-నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
33-జాను౦పల్లి గోపాల రాయ (1650)
‘’అష్ట భాషా బహిరి గోపాల రావు ‘’అని పిలువబడే గోపాలరాయ జానుం పల్లి వీరమ్మ ,వెంకట లకుమారుడు .17వ శతాబ్దం మధ్యభాగం లో జానుంపల్లివంశ రాజులు వనపర్తి సంస్థాన పాలకులు .1650కాలం వాడు .అతని రాజధాని వనపర్తి దగ్గరున్న సూగూరు .రెడ్డికులస్తులు .కవిపండిత పోషణతో బాటు స్వయంగా రాజు కవి .బహుభాషా వేత్త .ఎనిమిది భాషలు వచ్చు .’’అందుకే అష్ట భాషా బహిరి ‘’అని పిలిపించుకొన్నాడు .బహిరి అనేది వనపర్తి రాజుల వంశ పారంపర్య నామం .’’షడ్ దర్శన వల్లభ ‘’అనే సార్ధక బిరుదూ ఉంది .’’రామ చంద్రోదయం ‘’అనే యమక కావ్యాన్ని ,శ్రీరంగ మంజరీ భాణం’’ను రాశాడు .
రామ చంద్రోదయం క్లిష్టమైన యమక కావ్యం .5ఉచ్వాసాలతో 295శ్లోకాలతో ఉంది .వ్యాఖ్యానం లేకుండా అంగుళం కూడా కదలలేము .రాజు తానె స్వయంగా ‘’విజ్ఞానార్ధ దర్పణం ‘’అనే వ్యాఖ్యానం రాశాడు .పూర్తీ రామాయణ గాద .మొదటి అధ్యాయం లో అయోధ్య వర్ణన ,రామాదుల పుట్టుక వర్ణించాడు .రెండవ దానిలో వసంత ఋతువు దశరధుని జలక్రీదాడున్నాయి .మూడులో విశ్వామిత్ర ప్రవేశం ,ఆయనతో సోదరులిద్దరు యజ్న రక్షణకు వెళ్ళటం బల అరిబల విద్యలు నేర్వటం .తాటాక సుబాహు వధ మారీచుడిని బాణం తో పార ద్రోలటం ,గంగావతరణం మిధిలా ప్రవేశం ఉన్నాయి. నాలుగులో జనకుని స్వాగతం సీతారాముల సమాగమం ,దశావతార వర్ణన లో పది దశల ప్రేమ ను వ్యక్తం చేయటం ,శివ ధనుర్భంగం ఉంటాయి. చివరి అధ్యాయం లో సీతారామ వివాహ వర్ణన చాలా విస్తృతంగా చేశాడు కవి .అయోధ్యకు తిరుగుప్రయాణం పరశురామ గర్వ భంగం ఉన్నాయి .చివరి శ్లోకాలలో రాముడిని అడవికి పంపటం వాలివధ ,సుగ్రీవ పట్టాభిషేకం సేతు బంధనం రావణ వధ ,శ్రీరామ పట్టాభ్హి షేకం తో పూర్తీ .
వ్యాకరణ విద్యార్ధులకు,కొత్తగా కవిత్వం రాసేవారికి ఈ కావ్యం కర దీపిక .ప్రారంభ శ్లోకం –
‘’శ్రీ వేంకట పురపతిం స్థిర సత్ప్రభావం శ్రీ రామ చంద్ర మనిశం హృది భావ యామి –నశ్యత్య బాహ్యమపి భూరి తమః ప్రజానాం సర్వార్ధ సాధ్విది గమో స్తి చ యత్ప్రసాదాత్ ‘’
కవి తన గురించి తానూ ఇలా చెప్పుకొన్నాడు
‘’శాట్చాస్త్రీ పార దృశ్వా సరస మృదు వచరారాల్లాధ్య నానా కవీంద్ర –స్తుత్యః స్వారేష భాషా కృత బహు మధురోదార చిత్ర ప్రబందః ‘’ అని చెప్పుకొని ఇంత గొప్ప కవిత్వం తనకు శ్రీ రామ చంద్రుని కటాక్షం వలననే లభించిందని వినయంగా చెప్పుకొన్నాడు –
‘’అక్రుతసనామా ధీరం యమక కృతిం కాళిదాస నామా ధీరం –అన్యో నామా ధీరం సుకవిం తత్ప్రధయాయి తుమదునా మధీరం .
శబ్దాలతో చెడుగుడు ఎలాఆడాడో చూద్దాం –
‘’యతో యతో యతో యతోదయం పికర్తునిధి సః-రమా రమా రమా రమాయత తాత తోధవైజయీ ‘’
రెండర్ధాల శ్లోక వైభవం చూద్దాం –
‘’మంజులతా గణికానాం జగృహే మధుపేన పుష్పతాగనణికానాం-జాతిరుత గణికానాం ననుశ్రుతా నోచితజ్ఞాత గణికానాం ‘’ఈ శ్లేష పగలకొట్టి అర్ధం చేసుకోవటానికి శోష పడాలి .
ప్రేమలో ఉన్న పది అవస్థలను అద్భుతంగా వర్ణించాడు .చివరికి రామ రాజ్యాన్ని వర్ణించాడు –
‘’రామితా గాదిభి శ్శామితా జనతా శమితాన నాశ మితాన వ్రుషాః-పరమాయురవాప రమామాఖిలః పరమామపి నోపరమార హృది ‘’
గోపాల రాయని రెండవ రచన ‘’శ్రీ రంగ మంజరీ భాణం’’ను మృదు మధురంగా రాశాడు .మహబూబ్ నగర్ శ్రీరామాలయ ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .తన రాజధాని సూగూరును వర్ణించాడు .తన భాణాన్ని’’కోష్యేష ప్రచురే గిరం మధురిమా కోప్యార్ధ గంభీరిమా –సర్వం నూతన మేవ సూత్రితమహో యన్నాన్య సాధారణం –భాణో స్మిన్ కవినాసయే సుమహాన్ భాగ్యస్య పాకోహినః ‘
కాళిదాస కుమార సంభవాన్ని గుర్తుకు తెస్తుంది .శ్రీరంగ నాద దర్శనానికి రధాలలో వచ్చే వివిధ దేశాలనుంచి వచ్చిన మహిళను చక్కగా వర్ణించాడు .ఘూర్జర ,నేపాల లాట దేశ స్త్రీలను వర్ణించాడు .చంద్రోదయం తో సమాప్తి చేశాడు .భరత వాక్యమూపలికాడు .అక్కడక్కడ ప్రాకృతం వాడాడు .చివరి శ్లోకం –
‘’దేవః పంచ శరః ప్రపశ్యతు వియుగ్దీనాన్ దయాలోకితే –స్స్వాన్న్కాంతా నను గృహ్నతాంమృగ ద్రుశ స్సంత్య క్తమా నాస్శ్వయం ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-15-ఉయ్యూరు

