ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -64
28-మానవత్వాన్ని మాత్రమే చిత్రించిన మహోన్నత చిత్రకారుడు -విన్సెంట్ వాన్ గో(Vincent Van Gogh)
37ఏళ్ళకే తనను తాను చంపుకొని ,పదేళ్ళుమాత్రమే చిత్రకారుడిగా ఉన్నా తరాలు గుర్తుండిపోయే అతి అరుదైన స్వీయమైన చిత్రాలు గీసి ,జీవితం అంటే భయం ,ప్రేమలో విషాదం అనుభవించి వాటినే కాన్వాస్ పై ప్రతిఫలి౦పజేసిన అరుదైన హాలండ్ చిత్రకారుడు విన్సెంట్ వాన్ గో .అందం ,ఆనందం కోసం కాకుండా బాధ నివృత్తికోసం పెయింటింగ్ వ్రుత్తి చేబట్టాడు .అందం ,అపరిశుభ్రత ,ఔన్నత్యం ,దుఖం లను కలగలిపి నిరాశను ఆశాత్మక సృజనకోసం ప్రయత్నించిన వాడు విన్సెంట్ .I want to paint humanity ,humanity and humanity ‘’అని మానవత్వం కోసం అర్రులు చాచిన చిత్రకారుడు .
30-3-1853నహాలండ్ దేశం లోని బ్రాబాంట్ ప్రాంతం లో గ్రూట్ జండర్ట్ గ్రామం లో విన్సెంట్ జన్మించాడు .సంతానం లో పెద్దవాడు .తండ్రి పాస్టర్ కనుక ఇంట్లో వారందరూ మత పద్ధతులను పాటించాలి .మిగిలిన పాస్టర్ లకంటే ఇతని తండ్రి కడు పేదవాడు .కనుక కొడుకును బిజినెస్ లో పెట్టాలనుకొన్నాడు .ముగ్గురు బాబాయిలు ఆర్ట్ డీలర్స్ .విన్సెంట్ కు పదహారేళ్ళ వయసులో ఒక బాబాయ్ తన గూపిల్ అండ్ కంపెనీలో పెట్టాడు .దీనికి దేశ విదేశాలలో బ్రాంచీలున్నాయి .తండ్రిలోని పిరికితనం తల్లిలోని మూర్ఖత్వం వారసత్వంగా వచ్చి విన్సెంట్ ఆర్ట్ సేల్స్ మన్ గా విజయం సాధించాడు .అందుకే బాబాయి హేగ్ ఆఫీస్ నుంచి పారిస్ ఆఫీస్ కు,తర్వాత లండన్ కు మార్చాడు .ఎవరితోనూ స్నేహం చేయలేదు. విన్సెంట్ కు అనుయాయుడు తమ్ముడు థియో మాత్రమే .ధియో కు ఆర్ట్ డీలర్ అవాలనే కోరిక ఉండేది .అన్నదమ్ములిద్దరిమధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ తర్వాత ఒక గొప్ప మానవ డాక్యుమెంట్ గా చరిత్రలో నిలిచిపోయింది .
లండన్ లో విన్సెంట్ కు మొట్టమొదటిసారి తిరస్కరణ జరిగింది .తాను ఉంటున్న ఇంటి యజమాని కూతురిపై ప్రేమ ఒలకబోసుకొని ఆమె కూడా తాన అంటే తందానా అంటుందని ఆశపడి ఆమె ఎదురుతిరిగితే అవాక్కయ్యాడు .విన్సెంట్ అందవిహీనుడు .పెద్దతల ఎర్రటి జుట్టు .నీలి కళ్ళు చూసి ఆమె భయపడి పోయింది .అదీకాక అప్పటికే ఆమెకు ఇంకోరితో ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది .దీనితో హృదయం తీవ్రంగా గాయపడి కోపం పెరిగి బాబాయి కంపెనీ కస్టమర్ల పై చూపించాడు .వాళ్ళు కోనేదంతా చెత్త అన్నాడు .అవమాని౦చాడుకూడా .మనోడేకదా అని జాలితో పారిస్ బ్రాంచ్ కు మార్చాడు .అక్కడ కూడా తీరు మారలేదు .కంపెనీ ఇతని ప్రవర్తన చూసి నోటీసు ఇచ్చింది
ఇక లాభం లేదని ఉద్యోగంవదిలి ఇంగ్లాండ్ వెళ్లి చిన్న ఊరు రామ్స్ గేట్లో చిన్న స్కూల్ లో లాంగ్వేజెస్ చెప్పి పొట్ట పోషించుకొన్నాడు .తాను ఇంకా మతం లోనే ఉన్నానని గుర్తు చేసుకొని మెథడిస్ట్ పుస్తకాలు ఐసిల్ వర్త్ లో ఉండి చదివాడు.` మినిస్ట్రీ పరీక్షలో పల్తీకోట్టినాఆశ పోలేదు .పాస్టర్ కాలేనని గ్రహించిబెల్జియం లో బోరినేజ్ లో ప్రీచర్ గా ఉన్నాడు .అది బొగ్గుగని కార్మికులు ఉండే చోటు .అందరూ అండర్ గ్రౌండ్ మనుషులే .వాళ్ళతోనే కలిసి వాళ్ళల్లో ఒక్కడుగా పెరిగి వాళ్ళ తిండే తింటూ వాళ్ళ కన్నాలలోనే పడుకొన్నాడు .వాళ్లతోకలిసి బాధలు పంచుకొన్నాడు .వాళ్లకు జబ్బు వస్తే సేవచేశాడు .గాయాలైతే కట్టుకట్టాడు .వాళ్ళ పిల్లలకు చదువు చెప్పాడు .తనకొచ్చే జీతం తన బట్టలు వాళ్లకు పంచిపెట్టేవాడు .తన మంచం మీద వాళ్ళను పడుకో బెట్టుకోనేవాడు .వాళ్ళు జీతనాతాలకోసం సమ్మె చేస్తే వారిని సమర్ది౦చేవాడు .ఇదంతా బ్రసెల్స్ లో ఉండే అధికారులకు నచ్చలేదు .అతని అత్యుత్సాహం, చొరవ ,వైట్ కాలర్ గా ఉండాల్సినవాడు వాళ్ళతో కలిసి ఉండటం వాళ్లకు ఇష్టం లేకుండా పోయింది .ఉద్యోగం కాలపరిమితి అవగానే వారు అతని ఉద్యోగాన్ని పొడిగించలేదు.మత బోధ కూడా చేయద్దని ఆంక్ష విధించారు .
