బుధ జన హృదయ సభాపతి
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి కి మే నెల 26న 60 ఏళ్ళు నిండు తున్నసందర్భం గా మే నెల 27వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ”ష ష్ట్యబ్ది పూర్తీ ”మహోత్సవాన్ని కిన్నెర ఆర్ట్ అకాడెమి అధ్యక్ష కార్య దర్శులు శ్రీ గంధం సుబ్బారావు శ్రీ మద్దాళి రఘురాం గార్ల ఆధ్వర్యం లో ప్రచురించి ఆవిష్కరింప జేస్తున్న ”బుద్ధ యానం ”అభినందన సంచికకు నన్ను వ్యాసం రాసి పంపమని కోరగా రాసిన వ్యాసం -దుర్గా ప్రసాద్
విలక్షణ విశిష్ట వ్యక్తిత్వం
ఆయనదొక విచిత్ర చైతన్యం .తాను పెద్దల వద్ద గ్రహించిన విషయ సారాన్ని జనసామాన్యానికి అందించాలన్న తపన ,ఆ పెద్దలను విశాల వేదికలపై సత్కరించి ఋణం తీర్చుకోవాలన్న ధ్యేయం .మంచి ఎక్కడున్నా సంగ్రహించి భావితరాలను ఉత్తేజితులను చేయాలన్న ఆలోచన ,పాతది తీసి పారేసేది, కొత్తది అమాంతంగా కౌగలించుకొనేది కాదన్న సమతుల్యత ,తరతరాల భారత జాతి అన్నిరంగాలలో సాధించిన ప్రగతి నవ నాగరకతా వ్యామోహం లో అధోగతి కాకూడదన్న ఆవేదన ,తెలుగు భాషాసాహిత్య ,చరిత్ర ,సంస్కృతులను మనం కాపాడుకొంటూ ముందు తరాలవారికి అందిస్తూ సాగాలనే సత్సంకల్పం ,వెనుక పడి పోతున్న తెలుగును ,దాని వెలుగులను తెలుసుకోలేని ఆధునికులను గమనించి తెలుగు ను శాస్త్రీయత సాంకేతికత లతో పరిపుష్టిచేసి ‘’ యూని కోడ్ ‘’లను సాది౦ప జేసి యువకులను ఆకర్షించాలన్న పట్టుదల ,ఏ వేదికమీదైనా వీటి నే ప్రస్తావించి ,బుద్ధిజీవులను ,యవతను ,సామాన్యులను ,మహిళలను చైతన్య వంతులను చేస్తున్న ఆంద్ర ప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ నిజంగానే’’ బుధ జన హృదయ సభాపతి’’. .వ్యక్తిగా ,శాసన సభ్యునిగా ,అధికార భాషా సంఘ అధ్యక్షులుగా ,మంత్రిగా ,ఉపసభా పతిగా ఏ హోదాలో ఉన్నా ఆయన తెలుగు భాష సంస్కృతులకోసం ,భారతదేశ సమగ్రత కోసం అహరహం శ్రమిస్తున్న అలసట ఎరుగని ఉత్సాహ శీలి .సాటి శాసన సభ్యులకు ,మంత్రులకూ ,రాజకీయ నాయకులకూ పట్టని ఈ విషయాలపై జనానికి తన రుజు ప్రవర్తన శాంత స్వభావం ,భేషజం లేని వ్యక్తిత్వం ,కలుపుగోలుతనం ,అవగాహనా చాతుర్యాలతో,విజన్ తో ప్రేరణ కలిగిస్తున్న ఏకైక విశిష్ట వ్యక్తీ ,మహా మనీషి ..
క్రియా కార్య శీలి
భాషా సాహిత్యాలతో పాటు మనదే అయిన సంగీత నాటక ,చిత్ర,శిల్ప , కళా రంగాలనూ పరి పుష్టం చేసుకోవాలని ,వీటి అభివృద్ధికోసం మళ్ళీ ఎకాడమీలను పునరుద్ధ రించాలని నినదిస్తూ ,ప్రభుత్వానికి తెలియ బరుస్తూ జాగృతి కలిగిస్తూ మాటలతో కాక చేతలతో చేసి చూపిస్తున్న చాతుర్యం శ్రీ బుద్ధ ప్రసాద్ ది.కూచి పూడి కళా కేంద్రాభి వృద్ధి ,హంసలదీవి పర్యాటకాభి వృద్ధి ,ఘంటసాల బౌద్ధ స్తూప పరిరక్షణ ,శ్రీకాకుళం లో శ్రీ కృష్ణ దేవరాయల ,కాసుల పురుషోత్తమ కవి ల విగ్రహ స్థాపన ,శ్రీ కృష్ణదేవ రాయ ఉత్సవాలు ,కృష్ణా మహోత్సవాలు, దివి సీమ ఉత్సవాలు ,బందరు కోట ప్రాచీన వైభవం ,కృష్ణా జిల్లా సర్వస్వం వంటివి ఆయన ఆలోచనా విధానికి ,కళా వికసన ప్రాభవ చైతన్యానికి నిదర్శనలు .
