బేగం షా నవాజ్ – గబ్బిట దుర్గా ప్రసాద్
ఆసియా శాసన సభకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ – బేగం షా నవాజ్
జహానారా అని పిలువ బడిన బేగం షా నవాజ్ ప్రముఖ ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ షఫీ కుమార్తె .1896 లో పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించింది .అక్కడే క్వీన్ మేరీ కాలేజి లో చదివింది .మియాన్ షా నవాజ్ ను పెళ్లి చేసుకొని బేగం షా నవాజ్ అయింది .
అఖిల భారత ముస్లిం మహిళా సంఘం ఏర్పడినప్పుడు ,దాని నిర్మాణానికి ,అభి వృద్ధికి శక్తి యుక్తులన్నీ ధార పోసింది .1918లో లాహోర్ లో ఆ సంఘం సమావేశమైనప్పుడు ‘’బహు భార్యా వివాహం ‘’రద్దు చేయాలని ఒక తీర్మానం తీసుకు రావటం లో సఫలీ క్రుతమైంది .లాహోర్ లోని ’’అంజుమన్- ఇ-హిమాయత్-ఇ-ఇస్లాం ‘’సంస్థలో విద్యా ,అనాధ లకోసం ఏర్పాటైన కమిటీలలో భాగస్వామిని అయి కృషి చేసింది .అఖిల భారత ముస్లిం మహిళా సమాఖ్య లో చాలా చురుకైన పాత్ర పోషించింది .దాని ప్రాంతీయ శాఖకు అధ్యక్షురాలై చాలా సంవత్సరాలు పని చేసి తన దక్షత చూపించింది .అఖిల భారత ముస్లిం మహిళా సమాఖ్య కేంద్ర కమిటీకి వైస్ ప్రెసిడెంట్ గా సేవలు చేసింది
లాహోర్ మునిసిపల్ కమిటీ సభ్యురాలుగా ఉంటూ .ఎన్నో హాస్పిటల్స్ ,మెటర్నిటి ,శిశు సంక్షేమ కమిటీలలో ఉత్తమ కృషి చేసింది .ప్రాంతీయ ముస్లిం మహిళా సంఘానికి ఉపాధ్యక్షురాలి గా ఎన్నికైన మొదటి మహిళా గా రికార్డ్ లకెక్కింది ‘.ఆమె సమర్ధత ,సేవ ,అంకిత భావాలను గుర్తించి అఖిల భారత రెడ్ క్రాస్ సొసైటీ కి సభ్యురాలిని చేసి అరుదైన గౌరవం కలిగించారు . రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు బేగం షా నవాజ్ మహిళా ప్రతినిధిగా హాజరైంది .1935లో బేగం ‘’పంజాబ్ ప్రాంతీయ మహిళా ముస్లిం లీగ్ ‘సంఘం ‘’ఏర్పరచింది .1937లో పంజాబ్ శాసన సభ కు సభ్యురాలిగా ప్రజా బలం తో ఎన్నికైంది .విద్యా ,వైద్యనిధి ,పబ్లిక్ హెల్త్ లకు పార్లమెంటరీ సెక్రటరిగా నియమింప బడింది .1938లో అఖిల భారత ముస్లిం లీగ్ బేగం కు ‘’కేంద్ర మమహిళా సబ్ కమిటీ ‘’లోగౌరవ స్థానం ఇచ్చింది .1942లో కేంద్ర ప్రభుత్వం ఆమెను ‘’నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ సంభ్యు రాలు ‘’గా నియమించి గౌరవించింది .తర్వాత ముస్లిం లీగ్ ఆమెను డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ షిప్ కు రాజీనామా చేయమని కోరితే తిరస్కరించింది .ఫలితంగా బేగం ను లీగ్ డిస్మిస్ చేసింది .
1946లో మళ్ళీ లీగ్ తీర్ధం పుచ్చుకొని పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికైంది .ఆ ఏడాదే ,బీగం ను ఏం ఏ .హెచ్ ఇస్ఫానీతో అమెరికా కు సౌహార్ద యాత్ర కు పంపారు .యాత్ర ముఖ్యోద్దేశం అమెరికా ప్రజలకు ముస్లిం లీగ్ మనో భావాలను వివరించి తెలియ బరచటమే .1947లోపంజాబ్ లో పెద్ద ఎత్తున జరిగిన శాసనోల్లంఘన కార్య క్రమాన్ని సమర్ధ వంతం గా నిర్వహించింది .ఇతర ముస్లిం లీగ్ నాయకులతో బాటు అరెస్ట్ అయి జైలుకు వెళ్ళింది .’’ది హార్ట్ డివైడెడ్’’అన్న పేరుతొ భారత్ పాకిస్తాన్ విభజనపై గ్రంధం రాసింది .1948లో కూతురు ముంతాజ్ షానవాజ్ మరణించింది .దాన్ని తట్టుకోలేక పోయింది బేగం .కొడుకు డా అహ్మద్ షా నవాజ్ అమెరికాలోని మాసా చూసేట్స్ లో కెమికల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ .ఈయన 2007లో చనిపోయాడు .బేగం కుమార్తె బేగం నసీం జహాన్ –పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు .జుల్ ఫికరాలీ భుట్టో ప్రధానిగా ఉన్నప్పుడు నేషనల్ అసెంబ్లీకి ఎన్నికైంది .మరో కుమార్తె ముంతాజ్ షా నవాజ్ 1948లో యునైటెడ్ నేషన్స్ లో పాకిస్తాన్ ప్రతినిదిగా హాజరవటానికి వెడుతూ విమాన ప్రమాదం లో చనిపోయింది . 82 ఏళ్ళ వయసులో బీగం షా నవాజ్ 27-11-1979 న మరణించింది .
-గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

