40-పోస్ట్ ఇంప్రెషనిస్ట్ పెయింటర్ హెన్రి డీ టోలోసే లాట్రే(Henri de Toulouse –Lautrec)-2(చివరిభాగం )

40-పోస్ట్ ఇంప్రెషనిస్ట్ పెయింటర్  హెన్రి  డీ టోలోసే లాట్రే(Henri de Toulouse –Lautrec)-2(చివరిభాగం )

చాలా ఏళ్ళ బట్టి తాగుడు బాగా అలవాటైంది .ఇరవయ్యవ ఏడుదాటే దాకా మద్యం ఒక మందు అని అనుకోలేదు .33ఏళ్ళకు బాగా అలవాటు పడ్డాడు .విపరీతమైన తాగుడు ,విరామం లేని శ్రమ తో 1899లో ఆరోగ్యం దెబ్బతింది .తల్లికోరికపై న్యూలిలోని శాని టోరియం  నర్సింగ్ హోమ్ లో చేర్చారు .ఆల్కహాలకు దూరమవటం తో ఆరోగ్యం బాగైంది ..తిరిగి వెళ్లి మళ్ళీ బాటిల్ ఎత్తితే కొంప కోల్లేరని  హాస్పిటల్ సిబ్బంది హెచ్చరించారు .అందుకే వాకింగ్ కు వెళ్ళినా మనిషిని తోడు గా పంపేవారు .అది చాలా అసంబద్ధం అనిపించింది .అటెండర్ ను మంచి చేసుకొని అతనితో బార్ కెళ్ళి వాడికి పూటుగా పోయించి తానూ సేవించి శానిటోరియం చేరేవాడు రహస్యంగా .విశ్రాంతి దొరకటం తో ‘’సర్కస్ ‘’అనే కొత్త సీరియల్ చిత్రాలు గీయటం ప్రారంభించాడు. మానసికంగా బాగానే ఉన్నాడని భావించి డాక్టర్లు రిలీజ్ చేశారు .మొదట్లో కొంచెం తగ్గిఉన్నా మళ్ళీ డ్రీంకింగ్ లో విజ్రు౦భి ౦ చాడు .1901లో పక్షవాతం వచ్చింది .తల్లి వచ్చి తమ మల్రోం కోటకు తీసుకు వెళ్ళింది .జబ్బు తీవ్రమై 37 ఏళ్ళకే 9-11-1901న చిత్రకారుడు డీ టోలోసే లాట్రేస్  చనిపోయాడు ..

ఒకప్పుడు లాట్రేస్ కదిలే  వస్తువులంటే ఆసక్తి చూపాడు .ఆడ మగ జంతువుల  నడకలు బాగా గీశాడు .ఆసక్తి కలిగించని ప్రకృతిని ఇష్టపడేవాడు కాదు .పూలు ,పళ్ళ అమరిక కన్యలకే కాని మగాళ్ళకు కాదనే వాడు ప్రతిదానిలో వేగం  తోకూడిన దృశ్యం గోచరి౦చాలన్నాడు , లాండ్ స్కేప్ లంటే అయిష్టం .’’land sccape is nothing and should remain nothing but an accessary –the painter of pure land scape is an idiot ‘’అని అభిప్రాయ పడ్డాడు .చిత్రం యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకా స్పష్ట పరచాలంటేనే లాండ్ స్కేప్ కావాలన్నాడు .చిత్రకారుడు ఫోర్ర్టైన్ దగ్గర కొద్ది స్ట్రోకులతో కేరెక్టర్ ఎలా చూపచ్చో నేర్చాడు .ఫోర్తైన్ మనుషుల తప్పుల్ని చర్మం వొలిచినట్లు వొలిచి చూపేవాడు .కాని లాట్రేస్ వారిలోని వైపరీత్యాలను ,విషాద ,అసంగతాలను గీశాడు .అతని టెక్నిక్ జపనీస్ ప్రింట్ ను తలపుకు తెస్తుంది .ముఖ్యంగా వాటి లో ఉండే అసమతుల్యమైన రంగులకలయిక కన్పిస్తుంది .అతనికి ‘’their spatial diagnols ,broad flat areas of color strong silhouttes cutting off a figure withseeming arbitrarines,but actually with sharp discrimination and great effect ‘’బాగా ఇష్టం .