చోదక ప్రేరక మార్గ దర్శి
తెలుగు భాషా సాహిత్యాలను తెలుగు దేశం లో కాపాడుకోవటానికి ,ప్రజా చైతన్యాన్ని కల్గి౦చటానికి భాషా సంఘాలతో కలిసి ఉద్యమించి తెలుగు కు ప్రాచీన హోదా సాధించి ప్రజా బలాన్ని ప్రభుత్వానికి తెలియ బరచినవారు శ్రీ ప్రసాద్ .మన రాష్ట్రం లోనే కాక భారత దేశం లో అనేక రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారు ఎదుర్కొంటున్న కష్టాలను ,అక్కడి ప్రభుత్వాలు తెలుగుకు చేస్తున్న చేటును గుర్తించటానికి ఆయా రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి ,అక్కడి ప్రభుత్వాలను కదిలించి ,తెలుగుకు ,తెలుగు ప్రజలకు మేలు చేయటం లో మార్గ దర్శి గా ఉన్నారు .ముఖ్యంగా తమిళనాడులోని హోసూరు ,తెలుగు వారికి ఒడిస్సాలోను ,మహారాష్ట్ర ,కన్నడ రాష్ట్రాల తెలుగు వారినీ ఇక్కడ జరిగే సభలకు ఆహ్వానించి ,వారి నోట వారెదుర్కొనే ఇబ్బందులను సమస్యలను చెప్పించి ,మనవంతు సాయమందించే సంకల్పం తో వారికి ఊరట కల్పించటంలో శ్రీ బుద్ధ ప్రసాద్ చూపించిన చొరవ నిరుపమానం .
సంస్కార మూర్తి
అమెరికా ,కెనడా ,మారిషస్ ,ఇంగ్లాండ్ ,మొదలైన దేశాలలో తెలుగు సభలలో పాల్గొని , వారితో మమేకమై ,వారు మన భాషా సాహిత్య సాంప్రదాయాలను పరిరక్షించుకొంటున్న తీరు చూసి ఉప్పొంగి పోయి అలాంటి చైతన్యం ఇక్కడ కూడా రావాలని ఉద్బోది౦చిన సాహసి శ్రీ బుద్ధ ప్రసాద్ .ఎవరో ఏదో అనుకొంటానే సందేహం, మొహమాటం లేకుండా మనం వెనకబడి పోతున్నామనే ఆవేదనతో ఆయన చేసే ప్రసంగాలు స్పూర్తిమంతాలై కర్తవ్య నిర్వహణకు మార్గ దర్శకాలయ్యాయి. ఇది ఆయన సాధించిన అద్భుత విజయం .ఆయనకు మాత్రమే సాధ్యమైన విషయం కూడా .మాట్లాడే ప్రతిమాటలో సంస్కారం ఉట్టి పడి మనం ఏమిటో మనకు ఎరుక కలిగిస్తుంది .ఇంగ్లాండ్ లో తెలుగు సాహితీ సేవ చేస్తున్న జ్ఞాన వృద్దు శ్రీ గూటాల కృష్ణ మూర్తి గారి ని ,మలేషియాలో శ్రీ మదిని సోమినాయుడు ,ఫ్రాన్స్ కు చెందినా శ్రీ డేనియల్ నేగెర్స్ మొదలైన భాషా సాంస్కృతిక సేవాపరాయణులనుకలిసి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో జరిగిన జాతీయ ,ప్రపంచ తెలుగు రచయితల మహా సభలలో వారితో స్పూర్తి పూర్వక ప్రసంగాలు చేయించి ,ఆ సభలను న భూతో గా నిర్వహించి ప్రపంచ వ్యాప్త ప్రశంసలను అందుకొనేట్లు చేయటం లో ప్రధాన సారధి శ్రీ బుద్ధ ప్రసాద్ . ఊరికే వేదికలపై ఉపన్యాసాలిస్తే అనుకొన్నది సాధించలేమని ,అవన్నీ అక్షర బద్ధమై తరతరాలకు వెలుగుల నివ్వాలని ,’’ఆచూకీ పుస్తకాలు’’గా ,కరదీపికలుగా నిలిచిపోవాలని భావించి ‘’తెలుగు పసిడి’’,వజ్ర భారతి ‘’కృష్ణా జిల్లా సర్వస్వం ‘’తెలుగు భారతి ,’’మణిదీపాలు’’ వంటి అత్యుత్తమ గ్రంధ ప్రచురణ చేయించిన క్రాంత దర్శి . ,అధికారం లో ఉన్నా లేకున్నా ప్రభుత్వాన్ని ఒప్పించి వారి సహాయ సహకారాలు అందేట్లు చేసి సభలను దిగ్విజయం చేయించిన ఘనత శ్రీ బుద్ధ ప్రసాద్ గారిదే.