ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -94
41-ఐరిష్ సాహిత్య పునరుద్ధరణ చేసిన -విలియం బట్లర్ యేట్స్
‘’కవులు గుర్తింపబడని ప్రపంచ శాసన సభ్యులు ‘’అన్నాడు షెల్లీ కవి .ఆమాటను నిజం చేశాడు అక్షరాలా యేట్స్ కవి .అయన కవి ,కవితా నాటక కర్త , ,స్వతంత్ర ఐర్లాండ్ దేశానికి సెనేటర్ గా 1922నుండి 1928వరకు సేవ చేశాడు .ఇలా షెల్లీ మాట నిజం చేశాడు .
విలియం బట్లర్ యేట్స్ ఐర్లాండ్ లో డబ్లిన్ దగ్గర సాండి మౌంట్ లో 13-6-1865లో ప్రొటెస్టెంట్ కుటుంబం లోజన్మించాడు .తాత ముత్తాతలు ఆంగ్లికన్ మినిస్టర్లుగా పని చేశారు .తండ్రి జాన్ ప్రముఖ ఆర్టిస్ట్ .,సోదరుడు జాక్ ప్రసిద్ధ చిత్రకారుడు .వీరిద్దరి ప్రభావం విలియం పైన ఉంది .19వ ఏట డబ్లిన్ లోని మెట్రోపాలిటన్ ఆర్ట్ స్కూల్ లో చేరాడు .చిత్రకారుడు టర్నర్ దగ్గర పని చేసి కొంత నేర్చినా ద్రుష్టి రచనమీదే ఉండేది .చివరికి తన భావ వ్యక్తీకరణకు బ్రష్ కంటే పెన్ను బాగా సహకరిస్తుందని నిశ్చయించుకొని రాతకే మొగ్గు చూపాడు .
విలియం యవ్వనం ఇంగ్లాండ్ –ఐర్లాండ్ మధ్యనే గడిచింది .పదకొండేళ్ళ వయసులో లండన్ దగ్గరున్న హామర్ స్మిత్ లోని గోడాల్ఫిన్ స్కూల్ లో చేరాడు . కాని .తన దేశం లో తనకిష్టమైన స్లిగో కు తిరిగి వెళ్లాలని కోరుకున్నాడు .జీవితం లో ఎక్కువ భాగం స్వదేశానికి దూరం గా గడిపినప్పటికీ మాతృదేశం ఐర్లాండ్ పై ఎప్పుడూ మక్కువతో ఉండేవాడు .22వయసులో లండన్ వెళ్ళాడు .అక్కడ ఎర్నెస్ట్ రైస్ తో కలిసి ‘’రైమర్స్ క్లబ్ ‘’స్థాపించాడు .ఇది ప్రీ రాల్ఫ డైట్ ల భౌతిక భావ వ్యాప్తికి అడ్డు కట్ట వేసి ,ధార్మిక భావ వ్యాప్తికోసమే ఏర్పాటు చేయబడింది .ఈ వయసులో బక్కగా పలుచగా ఎత్తుగా ఉండేవాడు .ముఖం చిన్నదిగా ,మిరుమిట్లుగొలిపే కళ్ళతో ఉండేవాడు .
శీతాకాలం లో ఈ క్లబ్ కు వచ్చి మేధో సదస్సులలో పాల్గోటమే కాక వెచ్చదనాన్నీ పొందేవాడు విలియం .గుర్రం మీద డబ్లిన్ నుండి లండన్ కు వెళ్ళటానికి చేతిలో డబ్బులు లేక అనేక సార్లు నడిచి వెళ్ళే వాడిని అని ఆయనే చెప్పుకొన్నాడు .మధ్యాహనం ‘’టీ’’కి ఎవరో స్నేహితుల మీద ఆధార పడే వాడు .వీలయితే వారి ఆతిధ్యం పొంది భోజనం చేసేవాడు .ఇంకేవిధమైన పోషకాహారం తీసుకొనే ఆర్ధిక స్తితి లేనివాడిగా గడిపాడు .ఆస్తికతను ఒక జీవిత విధానం గా అలవరచుకొన్నాడు . యవ్వన దశలో హక్సిలీ ,తిండాల్ ల మెటీరియలిజం అంటే ఇష్టపడే వాడు కాదు .తన స్వీయ జీవిత చరిత్ర లో ‘’నేనుకవిత్వ విధానం అనే ఒక కొత్తమతాన్ని కనిపెట్టాను .అనేక తరాలుగా కవులు కళాకారులు తత్వ వేత్తలు అందించిన విజ్ఞాన రహస్యాలను చిన్న కధలుగా చెప్పాను .ఈ భావ వ్యాప్తికోసం ఒక ప్రపంచం నిర్మించాలనుకొన్నాను .’’అని రాసుకొన్నాడు .
