కొలువు పిలుస్తోంది!

కొలువు పిలుస్తోంది!

  • 06/09/2015
  • -బి.వి.ప్రసాద్ -శ్రీధర్, కాటపల్లి అశోక్‌కుమార్

‘మీరేం చేస్తూంటారు..?’ .. కుర్రకారు ఎదురైతే వారిని చాలామంది అడిగే తొలిప్రశ్న ఇది. ప్రభుత్వ ఉద్యోగమేనా..? జీతమెంత..? గీతం ఏమైనా ఉంటుందా..? పీఎఫ్ వగైరా ఉంటాయా..? బదిలీలుంటాయా..? .. ఇవీ తరువాత దూసుకొచ్చే ప్రశ్నలు. ఈ రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలపై మోజున్నా, లక్షల్లో జీతాలొస్తున్నా- ప్రభుత్వ ఉద్యోగమంటే ఆ ప్రత్యేకతే వేరు. ఆ ఉద్యోగాల్లో ఉండే భద్రత ప్రైవేటు నౌకరీల్లో లేదు. దీంతో యువత, మెజారిటీ తల్లిదండ్రులు సర్కారీ కొలువులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గడచిన కొనే్నళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు మందగించడంతో ప్రైవేటురంగం వైపుకన్నువేసిన యువతకు ఇపుడు మంచికాలం వచ్చిందనే చెప్పాలి. అటు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, ఇటు కేంద్రప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు పెద్దఎత్తున నియామకాలకు కసరత్తు చేస్తున్నాయి. అపుడే నోటిఫికేషన్ల పరంపర మొదలైంది. దీంతో నిరుద్యోగ యువత ఇప్పుడు సర్కారీ కొలువు కొట్టేయడానికి సిద్ధవౌతున్నారు. పుస్తకాలతో కుస్తీ మొదలెట్టారు. కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. లైబ్రరీల్లో రద్దీ పెరిగింది. మొత్తమీద కొలువుల జాతర సందడి తెలుగునేలపై కన్పిస్తోంది. *** ఒకప్పుడు వ్యవసాయం చేయడాన్ని గర్వంగా చెప్పుకునేవారు. ఇవాళ అది నామోషీగా మారింది. స్వయం ఉపాధిపై దృష్టి తగ్గింది. ప్రభుత్వ ఉద్యోగం రాకపోతేనే ప్రైవేటు ఉద్యోగంలో కుదురుకునేది. అందరి దృష్టీ సర్కారీ నౌకరీపైనే. ప్రపంచవ్యాప్తంగా జరిగిన విశే్లషణలు చూస్తే 90 శాతం మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి. కేవలం 3 శాతం మంది మాత్రమే ప్రైవేటు ఉద్యోగాలపై దృష్టిపెడుతున్నారు. మిగిలిన ఏడు శాతం మంది పరిశోధనలు, ఇతర వ్యాపకాలపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న సౌఖ్యం, సౌకర్యం, భద్రత మిగిలిన ఉద్యోగాల్లో ఉండవనే భావనే దీనికి కారణం. జీతాలు సక్రమంగా ఇవ్వడం, కావల్సినపుడు సెలవులు, వేతన చట్టాలను కచ్చితంగా పాటించడం, పని భారం తక్కువగా ఉండటం, ఒత్తిడి లేకపోవడం, తక్కువ అర్హతలున్నా సీనియారిటీపై ఉన్నత పదవులకు చేరుకునే వీలుండటం వంటి అంశాలు దీనికి కారణం. ప్రభుత్వ ఉద్యోగంలో జీతంతో పాటు గీతం కూడా దక్కే అవకాశం ఉండటం, కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం, హోదా ఉన్నాయి. ఆ సర్వేలో చాలాకొద్దిమంది మాత్రమే సమాజానికి సేవ చేయాలనే దృక్పథం, పేదవారికి సహాయపడాలనే ఆలోచన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతులు, పెట్టుబడి సమస్య, వ్యాపారంలో గ్యారంటీ లేకపోవడం, ఎక్కువ సమయం కేటాయించాల్సిరావడం, స్థిరత్వం లేకపోవడం, ఎదుగుదలకు ప్రతిబంధకాలు వంటివి ఎన్నో ఉండటంతో స్వయం ఉపాధిపై నిరుద్యోగ యువత ఆసక్తి చూపడం లేదు. ఏతావతా యువతలో ప్రభుత్వ ఉద్యోగంపైనే మోజు కనిపిస్తోంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మునుపెన్నడూ లేనివిధంగా సాగనుంది. దీంతో ఉద్యోగార్థులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణలో లక్షకుపైగా ఖాళీలు తెలంగాణ రాష్ట్రంలో తొలుత 1.06 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు