శ్రీ శంకరం లోక శంకరం
వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర జయంతి –ఆది శంకరాచార్య జన్మించిన రోజు .దానిని నిన్న 11వ తేదీ బుధవారం కృష్ణానదీ తీరం సమీపం లో ఉన్న శ్రీ రామ చంద్రుడు ప్రతిష్టించిన ఉభయ రామేశ్వర క్షేత్రంగా ఖ్యాతి చెందిన ఐలూరు కు రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్న కూడేరు గ్రామం వాసి , నాకు 30ఏళ్ళుగా పరిచయం ఉన్నవారు నాతొ పాటు ఉయ్యూరు హైస్కూల్ లో లెక్కల మేష్టారు గా పని చేసినవారు మాంచి బాడ్మింటన్ ,వాలీ బాల్ ప్లేయర్ ,గణిత శాస్త్ర బోధనలో దిట్ట ,క్రమశిక్షణకు మారు పేరు ,సహాయ సహకారాలలో ముందుండే సహృదయులు ,స్నేహానికి చిరునామా సరసభారతికి ఆత్మీయులు ,మాకుటుంబ మిత్రులు అయిన శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రిగారు వారి స్వంత దేవాలయ సముదాయం లో ఉదయం 9గం లకు నిర్వహిస్తూ నెలరోజుల నాడే నన్ను ఆహ్వానించి నాలుగు ముక్కలు భాగవత్పాదులపై మాట్లాడమని కోరారు .మేమిద్దరం, మా మూడవ కోడలుశ్రీమతి రాణి ,మనవరాలు ఛి రమ్య కారులో ఉదయం 8గంటలకు కూడేరుకు కనకవల్లి దేవరపల్లి మీదుగా వెళ్లి కృష్ణ కరకట్ట ఎక్కి ,దారిలో ఐలూరు లో శ్రీ రామ లింగేశ్వర స్వామిని దర్శిద్దామని పావు తక్కువ తోమ్మిదికే అక్కడికి చేరగా గుడి తలుపులు తాళం వేసి ఉన్నాయి కటకటాల తలుపు లోంచి స్వామి లింగాన్ని దర్శించి తరించం .ఈ స్వామిని సుమారు 26ఏళ్ళక్రితం నేను మేడూరు హెడ్ మాస్టారుగా పని చేసినప్పుడు స్కూల్ పిల్లలను ఫీల్డ్ ట్రిప్ గా ఐలూరు తీసుకు వెళ్లి కృష్ణానది ఒడ్డుకు తీసుకు వెళ్ళే ఆలోచనలో ఉంటె , మేడూరు మహిళామండలి వారు మా అందరికోసం సుమారు 500మందికి లడ్డూలు ,పులిహోర చేసి రిక్షాలో మా వెనక పంపిన జ్ఞాపకం ఇంకా ఉంది .’’కటకటాల దర్శనం’’ తర్వాత సరాసరి కూడేరు శాస్త్రిగారింటికి చేరాం .ఇంటి దగ్గర మేము బయల్దేరే టప్పుడే టిఫిన్ చేసేశాం .ఇప్పుడు శాస్త్రిగారి భార్య ఇచ్చిన కాఫీ త్రాగాం.ఇంకా ఆయనకాని ఆవిడకాని స్నానాలు చేయలేదు .కూడేరు అల్లుడు శ్రీ ఫణి అభిషేక కార్య క్రమం కోసం కలిదిండి నుండి వచ్చారు. కలిదిండి అంటే శ్రీ పాతాల భోగేశ్వర స్వామి ఆలయం గుర్తు ఉండే ఉంటుంది .అక్కడికి ఒకప్పుడు రాజ రాజ నరేంద్ర మహారాజు ఆస్థానకవి నన్నయ గారు రాజ మండ్రి నుంచి వచ్చి స్వామిని దర్శించి ఇక్కడి నాగ కన్య వృత్తాంతం విని ,అప్పటికే రాజు మహా భారతాన్ని అనువదించమని కోరగా నన్నయ ఉదంకో పాఖ్యానాన్ని గుర్తుచేసుకొని ఉదంకుడు చేసిన నాగ స్తోత్రాలకు శ్రీకారం ఇక్కడే చుట్టాడని ఐతిహ్యం .అంటే తెలుగు భారత రచన కలిదిండిలో ప్రారంభమైనదన్నమాట .కలి దిండి అంటే ఇది జ్ఞాపక మొచ్చింది .
