ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -92
40-పోస్ట్ ఇంప్రెషనిస్ట్ పెయింటర్ హెన్రి డీ టోలోసే లాట్రే(Henri de Toulouse –Lautrec)
అంగవికల ఆరిస్టోక్రాట్ ,ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ ,వెలివేయబడిన వారితో ఆటలతో ,మార్పు చెందిన మాల్ ఫార్మేడ్ సొసైటీ తో గడిపే హెన్రి డీ టోలోసే లాట్రే24-11-1864న ఫ్రాన్స్ లోని అల్బి లో పుట్టాడు .తండ్రి కౌంట్ ఆల్ఫాన్సే స్వంత కజిన్ ఎడిలే ను పెళ్లి చేసుకొన్నాడు .తండ్రి ది విపరీత ధోరణి .ఒకతెల్ల ఆడ గుర్రాన్నిఎక్కి పారిషియన్ పార్కులన్నీ చుడుతూ ,దిగి దాని పాలు పిండుకొని తాగాడు .గర్విష్టి,తారుమారుగా మాట్లాడేవాడు .పల్లెటూర్లన్నీ తిరుగుతూ తనతో బాటు ఒక డేగ (హాక్ )ను కూడా తీసుకు వెళ్లి దారిలో జంతువుల్ని చంపి దానికి ఆహారంగా పెడుతూ తిరిగాడు .గతం లోనే ఎప్పుడూ జీవిస్తూ రేసింగ్ ఇష్టపడుతూ ,ఆధునిక ప్రపంచాన్ని ముఖ్యంగా మోడరన్ ఆర్ట్ ను ఏవగించు కొంటూ గడిపాడు .దీనికి విరుద్ధమైనది అతని భార్య .ప్రశాంతంగా పవిత్ర హృదయం తో ఉండేది .మతసంబంధ జీవితాన్ని గడిపేది .బాగా చదువుకున్న సంస్కారం ఉన్న యువతి .సంస్కారాభివ్రుద్ధి కోరుకొనే ఇల్లాలు .పెళ్లి అయిన తర్వాత చాలా ఏళ్ళు ఈ దంపతులు విడిగానే జీవించారు .తనకీ తన భార్యకీ మధ్య దగ్గర సంబంధం ఉండటం వలన రక్తాలు కలవక పోవటం వలన తన కొడుక్కి అంగ వైకల్యం వచ్చిందని నమ్మేవాడు కౌంట్ .అందుకే భార్యను దూరం గా ఉంచాడు .
తల్లిలాగానే కొడుకు హెన్రి కూడా చాలా సున్నితంగా మంచి ప్రవర్తనతో ఉండి తల్లి అంటే అమిత ప్రేమ చూపేవాడు .ఒకే ఒక్క సోదరుడు పసితనం లోనే చనిపోయాడు .హెన్రి మూడవ ఏట క్రైస్తవం లో చేర్చే ఉత్సవం లో అక్కడ చర్చి లో ఉన్న పుస్తకం లో పెద్దవాళ్ళు సంతకాలు చేస్తుంటే తానూ చేస్తానని మారాం చేశాడు .’’నీకు చదువురాదు కదా రాయలేవు ‘’అని అంటే ‘’అదినాకు తెలుసు కాని ఒక ఎద్దు బొమ్మ గీయగలను ‘’అని సమాధానం చెప్పాడు .అతని బాల్యం అలీబి కోట లోను పారిస్ లోను గడిచింది .పారిస్ లో లిసీ కండోర్సెట్ లో చదువుకు చేరాడు .బాగా చదివేవాడు .త్వరగా అన్నీ నేర్చేవాడు .స్నేహితులతో కలిసేవాడు బొమ్మలు బాగా వేసేవాడు .గుర్రాలు జంతువులను పరిశీలించి వాటి బొమ్మలను లెక్కలేనన్ని చిత్రించాడు .తనలాగే కొడుకు హార్స్ మాన్ గా స్పోర్ట్స్ మాన్ గా తయారవ్వాలని తండ్రి కోరిక .
