గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 411-గాన కళా పూర్ణ -శ్రీ నల్లాన్ చక్ర వర్తుల కృష్ణమాచార్యులు

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3

411-గాన కళా పూర్ణ -శ్రీ నల్లాన్ చక్ర వర్తుల కృష్ణమాచార్యులు

15-9-1923 కృష్ణాజిల్లా జగ్గయ్య పేటలో వైష్ణవ కుటుంబం లో శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణ మాచార్యులు జన్మించారు .బాల్యం లోనే సంస్కృతాంధ్రాలలో ప్రావీణ్యం సంపాదించి సంగీతం లో ప్రవేశించారు .పారు పల్లి రామ క్రిష్నయ్య పంతులుగారి వద్ద గురుకులాభ్యాసం లో సంగీతం అభ్యసించి ప్రసిద్ధి చెందారు .పంతులుగారి వద్ద విద్య నేర్చి ప్రసిద్ధులైన వారిలో శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ ,శ్రీ అన్నవరపు రామస్వామి వంటి ఉద్ద్దండులున్నారు 1948లో విజయవాడ ఆకాశ వాణి ప్రారంభమయినప్పుడే వయోలిన్ విద్వాంసునిగా చేరారు .35ఏళ్ళు ఉద్యోగించి 1983లో పదవీ విరమణ చేశారు .వయోలిన్ లో టాప్ ఆర్టిస్ట్ గా గొప్ప పేరు .స్వీయ రచనలలో ,హరికదాగానం లో ప్రసిద్ధులు .ఆంధ్రప్రదేశ్ అకాడెమి వీరి విద్వత్తుకు ‘’గానకళా ప్రపూర్ణ ‘’బిరుదు నిచ్చి సత్కరించింది .’’సంగీత సాహిత్య కళానిధి ,కళాసాగర,‘’హరికధా చూడామణి ‘’ఇతర బిరుదులు. ..వీరి సప్తతిమహోత్సవాన్ని శిష్యులు 1995అక్టోబర్ లో బెజవాడలో ఘనం గా నిర్వహించారు .విజయ వాడ రేడియో స్వర్ణోత్సవాలలో 1998లో వీరికి ప్రత్యెక గుర్తింపు నిచ్చి సన్మానించారు .

 

త్యాగ రాజ స్వామి శిష్యపరంపరలో అయిదవ తరం వారు

వీరు త్యాగరాజస్వామి వారి శిష్యులలో అయిదవ  తరం వారు కావటం విశేషం .ఆ వరుస ఇది –త్యాగయ్య ,మనుబూచవాదివెంకటసుబ్బయ్యర్ ,సుసర్ల దక్షిణా మూర్తి ,పారుపల్లి రామ కృష్ణయ్య య్య, నల్లాన్ చక్ర వర్తుల కృష్ణ మా చార్యులు .

రచనలు

.’’బిడాల మోక్షం ‘’అనే ప్రహసనం రాసి నవ్వులు పూయించారు .’’త్యాగ రాయ చరితం, పరకాల విలాసం  శ్రీ నృసింహ తాడనం తెలుగులో రాశారు .సంస్కృతం లో’’నౌకా చరితం శఠగోప చరితం ,భూ ప్రశంస,చంద్ర కళా షోడశి ,’’ రచించారు . ‘ నౌకా చరితం త్యాగయ్య తెలుగు కృతికి సంస్స్క్రుతానువాదం    .