కూడేరు శ్రీ శంకరుల విగ్రహానికి నమక చమకాలతో అభిషేకం బిల్వార్చన శంకర భగవత్పాదుల అష్టోత్తర పూజాఫనిగారి ఆధ్వర్యం లో చేశారు .తర్వాత శ్రీ దాసాంజనేయ స్వామికి తమలపాకులతో అష్టోత్తర పూజ నిర్వహించారు స్వామికి మేము నూతన వస్త్రాలు సమర్పించాం.తరువాత సభ మొదలైంది .నేను శ్రీ శంకరులపై మాట్లాడాను .నాకు శాలువా కప్పి ‘’చంద్రునికో నూలు పోగు ‘’అన్నారు శ్రీ శాస్త్రి .ఒక జ్ఞాపిక బహూకరించారు .నేను ఆయనకు సరసభారతి జ్ఞాపికను ‘’దైవ చిత్తం ‘’శ్రీ హనుమజ్జయంతి ఆహ్వాన పత్రాలు అందించాను .శ్రీ ఫణిగారికి జ్ఞాపిక ,కేమటాలజి పిత, దైవ చిత్తం తో బాటు వేదాశీర్వచనం చేసినందుకు 116 రూపాయలు తాంబూలం లో సమర్పించాను అక్కడికి వచ్చిన శ్రోతలు’’ ఆరుగురికి’’ మన ఈ రండు పుస్తకాలు , కరపత్రాలు అందజేశాను .స్వామి ప్రసాదం రవ్వకేసరి పులిహోర అందరికి అందించారు. బహు రుచిగా ఉన్నాయి రెండూ ..తరువాత శాస్త్రి గారింట్లో మాకు రసం మామిడి పండు తో సహా భోజన ఏర్పాటు చేశారు .పదార్దాలాన్నీ రుచిగా శుచిగా ఉన్నాయి .కమ్మగా భోజనం చేశాం. మా ఇద్దరికీ శ్రీ శాస్త్రి దంపతులు నూతన వస్త్రాలు ప్రదానం చేసి ఆశీర్వదించారు వెంటనే బయల్దేరి కట్ట మీదుగా వల్లూరు ద్వారా ఉయ్యూరుకు మధ్యాహ్నం రెండున్నరకు చేరాం .
సాయంత్రం ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయ స్వామి దేవాలయం లో శ్రీ శంకర జయంతి ణి సరసభారతి 92 సమావేశంగా చేశాం .శ్రీ శంకరాచార్య పటానికి అష్టోత్తర పూజ చేశాం .తరువాత ప్రముఖ గాయని శ్రీమతి వట్టెం శాంతిశ్రీ శ్రీ శంకర కృత దేవీ స్తోత్రగానం వీనుల విందుగా చేశారు .ఆమె సౌందర్య లహరి ని సిడి లుగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాని శ్రీ కంచి స్వామి సన్నిధిలో నాలుగు గంటలు పాడి వినిపించానని వారు దివ్య ఆశీస్సులందించి ముందుకు సాగమని చెప్పారని అన్నారు .మంచి ప్రయత్నం చేస్తున్నారని ,విజయ వంతం కావాలని నేను అన్నాను .ఇలా రెండు సార్లు శ్రీ శంకర జయంతి లో పాల్గొనే అదృష్టం కలిగింది .అక్కడా ఇక్కడా మాట్లాడిన మాటలనే ‘’శ్రీ శంకరం లోక శంకరం ‘’గా మీకు అందిస్తున్నాను .
‘’శ్రుతి స్మృతిపురాణామాలయ౦ కరుణాలయం-నమామి భాగవత్పాదశంకరం లోక శంకరం ‘’
‘’దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే –
స ఏవ శంకరాచార్యః –సాక్షాత్ కైవల్య నాయకః –
శ్రౌత స్మార్త ప్రతిస్టార్ధం భక్తానాం హితకామ్యయా
కరిషత్సవతారం స్వం శంకరో నీల లోహితః ‘’(శివ రహస్యం )
కంచి మఠం లెక్కల ప్రకారం క్రీ పూ .509లో జన్మించి ,క్రీ పూ 477లో కైవల్యం పొంది ,పాశ్చాత్యుల లెక్కప్రకారం క్రీ శ 788లో జన్మించి క్రీ శ 820 లో మరణించారు జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు .ఎవరివి యే లెక్కలైనా వైశాఖ శుద్ధ పంచమి ఆర్ద్రా నక్షత్రం లో జన్మించారు అని అందరూ అంగీకరించారు . కేవలం 32సంవత్సరాలు మాత్రమే జీవించి,ప్రస్తాన త్రయానికి భాష్యం రాసి ,రసగుళికలు అనదగిన సంస్కృత స్తోత్రాలు ,సౌందర్య లహరి శివానంద లహరి వంటి అనేక రచనలు చేసి సంస్కృత భాషను సుసంపన్నం చేసి దాన్నిసామాన్య జనాలకుఅందుబాటులో తెచ్చిన మహానుభావుడు .అందుకే స్వామి వివేకానంద ‘’In Sankara we see tremendous intellectual power throwing ,the scorching light of reason upon every thing ‘’అన్నారు .’’Sankara was not merely a philosopher ,not really a religious leader ,but he was the greatest nation builder and thought leader ‘’అన్నాడు ఎ.కే బెనర్జీ .జాతి నిర్మాత శంకరుడు .మాసానాం మార్గశీర్షోహం ‘’అని గీతలో కృష్ణుడు అన్నా వైశాఖ మాసం విశిష్టమైనదని నాకని పిస్తుంది .ఈనెలలో ఎందరో మహానుభావుల జయంతులు ఉన్నాయి .వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ నాడు సింహాచ నరసింహ స్వామి చందనోత్సవం ,పరశురామ జయంతి వీరశైవ మత స్థాపకుడు బసవనమంత్రి జన్మదినం .శుద్ధ పంచమిశ్రీ శంకర జయంతి, శుద్ధ షష్టి శ్రీ రామానుజ జయంతి .శుద్ధ చతుర్దశి శ్రీ నృసింహ జయంతి .పౌర్ణమి భగవాన్ బుద్ధ జయంతి అన్నమాచార్య జయంతి .వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి .మండు వేసవిలో ఇన్ని జయంతులు .అందుకే పానకాలు వడపప్పు ,మామిడిపళ్ళు తాటాకు విసన కర్రలతో ఉపచారాలు తాపోపశమనం అటు దేవుళ్ళకూ ఇటు మనకూ కూడా .