ఈ విజయాలలో భాగస్వామ్యులు కృష్ణా జిల్లా రచయితల సంఘ అధ్యక్ష కార్య దర్శులైన శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,డా జి వి .పూర్ణ చంద్, శ్రీ యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్ లు అనటం లో సందేహం లేదు .అంతటి దార్శనికులు శ్రీ బుద్ధ ప్రసాద్ .ప్రభుత్వ సంస్థలలో ,న్యాయ స్థానాలలో తెలుగును వాడటం పై దీక్షగా కృషి చేసి విజయం సాధించారు .సమస్య మూలాలను తరచి పరిష్కరించే నేర్పున్నవారాయన .
సుజన జన మనో రంజనం
కృష్ణా జిల్లాలోను ,ఇతర జిల్లాలోను ,రాష్ట్ర రాష్ట్రేతర౦గాను ఉన్న సాహిత్య సాంస్కృతిక సంస్థలతో ,అక్కడి కవులు రచయితలు ,పురాతత్వ వేత్తలు ,చిత్రకారులు ,నటులు ,సంగీతజ్ఞులు, విమర్శక విశ్లేషకులతో, ప్రయోగ శీలుర తో నిత్యం సంబంధాలను కలిగి వారి సభలలో పాల్గొని ,పుస్తకావిష్కరణలు ఇబ్బడి ముబ్బడిగా చేసి యువతను ప్రోత్సహించి , బుద్ధిజీవులను సత్కరిస్తూ ,అన్ని సాహిత్య ప్రక్రియలకూ చేయూత నిస్తూ’’ భువన విజయ రాయలు’’ గా ప్రేరణనిస్తూ నిత్య చైతన్య శీలిగా ,నిర్విరామ భాషా సాహిత్య కళా రాధక సేవకునిగా,తండ్రి స్వర్గీయ శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి వారసునిగా జీవితాన్ని ధన్యం చేసుకొంటున్నారు.
సరసభారతి తో సాన్నిహిత్యం
శ్రీ బుద్ధ ప్రసాద్ గారితో నాకు ౩౦ఏళ్ళుగా పరిచయం ఉంది .ఆయనంటే నాకు గొప్ప అభిమానం .రాజకీయ నాయకులు అందరూ ఆయనలాగా ఉంటే, ఆలోచిస్తే ,నడిస్తే యెంత బాగుంటుంది అనిపిస్తుంది .కృష్ణా జిల్లా ఉయ్యూరులో నా ఆధ్వర్యం లో సరసభారతి అనే సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆరేళ్ళక్రితం ఏర్పడి 20గ్రంధాలను ప్రచురించింది .అందులో నేను రాసినవి 13పుస్తకాలున్నాయి .సరస భారతి నిర్వహించే ఉగాది వేడుకలకు ,భాషా సదస్సులకు ,పుస్తకావిష్కరణలకు ,కదా సదస్సు ,గురజాడ ,రవీంద్రుల 150వ జయంతి ఉత్సవాలకు శ్రీ ప్రసాద్ విచ్చేసి నిండుదనం తెచ్చి చైతన్య స్పూర్తి కలిగి౦చారు .కనిపించగానే నమస్కరిస్తూ ‘’దుర్గా ప్రసాద్ గారూ బాగున్నారా ?’’అంటూ ఆప్యాయంగా పలుకరించే సంస్కారం ఆయనది .ఏ పదవిలో ఉన్నా ఈ తీరులో మార్పు లేదు .సభలలో అధికార దర్జా డాబూ దర్పాలూ ప్రదర్శించని అతి వినయ శీలి .సౌజన్య మూర్తి .