11వ ఏట హెన్రి కోట లైబ్రరీలో పాలిష్డ్ నేలమీద పడిపోయాడు .దురదృస్ట వశాత్తు తుంటి ఎముక విరిగింది .అది అతుక్కోవటానికి చాలా కాలం పట్టింది .క్రచేస్ సహాయం తో తల్లితో వాకింగ్ చేసేవాడు .మళ్ళీ అదృష్టం కలిసిరాక ఒక క్రచెస్ జారిపోయి వీధిలో పడిపోయి రెండో కాలి తుంటి ఎముకా విరిగింది .అప్పటికి 15ఏళ్ళు మాత్రమె .తర్వాత రెండేళ్ళు దేనికీ పనికి రాకుండా పోయాడు .ఇక తన కాళ్ళు సరికావని ,తానిక నడవ లేనని కు౦గి పోయాడు .కుంచించుకు ఉండిపోవాల్సి వచ్చింది .కాళ్ళు పెరగటం ఆగిపోయాయి .మిగతా శరీరభాగ మంతా పరిపక్వమైంది .మొండెం బాగానే పెరిగింది .తలమాత్రం మిగిలిన శరీరం కంటే ఎక్కువగా పెరిగింది .కాళ్ళు మాత్రం మరు గుజ్జు వైనాయి .యవ్వన ప్రాదుర్భావం లో సర్వాంగ సుందరంగా వికసించాల్సిన వాడు చాలా వికారంగా వికృతంగా అయ్యాడు .ముక్కు పెద్ద బల్బు లాతయారైంది .పెదిమలు బండగా ముతకగా బాగా ఎర్రగా అయ్యాయి .మూతి చిన్న నల్ల గడ్డం తో ఉండేది . ఎత్తు నాలుగు అడుగులకు కొద్దిగా ఎక్కువ .పెరిగిన వయసులో మొండెం ,ఆ చిన్ని కాళ్ళమీద చూస్తుంటే చూడటానికి భయంకరంగా ,అసహ్యకరంగా ఉండేది పాపం .కాని కళ్ళు మాత్రం చాలా సున్నితంగా సుతి మెత్తగా ఉండేవి .ఆ కళ్ళలో ప్రేమ ,స్నేహం ఉన్నా పెద్ద కల్లద్దాల వెనక అవి కనబడేవికావు .ఎందరో అతని చిత్రాలు గీశారు కాని ఆయనే స్వయం గావేసుకొన్న చిత్రం లో ఇవన్నీ స్పష్టం గా కనిపిస్తాయి .అతని వికారమైన తల ,కోతిలాంటి సిమ్మేట్రి లేని ఆకారం అందులో ప్రస్పుటంగా చిత్రి౦చుకొన్నాడు .
తండ్రి కౌంట్ కొడుకు హెన్రి వికృత రూపాన్ని భరించలేక పోయాడు ఇదివరకంటే కొడుకు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ మరింత సన్నిహితుడయ్యాడు తల్లి ప్రేమకంటే తండ్రిప్రేమ ఎక్కువైంది .తల్లి కొడుకుని త్వరగా స్కూలు విద్య పూర్తీ చేసి ఆర్ట్ అధ్యయనం చేయమని సలహా ఇచ్చింది .అప్పటికే రినే ప్రిన్సిటా అనే ఫామిలీ ఫ్రెండ్ నుంచి హెన్రి కొన్ని సూచనలు పొందాడు .రినే రేసింగ్ , వేట సీన్లు వేయటం లో సుప్రసిద్ధుడు .హేన్రిని బోనాట్ అనే చిత్రకారుని దగ్గర చేరి నేర్చుకోమని సలహా ఇచ్చాడు .సృజన లేని హెన్రి జీవితం లో ఏదీ గీయలేడని ఢంకా బజాయించి చెప్పాడుఆయన .తర్వాత ఫెర్నాండ్ కార్మాన్ అనే పెయింటర్ దగ్గర చేరాడు .ఈయన గొప్ప క్రమశిక్షణ,ఓర్పు వున్నవాడు .ఈయనదగ్గరున్నప్పుడే ప్రముఖ చిత్రాకారుడు ‘’వాన్ గో’’ ,మరికొంతమంది యువ ప్రయోగ శీలుర తో పరిచయ మయింది .ఇక ఎవరి శిక్షణా లేకుండానే స్వయం గా ఎదిగాడు హెన్రి .
