తెల్లవారి పై కోర్టు కేసు గెలిచిన తొలి నల్లజాతిమహిళ-సౌజేర్నార్ ట్రూత్

తెల్లవారి పై కోర్టు కేసు గెలిచిన తొలి నల్లజాతిమహిళ-సౌజేర్నార్ ట్రూత్

నల్ల వజ్రం

ఆఫ్రికన్ అమెరికన్ మహిళ,బానిసత్వ నిర్మూలన ఉద్యమకారిణి ,స్త్రీహక్కుల పోరాట యోధురాలు సౌజేర్నార్ ట్రూత్ అమెరికా న్యూయార్క్ లోని  స్వార్టర్కిల్ లో  అల్స్తర్ కౌంటి లో1797లో బానిసగా  జన్మించింది .1826లో బానిస సంకెళ్ళు తెంచుకొని  కూతురు తో  సహా పారి పోయింది .తన  కొడుకును  తనకు  ఇప్పించమని తెల్లాయన పై  కోర్టులో కేసు వేసింది  .ఆ కేసు గెలిచి  కొడుకును దక్కి౦చు కొని  దేశం లో మొదటి సారిగా తెల్లవారిపై కేసు వేసి గెలిచిన నల్లజాతి వజ్రం అయింది ట్రూత్ .నిజం గా ట్రూత్ ఆమె వైపే ఉంది .అందుకే గెలిచింది .ఆమె అసలు పేరు ఇసబెల్లా బామ్ ఫ్రీ. 1843లో తన పేరును సౌజేర్నార్ ట్రూత్ గా మార్చుకొన్నది .ఒహాయో లోని ఆక్రాన్ లో 1851లో ఒహాయో స్త్రీహక్కుల సమావేశం లో అనర్గళం గా మాట్లాడి అందరిని ట్రూత్ ఆకర్షించింది .ఆమె ఎంచుకొన్న శీర్షిక ‘’నేను స్త్రీని కానా ?(Ain;t I a woman ?)ఒక విమోచనోద్యమ స్లోగన్ అయింది .ఆమె సివిల్ వార్ లో డచ్ భాష ను మొదటిభాషగా ఉపయోగించింది .అమెరికన్ యూనియన్ ఆర్మీకి నల్లవారిని సైనికులుగా చేర్చటానికి సాయ పడింది .యుద్ధం తర్వాత బానిసలుగా పూర్వం జీవించిన వారందరికీ నివాస స్థలాని ప్పించటానికి తీవ్ర కృషి చేసింది కాని ,సఫలీకృతం కాలేదు .

బానిసగా నాలుగు సార్లు అమ్మకం

ట్రూత్ తలిదండ్రులను హార్డెన్ బర్గ్ అనే తెల్ల దొర బానిస వర్తకుల నుంచి కొని తన ఎస్టేట్ లో ఉంచుకొన్నాడు .ట్రూత్ తొమ్మిదేళ్ళ పిల్లగా ఉన్నప్పుడు హార్డెన్ బర్గ్ చానిపోతే ఆమెను సంతలో గోర్రేపిల్లలతో బాటు వంద డాలర్లకు న్యూయార్క్ లోని కిన్గ్ స్టన్లో ఉండే జాన్ నీలీ కి అమ్మారు .అప్పటిదాకా ట్రూత్ డచ్ భాషలోనే మాట్లాడేది .నీలీ కర్కోటకుడు. ఎప్పుడూ ఇనపరాడ్లు పెట్టి కొట్టి బాధించేవాడు .దయా దాక్షిణ్యం లేని పశువు .నీలే ట్రూత్ ను నూట అయిదు డాలర్లకు పోర్ట్ ఈవెన్ లో ఉండే మార్తినాస్ కు అమ్మేశాడు .పదినెలల తర్వాత మార్టినస్ ఈమెను న్యూయార్క్ దగ్గర వెస్ట్ పార్క్ లోని జాన్  డుమాంట్ కు  అమ్మాడు . ఈ నాలుగో యజమాని కొంత ఉదారా స్వభావం ఉన్నవాడే కాని అతని రెండో భార్య ట్రూత్ ను  నరక యాతన పెట్టేది .