ఆచార్యుల వారి సంస్కృత కృతులు

కర్నాటక సంగీతం లో కొత్త కీర్తనలు రాయాల్సిన అవసరం లేదని సంగీత త్రిమూర్తులు రాసిన అమూల్య రత్నాల వంటి కీర్తనలలో కొన్ని నేర్చుకొని పాడటానికే జీవితం సరిపోదని ద్రుఢంగా నమ్మారు .కాని అభిమానుల కోరికపై ఇరవై స్వంత కృతులు వర్ణాలు తిల్లా నాలు  రాశారు .ఇందులో కొన్ని అపూర్వరాగాలలో చేశారు .సంస్కృతాంధ్రాలలో అపార ప్రజ్ఞావంతులు కనుక దేనికీ వెతుక్కోవాల్సిన అవసరం ఉండేదికాదు .సంస్కృతం లో శుద్ధ అభంగ రాగం లో ‘’వర్ణం ‘’అనే వర్ణాన్ని ,వసంత రాగం లో ‘’గౌరీ సుకుమారి శంకర నారి కృతిని ,’’మారాజననిం ఆశ్రాయే ‘’కృతిని నాట రాగం లో ,కల్యాణి రాగం లో ‘’శ్రీ కనక దుర్గే కృతిని ,’’ గజవదన మాశ్రయే ‘’కృతిని కేదార రాగం లోను మొదలైనవి రచించారు .

వీరి కుమారుడు స్వర్గీయ జగన్నాధా చార్యులు పేరుమోసిన సంగీత విద్వాంసుడు .క్రిష్ణమాచార్యులుగారు 2006లో ఎనభై మూడవ ఏట పరమ పదించారు .

కృష్ణమాచార్యుల సంస్కృత రచనా సౌభాగ్యం

కృష్ణమాచార్యుల వారి సంస్కృత రచనలలో ‘’మృత సంజీవనం ‘’అనే ఏడు అంకాల నాటకం విశిష్టమైనది అన్నారు పాల పర్తివారు .భారతం లోని కచ దేవయాని కధను ,మృత సంజీవినీ విద్యనూ గ్రహించి సలక్షణ నాటకం గా తీర్చి దిద్దారు .సంగీత విద్వా౦సు లుకనుక కచ దేవయానుల మధ్య సంగీత చర్చను ప్రవేశ పెట్టారు .చివరి అంకం లో శుక్రాచార్యులవారు ‘’మృత సంజీవిని ‘’కి ఇచ్చిన వివరణ మహాద్భుతంగా ఉండి,నాటకాన్ని చిరస్థాయి చేసింది .

‘’ధర్మః సత్యం దయా శౌచం నీతిః ప్రీతిః మృతా ఇవ-తేషాం సంజీవనే సర్వే స్పృహ యంతాం మనీషిణః ‘’

మద్య పాన నిషేధానికి శుక్రాచార్యులు చెప్పిన కారణం మరీ బాగుంది –

‘’బుద్దేర్మోహ కరం ,విపత్పరికరం సత్కీర్తి నాశంకరం –మాన ప్రాణ హరం ,దశేంద్రియ గుణ గ్రామ ప్రభా తస్కరం

విధ్వంస కరం ,భ్రమణ యుగవత్ త్రైలోక్య సాక్షాత్కారం –శ్రితా రోద్య నిషిధ్యతే ఖలు సురాపానం మయా సర్వతః ‘’

ఈ నాటకం లో ఆచార్యశ్రీ కల్పించిన సన్నివేశాలు సంభాషణలు రసవంతం గా ఉన్నాయి .వీరి’’ చంద్రకళాశోడశి ‘’లో నుంచి ఒక శ్లోకం మచ్చుకి –‘’చంద్రేస్వతే నభసి సాదు విరాజ మానే –శ్రేయః కిమన్యకర దీప వలంబనేన –దోషా కరోస్తూ –ద్రస్టేతస్య గుణ దోష గణాన్వ్యసక్తు’’

ఆహార్యులవారు సంస్కృతం లో హరికధలు చెబుతూ భారత దేశమంతటా పర్యటించి రికార్డు సృష్టించారు .విజయ వాడ రేడియో కేంద్రం నుండి సంస్కృత హరి కదా చెబుతూ అధికారులను ‘’రామ చంద్ర సమారబ్దా ,వీర భాద్రాభి వర్దితా –రజనీ కాంత విక్రాన్తా ‘’నభో వాణీ ‘’విరాజతే ‘’అని శ్లాఘించారు .

సంస్క్రుతం ,తెలుగులలో లెక్కకు మించి అవధానాలు చేసిన ఘనులు ఆచార్యులవారు .

.

సశేషం

మరో కవితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.