కలియుగం ప్రవేశించి అప్పటికి 3వేల సంవత్సరాలు అయింది .దేశం లో వేద విరుద్ధ భావనలు వ్యాపించాయి యజ్న యాగాదులు లేవు .వేదఅధ్యయ్యన అధ్యాపనాలు లేవు .రాజులు వైదికాన్ని వదిలేసి జైన బౌద్దాలవైపు చేరి పోషించారు .పాషండ మతాలన్నీ పెరిగిపోయాయి .దేవతలందరూ శివుడిని చేరి లోకోపకారం చేయమనిప్రార్ధించారు .బోళాశంకరుని హృదయం కరిగి పరిష్కారమార్గంగా తానే భూమిపై శంకరాచార్య స్వామిగా అవతరిస్తానని అభయమిచ్చాడు .కుమార స్వామిని భట్ట పాదునిగా ,బ్రహ్మను మండన మిశ్రునిగా ,ఇంద్రుడిని సుధన్వ మహా రాజుగా తనకంటే ముందే భూమి పై జన్మించమని ఆదేశించాడు .విష్ణువును పద్మ పాదాచార్యునిగా వాయుదేవుడిని హస్తామలకాచార్యునిగా ,అగ్ని దేవుడిని తోటకాచార్యునిగా ,వరుణ దేవుడిని చిత్సుఖా చార్యునిగా జన్మించమని కోరాడు .శుక మహర్షిని గౌడ పాద లేక గోవింద భగవత్పాద యతీ౦ద్రు నిగా పుట్టమని చెప్పాడు .ఒకప్పుడు బ్రహ్మ వేదం చదువుతున్నప్పుడు స్వరలోపం జరిగింది .ప్రక్కనే ఉన్న అర్ధాంగి సరస్వతి నవ్వింది .కోపం వచ్చి ఆమెను భూలోకం లో విష్ణు మిత్రునికి కుమార్తెగా జన్మించమని శాపమిచ్చాడు ఆమె యే ఉభయ భారతిగా జన్మించి మండనమిశ్రుని వివాహమాడింది .భట్ట పాదుడు జైమిని సూత్రాలకు తాత్పర్యం రాసి సుధన్వ మహా రాజుకు వినిపించి ఆయన అనుగ్రహాన్ని పొందాడు .రాజు సహాయం తో జైన బోద్దాచార్యులతో వాదాలు చేసి ఓడించి వైదికం వైపు జనాలను చేరేట్లు చేశాడు .శివుడు ఒక రోజు సుధన్వ మహా రాజు కలలో కన్పించి కేరళలో కాలడి దగ్గర పూర్ణానది తీరాన ఒక శివాలయం నిర్మించి నిత్య ధూప దీప నైవేద్యాలతో వర్ధిల్ల జేయమని ఆదేశించాడు. రాజు అలానే చేశాడు .ఇంతటి బృహత్ నేపధ్యం ఏర్పాటు చేసుకొని శివుడు శంకరాచార్యునిగా కాలడిలో నంబూద్రీ బ్రాహ్మణ కుటుంబీకు డైన శివగురు ధర్మ పత్ని ఆర్యాంబ లకు జన్మించాడు .ఈ దంపతులకు వృద్ధాప్యం సమీపిస్తున్నా సంతతి కలుగ లేదు .వారి ఇష్టదైవం పరమేశ్వరుని అనుగ్రహం కోసం చాలా చేసి చివరికి పొందారు .దీర్ఘాయుస్సు కల కొడుకు కావాలా అల్పాయుష్కుడైన తేజస్వి కుమారుడు కావాలా అని అడిగితె తేజస్వి నే కోరారు. ఆ దంపతులు .ఇలా శివానుగ్రహం వలన ఆర్యాంబ శంకరుని భర్త శివ గురువుద్వారా కన్నది . శ్రీ శంకరుని జీవితం పై అనేక గ్రంధాలు ఉన్నప్పటి కి ,విజయనగర స్థాపనకు హరిహర బుక్క రాయల ను ప్రేరేపించి న అద్వైత గురువులు శ్రీ మాధవ విద్యా రణ్య స్వామిరాసిన ‘’శంకర విజయం ‘’సాదికారికమైనది .నా రచనకు ఎక్కువగా శంకర విజయం ఆధారం .మిగిలినవాటినుండీ గ్రహించి రాసినవే .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ 12-5-16-

