81 వ సమావేశంగా సరసభారతి నిర్వహించిన ‘’గురు పూజోత్సవం ‘’
సరసభారతి 81వ సమావేశం గా గురుపూజోత్సవం
‘’కృష్ణం వందే జగద్గురుం ‘’అనే శ్రీ కృష్ణ పరమాత్మ జయంతి అయిన శ్రీ కృష్ణాష్టమి ,ప్రాచ్య పాశ్చాత్య వేదాంతానికి వారధి, భారతీయ సంస్కృతికి నిలువెత్తు మూర్తిమత్వం ఉన్న డా సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని 127 వ జయంతి కలిసి ఒకే రోజు 5-9-15 శనివారం రావటం గొప్పఅదృష్టం . ఈ మహత్తరమైన రోజున ఉదయం పదకొండు గంటలకు సరస భారతి ,స్థానిక పరి౦కాయల రామస్వామి మెమోరియల్ జాతీయ కళాశాల సంయుక్తంగా సరసభారతికి అత్యంత ఆప్తులు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా) దంపతుల పూర్తి సౌజన్య సహకారాలతో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నాకు ,మైనేనిగారికి సుమారు 70సంవత్సరాల కిందట ప్రాధమిక విద్య బోధించిన గురువరేణ్యులు ‘’కీ శే కోట సూర్యనారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవం గా ,శ్రీ టి వి ఎస్ బి శాస్త్రి (ఆనంద్)చిత్రించినగురుమూర్తుల వారి చిత్రపటావిష్కరణ’కార్యక్రమాన్ని ఘనం గా, వేడుకగా నిర్వహించాం .సరసభారతికి ఇది 81వసమావేశం .
పరి౦కాయల కాలేజి విద్యార్ధులు రెండు వందల మంది ,సాహిత్య ,సంగీతాభిమానులు సుమారు వంద మంది మొత్తం300మంది తో సమావేశ మందిరం అయిన శ్రీ కన్యకపరమేశ్వరి ఏ. సి .కళ్యాణ మందిరం కళకళ లాడింది .మహిళలు కూడా విశేష సంఖ్యలో హాజరయ్యారు .మొదటగా ‘’మచిలీ పట్నం సోదరీ మణులేమో’’ నని పించే శ్రీమతి సింగ రాజు కల్యాణి ,శ్రీమతి కాళీపట్నపు ఉమ గార్లు గాత్ర సంగీత కచేరి చేశారు .ఇద్దరు సహాయకులు వారికి వాద్య సహకారం అందించారు .ఆ రోజుకున్న ప్రాధాన్యాన్ని పురస్కరించుకొని శ్రీ కృష్ణునిపై, గురువులపై ,గీతాలు గానం చేయటమేకాక విద్యార్ధులకు ప్రబోధ గేయాలు కూడా ఒకగంట సేపు పాడి కచేరీని చాలా రసవత్తరం గా రక్తి కట్టించారు ఇద్దరూ .హర్ష ధ్వానాల అభినందన కరతాళ ధ్వనులతో హాలు మారు మోగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ చేత సరసభారతి -గాయనీ మణులకు నూతన వస్త్రాలు ,శాలువా ,గురుపూజోత్సవ జ్ఞాపిక చెరొక మూడు వేల రూపాయల నగదు చందన పుష్పహార సమేతంగా ఘనంగా సన్మానించి గౌరవించింది . సహకార వాద్యాల వారిద్దరికీ చెరొక వెయ్యి రూపాయలు శాలువా సరసభారతి ప్రచురణలు జ్ఞాపికచందన తాంబూల హారాలతో సత్కరించింది .సరసభారతి అధ్యక్షునిగా నేను మాట్లాడుతూ కల్యాణి ,ఉమా గారాల సౌజన్యంమరువ లేనిదని కోరినవెంటనే అంగీకరించి కచేరి చేయటం వారి పెద్దమనసుకు నిదర్శనమని కల్యాణిగారి కచేరీ తోనే ఆరేళ్ళ క్రితం సరసభారతి మొదటి సమావేశం ప్రారంభమైనదని ఇదంతా ఆమె చేతి చలువయే నని అన్నాను .