ప్రతిభా పురస్కారాలు
శ్రీ బుద్ధ ప్రసాద్ .రాష్ట్ర ,రాష్ట్రేతరాలలో తెలుగు భాషా సంస్కృతులకు విశేష సేవ లందిస్తున్నఉత్తమ సంస్థను నిష్పక్ష పాతంగా ఎంపిక చేసి తమ తండ్రిగారి జయంతి ఆగస్ట్ 4న’’మండలి వెంకట కృష్ణారావు ‘’స్మారక పురస్కారాన్ని స్వంత ఖర్చులతో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ద్వారా ను , తెలుగు భాషా సేవ చేస్తున్న విశిష్ట వ్యక్తికి ,కృష్ణాజిల్లా రచయితల సంఘం ద్వారానూ తమ తండ్రిగారి పేర నగదు పురస్కారాన్ని అందజేస్తూ అందరికి ఆదర్శ ప్రాయ౦గా ఉన్నారు .’’క్రీం ఆఫ్ ఇంటలిజెన్స్ ‘’అంటే ‘’ప్రతిభా నవనీతం’’ ఎక్కడున్నా గుర్తించి వారి సేవలను సభాముఖంగా అందరికీ తెలియజేసి ప్రేరణ కలిగించటం ఆయనకే సాధ్యం .ఇక్కడ కుల మత జాతి,ప్రాంత సంకుచిత భావాలకు తావే లేదు .ప్రతిభకే పట్టాభిషేకం .ఇది అందరికి సాధ్యంకాని విషయం . ఆయనకే సాధ్యమై ,చిర యశస్సుకు కారణమైంది .అందుకే ఆయన విశ్వ మానవడు .’’ఉదార చరితానాం వసుధైక కుటుంబకం ‘’అన్నది ఆయన పట్ల సార్ధక మైనది .
అభినవ కృష్ణ రాయలు
తెలుగు సాహిత్యం లో శ్రీ బుద్ధ ప్రసాద్ చదవని గ్రంధం లేదేమో ?అనుక్షణ పఠనం ఆయన కిష్టం..చదివింది మనసు పొరల్లో ముద్ర పడి ఉండటం ఆయన ప్రత్యేకత .The book is one which will serve to open the eyes even of those who are blind to the sufferings of those around them ‘’అని జస్టిస్ శ్రీ అల్లాడి కుప్పుస్వామి రావూరి భరద్వాజ గారి ‘’జీవన సమరం ‘’పై రాసింది ఆచరణీయం చేశారు ..చదవటం, చదివించటం తో పాటు గొప్ప రచనలూ చేశారు. భాషా సంస్కృతులపైనా ,తన విదేశే యాత్రానుభవాలపైనా పుస్తకాలు రాసి ప్రచురించి సమకాలీనులకు ,భావితరాలకు ఉత్తేజం కలిగించారు .లెక్కలేనన్ని గ్రంధాలనుఅభిమానంతో అంకితం పొందిన ‘’అభినవ కృష్ణ రాయలు’’ శ్రీ బుద్ధ ప్రసాద్ .వేలాది విలువైన గ్రంధాలను కొని ,సేకరించి స్వంత గ్రంధాలయం లో భద్రపరచిన పుస్తక ప్రియులాయన .
