ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -49
20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్
అగస్టీ రోడిన్ శిల్పాలను మొదట తిరస్కరించిన వారే ఆ తర్వాత మహా గొప్ప శిల్పి అని ఆరాధించారు .గౌరవించారు సత్కరించారు .మళ్ళీ అతి తక్కువ చేసి మాట్లాడారు .దూషణ భూషణలు ఆయన జీవిత సముద్రం లో కెరటాలయ్యాయి .పావు శాతాబ్దికాలం ఆయన సృజన అంతా పెద్దగా ఆమోదం పొందలేదు .పై పెచ్చు అలక్ష్యం చేశారు కూడా .కొన్నేళ్ళ తర్వాత ప్రతిభను గుర్తించి అగ్రాసనం మీద కూర్చో బెట్టారు .అంతే కాదు 19 వ శతాబ్దపు అత్యుత్తమ శిల్పి అని ,అన్నికాలాలలోని మహా శిల్పుల లో ఒకడు అని వీర తాళ్ళు వేశారు .ఇదీ లోక రీతి .
మట్టి బొమ్మల శిల్పి
12-11-1840 లో పుట్టిన ఫ్రాన్కోస్ అగస్టీ రెనో రోడిన్ ఫ్రాన్స్ లోని పారిస్ లో పురాతన గోధిక్ లక్షణాలున్న జన సమూహం ఉన్న ప్రాంతం లో పుట్టాడు . తల్లి లోరైనీ నుండి తండ్రి నార్మన్ జాతికి చెందిన పని వారి కుటుంబం లోంచి వచ్చారు .ఆ జిల్లాలో రోడీన్లు అతి పేదవారుగా గుర్తింపు పొందారు .రోడిన్ కు అందువల్లనే 13 వ ఏట నుండి సరైన స్కూల్ విద్య నేర్చుకొనే అవకాశం లేక పోయింది .చిన్నతనం నుండి డ్రాయింగ్ బొమ్మలు గీయటం అతనికి అంది వచ్చిన వరం అయింది .తల్లి గ్రోసరీ షాప్ నుండి తెచ్చే సరుకుల పొట్లాల పేపర్ల పై ఉన్న కామిక్ బొమ్మలను చూసి రోడిన్ కాపీ చేసేవాడు .తర్వాత వాటిని తన స్వయం కృషి తో బాగా గీసేవాడు .ఇది గమనించిన తలి దండ్రులు రోడిన్ మాంచి కమర్షియల్ ఆర్టిస్ట్ అవుతాడని సంబర పడ్డారు .ఇంటి దగ్గర స్పెషల్ టీచర్స్ ను పెట్టి అతని చిత్ర నైపుణ్యాన్ని పెంచే స్తోమత వారికి లేదు .అందుకని అతని ఆసక్తికి ఊతం గా డేకరేటివ్ ఆర్ట్ లో శిక్షణ నిచ్చే’’ పెటైట్ ఈకోల్ ‘’లో చేర్పించారు .పెన్సిల్ డ్రాయింగ్ అంటే అసలు ఇష్ట పడని రోడిన్ మట్టి బొమ్మలు చేయటం లో ఆసక్తి చూపించి అదే తన జీవిత గమ్యం అనుకొన్నాడు .
