ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -151
59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -4
చక్కని సమాసాలు ,పద గుంభన ,అలవోక గా వచ్చే వాక్ ప్రవాహం తో చర్చిల్ సభికుల్ని ఆకర్షించేవాడు .ఒక ఆలోచనాపరుడిగా వినేవాళ్ళ బుర్రల్ని కంగాళీ పెట్టేవాడు కాదు .ఒకే మూస భావజాలం తోప్రవాహ ఝరిగా మాట్లాడుతుంటే అది పాతదే అని పించేదికాడు .స్వీయంకాని వాటిని స్వీయం గా చేసుకొనే నైపుణ్యం ఆయనలో యెలా ఉండేదో ఆయన జీవిత చరిత్ర ‘’విన్ స్టన్ చర్చిల్ –ది ఎరా అండ్ ది మాన్ ‘’ రాసిన వర్జీనియా కౌలేస్ ‘’అతను కార్య శూరుడేకాని ఆలోచనా పరుడు కాదు .ఉన్న విధానాలను ,విలువలను తనవే అన్నట్లు గా చెప్పే నేర్పు ఉన్నవాడు .విక్టోరియా కాలపు భావనలు పూర్తీ వికాసం పొందిన కాలం లో ఆయన చరిత్ర గడియారాన్నిశతాబ్దాల వెనక్కి తిప్పగల మేధావి .గతకాలపు ,కాలదోషం పట్టి ,రంగు కోల్పోయి వెలిసిపోయిన భావాలకు పట్టిన బూజు .ఆ బూజు దులపకుండా దాన్నే ప్రచారం చేసినవాడు చర్చిల్ .యూరప్ కు దూరం గాచిన్న సైన్యం కోసం ,సామ్రాజ్య వాదం కోసం ,పటిసస్ట ఆర్ధిక స్థిరత్వం కోసం ,స్వేచ్చా వాణిజ్యం కోసం ఆదాయం పన్ను పెంపుదల లేకుండా ఒంటరిగా ఉన్నవాడు .ఇవన్నీ గతకాలపు భావ జాలం .కొత్త శతాబ్ది వచ్చే సరికి ఇవన్నీ నశించిపోతాయి ‘’అని రాసింది .
‘’ఊహ తెలిసిన నాటినుంచి నేను దేన్నీ నమ్మాలి అనుకొన్నానో దానినే నమ్మి ఆచరించాను ‘’అంటాడు చర్చిల్.తన రాజకీయం పూర్తీ గా కన్జర్వేటివ్ అయిన తండ్రి రాండాల్ఫ్ చర్చిల్ వద్ద నేర్చినదే అని ,ఆయన మెప్పించగల సామర్ధ్యమున్న వక్త ,రాజకీయ వేత్తఅనీ అన్నాడు .ఆ పురాతన సంప్రదాయ వారసత్వమే తనకూ సంక్రమించిందని ,తన తాత మొదటి డ్యూక్ ఆఫ్ మరల్ బరో అని ,ఆయన గొప్ప మిలిటరీ కమాండర్ మాత్రమేకాక ‘’మాస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ ‘’ అని పించుకోన్నాడని ,ఆయన వాడిన హాస్యపు పలుకులు తానూ వాడి తన ప్రసంగాలకు మిర్చీ మసాలా అద్దానని చెప్పుకొన్నాడు .ఆయన ‘’he loves to see him work ‘’కు చెందినవాడని ,మిస్టర్ మాక్ డోనాలడ్ మాత్రం ‘’greatest living master of falling without hurting himself ‘’టైపు వాడని అన్నాడు .ప్రతి దానినీ వ్యతిరీకించటం చర్చిల్ స్వభావం అది తనకు మేలు చేస్స్తుందనే నమ్మకం ఉండేది ఆయనకు .ఆయన వ్యతిరేకులు మాత్రం చర్చిల్ పార్టీలో ఇమడలేనంత పెద్దవాడు అన్నారు ఆయన అనుకూలురు మాత్రం అప్పుడెప్పుడో మన’’ బారువా’’అనే ఆయన ‘’ఇండియా ఈజ్ ఇందిరా ‘’అన్నట్లుగా ‘’వ్యక్తీ ముందు ,.పార్టీ తర్వాత ‘’అని కొమ్ము కాశారు .సడన్ గా టోరీ కన్జర్వేటివ్ లపై విరుచుకుపడ్డాడుచర్చిల్ బోయర్ లతో శాంతి ఒప్పందం కోసం మరింతగా ముందుకు వెళ్లి సభలో లిబరల్స్ వైపు మొగ్గాడు .మూడేళ్ళ తర్వాత లిబరల్ పార్టీ తమ పార్టీలోని వ్యతిరేకుల్ని ,1906 సాధారణ ఎన్నికలలోవదిలించుకొని ,చర్చిల్ కు ‘’అండర్ సెక్రెటరి ఫర్ ది కాలనీస్ ‘’పదవి కట్టబెట్టింది .
