గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 13-ఏకాంకిక కర్త-అయ్యవారు శాస్త్రి

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4

13-ఏకాంకిక కర్త-అయ్యవారు శాస్త్రి

17వ శతాబ్ది మధ్యలో కర్నూలు పాలకుడు ఆనంద రావు దేశాయ్ ఆస్థానం లో అయ్యవారు శాస్త్రి ఉన్నాడు .’’సభార౦జనం ‘’అని పిలువ బడే ‘’హితకారి ‘’అనే ఏకాంకిక నాటకం రాశాడు .దీన్ని 29తాటాకులపై లిఖించాడు .అందులో మొదటి అయిదు పత్రాలు కనిపించలేదు .కనుక కవి గురించి ఆయన పోషకుల గురించి వివరాలు తెలియటం లేదు .లభించిన ఆధారాలను బట్టి సంస్కృతాంధ్రాలలో దిట్టమైన కవి .కందనోలులేక కర్నూలు  నుపాలించిన మహారాష్ట్ర పాలకుడు నిత్యానందరావు లేక ఆనంద రావు దేశాయ్ ఆస్థానకవి .బహుశా ఆనందరావు మహారాష్ట్ర రాజ ప్రతినిధి కావచ్చు .శివాజీ పాలనలో కర్నూలును పాలించిన మరో ఆన౦దరావు కూడా ఉన్నాడు .ఆనందరావు శివాజీ మహారాజును కీర్తించినందు వలన ఈయనే అయ్యవారు శాస్త్రిగారి పోషకుడు అని భావించారు .మహబూబ్ నగర్ జిల్లాలో జటప్రోలు సంస్థానం లో ‘’అయ్యవారు పల్లె ‘’అగ్రహారం ఉంది .ఇది ఈయనకు ఈనాముగా బహూకరించ బడి ఉండచ్చు .

కవి చెప్పిన దాన్నిబట్టి ఇది ఏరకమైన ఎకా౦కికయో తెలియదు .బీజ,ముఖ సంధులు మొదటి అయిదు పత్రాల అలభ్యతవలన తెలియ రావటం లేదు .అంతా వర్ణన మయం .నాటిక చివరి భాగం కూడా స్పష్టంగా లేదు .రసికా వతంస అనే ఇందిరా మందిరరాజు ,హితకారి  అనే రెండే రెండు ముఖ్య పాత్రలున్నాయి .హితకారి అనేవాడు మంత్రి కొడుకు .దౌవారికుడు హితకారి ని రాజు సమక్షం లో ప్రవేశ పెట్టి నిష్క్రమిస్తాడు .హితకారి ,రసికావతంసుడు కలిసి వన విహారం చేస్తారు .వనపాలుడనే తోటమాలి ,రాజానుచరుడు కొంత హాస్య సంభాషణ నడుపుతారు . దీనితో కద సమాప్తం .రాసికావతంసుడు ,హితకారి ఒక రోజు కార్యక్రమగా రాజంతః పురం నుండి వన సందర్శనం చేయటం,కాసేపు తోటలో తిరిగి ,పిచ్చాపాటీ మాట్లాడుకొని మళ్ళీ తిరిగి రావటం  ఇందులో కధ.దారిలో వారికి కనిపించిన సకల సజీవ నిర్జీవ విషయాలను వర్ణించాడు కవి .శాస్త్రి గొప్ప పండితకవి అనిపిస్తాడు .వైశేషిక న్యాయం నుంచి వైద్య శాస్త్రం వరకు ఆయనకు ప్రతి విషయం లోను లోతైన పరిజ్ఞానం ఉందని తెలుస్తుంది .ఇద్దరూ బయల్దేరేముందు వారి వేషధారణ రసికుడు అద్దం లో తన అందాన్ని చూసుకోవటమూ వర్ణించాడు –మనమూ ఒక సారి ఆ అడ్డం లోకి తొంగి చూద్దాం –

‘’ఆదర్శ న భవతే దర్శనతోన్తః ప్రవేశ యసి సర్వాన్ –యస్య ముఖ శ్రీ ర్లోకే తస్య బేర్ సర్వలోకాఃస్యుః’’

రాజు తన ముత్యాల  కర్నా భరణాన్ని చూస్తూ—‘’’ముక్త ఫల ముఖో ల్లాస కరే రాజం అవోగ్రగః

సువృత్త చతురాకారో న కః ప్రభుహితో భవేత్ ‘’అంటాడు .తోటకు వెళ్లేముందు హితకారి తమ ఇందిరామందిర పట్టణ వైభవాన్ని వర్ణిస్తాడు

‘శ్రీ మత్సర్వ పురీ రమా విజయ లక్ష్మీ లక్షణ ప్రభవా-సీమాన్తాయితసూర్య సోమ సరణీ శృంగార రంగన్ముఖా

సత్ప్రాకార నితంబ బింబ రాశనా కల్పాయిత స్వర్దునీ –మేధ్యాసౌ న కదం హిసర్వ విబుధ శ్రీ మందిరేయం పురీ ‘’అని దాని శోభను వర్ణిస్తాడు .

