ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -150

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -150

 59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -3

   ఒక ఏడాది తర్వాత ఇండియా లోని ఆగ్నేయ ప్రాంతం లో పోరాటం సాగింది .యుద్ధ వార్తాప్రతినిదిగా ఉన్న చర్చిల్ ఇక గోళ్ళు గిల్లు కుంటూ కూర్చోరాదని అనుకోని తన పై అధికారులకు తనకు  యుద్ధం లో పాల్గొనే అవకాశమిచచ్చి పఠాన్ల తిరుగు బాటు ను  అణచి వేసే బాధ్యతనిమ్మని కోరాడు  .దీనిలో విజయం సాధించి తన వ్యాసాల  వలన చర్యలవలన పొగడ్తలు సాధించాడు ..దిస్టోరీ ఆఫ్ ది మాలకండ్ ఫీల్డ్ ఫోర్సెస్ ‘’అనే పుస్తకం లో ఈ యుద్ధ విశేషాలను రాశాడు .ఇరవై మూడేళ్ళ కె ఈ పుస్తకం అచ్చు అయి మంచి పేరు తెచ్చింది ,ఆర్ధికంగా బాగా లాభించింది .రాయల్టీ వర్షమే కురిసింది .సెకండ్ లెఫ్టినెంట్ అయి మాంచి హుషారులో ఉండి’’సవ్రోలా ‘’అనే నవలను ఫిక్షన్ ,కల, కలగా పులగం గా రాశాడు .తిరుగు బాటుకు వ్యతిరేకి చర్చిల్ .’’ఆయన బ్లడ్ లో సైనికుడే ఉన్నాడుకాని రచయితలేడు’’ అని పిస్తాడు .ఆంగ్లో ఈజిప్షియన్ సైన్యం డేర్విషేస్ సుల్తాన్ కు విమోచనం కలిగించే దుందుడుకు చర్యలు చేబట్టాలని ఆలోచిస్తున్నప్పుదు తానూప్రచారం లో భాగంయ్యాడు .పై అధికారుల్ని ఒప్పించటానికి కష్ట పడాల్సి వచ్చింది .కమాండర్ ఇన్ చీఫ్ సర్ హెర్బర్ట్ కిచేనర్ కు చర్చిల్ ను తీసుకొనే ఉద్దేశ్యం లేదు .అతని తల్లి వెనకాల ఉండి కద నడిపించింది .21వ లాన్సేర్ కు సూపర్ న్యూమరరి లెఫ్టినెంట్ అయి ,కరేస్పాన్డెంట్ గా స్థానం పదిల పరచుకొన్నాడు .

   సూడాన్ యుద్ధం చర్చిల్  డబల్  ఢమాకాగా   పోరాట యోధుడిగా ,రచయితగా ప్రసిద్ధి చెందాడు .ఆండర్మాన్ యుద్ధం లో లాంసర్ దళం అద్వితీయ పోరాట పటిమ చూపి అతని ప్రతిభ నాయకత్వం వలన గెలుపు లభించింది .దీనిపై రాసిన ‘’ది రివర్ వార్ ‘’పుస్తకం విమర్శకులకే కాక సాధారణ చదువరులను  కూడా  ఆకర్షించి ,చాలా పెద్ద ఖరీదైన పుస్తకం అయినా కొన్ని నెలలోనే పునర్ముద్రణ పొందటం విశేషం .24 ఏట ఇంగ్లాండ్  కు తిరిగి వెళ్లి ఈ  ‘’సోల్జర్ జర్నలిస్ట్ ‘’మళ్ళీ రాజకీయాలలో తన సత్తా చాటుకొనే ప్రయత్నం చేశాడు .సరైన దిశా ఆలోచనలు లేని కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్ధిగా ఉప ఎన్నికలో పోటీ చేశాడు .టోరీల ప్రాధాన్యత ,స్టాటస్కోవిధానం అంగీకరించాడు .’’టిటేస్ బిల్లు ‘’కు మద్దతుపలికాడు .అది జనాభిప్రాయానికి విరుద్ధంగా ఉందని తెలిసి ఉపసంహ రించాడు .హౌస్ ఆఫ్ కామన్స్ నాయకుడు ఆర్ధర్ బాల్ఫోర్ ఈ ఫిరాయింపు చూసి ‘’ఈకుర్రాడు పనికోస్తాడను కొంటె వాగ్దానాల మోజులో పడ్డవాడిగా కనిపిస్తున్నాడు ‘’అని హేళన  చేశాడు .ఈ ఎన్నికలో చిత్తూ గా ఓడిపోయాడు చర్చిల్.తప్పు తెలుసుకొని చెంపలేసుకొని మళ్ళీ సోల్జరింగ్ అంటూ యుద్ధ వీరుడయ్యాడు .సుడి ఎక్కడో ఉండి ఆరు నెలల తర్వాత హీరో అయ్యాడు .

