-నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
32-పుష్పగిరి పీఠఆస్థానపండితులు ,తత్వ శాస్త్ర పారంగత –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు
జనన విద్యాభ్యాసాలు
ఆధునిక కాలం లో గీర్వాణ భాషలో లోతైన పాండిత్యం కలిగి మహా ప్రతిభావంతంగా కావ్య రచన చేసి ఆంద్ర దేశానికి చెందిన అసలైన పీఠంఅయిన పుష్పగిరి పీఠ ఆస్థాన పండితులుగా గౌరవం పొంది ,సహజ పాండితీ గరిమతో ,అరుదైన శాస్త్ర పాండిత్యం తో బహు గ్రంధ కర్తృత్వం తో వన్నె కెక్కిన అసమాన పండితకవులు ,మన విజయ వాడ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజులు శర్మగారు .శ్రీ గరిమెళ్ళ సూర్య నారాయణ ఘనాపాఠీ , శ్రీమతి సూర్య కాంతమ్మల దంపతుల పుత్రులు .తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటతాలూకా ‘’అవిడి ‘’గ్రామం లో 5-8-1950లో శ్రీ వికృతినామ సంవత్సర నిజాషాఢ శ్రీ కృష్ణాష్టమి నాడు జన్మించారు .సంస్కృతాంధ్రాలలో ఏం .ఏ .సాధించారు .
ఉద్యోగ సోపానం
తూర్పు గోదావరిజిల్లా అమలాపురం లోని ఎస్ .కే.బి ఆర్ .కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా1979నుండి 89వరకు పని చేశారు.తర్వాత విజయ వాడ కే బి యెన్ కళాశాల లో 1989-నుండి 2007వరకుతెలుగు ఉపన్యాసకులుగా సేవలందించారు. ఉద్యోగ విరమణానంతరం విజయవాడలో స్థిర పడ్డారు .
వివాహం సంతానం
సోమయాజులు శర్మగారు ముమ్ముడివరం కు చెందిన శ్రీ నూకల శ్రీ మన్నారాయణ ,శ్రీమతి రాజేశ్వరి దంపతుల కుమార్తె శ్రీమతి రాజ్య లక్ష్మి గారిని 1996లో వివాహ మాడారు .ఈ దంపతుల వంశోద్ద్దారకుడు ,కులదీపకుడు రవి తేజస్సుతో విరాజిల్లే ఛి సూర్య తేజ.
అందుకొన్న బిరుదులూ ,పదవులు
శాస్త్ర సాహిత్యాలలో సోమయాజులుగారి ప్రతిభ కు గుర్తింపుగా శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పండితులుగా గౌరవ స్థానం లో ఉన్నారు .కృష్ణాజిల్లా అధికార భాషా సంఘ .సభ్యులు .
సోమయాజులు శర్మగారుపొందిన ‘’సహజ పాండిత్య ‘’బిరుదం అన్వర్ధం..శ్రీ పుష్పగిరి శంకరాచార్య స్వామి ‘’విద్యా విభూషణ ‘’బిరుదునిచ్చి సత్కరించారు .విజయవాడ దేవీఫౌందేషన్ వారు ‘’తత్వ శాస్త్ర పారంగత ‘బిరుదు ప్రదానం చేసి సన్మానించారు .
ప్రవ్రుత్తి
సంస్కృతాంధ్ర భాషలలో శాస్త్ర ,కావ్య గ్రంధ రచన .పుష్పగిరి పీఠ చాతుర్మాస్య సమయం లో అవధానాలు నిర్వహించటం .అముద్రిత తాళ పత్ర, లిఖిత గ్రంధ సేకరణ ,వాటిని పరిష్కరించి శుద్ధప్రతులను తయారు చేసి భద్ర పరచటం ,సాహిత్య ,ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయటం శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారి ప్రస్తుత ప్రవ్రుత్తి ,వ్యాసంగం .
గబహుగ్రంద కర్త
శ్రీ సోమయాజులు శర్మగారు అనేక గ్రంధాలను గీర్వాణ ,ఆంధ్రాలలో రచించారు .అన్నీ ప్రసిద్ధి చెందినవే .
సంస్కృత రచనలు
1–ద్వాదశీ వ్రత మహాత్మ్యం (అంబరీషోపాఖ్యానం )-దీన్ని మైసూరు సుధర్మ సంస్థ ప్రచురించింది 2మహా భారత కంట కోద్దారః 3-కర్నాటసాహిత్య దర్శనం (హిస్టరీఆఫ్ కన్నడా లిటరేచర్ ఇన్ సాంస్క్రిట్ )
సంస్కృత లఘు కృతులు
1-శ్రీశైల లింగాష్టకం 2గోపాల కవేః కాలః 3-సుధార్మాభి నందనం 4-సమస్యా పూరణం 5-శ్రీ వినాయక పంచ రత్నం 6-అశ్వధాటీ వృత్త లక్షణ విచారః 7-శ్రీ వెంకటేశ్వర స్తుతిః 8-హల్లోహల శబ్దార్ధ విమర్శః 9-భట్ట వచనం సత్యమేవ 10-సుధార్మాభి వర్ధనం 11-శ్రీరామ నవమీ 12-ఆమోదః (శ్రీ మహేశ మాలా పీఠిక )13-కళావికాసః (పుష్ప బాణ విలాస పీఠికా )14-ఆనంద మందారః (బెల్లం కొండ రామ రాయ కవిః-అముద్రితం )15-అమృత సందేశః (మేఘ సందేశ పీఠికా)
తెలుగు రచనలు
పద్యకావ్యాలు –వాల్మీకి వృత్తాంతం ,శ్రీ వెంకటేశ్వర శతకం ,శ్రీ వెంకట రామ యశో వికాసం ,శివ మహాత్మ్యా ఖండం ,శివ కర్ణామృతం
లఘు పద్యకావ్యాలు –పంచ రత్నాలు ,సరస్వతీ దండకం ,దివాకర్ల ప్రశంస ,విశ్వనాధ మహా కవి ,శ్రీ రామ విభక్తి స్తవం ,వారణ మాల ,తెలుగు భాషా వైభవం ,ఉగాది పద్యాలు ,కర్షక నవ రత్న మాలిక .