భావించినా, ఆ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తక్షణం వివిధ విభాగాల్లో దాదాపు 25వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. నోటిఫికేషన్లు వరసగా వెలువడుతున్నాయి. తెలంగాణ పోలీసు శాఖలో10,810 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కానిస్టేబుల్ క్యాడర్ నుండి ఎస్‌ఐ వరకూ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఎస్‌ఐ మేల్ 467, ఎస్‌ఐ ఫిమేల్ 77, ఆర్‌ఎస్‌ఐ 59, కానిస్టేబుల్ మేల్ 2978, కానిస్టేబుల్ ఫిమేల్ 38, ఎఆర్ కానిస్టేబుల్ 2169, ఎఆర్ కానిస్టేబుల్ ఫిమేల్ 57, ఎస్‌పిఎఫ్ 174,కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు మరో 3600 ఉన్నాయి. ఫారెస్టు డిపార్టుమెంట్‌లో 2వేల పోస్టుల భర్తీ జరగనుంది. ఇరిగేషన్, వాటర్ గ్రిడ్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, ట్రాన్స్‌కో, జెన్‌కో తదితర విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో ఆరు వేల పోస్టులు నింపుతారు. వెటర్నరీ డిపార్టుమెంట్‌లో 477 , ఎక్సైజ్ కానిస్టేబుల్స్ 321, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు 276, ఎసిటిఓలు 147, డిప్యూటీ తహసీల్దార్‌లు 20 పోస్టులు భర్తీ చేస్తారు. వైద్య, అనుబంధ కోర్సులు చేసిన వారికి సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్ట్ఫా నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూప్-1లో కనీసం 300 పోస్టులు భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆంధ్రాలో… ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షను నిర్వహించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఎ) పరిధిలో ఇప్పటికే 3వేల ఉద్యోగాలను డిప్యూటేషన్, డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేశారు. రాష్టవ్రిభజన తర్వాత ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్పష్టత వస్తే మరిన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. యూనివర్శిటీల్లోనే బోధన, బోధనేతర పోస్టులు దాదాపు 5వేల వరకూ ఉన్నాయి. అటవీ, పోలీసు, వైద్య, సంక్షేమ శాఖల్లో మరో 6వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించారు. జాతీయస్థాయిలో… జాతీయ స్థాయిలో కీలక ఉద్యోగాలు పొందాలన్న ఆకాంక్ష ఉన్నవారు సివిల్ సర్వీసు పరీక్షలు రాయడం ద్వారా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. రాజ్యాంగబద్ధమైన పోస్టుల్లో నియామకానికి కూడా సివిల్ సర్వీసు రిక్రూట్‌మెంట్ ద్వారా మార్గం సుగమం అవుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఎన్నో కీలకమైన పోస్టులకు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తుంది. ఆ తరహా ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ సంస్థలు దేశంలో చాలానే ఉన్నాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో ఈ ఏడాది లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగంలో వచ్చే ఏడాది పదవీ విరమణ చేసే ఉద్యోగుల సంఖ్య భారీగానే ఉంటుంది. దీంతో ఆయా పోస్టుల భర్తీ తప్పనిసరి కానుంది. కొత్తరాష్ట్రంలో యువత ఆశలు, ప్రభుత్వం హామీలు, విభజిత రాష్ట్రంలో నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలన్న అక్కడి ప్రభుత్వం చర్యలు ఉద్యోగాల భర్తీ తప్పనిసరి కాబోతోంది. ఈ ఏడాది