బానిస మరో ఫాం లో బానిసను ప్రేమించరాదా?

1815 ప్రాంతం లో ప్రక్క ఫాం లో ఉండే ఒక బానిస రాబర్ట్ ను ట్రూత్ ప్రేమించింది  .రాబర్ట్ యజమాని లాండ్ స్కేప్ పెయింటర్ .తనకు చెందని బానిస తో తన బానిస రాబర్ట్ పిల్లల్ని కనటానికి ఇష్టపడక అడ్డునిలిచాడు .ఒక రోజు రాబర్ట్ ట్రూత్ ను తొంగి చూస్తుంటే అతని యజమాని కొడుకు చూసి రాబర్ట్ ను చితక బాదాడు. ఇది చూసి ట్రూత్ యజమాని జోక్యం కలిగించుకొని విడిపించాడు .అప్పటి నుండి ట్రూత్ రాబర్ట్ ను చూడనే లేదు .ఈ సంఘటన ట్రూత్ ను మానసికం గా కల్లోలపరచింది .తర్వాత ట్రూత్ ఒక ముసలి బానిస థామస్ ను పెళ్ళాడి అయిదుగురు పిల్లల్ని కన్నది .

స్వేచ్చ కోసం పారిపోయిన ట్రూత్

న్యు యార్క్ రాష్ట్రం 1799లోనే బానిసత్వ నిర్మూలనం మొదలు పెట్టినా పూర్తిగా అమలు జరిగింది 4–4-1827నమాత్రమె .విమోచనకు ఒక ఏడాది ముందే ట్రూత్ కు విమోచన కలిగిస్తానని ఆమె యజమాని ప్రకటించినా ఆ పని చేయ లేదు .ఆమెకు చేతి దెబ్బ తగిలిందని ఆమె వల్ల ఆదాయం లేదని కుంటి  సాకులు చెప్పాడు .యజమాని మీద విశ్వాసం తో ట్రూత్ వంద పౌన్ల నూలు వడికింది .1826లోపెద్ద పిల్లలను యజమాని దగ్గరే వదిలిపెట్టి  చంటి పిల్ల సోఫియా తో యజమాని ఇంటినుంచి పారిపోయింది .అక్కడ నుండి ఐసాక్ మేరియా దంపతుల దగ్గరకు చేరగా వారు ఈమెను ,పిల్లను జాగ్రత్తగా చూసుకొన్నారు .విమోచన చట్టం ఆమోదం పొందేదాకా అక్కడే ఉంది .

కోర్టులో కేసు గెల్చిన మొదటి బానిస స్త్రీ ట్రూత్

ఆమె పెద్దఅయిదేళ్ళ కొదుకునూ యజమాని అన్యాయం గా అలబామాలోని ఒక యజమానికి అమ్మాడని తెలుసుకొన్నది .మేరియా దంపతుల సహాయం తో కోర్టులో కేసు వేసి గెలిచి తన కొడుకును తాను దక్కించు కొన్నది ట్రూత్ .ఈ విధం గా ఒక నల్ల జాతి బానిస తెల్ల జాతి యజమాని మీద కోర్టులో కేసు వేసి గెలిచి కొడుకును దక్కించుకోవటం చరిత్రలో ఇదే మొట్టమొదటిది .దీనితో ట్రూత్ గురించి అందరికీ తెలిసింది

మత విశ్వాసం .

