిస్తున్న మ్యాగీ కేవలం లాభాలపైనే దృష్టిపెట్టి, వినియోగదారుడి ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టిందా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. వివిధ రాష్ట్రాల్లో మ్యాగీ నూడిల్స్‌తో నిషేధం విధించడం, ఆ నూడిల్స్‌ను నిషేధించాలని కేంద్రం ప్రభుత్వ సంస్థ ఆదేశించడంతో విధిలేని పరిస్థితుల్లో నెస్ట్లె తమ నూడిల్స్‌ను మార్కెట్‌నుండి వెనక్కు రప్పించింది. మ్యాగీ నూడిల్స్‌లో పరిమితికన్నా ఏడెనిమిది రెట్లు ఎక్కువగా ఎంఎస్‌జి, సీసం ఉన్నాయన్నది అభియోగం. ఈ వివాదంవల్ల దాదాపు 4వేల కోట్ల రూపాయల మేరకు ఆ సంస్థకు దెబ్బతగిలింది. అయితే భారతీయ వినియోగదారుడి మనసు చూరగొనేలా, విశ్వాసాన్ని పొందేలా మళ్లీ మార్కెట్‌లోకి వస్తామని ఆ సంస్థ గట్టిగా చెబుతోంది. నెస్ట్లె చిహ్నం చూసి ఎంతో నమ్మకంతో ఆ సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేసే భారతీయులు ఇప్పుడు అపనమ్మకంతో ఉన్నారు. మ్యాగీ నూడిల్స్‌లో పరిమితికి మించి ఎంఎస్‌జి, లెడ్ ఉండటంవల్ల ఎన్నో ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని తేలడం నెస్ట్లె వ్యాపారానికి గట్టి దెబ్బ తగిలింది. కేవలం ఆ సంస్థ ఉత్పత్తి చేసే పదార్థాలే కాదు. ఇప్పుడు ఇతర సంస్థలు తయారు చేస్తున్న ప్రాసెస్‌డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నింటినీ పరీక్షించాలని భారత కేంద్ర ఆహార పదార్థాల నాణ్యత, ప్రమాణాల సంరక్షణ సాధికార సంస్థ నిర్ణయించింది. అయితే ఆయా ఉత్పత్తుల తయారీకి, చాలాకాలంగా వస్తున్న ఆరోపణలకు స్పందించకుండా ఉండటానికి రాజకీయ నేతలు, అధికారులే కారణమని భావించాలి. అసలు ఆహార పదార్థాలా నాణ్యత, ప్రమాణాలను పరీక్షించే సంస్థ ఇన్నాళ్లూ లేకపోవడం ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏపాటిదో చెబుతోంది. ఇదీ నూడిల్స్ సామ్రాజ్యం మన దేశంలో ఇప్పుడు అందరినోటా విన్పిస్తున్న మాట మ్యాగీ నూడిల్స్. నిజానికి ‘యెప్పీ’ అనే రకం నూడిల్స్ కూడా ఈ మధ్య జనాదరణ పొందాయి. ప్రపంచవ్యాప్తంగా నూడిల్స్ అంటే ఇష్టపడేవారి సంఖ్య తక్కువేమీకాదు. భారతదేశంలో ఇన్‌స్టెంట్ నూడిల్స్ మార్కెట్‌లో మ్యాగీ వాటాయే ఎక్కువ. దాని వార్షిక అమ్మకాల విలువ 8,900 కోట్ల రూపాయల పైమాటే. మనదేశంలో సైనికులు బాగా ఇష్టపడే ఆహారం కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది 102.7 బిలియన్ ప్యాకెట్ల నూడిల్స్‌ను జనం తిన్నారు. భూగోళంమీద ఉన్న ప్రతి ఒక్కరికి వీటిని పంచితే ఏడాదికి ఒక్కొక్కరు 14 ప్యాకెట్లు తిన్నట్లు లెక్క. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్‌స్టెంట్ నూడిల్స్‌ను ‘గ్లోబల్ ఫుడ్’ గా కీర్తిస్తే, భారతదేశంలో ‘కంఫర్ట్ ఫుడ్’ గా భావిస్తారు. వీటిని ఇష్టపడి బాగా తినే దేశాల్లో చైనా, హాంకాంగ్ మొదటి స్థానంలో ఉన్నాయ. ఇక్కడ ఏటా 44,400 మిలియన్ల ప్యాకెట్లు తినేస్తూ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇండోనేషియా, జపాన్ తరువాతి స్థానాల్లో ఉండగా భారత్ నాల్గో స్థానంలో ఉంది. *** మొక్కజొన్న పిండి లేదా వరి, గోధుమ పిండ్లతో నూడిల్స్ తయారైన తరువాత వాటికి ఇతర రుచులు మేళవించాక, సగం ఉడకబెట్టడమో, లేక పొడిబారేట్లు