నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4
మనవి –బెజవాడలో ఉన్న సంస్కృత మహా విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు పరిచయమవ్వగా వారికి మన గీర్వాణం గురించి దాని అభివృద్ధి గురించి తెలిపి ,మన పుస్తకాలు పంపి వారి గురించి వారికి తెలిసిన ఇతర సంస్కృత కవులగురించి, గ్రందాల గురించి వివరాలు ఉంటె ఇవ్వమని కోరాను. వారు మాడభూషి క్రిష్ణమాచారియార్ పుస్తకం లో విషయాలు రాశారా అని అడగగా అక్షరం వదలకుండా రాశానన్నాను .ఆచార్య బిరుదరాజు రామ రాజు గారి పుస్తకం చూశారా అని అడిగితే లేదని చెప్పగా దానిపేరు ‘’Contribution of Andhra to Sanskrit Literature ‘’అని బాగా రాశారని ప్రయత్నించి తెప్పించుకోమని తన దగ్గరున్న పుస్తకాలు వివరాలు త్వరలో పంపిస్తానని చెప్పారు .నేను వెంటనే మా ఆత్మీయులు శ్రీమైనేని గోపాల కృష్ణ గారికి ఈ విషయం మెయిల్ రాశాను . వారు ఆ సాయంత్రానికి నెట్లో వెదికి అది హైదరాబాద్ లోని సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ‘’సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ‘’వారి దగ్గరున్నదని ,వారి అబ్బాయి శ్రీ బసవ రాజు గారు చెప్పారని వారి నంబర్ ఇచ్చి ఫోన్ చేయమంటే రాజుగారికి ఫోన్ చేయగా ,తమవద్ద స్టాక్ అయి పోయిందని భీమిలీ లో ఉన్న తమ సోదరి శ్రీమతి రాధాకుమారి గారి వద్ద ఉన్నాయని తాను ఫోన్ చేసి చెప్పానని ,నన్నుఫోన్ చేసి మాట్లాడమని ఏంతో ఆత్మీయంగా చెప్పారు .వెంటనే రాదాకుమారిగారికి ఫోన్ చేయగా తమ అన్నగారు ఈ విషయం ఫోన్ చేసి చెప్పారని, నా అడ్రస్ ను మెసేజ్ గా పంపమని చెప్పారు. వెంటనే ఆ పని చేశాను .వారు కొరియర్ లో ఖర్చులు పెట్టుకొని ,పుస్తకం ఖరీదు 112రూపాయలు కూడా తీసుకోకుండా ‘’అమూల్యం ‘’గా నాకు పంపారు .అన్నా సోదరిల సౌజన్యం మరువలేనిది .వారికి కృతజ్ఞతలు ఫోన్ ద్వారా తెలియ జేశాను .ఈ గ్రంధం నా చేతిలోకి రావటానికి ఇంత జరిగింది .ఇదంతా మా గోపాల కృష్ణ గారికి నామీదా, సరసభారతి మీద ఉన్న అపూర్వ గౌరవం సహృదయత, ప్రోత్సాహం .వీరందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు .రామ రాజు గారు చాలా శ్రమ పడి విషయ సేకరణ చేసి800 పేజీలలోఆంగ్లం లో రాసిన ఉద్గ్రంధం ఇది .దీన్ని చదువుతుంటే వారికిఇలాంటి గ్రంధాన్ని రాయాలన్న కోరిక కు ప్రేరణ అంతకు ముందే వచ్చిన ‘’contribution of Kerala to Sanskrit Literature ‘’మరియు ‘’contribution of West Bengal to Sanskrit Literature ‘’అని అర్ధమైంది .ఇలా ఎవరో ఒకరు ఆ రాష్ట్ర కవుల రచనలగురించి రాయక పొతే ఎలా తెలుస్తుంది ?రాజుగారి ప్రయత్నం పి.హేచ్.డికోసం చేసింది .కానిఅనివార్య కారణాల వాళ్ళ అది సాధ్యం కాలేదు .కనుక వారే పూనుకొని ఢిల్లీ లోని సంస్కృత సంస్థాన్ మొదలైన సంస్థల ఆర్ధిక సాయం తో 2002లో ప్రచురించారు . ఈ పుస్తకం లో నేను ఇప్పటిదాకా రాయని కవులు చాలామంది ఉన్నారు .వారి గురించి ఇక వరుసగా నాల్గవ గీర్వాణం-‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4లో ధారా వాహికంగా రాస్తున్నాను .చదివి స్పందించండి .-మీ దుర్గా ప్రసాద్