కనీసం వేలల్లోనైనా ఉద్యోగాల భర్తీ చేయకతప్పదు. ప్రశాంత జీవితం చిన్న ఉద్యోగమైనా ఫర్వాలేదు, ప్రభుత్వ ఉద్యోగమైతే చాలన్న భావన ఇప్పటికీ చాలామందిలో ఉంది. అందువల్ల చిన్న పోటీ పరీక్ష నిర్వహించినా లక్షలాది మంది పరీక్ష రాస్తున్నారు. ఈ మధ్య జరిగిన బ్యాంకింగ్ సర్వీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన క్లర్కు పోస్టులకు 18 లక్షల మంది పరీక్ష రాశారు. అందులో టెన్త్ పాసైన వారు మొదలు పీజీలు, పిహెచ్‌డిలు చేసిన వారు కూడా ఉండటం, ఇంజనీరింగ్ చదివిన వారు సైతం పోటీ పడటం పరీక్ష నిర్వాహకులనే ఆశ్చర్యపరిచింది. అనేక వడపోతలు నిర్వహించి ఉద్యోగం ఇవ్వగానే స్పెషలైజ్డ్ కోర్సులు చేసిన వారు తమకు తగిన ఉద్యోగం రాగానే వెళ్లిపోతున్నారు. దాంతో మరోమారు రిక్రూట్‌మెంట్‌లు నిర్వహించుకోవల్సి వస్తోంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే కొన్ని పోస్టులకు అర్హతలను ఖరారు చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో అదనపు అర్హతలు ఉన్నవారిని నిరాకరిస్తున్నారు. ఎక్కువ అర్హతలకు ప్రభుత్వం రంగంలో ప్రాధాన్యం లభిస్తుండగా, సరిపడా అర్హతలకే ప్రైవేటు రంగం పరిమితం అవుతోంది. మారిన దృక్పథం ఉద్యోగం అంటే యజమాని దగ్గర, యజమాని కోసం పనిచేస్తూ ఆ పనికి తగినట్టు నెలకు కొంత మొత్తాన్ని జీతం లేదా వేతనంగా పొందడం అని చెప్పుకోవచ్చు. పూర్వకాలంలో హిందీ నానుడి ఒకటి వాడుకలో ఉండేది. ‘వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మాధ్యమం, ఉద్యోగం అథమం’ అని, ఉద్యోగం అంటేనే గాడిద చాకిరీగా భావించేవారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి ఒక్కరి వ్యాపకం వ్యవసాయంగానే ఉండేది. రానురాను వ్యవసాయం వైపు ఆసక్తి తగ్గి ఉద్యోగాలకు అనే్వషణ పెరిగింది. హరితవిప్లవం పేరిట రసాయన మందులను యథేచ్ఛగా వాడటంతో వ్యవసాయం పెట్టుబడి పెరిగి గిట్టుబాటు తగ్గి జీవనమార్గాలను అనే్వషించాల్సి వచ్చింది. దీంతో ఇపుడు ఉద్యోగం ఉత్తమమైనదిగా భావిస్తున్నారు. ఏ వ్యక్తి అయినా స్వశక్తిపై నమ్మకం లేనపుడు, భవిష్యత్ అంటే భయం ఉన్నవాడు, ఆర్థిక ఆసరా లేనివాడు మాత్రమే ఉద్యోగాలకు వెళ్లేవారు. ఉద్యోగం అంటే ఒకరి దగ్గర ఊడిగం చేయడంగానూ, అవమానకరంగానూ గతంలో ఆలోచించేవారు. రోజురోజుకూ పరిస్థితి మారింది. సొంత ఉపాధి కంటే ఉద్యోగంలో ఉన్న అవకాశాలు, ఆర్ధిక సదుపాయాలు, సెలవుల వెసులుబాటు, హోదా, సమాజంలో గౌరవం, కొన్ని శాఖల్లో అస్సలు ఒత్తిడి లేకపోవడం, హాయిగా ఏదో ఒకటి రెండు గంటలు గడిపేస్తే లక్షలాది రూపాయల వేతనం పొందే వీలుండటం వంటివి ఉద్యోగంపై దృష్టి పెరిగేలా చేశాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగం పొందినా లేని మరిన్ని విస్తృత సౌకర్యాలు, సదుపాయాలు నేడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండటంతో అందరి దృష్టీ వీటిపై పడింది. ఇదీ వాస్తవం బాగా డబ్బు సంపాదించాలన్నది సమాజంలో చాలామంది కోరిక. ప్రభుత్వ ఉద్యోగం చేస్తే నిలకడైన ఆదాయం, హోదా ఉండొచ్చు. కానీ ఇబ్బడిముబ్బడిగా డబ్బు సంపాదించే అవకాశం ప్రైవేటు ఉద్యోగాలతో పోలిస్తే తక్కువ. కానీ ఆ రంగంలో భద్రత తక్కువ. వ్యాపారం, స్వయం ఉపాధిలో నాయకత్వ లక్షణాలు, పదిమందికి ఉపాధి చూపడం, బాగా డబ్బు సంపాదించే వెసులుబాటు ఉన్నా సవాళ్లూ ఎక్కువే. ఉద్యోగాలు చేసిన వారిలో 90 శాతం మంది వేతనాలు కేవలం 30వేల రూపాయల లోపు మాత్రమే. 