శర్మగారు అనేక గ్రంధాలకు బృహత్ పీఠికలు రాశారు –ఆంద్ర మాఘానికి భూమిక ,శంకర విజయానికి ఆముఖం ,వాసుదేవ మననం కు ఉద్యోతం ,సూత సంహితకు న్యాసం ఆంధ్ర బ్రహ్మ సూత్రాలకు వేదాంత దర్శనం మొదలైన బృహత్ పీఠికలను ,13రాశారు .
లఘు పీఠికలు –కొప్పు లింగేశ్వర మహాత్మ్యం ,మోక్షసోపానం గాయత్రీ కల్ప వృక్షానికి వరివస్య విష్ణు సహస్ర నామ స్తోత్రానికి ప్రవేశిక ,మారుతి రామాయణానికి సంజీవని ,పరివ్రాజ చంద్రికకు విన్నపం మొదలైన 33గ్రంధాలకు లఘు పీఠికలు సంతరించారు .
వ్యాసాలు
శర్మగారు శర పరంపరగా వ్యాస వాహిని ప్రవహింప జేశారు .భాగవత సంపద ,ఈశాన సంహిత ,కల్ప వృక్షం –నావిక పరిభాష ,బెల్లంకొండ రామరాయ కవి ,కోన సీమ వాజ్మయ సేవ ,కల్ప వృక్షం –నాట్య శాస్త్రం ,సంగీత శాస్త్రం ,సమగ్రాంధ్ర సాహిత్య సమాలోచనం ,మకర సంక్రాంతి ,చత్వారి శృంగాః ,శ్రీ లంకా వెంకట రాయ శాస్త్రి ,ప్రయోగ రత్నమాల మొదలైన 37వ్యాసాలను వివిధ విషయాలపై రాసి వెలుగు నిచ్చారు .
అనువాదాలు
తరల సంగ్రహం ,తత్వ బోధ ,సర్వ సిద్ధాంత సంగ్రహం ,సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి ,తైత్తిరీయోపనిషత్ ,పరివ్రాజక చంద్రిక మొదలైన 6అనువాద గ్రంధాలు రాశారు .
వ్యాఖ్యాన లహరి
సోమయాజులు శర్మగారు అనేక కావ్యాలకు వ్యాఖ్యానాలు రచించారు .జగన్నాధ పండిత రాయల యమునాలహరికి గంగా లహరి ,విష్ణు లహరి లకు –అమృత ధారా వ్యాఖ్య ,అనులోమ విలోమ రాఘవ యాదవీయానికి –హరిప్రియా వ్యాఖ్య ,అశ్వ దాటీ కావ్యానికి –నవ వీధీ వ్యాఖ్య రచించి ఆ కవుల కవితా ప్రభావాన్ని తెలియ జేశారు .
పరిష్కరణలు
శ్రీ శర్మగారు గ్రంధ పరిష్కరనలోనూ తన ప్రతాపాన్ని ప్రదర్శించారు –సూతసంహిత ,శ్రీ భద్రాద్రి రామ శతకం ,శబర శంతన విలాసం ,భోగినీ దండకం ,స్తోత్ర ముక్తావళి ,తైత్తిరీయోపనిషత్ ,మైరావణ చరిత్రం ,కూచి మంచి సామ్బకవి రాసిన కుమారసంభవం మొదలైన 10 గ్రంధాలు పరిష్కరించి ప్రచురణకు తోడ్పడ్డారు .
అముద్రితాలు
సోమయాజులు శర్మగారి అముద్రిత గ్రంధాలు ముఖ్యం గా మూడున్నాయి అవి –కల్ప వృక్ష శిల్ప సమీక్ష ,ఆంద్ర పురాణ సమీక్ష ,పోతన కృతులు
గరిమెళ్ళ వారిరచనలపై పరిశోధనలు
1-గరిమెళ్ళ వారి పద్య కావ్యాలపై శ్రీ జి చలపతి రావు (నాగార్జున విశ్వ విద్యాలయం ),2-కర్ణామృత త్రయం –ఆంధ్రానువాదములు –తులనాత్మక పరిశీలన –శ్రీ షేక్ బాపూజీ (నా వి వి.)3-గరిమెళ్ళ సంపూర్ణ వాజ్మయం –శ్రీ పి.ఉమానాద శర్మ (బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం ) పరిశోధనలు చేసి పి.హెచ్ డి పొందారు .మేలు రచనలు గరీయంగా చేసి గరిమెళ్ళ వారు ఆంద్ర సాహిత్యాకాశం లో ప్రకాశిస్తున్నారు .వారు నిజంగా సాహిత్య యజ్ఞం చేసిన సోమయాజులు .మరిన్ని సార్ధక గ్రంధాలు వారు వెలువరిస్తారని ఆశిద్దాం .
ఈ రచనకు ఆధారం –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు స్వయంగా ఈ రోజు నాకు పోస్ట్ లో పంపిన వారి ‘’బయో డేటా’’వారి రచనలు .ఇందుకు వారికి కృతజ్ఞతలు .వారి చిరునామా ,ఫోన్ నంబర్ అందజేసిన శ్రీ రావి మోహనరావు (చీరాల )వారికి ధన్యవాదాలు.
సోమయాజులుగారి ఫోటో జత చేశాను చూడండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-15-ఉయ్యూరు


