దారులన్నీ అటువైపే
- 04/09/2015
- – శ్రీ

కథలకు కరువాచిన తెలుగు తెర -ప్రయోగాలను పక్కనపెట్టి పాత కథల బూజు దులుపుతోంది. జానర్‌లను జాడీల్లో మూతపెట్టి -సకుటుంబ సపరివారాన్ని తెరకుఎక్కిస్తోంది. తెర నిండుగా ఉంటేనే ప్రేక్షకుడికి కనువిందు. తాతా మామ్మా, అమ్మా నాన్న, అత్తా మామ, అన్నా వదిన, తోబుట్టువులు, బంధువర్గం… ఇలా కుటుంబగణంతో కళకళలాడే ఇళ్లు నిజానికి నందనవనమే. అందుకే -ఆ బంధాలను, అనుబంధాలను తెరపై ఇంపుగా చూపించే తెలుగు సినిమాలు వరుస పెడుతున్నాయి. ప్రధానంగా స్టార్ హీరోలే యాక్షన్‌పాళ్లు తగ్గించి -ఎమోషన్ స్ట్రోక్ పెంచుతున్నారు. అవును తెలుగులో కుటుంబ కథలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే వరుసగా వస్తున్న కథలతోపాటు -ఈ ఏడాది చివరినాటికి మరిన్ని కుటుంబ కథా చిత్రాలు తెరపై దర్శనమివ్వబోతున్నాయి. =================== ప్రపంచం చిన్నది గురూ! ఎక్కడ మొదలెట్టామో తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటాం -అంటూ చాలా సినిమాల్లో హీరోలు చెప్పే డైలాగులే ఇప్పుడు టాలీవుడ్‌లో నిజం అవుతున్నాయి. భూమి గుండ్రంగా ఉంది కనుక -ప్రయాణం ఎక్కడ మొదలెట్టామో తిరిగి అక్కడికే చేరుకుంటాం. ఇప్పుడు తెలుగు సినిమా కూడా అలాగే ప్రయాణించి -మళ్లీ కుటుంబ కథా చిత్రాలను భుజానికి ఎత్తుకునే చోటుకు చేరుకుంది. నిజానికి -తెలుగు సినిమా ఖ్యాతి బాహుబలితో ఒక్కసారిగా పెరిగింది. దేశం మొత్తం తెలుగు సినిమావైపు చూసే సందర్భం ఆ సినిమాతోనే ఆరంభమైంది. ఈ ఏడాది ప్రథమార్థం అంతంత మాత్రంగానే విజయాలతో నెట్టుకొచ్చిన పరిశ్రమకు -ద్వితీయార్థంలో భారీ అంచనాలతో వచ్చిన బాహుబలి సినిమాతో ఘన విజయం దక్కింది. అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న బాహుబలికి -రాజరికపు కుటుంబ కథే మూలం. ఇక కొద్దిరోజుల క్రితం విడుదలైన మహేష్‌బాబు శ్రీమంతుడూ ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బాహుబలి తరువాత టాలీవుడ్‌లో వంద కోట్ల మార్కెట్ దాటిన సినిమాగా నిలిచింది. తరువాత వెంటనే చిన్న సినిమాగా విడుదలైన ‘సినిమా చూపిస్త మావ’కూ మంచి విజయమే దక్కింది. ఈ విజయాలకు అసలు కారణం -ఇవన్నీ కుటుంబ కథా చిత్రాలే కావడం. ఇలా వరుసగా మూడు హిట్ చిత్రాలతో తెలుగు సినిమా వాతావరణం మారింది. అందుకే ప్రస్తుతం సినిమావాళ్ళ దృష్టి అంతా ఫ్యామిలీ ఆడియన్స్‌పై పడింది. ఇప్పటివరకూ మాస్, యాక్షన్, థ్రిల్లర్, కామెడీ అంటూ ఎన్ని జోనర్లలో సినిమాలు చేసినా, చివరాఖరుకు వారందరికీ నచ్చేది ఫ్యామిలీ జోనరే. హీరోయిజమ్ ఉన్న సినిమాలు, విలనిజంవున్న సినిమాలు, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అనే నేపథ్యాలు ఎన్నివున్నా అన్నింటికీ మూలం ఫ్యామిలీ చిత్రాలే. ఎన్ని వైవిధ్యాలతో చిత్రాలు నిర్మించినా -్ఫ్యమిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే సేఫ్ అని భావిస్తోంది తెలుగు పరిశ్రమ. అందుకోసమే ఇప్పుడు ఫ్యామిలీ కానె్సప్టుతో సినిమాలు రూపొందించడానికి ఆసక్తి చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా దీనికి గట్టి ప్రయత్నాన్ని వేసింది -కొరటాల శివ. కొద్దికాలం క్రితం మిర్చి సినిమాతో కుటుంబ కథా చిత్రాలకు కొత్త అర్థాన్ని చెప్పి, ఆ సినిమాతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాడు. ఇటీవలే