డా .వెంకటేశ్వర గారి ‘’మధ్యాక్కరలు ‘’
చెన్నైలో ఉంటూ ఆ నగర జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తూ ఏది రాసినా దానిపై ఉన్నమక్కువను తెలియ జేసుకొంటూ తెలుగును జీవి౦పజేస్తూ వ్రుత్తి వేరే అయినా ప్రవృత్తిగా సాహిత్యాన్ని ఎంచుకొని అరుదైన రచనలు తెలుగులో చేస్తున్న డా ఉప్పలధడియం వెంకటేశ్వర్లు సరసభారతికి ఆత్మీయులే . వారు ఇటీవలే అరుదైన తెలుగు దేశీ ఛందస్సు ‘’మధ్యాక్కరలు ‘’లో శతకం రాసి 2015లో వెలువ రించారు .అందులోని నాకు తెలిసిన సొబగులను మీకు అందజేస్తున్నాను .
సాధారణం గా కవికి అక్కర వస్తేనే మధ్యాక్కరలు జోలికి పోతాడు .లేక పొతేపోరు . చాలామంది తెలుగు కవులు దాని జోలికి పోలేదు .ఒక వేళ రాసినా కొద్దిమంది మాత్రమె రాశారు. విశ్వనాధ సత్యనారాయణ గారు మాత్రం మధ్యాక్కర శతకాలు పది రాశారు అంటే 1,010.మధ్యాక్కరలు రాశారు . కల్పవృక్షం లో దాదాపు ౩౦౦మధ్యాక్కరాలతో సన్నివేశ అక్కర తీర్చారు .ఆదికవి నన్నయ గారు 39 రాస్తే ఎర్రాప్రగడ ఒకదానికే పరిమితమైతే తిక్కన గారు ఆ చాయలకే పోలేదు .తర్వాత తుమ్మల ,నాయని ఆరుద్ర ,సుప్రసన్న ,మొదలైన వారు తలో శతకం కాని కొన్నిపద్యాలు కాని సంతరించారు .అలాంటి ‘’నన్ను ముట్టుకోకు ‘’అన్న మధ్యాక్కరలపై వెంకటేశ్వర కు మోజు కలిగి శ్రీమతి ప్రోత్సాహం తో తన అనుభవాలను ఈ దేశీ ఛందస్సులో చెప్పాలని తపించి ఆ తపనకు అక్షర రూపం కల్పించి సరస్వతీ కంఠా భరణం చేశారు. .
ఈ దేశీ ఛందస్సులో ఆధ్యాత్మికమే కాక ఇతర భావాలనూ చెప్పటానికి అణుమాత్రం సందేహం లేదన్నారు మొదటి పద్యం లో .తాను పాటించిన నియమాలను వివరించారు .తెలుగు ఛందస్సులోని సొగసును దర్శింప జేయటమే తన ఆదర్శం అన్నారు .’’దేహంబు ఉండు నందాక దాహంబు తీరదట’’.సామాన్య మానవ జీవిత విశేషాలనుఈ అసామాన్య ఛందస్సులో అతి సునాయాసంగా చెప్పటం ఉప్పలధడియం వారి గొప్పతనం .ఒకరకం గా పప్పు దప్పళం .
‘’భారత రామాయణాది ప్రాచీన వాజ్మయ మందు –నేరము లేన్నుత కంటే తిరముగా నిజ విద్య మెరయ –చారు కృతుల్ వెలయించు టే౦తేని సత్కార్య మగును –పేరిమి కల్గునే ప్రుద్విని పెదవి విరుపుల చేత ‘’అని చక్కని జాతీయం తో చీకటిని తిట్ట్టు కుంటూ కూచోకుండా చిరు దీపం వెలిగించాలని చెప్పారు .సిద్ధాంతాలు వల్లిన్చేవాడి చేత హుళక్కి . రాద్ధాంతాలు చేసేవాడి రాణ కూడా అంతే .పధ్ధతి లేని మనుషులలో ఔచిత్యం ఉండదు అంటారు .కూరలు కొందామని వెడితే కొబ్బరి కూడా కాటా లో పెట్టి తూచటం చూసి ఔరా అనుకొన్నారు .మరో అందమైన మధ్యాక్కర ముక్కెర –
‘’గగన మండలమెల్ల క్రమ్ముకొన్నవి కారు చీకటులు –అగణిత సంఖ్యలో తారలగుపించే ,నన్నింటి నడుమ –నిగనిగ మని కళ లొలుకుచు౦డెను నిండు జాబిల్లి –తెగిన పూసల దండ వోలె ,నందలి దివ్యమణి వలె’’.