  దక్షిణాఫ్రికా చర్చిల్ కు పెద్ద దృశ్యమే అయింది .ఆరంజ్ ఫ్రీస్టేట్ లోని ట్రాన్స్ వాల్లోని బోయర్లు అనబడే  రైతులు ,ఆంగ్ల సంపన్నుల దాడి ని వ్యతిరేకించారు .అక్కడి బంగారు వజ్రాల గనుల ఖనిజ సంపద పై బ్రిటిష్ వాళ్ళ కళ్ళు పడి దోచుకొనే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి చిన్న చిన్న స్వతంత్ర రిపబ్లిక్ లను ఏకం చేసి  ‘’శ్వేత చత్రం ‘’కిందకు తెచ్చే ప్రయత్నం లో ఉన్నారు .ఇంగ్లాండ్ సైనిక దళాలు ట్రాన్స్ వాల్ సరిహద్దులో దిగగానే ప్రెసిడెంట్ పాల్ క్రూజర్ ఒక అల్టిమేటం జారీ చేయటం ,లండన్ యుద్ధం ప్రకటించటం చక చకా జరిగి పోయాయి .దక్షిణాఫ్రికా యుద్ధాన్ని బుజాన మోసిన టోరీ ఇ౦పీరియలిస్ట్ లపై  లిబరల్స్ ,రాడికల్స్ దాడి చేశారు .దీనితో తలబోప్పికట్టి పరువు బజారున పడిన ‘’ఘనత వహించిన బ్రిటిష్ ప్రభుత్వం ‘’మూడేళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది .ఏదో రకంగా విజయం దక్కించుకొనే ఆలోచనలో ఆంగ్లప్రభుత్వం ఒక లక్షా ఇరవై వేలమంది బోయర్ మహిళలను,పిల్లలను ఒక కాన్సేంట్రేషన్  కాంప్ లో పెడితే అందులో 20వేల మంది సైనిక దౌర్జన్యానికి బలై చనిపోయారు .పరువు ప్రతిష్టలు పాతాళం లోకి జారిపోయినా ,చర్చిల్ పేరు మాత్రం బాగా ప్రచారమైంది . ‘’మార్నింగ్ పోస్ట్ ‘’పత్రికకుయుద్ధ ప్రతినిధిగా  దక్షిణాఫ్రికా వెళ్లి ,ఒక పాడైపోయిన యుద్ధ రైల్ లో ప్రయాణం చేసి ,తనే నాయకత్వం వహించి వెడుతుండగా రైలు పట్టాలు తప్పగా చర్చిల్ ను వల వేసి  పట్టి బందీని చేశారు .రెండు వారాల తర్వాత తప్పించుకొన్నాడు .ఆయనపై నిఘావేసి పట్టిస్తే పాతిక పౌండ్లు నజరానా ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే ‘’నా విలువ పాతికేనా ‘’?అని గునిశాడు .అతని ఆచూకీ కోసం వేసిన పత్రాలలో ‘’25 ఏళ్ళ ఇంగ్లీష్ వాడు అయిదడుగుల ఎనిమిది అంగుళాల పొడవు ,అందరికంటే భిన్నమైన శరీరం ,ముందుకు వంగి నడిచే నైజం ,పాలి పోయినట్లుండే ముఖం ,రాగి రంగు జుట్టు ,కనిపించీ కనిపించని మీసం, ముక్కు మాట ,’’ మాటల్లో ఎస్ ‘’అక్షరాన్ని పలకలేని తనం ఉన్నవాడు’’అని రాశారు . బ్రిటిష్ కాలనీకి అద్దేకారు లో కలప దుంగల కింద దూరి  పారి పోయి ఉంటాడని అనుమానించారు .చర్చిల్ రాసిన రిపోర్ట్ లను మిలిటరీ అధికారులు ఛీ కొట్టారు .అందులో చర్చిల్ బోయర్ ల సుపీరియారిటీ,గొప్పతనపు ప్రశంస తప్ప  తప్ప న్యూస్ ఏదీ లేదన్నారు .ఒక గ్రూపు బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్లు చర్చిల్ కు టెలిగ్రాం పంపుతూ ‘’నీ ముఖ్య స్నేహితులు ఇక్కడ నువ్వు మరింత గాడిద లాగా గుర్తి౦ప బడకుండా వెంటనే ఇంగ్లాండ్ తిరిగి రావాలని కోరుకొంటున్నారు ‘’అని వార్త పంపారు .పై అధికార్లు చీదరించినా తడబాటు పడలేదు .అతనిది ‘’పతాక శీర్హిక విజయం ‘’(హెడ్ లైన్ విక్టరి ).అదే అతనికి ఆనందం .నమ్రత గా  ఉండాలనుకొంటాడుకాని స్వీయ మౌనాన్ని భరించలేడు .ఏది ఏమైనా ఇరవై ఏళ్ళ నడి వయసులో చర్చిల్ ఇంగ్లాండ్ దేశ జాతీయ విగ్రహ మూర్తి (ఐడల్ )అనిపించుకొన్నాడు .