తరువాత గురు పూజోత్సవ కార్య క్రమం నా అధ్యక్షతన జరిగింది .ఈ మొత్తం కార్య క్రమానికి శ్రీమైనేని గారు స్పాన్సర్ చేశారని వారి సూచనలు మాత్రమే సరసభారతి అమలు చేస్తోందని దీని క్రెడిట్ అంతా గోపాల కృష్ణ గారిదే నని చెప్పాను. కీ శే .డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి తెలియ జేసి, అంతటి వారి మనవడు ఎనభై ఏళ్ళ ప్రొఫెసర్ రామమోహన రావు (అమెరికా )గారు మైనేని గారిని అభినందిస్తూ ‘’గోపాల కృష్ణా నువ్వు అదృష్ట వంతుడివయ్యా!గురు పూజ చేసి ధన్యుడ వౌతున్నావు’’అని మెయిల్ రాసారని తెలియ జేశా .మొదట హైదరాబాద్ స్టేట్ బాంక్ ఉద్యోగి శ్రీ టి వి ఏఎస్ బి శాస్త్రి (ఆనంద్ )చిత్రించిన శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రిగారి వర్ణ చిత్ర ఆవిష్కరణగౌరవ అతిధి సుప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు ,కేంద్ర సంగీత నాటక అకాడెమి పురస్కారగ్రహీత శ్రీ వేదాంతం రాధేశ్యాం ఆత్మీయ అతిదులైన గురు పుత్రులు ,కోటసోదరులు శ్రీ చంద్ర శేఖర శాస్త్రి ,శ్రీ సీతా రామాంజనేయులు శ్రీ గాయత్రి ప్రసాద్ ,ఆర్టిస్ట్ శ్రీ ఆనంద్ , శ్రీమతి వరలక్ష్మి ,శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ,శ్రీ రావి శివాజీ శ్రీ ఏం. నరసింహారావు గారల సమక్షం లోముఖ్య అతిధి శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు .అతిధులందరూ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి గురు భక్తిని చాటుకొన్నారు .
నేను ‘’నాకూ మైనేనిగారికి సుమారు డెబ్భై ఏళ్ళ క్రితం ప్రాధమిక విద్య నేర్పిన స్వర్గీయ కోట మేస్టారుగారిని మరువ లేదని వారిని నిత్యం స్మరించుకొంటూనే ఉన్నామనీ గుర్తు చేశాను .మైనేని వారి కొన్ని తీపి జ్ఞాపకాలు ‘’మేస్టారి గారింట్లో నేను నా సోదరి భారతీ దేవి చదివాము . రాత్రిళ్ళు అక్కడే పడుకొనే వారం(స్లీప్ ఓవర్) మా ఇంటికి వచ్చి కూడా బోధించారు గురుపత్ని చాలా రుచికరంగా ‘’తోటకూర సెనగ పప్పు పులుసు ‘’ చేసి భోజనం లో ఆప్యాయంగా తిని పించేవారు . మా ఇద్దరినీ తాడంకి హైస్కూల్ లో ఆరవ తరగతి లో మేస్టారే చేర్చారు .నా పేరు గోపాల కృష్ణ గోఖలే అని మా నాన్న గారు నామ కరణం చేశారు. ‘’గోఖలే –ఢోకలే ‘’అని నన్ను ఏడిపించేవారు. ఇదిగామనించిన మేష్టారు ‘’గోపాల కిషన్ ‘’అని రిజిస్టర్ లో రాయించారు .కాని ఎస్ ఎస్ ఎల్ సి సర్టి ఫికేట్ లో గోపాల కృష్ణ అని పడి అదే ఖాయమైంది .మేస్టారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ .బాగా చదివే వాడిని ‘’వెధవ ‘’అంటే వెయ్యేళ్ళు ధనధాన్యాలతో వర్ధిల్లు అని దీవించేవారు. అల్లరి పిల్లల్ని ‘’వెదవ ‘’అంటే వెయ్యేళ్ళు దరిద్రం తో వర్ధిల్లు అని అనేవారు .అనుమానం వాడికి ‘’అదేదో అయిదు చోట్ల అంటు కుంది రా ‘’అని నన్ను అనేవారు .మేస్టార్ని మర్చి పోవటం అసాధ్యం .ఈ స్తితిలొ నేను నా కుటుంబం ఉన్నది అంటే మేష్టారు పెట్టిన అక్షర భిక్ష యే కారణం ‘.అందుకే మా గురుపుత్రులదంపతులను, వారి బంధువులను గురు పూజోత్సవం నాడు ఘనం గా సత్కరించాలని శ్రీ దుర్గా ప్రసాద్ గారి తో చెప్పాను. వారి అంగీకారం తో వారబ్బాయి రమణ సహకారం తో ఈ కార్య క్రమం ఇంత బాగా జరుపుతున్నాం ఇది .గురువు ఋణం తీర్చుకోవటమే తప్ప ప్రచార ఆర్భాటం కాదు భవిష్యత్తు తరాలకు తెలియాలని స్పూర్తి పొందాలని సవినయం గా చేస్తున్న కార్య క్రమం .దీనిలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు అందజేస్స్తున్నాను .గురు ఋణం తీర్చుకోలేనిది .’’అని నాకు రాసిన మెయిల్ లోని విషయాలను సభా ముఖం గా నేను తెలియ జేశాను .