20ఏళ్ళ వయసులో మాంట్ మాట్రే లో నివసించాడు .ఇది పారిస్ లో ఒక భాగం .ఇక్కడే ప్రముఖమైన పూటకూడు ఇళ్ళు ,ఈతగాళ్ళు ఉండేవారు .ఇది సిటీ కి దూరంగానేకాక ,చట్టానికీ దూరంగా ఉన్న ప్రాంతం .దీని వైవిధ్యం 1818వరకు బాగా ప్రసిద్ధమైంది .లాటిన్ క్వార్టర్ లలో ఉండే ఆర్టిస్ట్ లు రచయితలూ ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు .రాత్రి జీవితం ఒక వెలుగు వెలిగింది ఇక్కడ .’’కాబెరేట్స్, ఆర్టిస్టిక్స్ ’’గా పిలువబడే ఇక్కడ నైట్ క్లబ్బులు ,డాన్స్ హాళ్ళు సాహిత్య జీవులకు ఆర్టిస్ట్ లకు మోడల్స్ కు సమావేశ స్థలా లైనాయి .మన ఆర్టిస్ట్ కు ఇక్కడి నివాసులతో పరిచయమేర్పడింది .తల్లిని తానిక్కడ ఉండటానికి అనుమతికోరి దాదాపు ఇక్కడే ఉండిపోయాడు .స్నేహితుల అపార్ట్ మెంట్ లలో కలిసి ఉండేవాడు .ఒంటరిగా ఎప్పుడూ ఉండేవాడుకాదు .డీ మార్లిటన్ ప్రోప్రైటర్ అరిస్తైడ్ బ్రాంట్ అంటే మహా ఇష్టపడేవాడు.అతనికి చాలా చిత్రాలు వేశాడు .బ్రాంట్ గాయకుడు .బాలడ్స్ రాసేవాడు .అవి కూడా ఈ ప్రాంతం లో దగాపడిన మోస పోయిన వారిగురించి కవితలు రాసేవాడు .ఆతను హాస్య గాడు .పోకిరీజనంఅంటే ఇష్టం ఇక్కడున్న డాన్స్ హాల్స్ తో బ్రోతల్ హౌసెస్ తో హేన్రికి దోస్తీ బాగా కుదిరింది .డాన్స్ హాళ్ళలో తిండి, మందు ,డాన్సులతో పాటు లభించేవి .అద్భుతమైన డాన్సులకు కేంద్రంగా ఉండేవి. ఎలిస్ మాంట్ మాట్రేలో ప్రొఫెషనల్స్ మాత్రమె చేసే డాన్సులు ఉండేవి .వీటిని చూడటానికి క్లబ్ పోషకులు ,వచ్చేవారు .అందులో ప్రఖ్యాతులందరి చిత్రాలు లాట్రేస్ఆరాధనా భావం తో చిత్రించాడు . మరొక కేబరేట్ ప్రొప్రైటర్,దివాన్ జపనీస్ మేనేజర్ కవిత్వం అల్లేవాడు .ఇతనే హేన్రికి .పాత జానపద గేయాలతో ప్రేక్షకుల్ని ఉర్రూత లూగించే గాయని యువేటి గిల్బర్ట్ ను పరిచయం చేశాడు .ఆమె ఫీచర్స్ కు మనవాడు ఫ్లాటయ్యాడు .ఒకసారి ఆమె మనవాడు వేసిన చిత్రాలను చూడటానికి వచ్చినప్పుడు ఆమె చిత్రం గీసేశాడు ఆమెకు ఏదో ఉపద్రవం జరిగి పోయినట్లు ఫీలయి’’నిజం గా మీరు వికలా౦గులై నా పెయింటింగ్ లో జీనియస్ ‘’అన్నది .’’సహజమే ‘’అన్నాడు .
శారీరక వక్రత హెన్రి లో విషాద వేదాంతాన్ని నింపింది .అతని పక్వ కళ కేబరేలలో ఇరుక్కు పోయి౦దన్నారు .మనిషిలోని ఉన్నతిని ఆతను వదిలేశాడు .అందుకే అది విషాదాన్ని వదిలేసింది .అతనికళ కుళ్ళిపోయిన శిధిలమైన వాటినే చిత్రించింది .ఈ ప్రదేశ వాసుల జీవితాలను చిత్రించటం లో అతని భుక్తి గడిచింది .ఇందులో కొద్దిభాగమే గీశాడు .అందులోని అంతర్గత ప్రవాహాల జోలికి వెళ్ళలేదు .ఆతను స్నేహం, ఆప్యాయత కోరుకున్నాడు .అందుకే అసహజమైన వాటినే చిత్రించాడు .విదూషకులతో ,సైకిల్ తోక్కేవాళ్ళతో ,బల ప్రదర్శకులతో తిరిగి, వారినే గీశాడు .గుర్రపు పందేగాళ్ళను ,డాన్సర్లను ,ధైర్య సాహసవంతుల్ని చిత్రించలేదు .ఆశ్చర్యం కలిగించనివి,కోపం తెప్పించనివి అతనికి ఇష్టం .