యేట్స్ కొత్త మత అన్వేషణ లో సగం అభూతకల్పన ,సగం మాజిక్ ఉన్నాయి .అందుకని దియసాఫిస్ట్ లకు దగ్గరయ్యాడు .1887లో రష్యా దేశపు మార్మిక వేత్త మేడం బ్లావట్ స్కి కి శిష్యుడైనాడు . ఆమె చేసేదంతా అభూత కల్పనా అని రుజువైనా యేట్స్ కు ఆమె పై విశ్వాసం తగ్గలేదు .పుష్పాలలో దెయ్యాలని ఆహ్వానించటం ,తలక్రింద ప్రత్యేక దిండులను ఏర్పరచి కళలు కనమని చెప్పి వాటి అర్ధాలను వివరించేవాడు. ఈ జబ్బును తోటి క్లబ్ సభ్యులకూ అంటించాడు..పంచేంద్రియాలకు అతీతమైన దేదో ఉందని చెప్పేవాడు . మెటీరియలిజానికి వ్యతిరేకంగా ఈ పని చేస్తున్నాడు .అద్భుతకధలన్నిటినీ నమ్మింప జేసేవాడు .చిన్ననాటి జానపద కధలనూ వండి వడ్డించేవాడు .ఇవన్నీ తన జీవితం లో కన్న కలలే అనేవాడు .
సహజంగా సిగ్గు పడే విలియం హృదయం ఆత్మ స్పర్శకు ,ఈ కల్పిత కధలకు మధ్య విలవిలలాడిందికొంతకాలం .దేనికి సమాధానం చెప్పాలో అర్ధంకాలేదు .ఈ ద్వంద్వాలలో ఊగిసలాడాడు .తనకాలం లో పెరుగిపోతున్న మెటీరియలిజానికి బ్రేకులు వేయటమే యేట్స్ ఉద్దేశ్యం .ఈ ఊహా ప్రపంచమే లేక పొతే తానేదీ రాయగలిగి ఉండేవాడిని కానన్నాడు .’’సెల్టిక్ రివైవల్ ‘’ఉద్యమం వచ్చేసరికి విలియం లో స్పిరిటిజం తో బాటు జాతీయతా భావం కలిసి పోయాయి .ఐర్లాండ్ లో రెండు మహా ఉద్యమాలు మొలకెత్తాయి .అందులో 1893లో ఐరిష్ ప్రాచీన సాహిత్యాధ్యయనం పునరుద్ధ రించాలని ,గేలిక్ ను జాతీయ భాష గా చేయాలని ప్రారంభమైన ‘’గేలిక్ లీగ్’’ఉద్యమం , తర్వాత కొన్నేళ్ళకు మెరుగైన వ్యవసాయం ,వర్తక వాణిజ్యం ,మెరుగైన జీవితం కోసం ,మొదలైన ‘’సహకార ఉద్యమం ‘’.ఈ రెండు ఉద్యమాలు ఐరిష్ జాతీయ సంస్కృతీ వికసనం కోసమే ఏర్పడ్డాయి .
ఈ ఉద్యమాలలో ఐరిష్ కవులు ,జానపద గేయ కర్తలు కళాకారులు ,విద్యావేత్తలు ,ఆర్ధిక సామాజిక వేత్తలు ,వ్యవసాయదారులు నిపుణులు అందరూ చేయి చేయి కలిపి పని చేశారు .జార్జి రసెల్ ‘’ఏ యి ‘’అనే మారుపేరుతో కవిత్వం రాసి ప్రేరణ కలిగించాడు .ఈ మహోద్యమాలలో తానూ మమేకంయ్యాడు యేట్స్ .ఉద్యమాలు తీవ్ర రూప దాల్చి తీవ్రవాదమైంది .ఉద్యమాన్ని అణచి వేసే ప్రయత్నాలూ తీవ్రంగా సాగాయి .తిరుగుబాటు ప్రతిచోటా తీవ్రమైనది.కొద్దిమందితో ప్రారంభమైన ఉద్యమం దేశమంతా ప్రాకింది .ఐరిష్ పునరుద్ధానం విప్లవం తో ముగిసింది .కవుల రక్తతర్పణం తో ‘’ఐర్’’ఏర్పడింది .గేలిక్ లీగ్ సంస్థాపకుడు ,కవి డగ్లాస్ హైడ్ ఐర్లాండ్ కు మొట్టమొదటి ప్రెసిడెంట్ అయ్యాడు .
ఐరిష్ సాహిత్యం దియేటర్ లోనూ మార్పు తెచ్చింది .దీనిలో యేట్స్ ప్రవేశించి,లీనమై చలనం తెచ్చాడు .బౌద్ధిక ఉద్యమం లో చురుకుగా పని చేసిన మాడీ గానే అనే అమ్మాయిని యేట్స్ ప్రేమించాడు .ఆమెనే దృష్టిలో పెట్టుకొని నాటకాలు రాశాడు .అంతరార్ద నాటకాలు రాసి ప్రఖ్యాతి చెందాడు .క్రమంగా ఐరిష్ కవులలో మార్గ దర్శి అనిపించుకున్నాడు .పారిస్ లో జే. ఏం .సిన్జ్ అనే నాటక రచయితనుకలిసి ‘’ఆరన్ ‘’అనే ఆదిమ జాతి ప్రదేశానికి ,ఆ ప్రజల మధ్యకు తిరిగి రమ్మని పిలిచాడు . బైబిల్ ను వారి భాషలోకి అనువాదం చేయించాడు ఆయనతో .ఐరిష్ జాతీయాలను పలుకు బడులను అందులో చొప్పించి రాయించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-15-ఉయ్యూరు