నాకు అక్షరా భ్యాసం చేసింది కోట మాస్టారేనని ,మా ఇంటికి దక్షిణాన మూడవ ఇంట్లో ఉండేవారని ,నేను మారాం చేసి బడికి వెళ్ళాక పొతే మేస్టారే మా ఇంటికి వచ్చి బుజ్జగించి తీసుకు వెళ్ళేవారని వారు మా నాన్నగారి శిష్యులని చెప్పాను .భారత దేశం వదిలి అర్ధ శతాబ్దం అయినా గోపాల కృష్ణ గారికి ఉయ్యూరు తో అనుబంధం ఇంకా ఉంచుకొన్న మనీషి ఎన్నో కార్యక్రమాలు సరసభారతి ద్వారా చేయిస్తున్నారు .వారి ఆత్మీయత మరువలేనిది అన్నాను . తరువాతకోట సోదరులలో పెద్దవారు శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి గారు(హైదరాబాద్ ) తమ తండ్రిగారి శిక్షణ తమను ఉన్నత విద్యా వంతులనుగా ఉన్నతోద్యోగులనుగా చేసిందని వారి పుత్రప్రేమకు హద్దు లేదని జ్ఞాపకం చేసుకొన్నారు .శ్రీ సీతా రామాంజనేయులు గారు(గుడివాడ) తమ తలిదండ్రుల చలువతో ఎదిగిన వాళ్ళం మేము .వారు మా మనసులలో నిలిచి ఉన్నారన్నారు .శ్రీ గాయత్రి ప్రసాద్ (నిజామాబాద్ )తండ్రిగారిని మనసారా స్మరించి కృతజ్ఞతలు తెలియ జేసుకొన్నారు .
గౌరవ అతిధి శ్రీ రాధేశ్యాం ఆంగికాభినయం తో అద్భుత ప్రసంగం చేశారు. సంగీతం నాట్యం నేర్చుకొంటే ఆరోగ్యానికీ బుద్ధి వికాసానికి ఉపయోగపడుతుందని కావలసిన వారికి ఉచితంగా నేర్పిస్తానని ఏ సాహిత్య సంస్థ తనను గుర్తించలేదని సరసభారతి వారు ఆహ్వానించి సత్కరించాలను కోవటం మర్చిపోలేని విషయమనీ అన్నారు .
శ్రీ రాజేంద్ర ప్రసాద్ ‘’దుర్గాప్రసాద్ మాస్టారు మైనేని వారి సహకారం తో పరింకాయల కాలేజి తో కలిసి ఇంత ఘనమైన గురు పూజోత్సవం జరపటం అభినందనీయం .న్ని విద్యార్ధులు గుర్తించి అనుసరించాలి .ఉయ్యూరు మహా మేధావులు కాకాని వంటి రాజకీయ దురంధరులకు ,సూరి రామం వంటి గోవా వీరులకు ,కొలచల సీతా రామయ్య గారి వంటి శాస్త్ర వేత్తలలకు ఎందరో కవులకు కళాకారులకు నిలయం అన్నారు.