ఒక అందమైన జ్యూయేస్అతనిపై సానుభూతితో దగ్గరై మిస్త్రేస్ అయింది .కాని ఆడవాళ్ళు ‘’ఈ లిటిల్ మాన్ స్టర్(పిల్ల రాక్షసుడును చూసి ఉలిక్కిపడి పారిపోయేవారు .అందుకే మనవాడి శ్రు౦గార చేస్టలన్నీ వ్యభిచారులతోనే .వారితోనే తృప్తి తీర్చుకోనేవాడు.కనుక వాస్తవమైన ప్రేమ ,పెళ్లి అతని జీవితం లో ‘’ఔటాఫ్ క్వస్చిన్ ‘’అయింది .వారితోడిదే జీవితం ప్రేమా ,ఆనందం తృప్తి సౌఖ్యం వారికి ఆతను స్నేహితుడైన ఆర్టిస్ట్ .వారి నిరాశామయ జీవితాలకు అతడే వెలుగు .వారి చిత్రాలనే గీసి సంతోష పెట్టేవాడు .నెలకు రెండువారాలు వారాంగన ల ఇళ్ళల్లోనే మకాం .అక్కడున్నప్పుడే అమితానందాన్ని పొందేవాడు .తనను కలుసుకోవాలనుకొన్న కన్జర్వేటివ్ ఫ్రెండ్స్ ను అక్కడికే వచ్చి మాట్లాడమనే వాడు .వాళ్ళకు ఈ అడ్రస్ లు కనుక్కోలేక తలప్రాణం తోక కొచ్చేది .తన సెట్టింగ్ ల గురించి చెబుతూ ‘’every where there is ugliness and every where ugliness has its beautiful aspects .It is thrilling to discover them where nobody has noticed their existence ‘’అన్నాడు .
అతని స్టూడియో లన్నీ ‘’ఎవరిగోల వారిది ‘’గా రణ గోణ ధ్వనులతో ,చిందర వందర పెయింటంగ్ లతో ఉండేవి .ఆ ప్రాజెక్ట్ లలో ఏమున్నాయో కూడా తెలీని స్థితి .ఒక సారి రూమ్ మారుస్తూ ఉన్నగదిలోనే 80 కేన్వావాసులను గోడకు వదిలేసి వెళ్ళిపోయాడు .స్నేహితులకు అదిరిపోయే పార్టీలు ఇస్తూ’’ కంగారూ రో’’స్ట్’’తినిపించేవాడు .ఎన్నోరకాల మద్యాలు పోసేవాడు తాగేవాడు తాగించేవాడు తినేవాడు తినిపించేవాడు .ఇరవై ముప్ఫై మధ్య వయసులో ఆతను తిరిగిన మ్యూజిక్ హాళ్ళు ,రేసులు ,సర్కసులు హాస్పిటల్స్ అందులో ముఖ్యం గా ఆపరేషన్ దియేటర్లు ,కోర్ట్ రూములు బ్రోతల్ హౌసులు లెక్కలేనన్ని . వింత ప్రవర్తన ఉన్న వారందర్నీ చూసేవాడు .వెయ్యికి పైగా డ్రాయింగులు , ,లితోగ్రాఫులు పెయింటింగులు వేశాడు .క్షణ జీవితానికి ఇష్టపడేవాడు .భవిష్యత్తు గూర్చి ఆలోచన ఉండేదికాదు .సాంగ్ షీట్స్ గణాంకాలు ,ప్రకటనలు,దియేటర్ ప్రోగ్రాములు ప్రదర్శన అట్టలు (ప్లేకార్డ్ )బొమ్మలు వాణిజ్య స్కెచ్ లు అన్నీ తయారు చేసిచ్చేవాడు .తన తల్లి లోని ‘’అమ్మతనం ‘’పై అద్భుతమైన లోతైన అవగాహనతో చిత్రాన్ని గీశాడు .వాన్ గో,ఆస్కార్ వైల్డ్ చిత్రాలు గీశాడు .నిరంతర యాత్రాశీలి .ఇంగ్లాండ్ హాలండ్ స్పెయిన్ బెల్జియం దేశాలు తిరిగాడు .అక్కడ తన అభిమాన చిత్రకారుడు వాన్ గో ను గేలి చేసినవాడితో దాదాపు ద్వంద యుద్ధం చేశాడు .ఫ్రాన్స్ సముద్ర తీరాన్ని చుట్టాడు . దాని అందాలను చిత్రాలలో బంధించలేదు .కాని స్థానిక బార్ మెయిడ్స్ పెయింటింగ్ లను కొని తెచ్చుకొన్నాడు .హెన్రి ప్రపంచం మాంట్ మాట్రే ఒక్కటే .ఇక్కడ స్వంత ఇంటి ఆనందాన్ని అనుభవించాడు
..
సశేషం
దీపావళి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-11-15-ఉయ్యూరు