5 శాతం మంది వేతనం లక్ష వరకూ ఉండగా, మరో ఐదు శాతం మంది వేతనం లక్షదాటి ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కేంద్ర, రాష్ట్ర వేతన సవరణ చట్టాల వల్ల ఒక్కొక్కరి వేతనం ఐదు నుండి పదివేలు పెరిగినా, మొత్తం మీద చూస్తే అత్యధిక వేతనం పొందేవారు 10 శాతం కాగా, తక్కువ వేతనాలతో నెట్టుకొచ్చేవారు 90 శాతం మంది ఉన్నారు. ప్రభుత్వ రంగంలోనూ, ప్రైవేటు రంగంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఫలితంగా వీరు నిత్యం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుంది. ఉద్యోగంతో రోజులు గడుపుకోవడమేగాని, ఆస్తులు సంపాదించలేం అని చాలా మంది అంటుంటారు. నిజానికి సంపాదనకు, చదువుకు సంబంధం లేదు. సంపాదనకు కాస్తంత తెలివి ఉండాలి అంతే. సెటిల్మెంట్ ఆ మధ్య ‘రంగీలా’ సినిమాలో ‘ఏం చేయదలుచుకున్నావ్?’ అని హీరోయిన్ అడిగితే హీరో ‘సెటిల్ అవుతా’ అంటుంటాడు. సెటిల్ అవ్వడం అంటే వయసులో ఉండగానే పనిచేయకపోయినా నెలతిరగ్గానే చేతికి డబ్బు వచ్చేలా ప్రణాళిక వేసుకోవడమే. అందుకే సామర్ధ్యం ఉన్న ప్రతి వ్యక్తి వయసులో ఉండగానే సెటిల్ కావాలని కోరుకుంటాడు. నిపుణులకే.. కార్పొరేట్ సంస్థల్లో కాలుమోపాలనే ఉద్యోగార్ధుల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. మేకిన్ ఇండియా, ఇ గవర్నెన్స్, డిజిటల్ పాలన, స్మార్టు సిటీస్ కానె్సప్ట్, డెవలప్‌మెంట్ గోల్స్‌తో పాటు ఐటి, ఐటిఇఎస్, టెలికం, హాస్పిటాలిటీ, ఫార్మా-హెల్త్ రంగం, బిఎఫ్‌ఎస్‌ఐ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, అవుట్ సోర్సింగ్, బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, ఆతిథ్య -రిటైల్ రంగాలు అవకాశాల ద్వారాలను తెరుస్తున్నాయి. అయితే అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇకపై ఉపాధి పొందడం అంత సులభమేమీ కాదంటున్నారు నిపుణులు. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో సంస్థలు ఉండటంతో, అపారమైన నైపుణ్యం ఉన్న నిపుణులకే ఐటి కొలువులు దరిచేరుతున్నాయి. సుమారు 35 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని ఇచ్చిన ఐటి రంగంలో, కొత్త ఉద్యోగ నియామకాలు గత ఏడాది తగ్గిపోయాయి. సాఫ్ట్‌వేర్ కోడింగ్ విభాగంలో ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి రావడంతో, సంప్రదాయ ఐటి సేవలకు గిరాకీ గణనీయంగా తగ్గిపోయింది. తక్కువ నైపుణ్యం ఉన్న సామాజిక మొబిలిటీ, బిగ్ డేటా విశే్లషణ, ఐఓటీ ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త తరం డిజిటల్ టెక్నాలజీలో నైపుణ్యం చూపించే వారికే ఐటి ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయని చెబుతున్నారు. ఇటీవలి కాలం వరకూ భారత్ కొత్తగాకల్పిస్తున్న ఉద్యోగాల్లో దాదాపు 80 శాతం సంప్రదాయ ఐటి విభాగంలోనే వచ్చాయి. ఇకపై ఆ తరహా పరిస్థితులు ఉండవు. 2014-15లో ఐటి రంగంలో 2.24 లక్షల ఉద్యోగాలు ఇవ్వగా, 2015-16లో ఆ సంఖ్య రెండు లక్షలు దాటబోదని ‘నాస్కామ్’ అంచనా వేస్తోంది. రాబోయే కాలంలో ఐటి కంపెనీల ఆదాయాల వృద్ధిరేటుకు సమానంగా ఉద్యోగ నియామకాల వృద్ధి ఉండే అవకాశాలు లేవని విశే్లషకులు చెబుతున్నారు. 