వనం లోకి ప్రవేశించాక కనబడిన ప్రతి వృక్షాన్ని వర్ణిం చాడు కవి .ఈ వర్ణన లలో శాస్త్రీయ కోణమూ ఉంది .అశ్వత్థ నింబ ,వట ,తి౦త్రిణి ,కపిత్త ,బిల్వ ,ప్లక్ష ,ఉదుంర ,చూతమొదలైన వృక్ష వర్ణన ఉంది .తరువాత కనిపించిన సింహ శార్దూల కురంగ వనావర్త ,మున్నగు జంతువర్ణన చేశాడు .అప్పటికే మధ్యాహ్నమైంది. అక్కడ భవానీ దేవాలయం లో అమ్మవారికి పూజ చేశారు .అప్పుడు అక్కడి సరోవరం లో విహరించే హంస ,కుముద మత్స్య ,చాతక చకోర చక్రవాక పక్షుల వర్ణనా పనిలోపనిగా కానిచ్చేశాడు .చకోరపక్షి వర్ణ చూడండి –

‘’చకోరే తారకోదార యోగో యస్తోనిరంతరం –నహి చే చ్చంద్రికా పానంకదం ఖేచరముద్రయా ‘’

ఇంతలో కొన్ని మాటలు వినిపిస్తే అవి వనపాలురు రాజును చూడాలనే ఉత్సాహపు మాటలంటాడు హితకారి .వాళ్ళు రాజుకు ఫలాలు పుష్పాలు కానుకగా సమర్పిస్తారు .వాళ్ళు తెచ్చిన ఖర్జూర ద్రాక్ష ,మాతలు౦గ దాడిమి మొదలైన ఫల వర్ణన తర్వాత మల్లికా ,గంధఫలి (సంపెంగ )కేతకీ పుష్ప వర్ణన  చేస్తాడు .మిట్ట్మమధ్యాహ్నమైనఉక్కపోస్తోంది రాజుగారికి విసరటానికి విజామర వర్ణ న చేశాడుకవి .చమట పట్టిందికనుక స్నానం చేయాలి .ఆ తతంగాన్నీ బాగానే పూర్తీ చేశాడు .చండీ ఆలయం లో పూజారి వీరికోసం ఎదురు చూస్తున్నాడు .వెళ్లి పాల్గొన్నారు .భవానీ దేవిని కవి వర్ణించాడు –

‘’అంబ జగతో వలంబ నమంబాత్వే నైవ విహితామిహ భూయః –అవలంబయ  మాం కృపయే త్యుక్తిః పునరుక్తమితిమయానోక్తా ‘’అని వరుసగా అయిదు శ్లోకాల ప్రార్ధన చేశాడు .అమ్మవారి ప్రసాద స్వీకారం తర్వాత భోజనాలకు ఉపక్రమించారు .భోజన సామాగ్రినంతా వర్ణించాడు తినుబండారాల వర్ణనా నోరూరిస్తుంది .పాటోలఅంటే పొట్లకాయ వర్ణనా ఉంది –‘’పాటోలాదీర్ఘ క్రున్త్యాపి లాఘవం కేన సాధితం –పాషాణ వహనాదిభ్యః కిమార్జితాం ‘’

గుమ్మడికాయ అంటే కూష్మా౦ డాన్నిఅంతే రుచిగా వర్ణించాడు –‘’కూష్మాండ సర్వమదురోప్య బలాదుర్భఘసాఘ్రు వ్రుత్తోసి –బాల్యే సర్వ పిధ్యం భవదాచారణం  కిమేత దుపపన్నం ‘’

వన్నీ 24ఆకులలో ఉన్నాయి చివరి 25వ పత్రం లభ్యం కాలేదు .26లో తిరుగు ప్రయాణ వర్ణన ఉంది .దారిలో స్త్రీ,అంతఃపుర ,సింహాసనం  కళ్ళజోడు ,కలం ,రాసే వస్తువులు ,దీపం ,కత్తిమొదలైన వర్ణన ఉంటుంది .తర్వాత రాజు కళావతితో కాలక్షేపం చేసే సమయమైనదని హితకారి గుర్తు  చేస్తాడు .కళావతి రాణి అని మనకు అప్పుడు తెలుస్తుంది .చివరకు హితకారిరాజును ఆశీర్వదిస్తాడు .

‘’రాజన్ సామ్రాజ్య లక్ష్మీ విభవావిలాసితః సర్వ దిక్కుమ్భి కుంభ –ప్రోదాన్ముక్తా ఫలశ్రీ సహచర యశసా ఖ్యాత విద్రుద్రజ శ్రీ ‘’దీనికి జవాబుగా రాజు

‘’జయంతి బహుదా సుధా మధుర బందుతా బంధుర –ప్రబంధ రచనా చమత్కృతి కృతార్ధ స్ద్వే భవాః

ప్రసూన చయ సౌరభేః ప్రసవి దేను దుగ్ధ దాన్చితే –ర్వచో భి రభిత స్స్తభాం ప్రభావ ఏవ సంభావితం ‘’

రాజును తనకు సెలవిప్పించమని హితకారి కోరటం ,ఇతనికోసం ఇంటిదగ్గర భార్య కృపావతి ఎదురు చూస్తూ ఉండటం తో ఏకాంకిక పూర్తీ అవుతుంది .బిరుదు రాజు వారు దీన్ని ‘’వీధి ‘’అనే నాటక భాగం గా పేర్కొన్నారు .నాకేమో ఇది ఒక ‘’ట్రావేలోగ్ ‘’అంటే పిక్నిక్ లాగా ఉందని  పించింది .ఏమైనా అయ్యవారు శాస్త్రి తానొక ‘’గైడ్ ‘’గావ్యవహరించి కద నడిపించాడు .ఒక కొత్త ప్రయోగం అనిపించాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-15-ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.