‘’పెట్రోలు ఖర్చులు తగ్గు ననెడి అభిప్రాయ మెసగ –మెట్రో కు స్వాగతం ‘’పలికాడు కవి .కాని నగా నట్రా అమ్మితే కాని అణువు మాత్రం స్థలం కూడా రావటం లేదు .ఇదీ ‘’మెట్రోలియం ‘’గాధ .మద్రాస్ మహానగరం లో మానవాక్రుతులు కవికి ‘’సింహ శరభోర గేంద్ర శార్దూల –మద గజా కీర్ణంబు’’గా ఉన్దికనుక సామాన్య జనం జాగ్రత్తగా మసలాలి అని హెచ్చరించారు నన్నయ్యగారి భాషలో .’’రాయల వారు ‘’అనే మాట కర్ణాలకు తాకితే కవి కి శరీరం పులకి౦చి .పోతుందట . హృదయం రసజ్ఞత పొందుతుందట .రణ గోణ ధ్వనులతో కంపించిపోయే మద్రాస్ మహానగరం లో టి నగర్ ,మైలాపూర్ లు శ్రావ్య సంగీతం వినిపిస్తూ ఘనమైన సంప్రదాయాన్ని పాదు కోనేట్లు చేస్తున్నాయి .స్వర గంగలో మునకలు వేయిస్తున్నాయని మెచ్చుకొన్నారు .దక్షిణాది తెలుగును ఈసడించేవారికి చెంప దెబ్బలాగా గా
‘’దక్షిణాది తెలుగు వారి మాటల తరహాయే వేరు –లక్షణో పేతమ్ము కాదనుచు బుదులా పలుకులకు –ఆక్షేపణల్ తెలప వచ్చుగాని శతాబ్దాలుగా పరి –రక్షించు కొనినారు భాష ననుచు వారల మెచ్చవలదే ? ఇది అక్షర సత్యం స్వాభిమానం తో తెలుగును ఇంట్లో మాట్లాడుకొంటూ ,తమిళం పెత్తనాన్ని సహిస్తూ తెలుగు భాషను ప్రాణ ప్రదంగా కాపాడు కొంటున్న దక్షినాది తెలుగు వారికి జేజేలు .వారి సంకల్ప దీక్షకు అభినందనలు .
‘’రేవు ‘’అనే మాట మరుగై పోయి ;;పోర్ట్ ‘’అనే ఆంగ్ల పదమే విరివిగా వాడుకలో ఉండటం ఆంగ్లాను రక్తిఏ కాని భాషాభిమానం కాదని బాధ పడ్డారు .
‘’మౌలికమైన భావనల వ్రాసితి మధ్యాక్కరలను –శ్రీలు పొంగెడు తెల్గు సౌష్ట వమ్మున చెలగు కృతి యని –మేలిమి బుధులు ,భాషాభిమానులు మెచ్చిన నదియె –చాలును ,పది వేలటంచు నే నాత్మ సంతృప్తి గొనుదు’’ అని ఏంతో వినయంగా చెప్పారు మధ్యాక్కరకవి వెంకటేశ్వర .దాక్షిణాత్యకవుల కృతులను వారిని కీర్తిస్తూ కవి
‘’లాక్షణికుల మెచ్చు వెంకట సుకవి ,లాఘవ మొప్ప-అక్షయంబగు దివ్య కృతులు పలికిన అల త్యాగ రాజు –దక్షిణ ప్రాంతపు కవుల వార సత్వము నిల్పు కొరకు –అక్షరార్చన సేతు నష్ట దిక్పరి వ్యాప్తాంద్రి కేను ‘’అని హృదయ పూర్వక అంజలి ఘటించారు .చెన్నైలో ప్రముఖ తెలుగు సంస్థలు ‘’వేద విజ్ఞాన వేదిక ,ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించే ‘’తర తరాల తెలుగు కవిత ‘’ప్రసంగాలకు గొప్పగా స్పందించారు .పూర్వం రోజుల్లోనే కాదు ‘’నేటికిని చెన్న పట్టణమందు –కైతలు నవలలు ,కధలు వ్రాయు దిగ్దంతులు గలరు ‘’అని చాటి చెప్పారు .
‘’జీవన సన్న వేశములు కొన్నింటి చిత్రించినాను –భావము ,భాష ఇత్యాదిగా దీని పరికించి బుధులు –చేవగల క్రుతియో కాదో నిర్ణ యించెదరు ,తెలుగునకు –నా వంతుగా నొక కొన్ని పద్యాల నర్పించు చుంటి ‘’అని శతకాన్ని ముగించారు .దీన్ని చదివి బేరీజు వేసి నిగ్గు తేల్చమని కవి గారి కోరిక .పండితులు ఆపనికి పూనుకోవాలని నా విజ్ఞప్తి .
సాహసంగా మధ్యాక్కరలను మాధ్యమం గా గ్రహించి చక్కని తేట తెలుగు పదాలతో ఈ శతకం కూర్చిన శ్రీ వెంకటేశ్వరకు హార్దిక అభినందనలు .ప్రోత్సహించిన వారి అర్ధాంగి శ్రీ మతి ఉష గారికి శుభాశీస్సులు .అంకితం పొందిన శ్రీ విద్వాన్ ఎస్ దశరధ రామ రెడ్డి గారు ధన్యులు .
ముచ్చ్చటైన తెలుగు తల్లి వర్ణ ముఖ చిత్రం తో అచ్చు తప్పులు లేని అక్కరాల మధ్యాక్కరలు చూపులకే కాదు మనసుకూ ఆహ్లాదం కలిగిస్తాయి .ఆస్వాదించి కవిని అభినందించండి .స్కాన్ చేసిన పుస్తకం కవర్ పేజీలు జత చేశాను చూడండి .
‘’అమూల్యం ‘’అయిన ఈ పుస్తక ప్రాప్తి స్థానం
General secretary
Janani (social and cultural Academy )
13/53 second street ,Vasuki nagar
Kodungaiyur ,Chennai -600,1118
Phone -044-25541 572
మీ-గబ్బట దుర్గా ప్రసాద్