3-అన్నయార్య (1704-1778)
ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రం లో ఉన్న సూరాపురం జమీందారి ని బేదార్లు అనే తెలుగు నాయకులు పాలించారు .1752-1773కాలం లో పాలించిన పామినాయకుడు ముగ్గురు వైష్ణవ మతాచార్య సోదరులను అక్కడికి ఆహ్వానించాడు. వారి ప్రభావం వలన జమీందారు వైష్ణవ మతం స్వీకరించాడు .వీరు అనంతపురం జిల్లాలోని లోని జమ్మల మడుగు తాలూకా బుక్క పట్టణానికి చెందిన వారు .శ్రీనివాసాచార్య వెంకాంబ కుమారులు .వారే వెంకటార్య ,అన్నయాచార్య లేక అన్నయ దీక్షితులు ,చిన్నయా చార్య లేక శ్రీనివాస దేశికులు .వీరి ని బుక్కపట్టణం కుటుంబం వారు అంటారు .వీరంతా మహా విద్వాంసులు మహా కవి పండితులు .సోదరత్రయం దాదాపు వంద సంస్కృత గ్రంధాలు రచించారు .కాని చాలా భాగం అచ్చుకు నోచుకోలేదు .శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు వీరి చరిత్ర త్రవ్వి తీసి వెలుగు లోకి తెచ్చారు. అయితే అన్నయార్య విషయం లో రెడ్డిగారు పొరబడ్డారు .వీరి వారసులు ఇప్పటికీ కర్నాటక,ఆంధ్రా లో మహబూబ్ నగర్ జిల్లా అమర చింత వనపర్తి లలో ఉన్నారు .పామినాయకుడు భార్గవ పురాణం రాశాడు ,వైష్ణవం లోకి రాకముందు ఆయన పేరు రాఘవ భూపాలుడు .వెంకటార్య రాజ గురువు .అన్నయార్య ,శ్రీనివాసులు కూడా పామినాయక ,ఆతనికుమారుడు వెంకట నాయక పోషణలో ఉన్నారు .
అన్నయార్య వాజపేయం పౌ౦డరీకం ,గారుడ చాయణం ఆప్తోర్యామ చేసి దీక్షితుడయ్యాడు .అన్నయార్య ‘’తత్వ గుణాదర్శ౦ ‘’అనే చంపూకావ్యం సంస్కృతం లో రాశాడు .ఇది వెంకట నాయక పాలనలో రాసినట్లు కనిపిస్తుంది .తన వంశ చరిత్రను ముందే రాశాడు .ఇది వేంకటాధ్వరి రాసిన ‘’విశ్వ గుణాదర్శం ‘’ను పోలి ఉంటుంది .జయ ,విజయ అనే పాత్రల ద్వారా వైష్ణవ ,శైవ మతాల విషయ చర్చ చేయించాడు .
‘’ఆచార్య వింశతి ‘’అనే స్తోత్రాన్ని వేదాంత దేశికులపై రాశాడు .ఇరవై శ్లోకాల కావ్యం .చివర్లో తన గురించి చెప్పుకున్నాడు .’’దేశిక యశో భూషణం ‘’అనే మరో కృతి చేశాడు ‘’రసోదార భాణ౦ ‘’రాశాడు ఇది శృంగార తిలక వసంత మంజరి ల ప్రేమకధ 246శ్లోకాలున్నాయి .కొంత గద్యమూ ఉంది .కవిత్వాన్ని గుప్పించేశాడు .ఉపోద్ఘాతం లో తన గురించి తాన సమకాలికుల గూర్చి రాశాడు .నాంది లోనే కవి గారి కవితా శక్తి జ్యోతకమవుతుంది .దీన్ని వెంకటాచలం లోని శ్రీనివాస ఉత్సవాలలో ప్రదర్శించేవారు .చివర ఇచ్చిన వివరాలను బట్టి తల్లి లక్ష్మాబ అని తెలుస్తుంది .గురువు ఆచార్య దీక్షితులు .72శ్లోకాలతో ‘’అభినవ కర్ణామృతం ‘’రాశాడు .విశిష్టాద్వైత గ్రంధాలు కూడా అన్నయార్య రచించాడు .అవే ‘’ఆనంద తార తమ్యఖండనం ,’’వ్యావహారికత్వ ఖండన సారం ‘’.
ఆయన రచనా వైదుష్యానికో మచ్చు తునక—‘’ఇచ్చండాయార్ధ విదుషా కమలా నివాస –తాతార్య గర్భ జనుషా సుగుణైక ధామ్ని-ఆచార్య దీక్షిత కటాక్ష ద్రుతాతి భూమ్నా-ప్రీత్యైహరేర్వరచితో మధురః ప్రబంధాః’’
మరోకవితో కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-11-15-ఉయ్యూరు