మూర్తిమత్వం
ప్రశాంత వదనం , చెదరని నవ్వు , ఆయన ఆంతర్యం లాగా నే తెల్లని స్వచ్చమైన ఖాదీ వస్త్ర ధారణ, ,సాంప్రదాయక నడవడి ,ప్రాచీన అర్వాచీన సాహిత్యం పై సరి సమాన ఆదరణ ,ధార్మిక జీవనం ,ఆధ్యాత్మిక ఉన్నతి ,రుజు ప్రవర్తనం ,సాంఘిక సేవ ,బహుజన హితాయచ బహుజన సుఖాయచ అన్న ఆదర్శం,అట్టడుగు వర్గాలతో సహా సమాజం లోని అన్ని వర్గాల అభి వృద్ధి కోసం శ్రమించే నిండైన విశాల హృదయం , మచ్చలేని నిజాయితీ ,విలువల తో కూడిన ప్రవర్తన,సౌజన్యం, స్నేహశీలత ,నిష్కళంక నిరాడంబర జీవితం వలన అందరకు శ్రీ బుద్ధ ప్రసాద్ దగ్గరయ్యారు .ఆయనతో మాట్లాడటం అంటే ఒక విజ్ఞాన సర్వస్వం లోకి ప్రవేశించటమే .మాట్లాడిన తర్వాత ఆ ప్రభావం గాఢంగా మనసుపై పడి ప్రచోదనం చేస్తుంది . ‘’ముఖం లో తేజస్సు ,హృదయం లో ఉత్సాహం ,నిరంతర కార్య తత్పరత సత్వ గుణ లక్షణం ‘’అన్నారు స్వామివివేకానంద .అలాంటి సత్వ గుణ సంపన్నులు శ్రీ బుద్ధ ప్రసాద్ .
మానవీయతకు ఎత్తిన పతాక
’’సంకుచితమైన జాతి మతాల సరిహద్దుల్ని చెరిపి వేస్తున్నాను చూడు –అకుంఠిత మైన మానవీయ పతాకను ఎగుర వేస్తున్నాను చూడు ‘’అన్నఅనుభూతి కవి ‘’ తిలక్ ‘’మాటలకు ఆచరణ రూపం కావటం వలననే శ్రీ బుద్ధప్రసాద్ ను పదవులు వరించాయి .ఆయనవలననే ఆ పదవులు సార్ధకమై అలంకారం ,గౌరవం పొందాయి. ‘’క్రుణ్వంతు విశ్వం ఆర్యం ‘’-ఈ విశ్వాన్ని ఆర్య మయంగా అంటే సత్పురుషులుగా చేస్తాము ‘’అన్నది ఋగ్వేదం .అలాంటి ఆదర్శ పురుషుడు శ్రీ బుద్ధ ప్రసాద్ .బుద్ధ భగవానుడు కూడా ‘’సమాధిః ఆర్యాణా౦ ధ్వజా –ప్రజ్ఞా ఆర్యాణా౦ ధ్వజా –ముక్తిం ఆర్యాణాం ధ్వజా ‘’అని సర్వమానవ సమత్వాన్ని సమాదరించాడు .అదే ఈ ‘’బుద్ధుని’’ పద్ధతి కూడా .
మూలాల విలువల పరిరక్షణం
పాశ్చాత్య వ్యామోహం పనికి రాదనీ, పక్షి యెంత దూరం సముద్రం పై ప్రయాణం చేసినా చివరికి తన గూటికే చేరుతుందని కవిసామ్రాట్ విశ్వనాధ చెప్పిన విషయాన్ని పదే పదే గుర్తుచేస్తారు శ్రీ బుద్ధ ప్రసాద్ .మన భాషా చరిత్ర సంస్కృతులను పరి పోషించుకొంటూ యువత ముందుకు సాగాలని ఆయన ఉద్బోధ . మన ఉపనిషత్తులు పారమార్ధిక హిమాలయాలని ,మన సంస్కృతిని పోషించే పావనోదకాలని చెప్పిన పండిట్ నెహ్రూ వాక్కులను మర్చి పోరాదని మరచిపోతే భారత దేశం భారత దేశం అనిపించుకోదని చేసిన హెచ్చరిక ను అనుసరించి, ఆచరింప జేస్తారు .’’Western civilization makes for material progress but Indian civilization makes for spiritual understanding‘’అన్న విషయం నరనరాల్లో ఉండాలని కోరుకొంటారు .ప్రాచీన సంప్రదాయం ,పారమార్ధక దృక్పధం ,ఆధునిక శాస్త్ర సాంకేతిక సగుణ ఫలితాలు మానవ భవితకు పునాదులు అని ఆయన నమ్మారు .అలానే ఆచరిస్తున్నారు .పూర్వ సాహిత్యం పైనా ఆకవుల,రచయితల పైనా ఆరాధనా భావం తో పాటు నవీన సాహిత్య సృజనపైనా అపారమైన ఆపేక్ష ఉన్నవారు .మొదటిదాని భూమికపై రెండవది వృద్ధి చెందాలని కోరుకొంటారు శ్రీ బుద్ధ ప్రసాద్ .