నేను మాట్లాడుతూ ఇంటర్ నెట్ లో నేను రాసిన ‘’కేమటాలజి పిత కొలచల సీతా రామయ్య –పుల్లేరు నుండి వోల్గా వరకు ‘’అనేదాన్ని పుస్తక రూపం లోకి తీసుకు రావటానికి స్పాన్సర్ గా శ్రీరాజేంద్ర ముందుకు వచ్చారని దీనికి సరసబారతి తరఫున కృతజ్ఞతలు అని చెప్పగానే హర్ష ధ్వానాలతో హాలు దద్దరిల్లింది .ఇది సరసభారతి ప్రచురించే 18 పుస్తకం, నేను రాసిన 12 పుస్తకం అవుతుందని తెలియ జేశాను .ఈ బాధ్యత మా అబ్బాయి రమణ మీద వేస్తున్నాను అన్నాను .శ్రీమతి వరలక్ష్మి ,శ్రీ శివాజీ శ్రీ నరసింహా రావు గార్లు క్లుప్తంగా మాట్లాడాక, శ్రీమతి శ్యామలాదేవి గానం తో సభ సమాప్తమైనది .
పిమ్మట అతిధులకు ఆత్మీయ సత్కారం జరిగింది .శ్రీ కోట సోదరులకు దంపతులతో సహా నూతన వస్త్రాలు ,శాలువా జ్ఞాపిక చందన తాంబూలాలతో నేనూ మా శ్రీమతి శ్రీమతి ప్రభావతి శ్రీ రాజేంద్ర సహకారం తో ఘనంగా నిర్వహించాం .గురుపుత్రుల ఆచూకీ తెలిపిన శ్రీ కోట సీతా రామ శాస్త్రి గారి దంపతులకు ఇదే విధంగా సత్కారం చేశాం కోట వారి మనవడు మనవ రాలికి, వారి బంధువులకు ఈవిద మైన సన్మానమే చేసి సంతో షిం చాం తరువాత శ్రీ రాధేశ్యాం గారి సన్మానం రెండు వేల రూపాయల నగదు ,నూతన వస్త్రాలు ,శాలువా జ్ఞాపిక ,సరస భారతి పుస్తకాలు చందన తాంబూలాలు అందజేసి సత్కరించాం రాధేశ్యాం గారి విద్య ఉద్యోగం సన్మానాలు మొదలైన వివరాలను నేనే తెలియ జేశాను అందరికి ..గురువు గారి చిత్రపట చిత్రకారుడు శ్రీ ఆనంద్ దంపతులను పై విధంగానే (నగదు లేకుండా)సన్మానిం చాం ఈ సందర్భం గా నేను మాట్లాడుతూ ‘’ఆనంద్ మా బావ మరది .హైదరాబాద్ స్టేట్ బాంక్ ఉద్యోగి .ఎన్నో చిత్రాలు గీసి పేరు పొందిన ఆర్టిస్ట్ .చాలా చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించాడు .నేను మైనేనిగారు అడగ గానే కోట మాస్టారి చిత్రపటాన్ని వేయ టానికి అంగీకరించి ,దానికి ప్రతి ఫలం తనకు వద్దని ఈ పవిత్ర కార్యం లో తానూ ఒకడి నవుతున్న సంతృప్తిని ఇవ్వమని చెప్పిన సౌజన్యుడని చిత్రం గీసి ఫ్రేం కట్టించి వాళ్ళబ్బాయి వంశీతో సహా హైదరాబాద్ నుండి ఉయ్యూరు వచ్చి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశాడు అని చెప్పాను .