మేరియా వాన్ వాజేన్స్ దగ్గర ఉండగా ట్రూత్ ఆధ్యాత్మిక ఆలోచనలలో పది నిజమైన క్రిస్టియన్ గా మారింది 1829 లో పిల్లాడు పీటర్ తో  సహా న్యూయార్క్ సిటీ చేరింది .క్రిస్టియన్ ఇవాన్జలిస్ట్ ఎలిజా పియర్సన్ ఇంట్లో హౌస్ కీపర్ గా ఉన్నది .తర్వాతా రాబర్ట్ మాధ్యూస్ తో పరిచయమై మాతియా కింగ్డం ఆఫ్ కమ్మ్యునల్ కాలనీ లో అతని హౌస్ కీపర్ అయింది .ఎలిజా పియర్సన్ మరణించాడు .అతన్ని విషం పెట్టి చంపారని అతని ఇల్లు అంతా దోచేశార్ని రాబర్ట్ మీద ట్రూత్ మీద అభియోగం వచ్చింది .కేసు కొట్టేశారు .రాబర్ట్ పడమటి దేశానకి వెళ్ళిపోయాడు .

1839లో ట్రూత్ కొడుకు వేల్ హంటింగ్ షిప్ లో ఉద్యోగం లో చేరి మళ్ళీ కనిపించలేదు తిమింగిలం బారిన పడి చని పోయి ఉంటాడు .1843 జూన్ ఒకటవ తేదీ న తన పేరు ‘’సౌజేర్నార్ ట్రూత్ ‘’గా మార్చుకొని దేవుడు తనను పిలుస్తున్నాడని చెప్పింది .మెథడిస్ట్ గా మారి బానిస విమోచానకోసం పర్యటన చేస్తూ ఉపన్యాసాలిస్తూ గడిపింది .1844లో మాసా చూసేట్స్ రాష్ట్రం లోని నార్త్ ఆమ్ప్ టన్లో ‘’నార్త్  అంప్ టన్అసోసియేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రి’’లో చేరి స్త్రీ హక్కులకోసం ,మత సహిష్ణుత ,పాసిఫిజం లకోసం కృషి చేసింది .ఈ సంస్థ 470ఎకరాల ఒక ఫాం హౌస్ లో ఉండేది .అక్కడ సభ్యులు పశువుల పెంపకం ,కోతమర నిర్వహణ ,గ్రిస్ట్ మిల్లు (పిండిమర)సిల్క్ ఫాక్టరీ నిర్వహించారు .ఇక్కడే ప్రసిద్ధ విమోచన నాయకులు ఫ్రెడరిక్ డగ్లాస్ ,విలియం లాయడ్ ,డేవిడ్ రాగ్లర్స్ మొదలైన వారితో పరిచయం కలిగింది .1846లో స్వయం పోషకం గా లేదని ఈ సంస్థను రద్దు చేశారు .

ట్రూత్ లైఫ్ హిస్టరీ

జాన్ బెన్సన్ ఇంటి వ్యవహారాలూ చూడటానికి ట్రూత్ కుదిరింది .పశ్చిమం వైపు వెళ్లేముందు జాన్ ద్యుమాంట్ ను కలుసుకొన్నది .తన జ్ఞాపకాలను స్నేహితురాలు ఆలివ్ గిల్బర్ట్ కు ట్రూత్ చెబితే ఆమె రాసి పుస్తకం గా కూరిస్తే విలియం గారిసాన్ దాన్ని రహస్యం గా ‘’ది నారేటివ్ ఆఫ్ సౌజార్నేర్ ట్రూత్ –ఏ నార్దర్న్ స్లేవ్’’పేరిట పబ్లిష్ చేశాడు . ఫ్లారెన్స్ లో మూడు వందల డాలర్లతో ఒక స్వంత ఇల్లు ఎర్పరచుకోన్నది .మాసాచూసేత్స్ లోని వార్ చెస్టర్ లో ‘’మొదటి జాతీయ మహిళా సమాఖ్య ‘’సమావేశం లో ట్రూత్ మాట్లాడింది .కమ్మ్యూనిటికి చెందిన సామ్యుఎల్ అప్పులు తీర్చింది .తన ఇంటి ప్రక్క స్థలాన్నికొని ,తర్వాతా అమ్మేసి మిచిగాన్ రాష్ట్రం లోని బాటిల్ క్రీక్ కు చేరింది .

నేను స్త్రీనికానా?