          మెప్పులూ మెహర్బానీలతో ఉన్న చర్చిల్ ఒల్ద్ హాం కు తిరిగొచ్చి ప్రజాసేవలో పడ్డాడు .దేశభక్తి విషయం లో మచ్చ లేని వాడని పించుకొన్నాడు కనుక రాజకీయ గెలుపు సమస్య కాలేదు .ఎన్నికల ముందే లెక్చర్ టూర్ టో లండన్ అంతా చుట్టేశాడు .దీనికి అయిదు వేల పౌండ్లు ,అమెరికా టూర్ లో మరొక పది వేల పౌండ్లు రాబడి వచ్చింది .అమెరికాలో చర్చిల్ ను ‘’5 యుద్ధాల వీరుడు ,6గ్రందాల రచయిత,ఇంగ్లాండ్ భావి ప్రధాని ‘’అని పొగిడారు .న్యు యార్క్ లో ప్రముఖ రచయిత మార్క్ ట్వేన్ ఒక సభలో చర్చిల్ ను పరిచయం చేస్తూ ‘’ఖచ్చితంగా పరిపూర్ణ (పెర్ఫెక్ట్ )వ్యక్తీ చర్చిల్ .అతని తండ్రి ఇంగ్లిష్ ,తల్లి అమెరికన్ ‘’అన్నాడు .అమెరికాలో ప్రసంగాలు ,పుస్తక పరిచయాలు పూర్తీ చేసు కొని ఇంగ్లాండ్ చేరే సరికి ‘’ఈ ఆంగ్ల దొర’’ చేతిలో లక్షణం గా ఒక లక్ష డాలర్లు పడ్డాయి .చర్చిల్ అదృష్టం తారాజువ్వ లాగా పైకి ఎగరటమే కాదు చాలా ఉన్నత స్థాయిలో నిలిచి,26వ ఏట నే బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ లో స్థానం పొందాడు .

      సశేషం

         మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-25-5-16-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.