తరువాత ముఖ్య అతిధిశ్రీ రాజేంద్ర ప్రసాద్ కు చందాన తాంబూలాలు పుష్పహారం ఆయనకు భార్యకు నూతన వస్త్రాలు శాలువా ,జ్ఞాపిక అందజేసి అందరం ఘనం గా సన్మాననించాం.తర్వాత శ్రీమతి వరలక్ష్మి దంపతులను శాలువ జ్ఞాపిక తోను ,శ్రీ శివాజీ శ్రీ నరసింహా రావు దంపతులను శాలువా జ్ఞాపిక సరసభారతి పుస్తకాలు అందజేసి సత్కరించాం .మా అబ్బాయి రమణ దంపతులకు మైనేని వారి ఆదేశం తో నూతన వస్త్రాలు శాలువా ,జ్ఞాపక చందన తాంబూలాలతో శ్రీ రాజేంద్ర ప్రసాద్ చేత సత్కరింప జేశాం .తరువాత పై విధంగానే మా దంపతులకు మైనేని వారి సత్కారం రాజేంద్ర చేయగా ,ఆనంద్ ,రాజేంద్ర మొదలైనవారు శాలువాలతో సన్మానించారు . ఆనంద్ తన ఉయ్యూరు హైస్కూల్ లెక్కల మేష్టారు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రిగారిని శాలువాతో సన్మానించాడు . శ్రీ మైనేని గోపాల కృష్ణ దంపతులు ఏర్పాటు చేసినపేద ప్రతిభ గల విద్యార్ధికి ‘’కీ శే కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక నగదు పురస్కారం ‘’ను శాంతి నికేతన్ లో పదవ తరగతి విద్యార్ధి ఛి గేదల మనోజ్ కుమార్ కు 10,000 రూపాయలు ,పెన్ సెట్ ,సరసభారతి గ్రంధాలు జ్ఞాపిక తో సహా శ్రీ రాజేంద్ర చేతులమీదుగా అంద జేయిం చాం .అలాగే ఆయన ద్వారానే పరి౦కాయల కాలేజి ఇంటర్ మొదటిసంవత్సరంవిద్యార్ధిని ఛి ఆరేపల్లి దీపికకు 10,000రూపాయలు పెన్ సెట్ జ్ఞాపిక ,పుస్తకాలు అందజేయి౦ఛాం .మా గురు పుత్రులు శ్రీ కోట సోదరులు తమ తండ్రిగారి జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన స్మారక నగదు బహుమతి 10 , 000రూపాయలు ఉయ్యూరు సిద్ధార్ధ కాలేజి లో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న పేద ప్రతిభ గల విద్యార్ధిని ఛి.అంబటిపూడి మోనికా భవానికి శ్రీ కోటసోదరులు తమ చేతులమీదుగా అంద జేశారు .ఈ సందర్భం గా సోదరులు ఈ నగదు బహుమతిని ప్రతి ఏడాది ఇస్తామని హర్ష ధ్వానాల మధ్య తెలియ జేశారు .
సరస భారతి నిర్వహణకు ప్రోత్సాహం గా గురజాడ కు చెందిన శ్రీ వీణెం గోపాల కృష్ణ గారు సభా ముఖం గా 1,116రూపాయలు అందజేయగా కృతజ్ఞతలు తెల్పుకొన్నాను .
సభానిర్వహణను ఆద్యంతం నేర్పుగా సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి నిర్వహించగా సాంకేతిక సహకారం శ్రీ వీర రమాచనేని బాలగంగాధర రావు అందించారు .సరసభారతి కార్య వర్గ సభ్యుల సహకారం ఎన్నదిగినదే .
ఉదయం అందరికి టిఫిన్ కాఫీ లు ,కార్యక్రమానంతరం అందరికి విందు ఏర్పాటు చేశాం .విద్యార్ధులందరికీ స్వీటు హాటు పొట్లాలు అందజేయి౦ చాం .ఈ ఆర్య క్రమం ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారు చూడ టానికి వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయించాం .
సుమారు మూడు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమం విజయ వంతం కావటానికి ముఖ్య కారణం పాల్గొన్నకాలేజీ విద్యార్ధినీ విద్యా ర్దుల సహన౦ , సహకారం క్రమ శిక్షణ .వారి లెక్చరర్ల పర్య వేక్షణ .వారి వలననే ఇంత దిగ్విజయమైఁన దని సభా ముఖం గా నేను తెలి
య జేశాను .
శ్రీ కోట సోదరులుదంపత్యుక్తంగా బంధు మిత్రులతో తరలిరావటం ఎంతో హృద్యంగా నిండుగా ఉండి మాకు, గోపాలకృష్ణ గారికి పరమ సంతోష కారణ మైంది .వారన్దరూ కార్య క్రమం జరిగిన తీరు ,వారి పట్ల కనబరచిన గౌరవ ఆత్మీయతలకు పరవశించి ఎంతోమురిసిపోయి చాలాసార్లు కృతజ్ఞతలు తెలియ జేశారు అది వారి సౌజన్య సంస్కారమే . మైనేనిగారి కోరిక ఏంతో ఘనం గా తీరి అందరికి సంతోషాన్ని సంతృప్తిని కలిగించింది .వారి సహృదయత అలాంటిది .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -6-9-15 –ఉయ్యూరు