పోర్సిలీన్ శిల్పి
18 వ ఏట ఈకోల్ బీక్స్ ఆర్ట్స్ లో చేరటానికి ప్రయత్నింఛి పరీక్ష రాశాడుకాని ఫలితాలు దారుణం గా ఉన్నాయి .మూడు సార్లుప్రవేశ పరీక్షరాసి తప్పాడు .ఇది చూసిన తలిదండ్రులు నీరు కారిపోయారు .అరకొర సంపాదనతో బతుకు బండీ ఈడుస్తున్న తండ్రి కొడుకును ఆ సంస్థకు పంపటం మానేశాడు .రోడిన్ తన కాళ్ళ మీద తాను నిలబడాల్సిన పరిస్తితి వచ్చింది .ఏదో ఉద్యోగం చేసి పొట్టపోసుకోవాలి .మట్టి బొమ్మల తయారీలో అప్ర౦టిస్ గా ,జర్నీమాన్ గా, ఆర్నమెంట్ వర్కర్ గా పని చేశాడు .కాపీయిస్ట్ గా ,స్పైరల్ స్క్రోల్స్ తయారీలో అనేక చోట్ల పని చేశాడు .ప్రముఖ జంతు శిల్పి ఆటోయిన్ లూయీ బారీ దగ్గర పని చేసి తాను బారీ శిష్యుడిని అని చెప్పుకోనేవాడు .తర్వాత’’మోల్డర్ ‘’అవతారం ఎత్తాడు .తర్వాత సెవ్రెస్ లో ఉండే పోర్సేలీన్ ఫాక్టరీకి డిజైన్లు తయారు చేసే కారియర్ బెల్లీస్ దగ్గర చేరాడు .ఇక్కడే చిన్న చిన్న విగ్రహాలు తయారు చేయటం ,జంతు భాగాలు కూర్చటం ,బొమ్మలకు అలంకరణ చేయటం నేర్చుకొన్నాడు .తర్వాత మూస పని(మోల్దింగ్) అలవాటు అయింది .ఈయన దగ్గరే అయిదేళ్ళు ఉన్నాడు .రెండు డాలర్ల నెల అద్దె ఇచ్చి ఒక గుర్రపు శాలలో గడిపాడు .అది చీకటి గుయ్యారం .దానికి ఒక చివర పెద్ద బావి ఉంది .తాను ఇక్కడే ఉండి పని చేయాల్సిన వాడు కనుక తానే ఆ నూతిని పూడ్చేశాడు రోడిన్ .
ముక్కు తెగిన మనిషి బొమ్మ
వయసు ఇరవై అయిదు వచ్చింది .నాగలి పట్టి దున్నే వాడుగా మొరటుగా కనిపించేవాడు .ముక్కు ఫ్లాట్ గా ఉండేది .ఒక బస్ట్ విగ్రహాన్ని చేసి ‘’ముక్కు తెగిన మనిషి ‘’అని పేరు పెట్టి1864 లో సెలూన్ కు తీసుకెళ్ళాడు .దాన్ని వాళ్ళు తిరస్కరించటమే కాదు తిట్టి పంపించారు .యదార్ధాన్ని ప్రతి బించి చేసిన శిల్పాన్ని వాళ్ళు మెచ్చుకోలేక పోయారు .అతను ‘’far too naturalistic and that he had mistaken the medium ‘’ అన్నారు విమర్శకులు .నిరాశ తోమళ్ళీ గురువు గారి దగ్గర చేరి కొన్నేళ్ళు పని చేశాడు .తన ప్రజ్ఞను కనబరుస్తూ లలితమైన ,అనుకరణాత్మకమైన చిన్న చిన్న బొమ్మలు తయారు చేసి అమ్మి జీవనోపాధి పొండాడు .1870లోపర్షియన్ వాళ్ళు పారిస్ ఆక్రమణ కోసం చేసిన దాడిలో నేషనల్ గార్డ్ గా పని చేశాడు .ఫ్రాంకో పర్షియన్ యుద్ధం ముగియ గానే బెల్జియం వెళ్ళాడు .అక్కడ బెల్జియన్ శిల్పి వాన్ రాస్ బోర్గ్ దగ్గర శిల్ప నిర్మాణం లో మెళకువలు నేర్చాడు .