ట్రూత్ మాట్లాడిన’’ Ain;t I a woman ?స్పీచ్ చిరస్తాయిగా నిల్చి పోయింది ఆ తర్వాతా పదేళ్ళు వందలాది ఉపన్యాసాలిచ్చి జనాన్ని ప్రభావితుల్ని చేసింది .న్యూయార్క్ లోని బ్రాడ్వే లో గొప్ప ప్రసంగం చేసింది .’’ఫ్రెండ్స్ ఆఫ్ హ్యూమన్ ప్రోగ్రెస్ ‘’లో మిచిగాన్ లోని బాటిల్ క్రీక్ చేరి మహోపన్యాసమిచ్చింది .అందులో ఒకడు ‘’నువ్వు మరీ మగాడిలా మాట్లాడుతున్నావ్ ‘’అనగానే రెచ్చి పోయి ట్రూత్ జాకెట్ విప్పి తన వక్షోజాలను సభా ముఖం గా చూపించి వాడి నోరు మూయించింది . ‘’అమెరికన్ ఈక్వల్ రైట్స్ అసోసియేషన్ లో ,నీగ్రోల ఎనిమిదవ  స్వేచ్చా సమావేశం లో భావోద్రేకాలతో మాట్లాడి  కార్యో న్ముఖులను చేసింది .

సేవాకార్యాలు

నార్త్ అంప్ టన్లో  ఇల్లు అమ్మేసి మిచిగాన్ లో హార్మోనియాలో కొత్త ఇల్లు కొనుక్కొన్నది .అమెరికన్ సివిల్ వార్ లో నల్లజాతి వారిని సైన్యం లో చేర్చే ప్రయత్నం చేసింది .ఆమె మనవడు జేమ్స్ కల్దేవేల్ చేరాడు .వాషింగ్టన్ లోని ‘’నేషనల్ ఫ్రీడ్ మాన్స్ రిలీఫ్ అసోసియేషన్ ‘’లో ఉద్యోగం చేసింది .అక్కడి ఆఫ్రికన్ అమెరికన్ ల జీవిత విధానాన్ని మెరుగు పరిచింది .ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ను కలుసుకొన్నది .ఫ్రీడం హాస్పిటల్స్ లో పణి  చేస్తూ గుర్రబ్బండీ తొలి సైన్యానికి సాయ పడింది .’

సైన్యం కోసం దేశ భక్తీ గీత రచన ,గానం

మొదటి మిచిగాన్ కలర్డ్ రెజిమెంట్ కోసం ‘’ది వాలిఎంట్ సోల్జేర్స్ ‘’అనే దేశ భక్తీ ప్రబోధ గీతం రాసి దాన్ని స్వరపరచి డెట్రాయిట్ ,వాషింగ్ట న్ లలో స్వయం గా పాడిన దేశ భక్తురాలు ఫ్లారెన్స్ లో విపరీతమైన ప్రయాణ బడలిక తో ఉన్నా కోరగానే  చిన్నపిల్లలా నుద్దేశించి అప్పటికప్పుడు మాట్లాడి వారిని ఉత్సాహ పరచింది .1870లో ఫెడరల్ ప్రభుత్వం  పూర్వపు బానిసలకు ఇళ్లస్థలాలను ఇప్పించమని తీవ్రంగా కోరి ప్రయత్నించినా ఇప్పించ లేక పోవటం ఆమెను తీవ్రంగా కలచి  వేసింది . ప్రెసిడెంట్ యులిసిస్ ను కలిసి బాటిల్ క్రీక్ కు తిరిగొచ్చి అధ్యక్ష ఎన్నికలో వోటు వేయటానికి వెడితే తిరస్కరించి పంపారు .

26-11-1883 నాడు సాంఘిక సంస్క రణాభిలాషి ,విమోచనోద్యమ నాయకురాలు ,మహిళాహక్కుల పోరాట యోధురాలు మహా వక్త ‘’సౌజేర్నార్  ట్రూత్ ‘’ఎనభై ఆరేళ్ళ వయసులో మరణించింది .

Sojourner truth c1870.jpg

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-15-ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.