హెన్రి గీసినవన్నీసుమారు  15 ఏళ్ళ కాలం లో గీసినవే .బతికి ఉండగా ఒక్క పేయింటింగ్అమ్మితే ఒట్టు .తనవి, ఇతరులవి చిత్రాలు చాలా వేశాడు .అతని శరీరం బలహీనమైనదేకాని మైండ్ చాలా బలమైనది అన్నారు విశ్లేషకులు .అడ్వర్టైజింగ్ ఆర్ట్ కు ,పోస్టర్ కు రూపం ,డిగ్నిటి తెచ్చిన వాడు లాట్రేస్ ఒక్కడే  . మోడరన్ ఇలస్త్రేషన్లు అన్నీ ఆయన కళనుండి ఏర్పడినవే .అతని ప్రతిభను గురించి మెక్ అనే విశ్లేషకుడు వివరిస్తూ ‘’Henri succeeded in raising design to the level of a fine art .He allowed no distinction ,no snobbish arbitrary barriers between commercial and pure art ‘’అన్నాడు .వాణిజ్య కళకు అసలు కళకు ఉన్న విభజన రేఖను చెరిపేసిన గోప్పకళాకారుడు హెన్రి.అతను మోరలిస్టూ కాదు ,మనుష్య ద్వేషికాడు.అతనొక సాక్షిమాత్రమే .ద్వేషం, భయం లేకుండా మాట్లాడతానని ప్రతిజ్ఞ చేసి నిలబెట్టుకొన్నవాడు.సమాజాన్ని లెక్క చేయలేదు .కాని ప్రతివ్యక్తిని విపరీత౦గా  తాపీగా ,నెమ్మదిగా అధ్యయనం చేశాడు .ఆసక్తి తగ్గకుండా మనుష్యులను పరీక్ష చేశాడు .వారి విషయమై ముందే అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా ఆలోచించాడు .స్వర్గం కాక నరకం కాక మధ్యస్తం గాఉన్న ప్రదేశాలలో ఉన్న మనుషులే ఆయనకు కావాలి .వారి గురించే ఆలోచించి వారినే చిత్రించాడు ..అందుకే అతని గీత సూటిగా సాగింది .తీక్షణ౦గా  ,నిరలంకృతంగా నగ్నం గా ఉంది .ఒక పర్య వేక్షకుడిగా బాధ ,విసుగు లనుండి మానవత తప్పించుకోవటం అతనికేమీ ఆశ్చర్యం కలిగించ లేదు .అతని మోడల్స్ అందరూ డాన్సర్లు ,డ్రింకర్లు,క్లౌన్లు ,ఆనందాన్ని వెతుక్కొనే అమ్మాయిలూ .అతని చిత్రణలో ఆనందం లేదు రంగు లేదు .ఆతను చిత్రించిన డాన్సర్లు గంభీరంగా ,క్లౌన్లు అలసిపోయినట్లుగా ,డ్రింకర్లు డల్ గా వ్యభిచారులు దారుణంగా ఉంటారు .కాని వాటిలో మానసిక అంతర్ ద్రుష్టి చాలా అగాధమైనది గా కనిపిస్తుంది .వాటిని సృష్టించిన సృజనకారుడు ,ఆచిత్రాలూ  కూడా సంతోషానికి ,నీచ దౌర్భాగ్య స్థితికి అతీతంగా కనిపిస్తారు .అతని గురించి క్లుప్తంగా చెప్పాలంటే ‘’the art of Touslouse Lautrec is the art of an intense observer who does not render verdicts but whose reports are clear un critically candid ,and not  without compassion ‘’అని చెప్పవచ్చు .

లాట్రేస్ జీవితం పై సినిమాలు నాటకాలు వచ్చాయి .మొత్తం మీద 737కాన్వాసులు ,  275వాటర్ కలర్లు ,363ప్రింట్లు ,పోస్టర్లు ,5084డ్రాయింగులు ,గ్లాసు పింగాణీవస్తువు లపై కళాత్మకాలు ఇంకా లెక్కకు రానివెన్నో గీసి  ఈ వామన చిత్రకారుడు కళావిశ్వ రూపం చూపించాడు .మేనట్,డేగాస్అనే ఇద్దరు ఇంప్రెషనిస్ట్ చిత్రకారులకు రుణపడి ఉన్నాడు .అతని శైలిపై ప్రభావం చూపింది జాపనీస్ వుడ్ ప్రింట్లు .అవే అప్పుడు పారిస్ లో బాగా చలామణిలో ఉండేవి .వ్యక్తులు పని చేసే పరిసరాలను రంగులతో కదలికలను రాత్రి జీవితాన్ని గీశాడు .గ్లామర్ కు  ప్రాధాన్యం లేదు .గుంపులో గోవింద లాగా ఉండక ప్రత్యేకంగా చూపటం అతని ప్రతిభ .సిల్హౌటీలను చిత్రించటం లో మార్గ దర్శి .పొడవైన పలుచని బ్రష్ స్ట్రోకులతో  కావాల్సిన ఫలితాన్ని రాబడతాడు .అతని ఆర్ట్ వర్క్ అంతా కలర్ పెయింట్ లో డ్రాయింగ్ లే  అనిపిస్తాయి .

 

Inline image 1 Inline image 2Inline image 3  Inline image 4

 

 

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-11-15-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.