ప్రబుద్ధ చేతుడు
సమకాలీన సమాజం లో శ్రీ బుద్ధ ప్రసాద్’’ ను ప్రబుద్ద చేతుడు’’ అంటే బుద్ధివైభవాన్నితెలుసుకోనేవారికి బుద్ధిని ప్రదానం చేసేవాడు అన వచ్చు . .అందుకే సాహిత్య శిఖరారోహణం చేసినవారు ,సంఘం లో అధికారం లోనూ ,విశిష్ట పదవులలోను ఉత్కృష్ట స్థానాలలో ఉన్నవారు, యువకులు అందరూ శ్రీ బుద్ధప్రసాద్ కు ఆత్మీయులే . ఆయన వలన ప్రేరణ పొంది ,తమ సామాజిక బాధ్యతను గుర్తించి నడిచేవారే . వారందరి మధ్య సాహిత్య,సంగీత సామాజిక ,కళా విద్యా ,శాస్త్ర సాంకేతిక విషయాలు చర్చిస్తూ దిశా నిర్దేశం చేస్తూ ,స్పూర్తి , ప్రేరణ నిచ్చే ఉదాత్త పురుషుడు శ్రీ బుద్ధ ప్రసాద్ .ఎవరు చెప్పినా ఓపికగా విని అర్ధం చేసుకొని ఆచరణలో పెట్టటం ఆయన కిష్టం .గొప్ప ప్రజాస్వామ్య వాది.గాంధేయ విధానం లో,అహింసా మార్గం లో ప్రగతి సాధించాలన్న ధ్యేయం ఉన్నవారు . . అజాత శత్రువు. అందరివాడు .అందలాలకు అర్హమైన వాడు .
మహత్తర కానుక
‘’ధర్మ రక్షణ ప్రేమ తత్వాల నెరిగించు –పోతనాది సుకవి పు౦గవులను
స్వర యుత గాన మొసగు త్యాగ రాజాది –లలిత సంగీత కళా నిధులను
బండ రాళ్ళకు ఉలిన్ ప్రాణంబు పోసిన –శేముషీ ధనులైన శిల్ప వరుల
అవని పేర్గన్న నాట్యాచార్య వరులైన –కూచి పూడిని నృత్య కోవిదులను
హస్త కళలందు నిష్ణాతు లైన వారి –ఆంధ్రమన్న పూర్ణగ జేయునట్టి వారి
దేశ సేవా దురంధరుల్ ధీనిధులను –కన్న తెల్గు తల్లికి నమస్కార శతము ‘’
అన్న ఆంద్ర కవి వాక్కు అమోఘం .అలాంటి తెలుగు తల్లి ముద్దు బిడ్డడు ,’’దివిసీమ రాయలు’’ ,సేవా తత్పరులు ,విద్యా వినయ సంపన్నులు ,,అనునిత్య సరస్వతీ సమార్చకులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారికి సార్ధక జీవనం తో అరవై ఏళ్ళు నిండిన సందర్భంగా కిన్నెర ఆర్ట్ అకాడెమిఅధ్యక్ష ,కార్య దర్శులు శ్రీ గంధం సుబ్బారావు ,శ్రీ మద్దాళి రఘురాం గార్ల ఆధ్వర్యం లో ‘’షబ్యబ్దిపూర్తి అభినందన గ్రంధం ‘’ప్రచురి౦చి బహూకరించటం అభినందనీయం .ఎక్కడెక్కడ ఉన్నా తెలుగు వారందరికీ గర్వకారణం , అత్యంత సంతోష దాయకం .తెలుగు సరస్వతికి అమూల్యాభరణం . మహత్తర కానుక .ఆయురారోగ్యాలతో మరింత ఉన్నత పదవులలో రాణిస్తూ,ప్రజా సేవలో తరిస్తూ ,తెలుగుచరిత్ర , భాషా సాహిత్య, సంస్కృతులకు ఇతోధిక సేవ చేసేలా శతాధిక ఆయుస్సును ఆ భగవంతుడు శ్రీ బుద్ధ ప్రసాద్ గారికి ప్రసాదించాలని మనసారా కోరుకొంటున్నాను .
గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-16-ఉయ్యూరు
అధ్యక్షులు –సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ –
శివాలయం వీధి –ఉయ్యూరు –కృష్ణా జిల్లా -521165
సెల్ – 9989066375