మనసు దెబ్బ తిన్న విన్సెంట్ తండ్రిని చేరి ఆ వాతావరణం లో ఇమిదడిపోదామనుకొంటే చర్చిగౌరవాన్ని మంటగలిపిన కొడుకుకు ఇంట్లో స్థానం లేదన్నాడు .కాలినడకనఎన్నోమైళ్ళు నడిచి జూల్స్ బ్రిటన్ అనే పెయింటర్ దగ్గరకు వెళ్లి సలహాకోరుదామనుకొన్నాడు .ఆ దేవేంద్ర భవనం లాంటి ఇల్లు వాతావరణం చూసి తలుపు కొట్టకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాడు .నిరాశా నిస్పృహా అవమానం ఆవేదన నిండిన మనసుతోఎక్కడ బయల్దేరాడో మళ్ళీ అక్కడికే బోరినేజ్ చేరాడు .
ఒక మైనర్ ఇంట్లో ఒకభాగం అద్దెకు తీసుకొని విషాదం లో పడిపోయాడు .తమ్ముడు థియో కు లెటర్ రాసి అందులో అయిదేళ్లుగా ఏ పనీ లేకుండా నిరాశతో బతుకుతున్నానని ,తాను చదివిన చదువు దేనికీ పనికి రాకుండా పోయిందని తెలిపాడు .యూని వర్సిటి ఎందుకు మానేశావని అడిగితె తాను సహజ మైన చావును కోరుకొంటున్నానని వర్సిటీ చావు కాదని రాశాడు .తనలో ప్రేమ పెల్లుబికి వస్తోందని అయితే ఈ ప్రేమ స్వంతప్రేమ కాదని ,అదొక అవగాహనా విషయమైన ప్రేమ అని ,బౌద్ధిక ప్రేమ అని దానితో ఏదో సృష్టించి దాన్ని అందరికి ప్రసారం చేయాలన్నదే తన ధ్యేయం అని విన్సెంట్ రాశాడు .హృదయాన్ని విశాలం చేసుకొని మనసును లోతుగా అధ్యయనం లో ఉంచుకొని నిరంతరం అభివృద్ధి చేసుకొంటూ ,విజ్ఞానాన్ని పెంచుకొంటూ ఉంటే అదే దైవ మార్గం అవుతుంది అని తన మనసులోని భావ పరంపరను కాగితం పై పెట్టి తమ్ముడికి తెలియ జేశాడు .
విన్సెంట్ బైబిల్ చదివాడు .మైకేలేట్ రాసిన ఫ్రెంచ్ విప్లవం చదివాడు .హ్యూగో, జోలా, డికెన్స్ మొదలైన విఖ్యాత రచయితలూ అట్టడుగు వర్గం వారి గురించి అణచబడిన వారి గురించి రాసిన రచనలనుఔపోసన పట్ట్టాడు .సృజన మీద మళ్ళిన బుద్ధిని తన చుట్టూ బోరినేజ్ గ్రామం లో ఉన్న పరిస్తితులను చిత్రాలుగా గీశాడు.గనికార్మికులే అతని మోడల్స్ .ఇతరులు వేసిన చిత్రాలను ప్రయోగాత్మకం గా కాపీ చేశాడు .పారిస్ లోని చిత్రాల నకళ్లను తనకు పంపమని తమ్ముడిని కోరాడు .కాని తమ్ముడు థియో ఇప్పుడిప్పుడేబిజినెస్ లో ఎదుగుతున్నాడు .అన్నగారు అన్నీ వదిలేసి జీవితం లో ఎదగాలనే కోరిక చూపిస్తున్నందుకు సంతోషపడి నెలకు వంద ఫ్రాంకులు పంపే ఏర్పాటు చేశాడు తమ్ముడు ;బోరినేజ్ లోని ఆచీకటి ఇరుకు బొక్కవదిలేసి బ్రసెల్స్ లో చిత్రలేఖనం చదవటానికి ఏర్పాటు చేశాడు .
సశేషం
గోదావరి మహా పుష్కర శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-7-15-ఉయ్యూరు
.
.