శ్రీమంతుడుతో కుటుంబ కథా చిత్రాల జోనరే సేఫ్ అని మరోసారి నిరూపించాడు. శ్రీమంతుడు సినిమాతో ఫ్యామిలీ కథా చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువైంది. ఇప్పుడు యువ హీరోలు కూడా హీరోయిజమ్ వున్న కథల్ని పక్కనపెట్టి కుటుంబ చిత్రాల బాటపట్టారు. అయితే, కొద్దికాలం క్రితంనుంచే పెద్ద హీరోలు సైతం కుటుంబ కథా చిత్రాలపై నమ్మకం పెంచుకోవడం మొదలుపెట్టారు. ఆమధ్య వచ్చిన రామ్‌చరణ్ ‘గోవిందుడు అందరివాడే’ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. అల్లు అర్జున్ కూడా సన్నాఫ్ సత్యమూర్తి చేసి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘నాన్నకు ప్రేమతో’ అంటూ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రెడీ అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. మరోవైపు గోపీచంద్, శర్వానంద్, అల్లరి నరేష్, నాని వంటి హీరోలు సైతం కుటుంబ కథా చిత్రాలు చేసేందుకు ముందుకొస్తున్నారు. అమ్మ.. నాన్న.. అక్కా.. చెల్లి.. అన్నా.. తమ్ముడు.. వంటి అనుబంధాలే కాకుండా కుటుంబ కథా చిత్రాలు అనగానే తెరనిండా నటీనటుల సందడితో పిన్నిలు, బాబాయిలు, అత్తయ్యలు, మామయ్యలు, మరదళ్లు, బావలు వంటి హంగామాతో చూడ్డానికి ఆకట్టుకునేలా ఉంటాయి సినిమాల్లోని కుటుంబాలు. ఇలాంటి నేపథ్యంలో వచ్చే సినిమాల్ని చూడడానికి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఏ నేపథ్యంలో సినిమా అయినా కథే ముఖ్యం. కథానుగుణంగా ఒక్కో దర్శకుడు ఒక్కో శైలితో కుటుంబ కథా చిత్రాలను రూపొందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మహేష్‌బాబు మరోసారి ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మొగుడితో నీరసపడినా మొక్కవోని ధైర్యంతో గోపీచంద్ కూడా తాజా చిత్రంతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ కుటుంబ కథా చిత్రాల నేపథ్యానికి అసలైన కారణం మరొకటుంది. యూత్‌ఫుల్ సినిమాలు అయితే కేవలం యూత్‌ను మాత్రమే ఆకర్షిస్తాయి. మాస్ సినిమాలు పట్ల మహిళా ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిచూపరు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ కథా చిత్రాలంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది కనుక -సినిమాకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో రాబడి, సినిమాకు హిట్టు రేటు పెరుగుతుంది. టీవీ మీడియా, వెబ్ మీడియా హంగామా సృష్టిస్తున్న ఈ రోజుల్లో మహిళా ప్రేక్షకులను థియేటర్ వరకూ రప్పించే ఏకైక మార్గం ఫ్యామిలీ సినిమానే. ఇప్పటికే బాలీవుడ్‌లో కుటుంబ కథా చిత్రాలకు కొదవే లేదు. అప్పట్లో ‘మైనే ప్యార్‌కియా’, ‘హమ్ ఆప్‌కే హై కౌన్’, దిల్‌వాలే దుల్హానియా లేజాయింగే వంటి చిత్రాలు సంచలన విజయం సాధించి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేయి. ఇంకా మరిన్ని సినిమాలూ సిద్ధమవుతున్నాయి. మరికొందరు టాలీవుడ్ హీరోలూ కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు మరి! సో.. రేపటి పొద్దు ఎర్రని తెల్లని రంగులు విదుల్చుకుని పచ్చని పైరుల వంటి కుటుంబాల్లోకి విచ్చుకుంటోందన్న మాట! ఇంకేం.. పాజిటివ్ ఆలోచనలతో కుటుంబ కథా చిత్రాలను చేయాలనుకునే వారికి ఇదే మంచి తరుణం, శుభపరిణామం!