మోడల్ భార్య
ఒక సారి పారిస్ అవతల ఒక బిల్డింగ్ వర్క్ చేస్తుంటే అందమైన కళ్ళున్న అమ్మాయి కనిపించింది .ఆమెకు 19 .పేరు రోజ్ బ్యూరేట్ .’’రోజ్ అంత బ్యూటీ’’అనుకొన్నాడు . ఆమె కుటుంబం వారు చా౦పేన్ లో రైతులు .పారిస్ లో సీస్మిస్త్రేస్ గా పని చేయటానికి వచ్చింది . ఆమెను మోడల్ గ పెట్టుకొని బొమ్మలు తయారు చేస్తూ ఇద్దరూ ప్రేమలో పడగా ఆమె అతనికో పిల్లాడిని’’ కని ‘’ పెట్టింది .ఈమెను అతని తలిదండ్రులు ఆదరించారు. అందరూ కలిసి బతికారు .ఆమె సైనికులకు చొక్కాలు కుట్టి సంపాదించేది .ఆ డబ్బుతో కొడుకు ను సాకేది .అప్పుడప్పుడు మొగుడు పెళ్ళాలు పోట్లాడుకోనేవారు. ఆమెలో సహనం ఎక్కువ .రోడిన్ మాత్రం బాధ్యతా రాహిత్యం గా ప్రవర్తించేవాడు. అతని తలిదండ్రులు ఆమె పక్షంగా మాట్లాడేవారు .కాలం గడిచిన కొద్దీ తాను ‘’ప్రకాశించే సూర్యుని కి ఛాయ మాత్రమె ‘’అని గ్రహించింది .అతను ఆమెను మంచీ చెడు తెలిసిన ఇల్లాలు అని కోపం అసూయ ,అనుమానం ఉన్నా ప్రేమ గుణం ఉందని ,సత్యాసత్య వివేకం తెలిసిన దొడ్డ ఇల్లాలని చెప్పాడు .వారిద్దరిది అలౌకిక ఆత్మీయ ప్రేమ అంటారు .మోడల్ గా వచ్చిన అమ్మాయి మోడల్ భార్య అయింది రోడిన్ కు .
సహజం నుండి అసహజానికి
1877లో సలూన్ రోడిన్ శిల్పాన్ని ప్రదర్శించటానికి అనుమతి నిచ్చింది .దానిపై 18 నెలలు తీవ్రం గా ద్రుష్టి పెట్టి పని చేశాడు .దీనికి ‘’కంచు యుగం ‘’(ఏజ్ ఆఫ్ బ్రాంజ్ )అని మొదట పేరు పెట్టి తర్వాత’’ప్రక్రుతికి మానవుడి జాగృతి ‘’(మాన్ ఎవేకేనింగ్ టు నేచర్ )అని మార్చాడు .దీన్ని చూసిన నిర్వాహకులు పెదవి విరిచారు .వారికి కావాల్సిన లలిత సుందర నగ్న శిల్పం కాదు అది .వెంటనే తిరస్కరించి ‘’too precise ,too realistic ‘’ అని వ్యాఖ్యానించారు .అది సృజనాత్మక శిల్పం కాదని అన్నారు .ఆ రోజుల్లో ఇవి సాధారణమే . .నకిలీ శిల్పాలు చేస్తున్నకాలమే అది . ఈ ఆరోపణను చాలెంజ్ గా తీసుకొన్నాడు రోడిన్ .ఒక నాయకుడి శిల్పాన్ని తయారు చేసి మామూలు గా జీవితం లో కనిపించే నగ్నత్వం కన్నా ఇంకా ఎక్కువ నగ్నం గా తీర్చిదిద్ది ‘’నడుస్తున్న మనిషి ‘’అని పేరు పెట్టాడు .కాని శిల్ప విశ్లేషకుడు అక్టేవియాన్ మిరాబూ కు ఇది ‘’సెయింట్ జాన్ ‘’పోలికలున్న శిల్పం అని పించింది .ఈ జాన్ గారే తర్వాత ‘’సెయింట్ జాన్ బాప్టిస్ట్ ‘’గా ప్రసిద్ధుడయ్యాడు .సుప్త స్థితిలో ఉన్న శీలా సజీవ చైతన్య రూపం దాల్చింది రోడిన్ చేతిలో .రోడిన్ లో ఆత్మ స్థైర్యం ఒక్కసారిగా పెల్లుబికింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-6-15 –ఉయ్యూరు