2003లో ఐటి పరిశ్రమకు 6300 కోట్ల రూపాయిల ఆదాయం దక్కితే 38వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2015లో మార్చి నాటికి ఏడాదిలో 6300 కోట్ల ఆదాయానికి కేవలం 14300 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ‘నాస్కామ్’ చెబుతోంది. పెరుగుతున్న అవకాశాలు భారతీయ కంపెనీలు అధికమొత్తంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాయి. అలాగే కంపెనీలు ఉద్యోగుల వేతనాలను పెంచాలని చూస్తున్నాయి. ఈ విషయాలు ‘కెరీర్ బిల్డర్ ఇండియా’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రానున్నకాలంలో శాశ్వత ఉద్యోగుల నియామకాలు పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు 73 శాతం కంపెనీలు వెల్లడించాయి. కాంట్రాక్టు ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టనున్నట్టు 60 శాతం కంపెనీలు తెలిపాయి. దాదాపు 46 శాతం మంది వర్కర్లు ఉద్యోగ బదిలీల వేటలో ఉన్నారు. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో ఉద్యోగ వేతనాలు పెంచాలని దాదాపు 86 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఉద్యోగుల ప్రారంభ జీతాన్ని ఐదుశాతం కన్నా పైగానే పెంచాలనే భావనతో 57 శాతం కంపెనీలున్నాయి. రానున్నకాలంలో కస్టమర్ సర్వీసెస్, సేల్స్, మార్కెటింగ్, ఐటి తయారీ, ఫైనాన్స్, హెచ్‌ఆర్ విభాగాల్లో అధిక ఉద్యోగ నియామకాలు నమోదు కానున్నాయి. మొబైల్ టెక్నాలజీ , క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి తదితర విభాగాల్లో కూడా నియామకాలు జోరుంటుంది. చీర్ లీడర్స్ క్రికెట్‌లో చీర్ లీడర్స్ టైప్‌లో ఇపుడు కంపెనీల్లో కూడా ప్రోగ్రామింగ్ చీర్ లీడర్స్ వచ్చేస్తున్నారు. ఖాతాదారులతో నవ్వుతూ, జోకులేస్తూ, సరదాగా మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించే ఉద్యోగాలు ఈమధ్య ‘పొట్టి స్కర్టులు ధరించే అమ్మాయిల’కే దక్కుతున్నాయి. ఖాతాదారులు రాగానే వారితో ముచ్చట్లు పెట్టడం, ఏం కావాలో అడిగి తెలుసుకోవడం, నవ్వించడం, వీటన్నింటితో పాటు ఆఫీసుల్లో ఉన్నవారితో ఆటలాడుతూ, ఉద్యోగులను ఉత్సాహపరిచి, మంచి ఉత్పాదకతను సాధించే బాధ్యతలను వీరికి అప్పగిస్తున్నారు. చైనాలోని టెక్నాలజీ కంపెనీలు అన్నీ ఇదే బాటలో ఉన్నాయి. అక్కడి పలు ఐటి కంపెనీలు ప్రస్తుతం వీరిని నియమించి ఉద్యోగులకు ఉల్లాసం కలిగిస్తున్నాయని ‘ట్రెండింగ్ ఇన్ చైనా’ సంస్థ ప్రకటించింది. అందమైన అమ్మాయిలను నియమించిన తర్వాత కంపెనీల వాతావరణం మారిపోతోంది. ముఖ్యంగా పురుషులు ఉత్సాహంగా పనిచేస్తున్నారని తేలింది. అయితే ఈ కొత్త పోకడలను ప్రశ్నిస్తున్నవారూ లేకపోలేదు. స్పీడ్ హైరింగ్ దేశంలో ఉద్యోగ నియామక ప్రక్రియ కొత్త పుంతలు తొక్కుతోంది. సంస్థల వ్యాపార పంథాతో పాటు రిక్రూట్‌మెంట్ విధానమూ కొత్తగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ కామర్స్, స్టార్టప్ వంటి నేటి తరం కంపెనీలు వ్యాపారంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాల్సి వస్తున్నందు వల్ల ఉద్యోగుల భర్తీప్రక్రియకు ఎక్కువ సమయం వెచ్చించడానికి ఇష్టపడటం లేదు. సమయం వృథా చేయడం ఇష్టం లేక స్వల్ప సమయంలోనే మంచి సమర్ధులను ఎంచుకునే దానిపై ఆధారపడుతున్నాయి. దీంతో తక్కువ సమయంలో కంపెనీ వ్యాపార స్థితిగతులకు తగిన వ్యక్తిని నియమించుకునే విధానాలను అవలంబిస్తున్నాయి. అలా పుట్టుకొచ్చిందే- స్పీడ్ హైరింగ్ కానె్సప్ట్. ఈ విధానంలో కేవలం 12 నిమిషాల్లోనే ఇంటర్వ్యూకు హాజరైన వ్యక్తి భవితవ్యం తేల్చేస్తారు. ఇందుకోసం అభ్యర్ధుల గ్రాహక శక్తిని పరీక్షించడం ద్వారా ఉద్యోగం ఇవ్వాలా లేదా అనేది కంపెనీలు తేల్చేస్తాయి. స్నాప్‌డీల్, ఓలా క్యాబ్స్, క్వికర్, ఫుడ్ పాండా, ప్రాక్టో, డబ్ల్యుఎస్‌ఎస్ వంటి టెక్నాలజీ ఆధారిత సేవల సంస్థలు అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవల్సి ఉంటుంది. వేల మందిని ఇంటర్వ్యూలు నిర్వహించుకుంటూ రోజులు, నెలల తరబడి కాలాన్ని వెచ్చించడం ఇష్టం లేక ఆ కంపెనీలు రిక్రూట్‌మెంట్ సంస్థలకు బాధ్యతను అప్పగించి ఒకటి రెండురోజుల్లోనే అభ్యర్ధులను ఎంపిక చేసి ఇవ్వమని కోరుతున్నాయి. స్పీడ్ హైరింగ్ టెస్టు నిర్వహించదలచుకున్న వారికి కో క్యూబ్ టెక్నాలజీస్ సంస్థ కాగ్నిటివ్ ఎబిలిటీ స్పీడ్ టెస్టు (కాస్ట్) పేరుతో ప్రత్యేక టూల్‌ను తయారుచేసింది. ఈ టూల్ ద్వారా ఇంగ్లీషు గ్రామర్, తేలికపాటి లెక్కలు, విశే్లషణ శక్తిని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. తద్వారా సంస్థల హెచ్‌ఆర్ మేనేజర్లు అభ్యర్ధుల గ్రాహణ శక్తిని అంచనా వేసి, తమ కంపెనీకి సరిపోతారనుకున్నవారికి వెంటనే ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు. ‘రిస్క్’తోనే కొందరికి కిక్.. సంపాదనే లక్ష్యంగా చదువుతున్నవారి ప్రాధాన్యతలు చాలా త్వరగా మారిపోతున్నాయి. రిస్క్ తీసుకుంటూ సవాళ్లను ఎదుర్కొనాలనుకునే వారు మాత్రం ధైర్యంగా, సొంతంగా ముందుడుగు వేస్తున్నారు. వ్యాపారమా? ప్రైవేటు ఉద్యోగమా? అని ఆలోచించకుండా వారు స్వశక్తిని నమ్ముకుంటున్నారు. ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో ఏ రంగంలోనైనా వీరు మాత్రమే దూసుకుపోతున్నారు. నిజానికి ఇలాంటి వారికి ప్రైవేటురంగంలోనే అవకాశాలు పుష్కలం. రిస్క్ ఇష్టం లేనివారు, భద్రత కావాలనుకున్నవారు ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తున్నారు. కాస్తంత సామాజిక స్పృహ, ధైర్యం ఉన్నవారు స్వయం ఉపాధి రంగంవైపు చూస్తున్నారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం మాత్రం ఎవరూ మానడం లేదు. ముందుగా సర్కారీ నౌకరీలో చేరి, ఆ తరువాత తమసొంత కోర్కెలకు తగ్గట్టు భవిష్యత్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. అందుకే ఇప్పుడు సర్కారీ కొలువులకోసం కొత్తపోటీ మొదలైంది. * గత వైభవం వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తున్న వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌లను జారీ చేస్తోంది. తెలంగాణ ఆవతరణ దినోత్సవం నాటి నుండి హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాలకు సంబంధించిన నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజిలో పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. ప్రయివేట్, కార్పొరేట్ స్థాయి ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా నేటి యువతరం ప్రభుత్వ ఉద్యోగాలపై మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగమైతే పూర్తిస్థాయి భద్రతతో పాటు అనేక రకాల లాభాలుంటాయన్నది వారి నమ్మకం. ప్రభుత్వం ప్రకటించిన వయోపరిమితి సడలింపుతో అనేకమంది కార్యాలయానికి వచ్చి తమ పేర్లను నమోదు చేసుకుంటుండంతో రద్దీ పెరిగింది. తెలంగాణలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ జిల్లాలో గత జూన్ మాసం నుండి నెలకు వెయ్యి చొప్పున ఇప్పటి వరకు ఏడు వేల ఐదు వందల మంది ఎంప్లాయిమెంట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థి తెలంగాణ వెబ్ సైట్‌కు సంబంధించిన డబ్ల్యుడబ్ల్యు.టిఎస్‌పిఎస్.జిఓవి.