చేయడమో అయ్యాక, 320 డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రత వద్ద వేయిస్తారు. దీంతో అందులో ఉండే నీరు ఆవిరై, క్రిస్పీగా తయారైన ఇన్‌స్టెంట్ నూడిల్ సిద్ధమవుతుంది. దీనిని మనం తినాలనుకున్నప్పుడు మరుగుతున్న నీళ్లలో వేసినప్పుడు అత్యంత వేగంగా నీటిని అవి పీల్చుకుని త్వరితగతిన ఉడికి తినడానికి వీలుగా సిద్ధమవుతాయి. ఈ మధ్య కాలంలో ‘బ్లోడ్రై’ పద్ధతిలో ఇన్‌స్టెంట్ నూడిల్స్‌ను సిద్ధం చేస్తున్నాయి. 176 డిగ్రీల ఫారన్‌హీట్ వేడితో ఉండే హాట్‌ఎయిర్‌తో 30నుండి 60 నిమిషాలపాటు మగ్గబెట్టి గట్టిపడిన తరువాత ప్యాకింగ్ చేస్తున్నారు. నిషేధంపై భిన్న వైఖరులు..! హానికర రసాయనాలున్నాయన్న వార్తలు రావడంతో దేశ వ్యాప్తంగా కుతకుతలాడిన ‘మ్యాగీ’ నూడుల్స్‌పై వివిధ రాష్ట్రాల్లో విభిన్న నివేదికలు రావడం విశేషం. మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రావడంతో- ‘మ్యాగీ’పై రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడి ఆగమేఘాలపై నిషేధాజ్ఞలు విధించాయి. ప్రజారోగ్యానికి చేటుతెచ్చే ఆహారోత్పత్తులను తాము అనుమతించేది లేదంటూ కేంద్రం సైతం జూలు విదిల్చింది. వివాదం ముదురుపాకాన పడడంతో ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాలు ‘మ్యాగీ’ నమూనాలను నిపుణుల పరీక్షల నిమిత్తం పంపాయి. ఈ నూడుల్స్‌లో సీసం (లెడ్) వేర్వేరు రాష్ట్రాల్లో ప్రామాణిక స్థాయి (2.5 పిపిఎం)ని మించి అనేక రెట్లు అధికంగా ఉన్నట్లు నివేదికలు రావడం ఆశ్చర్యకరం. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వ్యతిరేక ఫలితాలు రావడం ఇంకో విడ్డూరం. ఓ ప్రముఖ బహుళజాతి సంస్థ నిర్ణీత ప్రమాణాలతో ఒక ఉత్పత్తిని ఒకే పద్ధతిలో తయారుచేస్తే నాణ్యతకు సంబంధించి ఇంతటి తేడాలు రావడం ఏమిటన్నది శేషప్రశే్న! వివిధ రాష్ట్రాల్లో ఒకే ఉత్పత్తిపై పరీక్షలు జరిపితే ఇలాంటి వ్యత్యాసాలు ఎలా ఉంటాయన్నది అర్థం కాని విషయమే. ఈ నేపథ్యంలో ‘మ్యాగీ’పై కేంద్రం వైఖరి ఒకలా ఉండగా, వివిధ రాష్ట్రాలు పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు ‘మ్యాగీ’కి ‘క్లీన్‌చిట్’ ఇవ్వగా, ఇంకొన్ని చోట్ల నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయి. నిపుణుల పరీక్షలకు నిర్దిష్టమైన విధి విధానాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న వాదనలు లేకపోలేదు. తొమ్మిది రకాల నూడుల్స్‌ను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం ‘నెస్లే’ సంస్థకు సూచించింది. కాగా, ‘మ్యాగీ’లో అభ్యంతరకర అంశాలేవీ లేవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. తొమ్మిది రకాల ఉత్పత్తుల్లో సీసం మోతాదు మించినట్లు కనిపించలేదని మహారాష్ట్ర ఆహార, ఔషధ నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. రుచి కోసం వాడే ఎంఎస్‌జి కూడా పరిమితికి లోబడే ఉందని ఆ సంస్థ అధికారులు తేల్చారు. అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు వచ్చిన తర్వాతే ‘మ్యాగీ’పై తాము తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని అంశాలు ‘మ్యాగీ’లో కనిపించాయని భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ప్రకటించింది.