ఇన్‌లో తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నట్లయితే ప్రభుత్వపరంగా రానున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు ఫోన్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందుంతుంది. తప్పకుండా నిరుద్యోగ డిగ్రీ విద్యార్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. ఇక ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోడానికి వచ్చేవారి కోసం అన్ని ఏర్పాట్లు చేశాము. – కె.నాగభారతి, హైదరాబాద్ జిల్లా ఉపాధి అధికారి ‘టెంపరరీ’ అయినా ఓకే… ఉద్యోగంకోసం ఎదురుచూస్తున్న యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒకవైపు ప్రయత్నం చేస్తూనే ప్రైవేటు రంగంలోనూ అవకాశాలను వదులుకోవడం లేదు. పైగా అర్హతకు తగ్గ, స్థిరమైన ఉద్యోగం కోసం కాలాన్ని వృథా చేయడం లేదు. నవతరం ఆలోచనాధోరణిలో చెప్పుకోదగ్గ మార్పు గోచరిస్తోంది. అర్హతలకు తగ్గ ఉద్యోగం తాత్కాలికమైనదే అయినా, కాంట్రాక్టు పద్ధతిలోనే అయినా చేరిపోతున్నారు. అలాంటి ఉద్యోగాల్లో ఉంటే కావలసినప్పుడు, మంచి ఉద్యోగం వచ్చినప్పుడు వెళ్లిపోవడం సులభమని వారి నమ్మకం. పైగా అలాంటి ఉద్యోగాల్లో ఉన్నప్పుడే కొత్త టెక్నిక్స్, పనిలో మెళకువలు, కొత్త అంశాలను నేర్చుకోవడం సులభమని, ప్రతిభకు పదునుపెట్టే ఛాన్స్ అక్కడే దొరుకుతుందని, ఉద్యోగ విధుల నిర్వహణలో ఓనమాలు నేర్చుకోవడం అంటూ జరిగేది అలాంటి ఉద్యోగాల్లోనేనని వారంటున్నారు. ఇది పుక్కిట పురాణం కాదు. ఫెక్సిబిలిటీతో కూడిన తాత్కాలిక ఉద్యోగాలవైపు యువత ఆకర్షితులవుతున్నారన్నది ‘ఇండియన్ స్ట్ఫాంగ్ ఫెడరేషన్’ సర్వేలో తేలిన వాస్తవం. దేశంలో 49.7 మిలియన్లమంది ఉద్యోగాలు చేస్తూంటే వారిలో 28.8మంది ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నారు. మిగతా వారంతా తాత్కాలిక, ఫ్లెక్సిబుల్ ఉద్యోగాల్లోనే ఉన్నారు. ముఖ్యంగా చేనేత, హస్తకళలు, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, గుమాస్తాలు, బోధనారంగాల్లో ఈ ధోరణి కన్పిస్తోంది. ఎయిమ్స్, ఆధార్ వ్యవహారులు నిర్వహించిన యుఐడిఎఐ సహా ఎన్నో ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తున్నది ఇలాంటి ఔత్సాహికులనే. వారివల్ల ప్రభుత్వం చేయాల్సిన పనులు చౌకగా, వేగంగా సాగిపోతున్నాయి. ఇటు నిరుద్యోగులకు ఉపాధితోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు, విధివిధానాలపై అవగాహన పెరుగుతోంది. రేపోమాపో ఎప్పుడైనా పర్మినెంట్ చేస్తే ఈ అనుభవం పనికొస్తుందన్నది వారి ఆశ. నిజానికి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, కంప్యూటర్స్‌లో కొంత అవగాహన ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశాలే ఉన్నాయంటున్నారు ఇండియన్ స్ట్ఫాంగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు రితుపూర్ణ చక్రవర్తి. ముఖ్యంగా రిసెప్షనిస్టులు, సెక్రటేరియట్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, టెక్నికల్ లీడర్స్, సీనియర్ డెవలపర్స్ వంటి ఉద్యోగాల్లో వారిని నియమించవచ్చన్నది రితు అభిప్రాయం. ఇక ప్రైవేటురంగంలో 1.7 మిలియన్లమంది ఏటా ఇలాంటి ఉద్యోగాల్లో చేరుతున్నారు. అవినీతి లేని నియామకాలు కావాలి నిరుద్యోగుల్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు దక్కాలి. నియామకాల్లో పారదర్శకత ఉండాలి. ఉద్యోగాల భర్తీలో లంచగొండితనానికి తావ్వివద్దు. సీనియార్టి ప్రకారం ఉద్యోగం లభించేలా అధికారులు కృషి చేయాలి. తెలంగాణలో కొలువుల జాతర అంటున్నారు. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో నియామకాలు జరపాలి. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల కొరత ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంప్లాయిమెంట్ కార్డులున్నా ఇన్నాళ్లూ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఎంప్లాయిమెంట్ కార్డు రెన్యువల్‌కోసం హైదరాబాద్ ఎంప్లాయిమెంట్ కార్యాలయానికి వచ్చా. ఎంప్లాయిమెంట్ కార్డు రెన్యువల్‌లో వయోపరిమితిని తగ్గించడం కూడా సంతోషకరమైన విషయం. -కె.మహేంద్రనాథ్, ఫలక్‌నూమ-జంగమ్మెట్ అన్ని ఖాళీలూ భర్తీ చేయాలి చాలా కాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు జాబ్‌ల జాతరను నిర్వహించటాన్ని స్వాగతిస్తున్నాం. వెయ్యి, రెండువేలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా పూర్తి స్థాయిలో అన్ని శాఖల్లోని ఖాళీలకు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఆదేశాలివ్వాలి. నోటిఫికేషన్ విడుదల తర్వాత పరీక్షలకు కనీసం మూడు నెలల గడువునివ్వాలి. మారిన సిలబస్‌తో అభ్యర్థుల్లో అయోమయం నెలకొందని, వారు ఆత్మస్ధైర్యం కోల్పోకుండా పరీక్షలకు సిద్ధమయ్యేలా వారిని ప్రోత్సహించాలి. పరీక్షలను కూడా అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా పారదర్శకతతో నిర్వహించాలి. పోటీ ఎక్కువగానే ఉన్న నేటి తరుణంలో ఉద్యోగాలు దక్కని అభ్యర్థులకు కనీసం ఎంపిక పారదర్శకతతో జరిగిందన్న నమ్మకాన్ని కలిగించాలి. -తోట అంజన్న, ఎంటెక్ , విద్యుత్ ఇంజనీరింగ్ అభ్యర్థి ఉద్యోగాల వెల్లువ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఆతిథ్యం, ఐటి రంగాల్లో ఆశాజనకమైన వృద్ధి కనిపిస్తున్నందున రానున్న రోజుల్లో ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరగబోతున్నాయి. ‘ఆన్‌లైన్’లో ఉపాధి సేవలందిస్తున్న ‘నౌక్రీ’ సంస్థ జరిపిన తాజా సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే, వృద్ధి కనిపిస్తున్న రంగాల్లో – అనుభవం ఉన్న వారికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని తేలింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఉపాధి అవకాశాలు బాగా అందుబాటులోకి వస్తాయని ఆ సర్వే చెబుతోంది. నాలుగు నుంచి ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న వారికి అగ్రతాంబూలం లభించే పరిస్థితి ఉందని ‘నౌక్రీ హైరింగ్ ఔట్‌లుక్’ సర్వే చెబుతోంది. కొత్తగా ఉపాధి అవకాశాల కల్పనకు కూడా ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగావకాశాలతో పాటు కొన్ని రంగాల్లో వేతనాలు కూడా బాగా పెరుగుతాయని సర్వేలో పాల్గొన్న పలు కార్పొరేట్ సంస్థల యాజమాన్య ప్రతినిధులు తెలియజేశారు. సేవల విస్తరణకు పరిస్థితులు కలిసొస్తున్నందున ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సర్వేలో 60 శాతం మంది విశ్వాసం ప్రకటించారు. ఇపుడు వస్తున్న జీతభత్యాల కంటే మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు లభించే పక్షంలో ఉద్యోగాలు మారతామని ఎంతోమంది యువకులు చెప్పారు. ఉద్యోగ, వ్యక్తిత్వ జీవితాలు మెరుగ్గా ఉండాలని యువత ఆశించడమే ఇందుకు కారణం. కాగా, పలురంగాల్లో ప్రతిభావంతుల కొరత ఉన్నందున అనుభవం ఉన్నవారికి మంచి ఉద్యోగాలు, మేలైన వేతనాలు లభించే పరిస్థితి కనిపిస్తోంది.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.