లిబరల్స్ కన్జర్వేటివ్ లతో నిత్యం తలపడుతుంటే ‘’మహిళా వోటు హక్కు ‘’కేకలు చర్చిల్ కు చమట పట్టిస్తున్నాయి .ఇది గొప్ప ఉద్యమంగా మారి ప్రజా బలం పెరిగి చివరికి చర్చిల్ ను ఓడించేదాకా వచ్చింది .మరొక ‘’కౌంటీ ‘’లో లిబరల్స్ బలీయంగా ఉన్న చోటు నుంచి పోటీ చేసి గెలిచి మళ్ళీ సభలో అడుగుపెట్టాడు .మళ్ళీ మంత్రి వర్గం లో బెర్త్ సంపాదించి ఈసారి బోర్డ్ ఆఫ్ ట్రేడ్ కు ప్రెసిడెంట్ అయ్యాడు .పుష్కలంగా డబ్బు మూలుగుతోంది కనుక పెళ్ళాడాలనేలనే ఆలోచనలో పడ్డాడు .1908 సెప్టెంబర్ లో సెయింట్ మార్గ రేట్ చర్చ్ లో క్లిమే౦టైన్ హోజేర్ అనే అందగత్తె ను పెళ్లి చేసుకొన్నాడు .ఈ పెళ్లి పెద్ద రాజ లాంచనాలతో జరిగింది .36వ ఏట హోం సెక్రెటరి అయ్యాడు .ఏడాది తర్వాత ‘’ఫస్ట్ లార్డ్ ఆఫ్ అడ్మిరాల్టి’’అయ్యాడు .ఆయన బాధ్యత చాలా క్లిష్టమైనది ముఖ్యమైనది ప్రమాద భరితమైంది కూడా .అన్ని లోపాలకు ఆయన్నే లక్ష్యంగా చేసి మాట్లాడేవారు .ఇంగ్లాండ్ మూడు సమ్మెలు ఆరు నిరసనలతో అట్టుడికి పోతోంది .బయట ముంచుకొస్తున్న విపత్కర పరిస్తితులు పాలనకు చాలా ఇబ్బండులుగా మారాయి .సముద్రాంతర మార్కెట్ కోసం పోరాటం ఎక్కువైంది .ఆయుధ ప్రదర్శన , యూరప్ ను భయ పెడుతోంది .1914లో ఆంగ్లో –జర్మన్ సంబంధాలు బాగా క్షీణించాయి .ఇదంతా దారిలోకి రావాలంటే ఏదో ఒక రెచ్చ గొట్టే సంఘటన జరగాలి .28-6-1914న ఆస్ట్రియన్ డ్యూక్ సెర్బియన్ ఒక టెర్రరిస్ట్ సభ్యుడి చేతిలో హత్య చేయబడ్డాడు .జర్మని ఆస్ట్రియా ను సమర్ధించింది .రష్యా సెర్బియా వెనక నిలబడింది .ఫ్రాన్స్ కొంత ఊగిసలాడినా చివరికి రంగం లోకి దిగింది .జర్మన్ సైన్యం పారిస్ పై దాడి కోసం బెల్జియంను పై దాడి చేసి లోబరచుకోన్నది .జర్మన్ పై ఉన్న ద్వేషం తో ఇంగ్లాండ్ యుద్ధ సన్నద్ధమవటం టో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది .
మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభకాలం లో చర్చిల్ బ్రిటిష్ సామ్రాజ్యం లో అత్యంత శక్తి వంతమైన నాయకులలో ఒకడైనాడు .సమయానికి తగిన చురుకుదనం ,అవతలి వారిని ఒప్పించే నైపుణ్యం ,అవసరమైతే మొండిగా ఉండే నైజం ఉన్న చర్చిల్ పాత విధానం లో సాగే భూయుద్ధ వైఖరినే మార్చేశాడు .కొత్త ఆయుధాలు కనుగొనే అవకాశమిచ్చాడు ,మూస విధానం లోఉన్న యుద్ధ వ్యూహాలను సమూలంగా మార్చేశాడు .తేలిక రకం యుద్ధ విమానాలు చాలా అవసరమని గుర్తించాడు .అప్పటికే జర్మని గాస్ టో నడిచే జెప్ప్లిన్ విమానాలను వాడుతూ ఆకాశాన్ని హస్తగతం చేసుకొన్నది .అప్పటి వరకు వాడుకలో ఉన్న ట్రెంచ్ లలో దాక్కొని చేసే యుద్ధం ఇక ఫలించదని తెలుసుకొని ‘’ఆయుధ కారు ‘’ను ఉపయోగించి ఫలితాలు పొందాలనే నిర్ణయానికొచ్చాడు .ఇదే తర్వాత యుద్ధ టాంక్ గా మార్పు పొందింది .ఇంతచేసినా ఒక్క ఎదాదిమాత్రమే అధికారం లో ఉన్నాడు .అవతలి వారి అభిప్రాయాలను కనీసం వినని ,పట్టించుకోని తత్త్వం తో శత్రువులను ఎక్కువగా సృస్టించు కొన్నాడు .యుద్ధం నత్త నడక నడుస్తోంది ఆంట్వెర్ప్, డార్డ్ నేల్లెస్ లలో అపజయాలను చర్చిల్ మెడకే చుట్టారు .యుద్ధం ప్రారంభమైన పది నెలల తర్వాత ఆయన ‘’ఫస్ట్ లార్డ్ ఆఫ్ ది అడ్మి రాలిటి’’పదవి ఊడిపోయింది .మరో అయిడుననెలలలో చర్చిల్ మంత్రి పదవికే ఎసరోచ్చింది .
‘’నా పని అయిపొయింది .కార్య రంగం నుంచి నన్ను తప్పించేశారు ‘’అని వాపోయాడు ఒక స్నేహితుడిదగ్గర .ఇంకా హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడుగానే ఉన్నాడు. దేశ భక్తీ టో కూడిన ప్రతి పక్షం వాడిగా ఉన్నాడు .గాడి తప్పిన విధానాలను వ్యతిరేకించాడు .పని తక్కువ కనుక తనకు ఇష్ట మైన పెయింటింగ్ తో గడిపాడు .1916నాటికి డయానా ,రాండాల్ఫ్ , సారా అనే ముగ్గురు పిల్లల తండ్రి అయ్యాడు ..క్రమంగా పదవీ సోపానాలు ఎక్కటం ప్రారంభించాడు .పాత ప్రభుత్వాలు పోయి కొత్తవి వస్తున్నప్పుడు చర్చిల్ మంత్రి అవుతూనే ఉన్నాడు .వ్యతిరేకత తారా స్తాయిలో ఉన్నా లాయడ్ జార్జ్ చర్చిల్ ను ఆయుధ సంపత్తి మంత్రిగా తీసుకొన్నాడు .యుద్ధ విరమణ తర్వాత మిలటరి పై అధికారం తో సహా ఉన్న యుద్ధ మంత్రియ్యాడు .తర్వాత కలోనియల్ ఆఫీస్ కు బదిలీ అయ్యాడు .అప్పటికే బలహీనమై పోయిన లిబరల్ పార్టీని వదిలేసి ,లాబ రైట్స్ ను ఎదిరించి అతుకుల బొంత కూటమి పార్టీ ఆలోచన చేసి ,అదీ గిట్టక టోరీల తీర్ధం పుచ్చుకొన్నాడు .1924లో కన్జర్వేటివ్ లు మళ్ళీ అధికారానికోచ్చారు .స్టాన్లీ బాల్ద్ విన్ ,చర్చిల్ ను ‘’చాన్సెలర్ ఆఫ్ ది ఎక్స్ చెకర్ ‘’ను చేశాడు .అంటే ‘’బొక్కసానికి కులపతి ‘ని చేశాడు .రాజకీయ గాలి యే వైపు వీస్తుందో తేలికగా పసి గట్ట గల ‘’వెదర్ కాక్’’చర్చిల్ .దిగే గడపా ,ఎక్కే గడప ఆయనకు బాగా అలవాటే ,అధికారానికి అది రాచ బాటే అయింది .ఈ నాటి పార్టీ ఫిరాయి౦పు లకు ఆద్యుడు భజన్ లాల్ ,దేవీలాల్ మొదలైనవారికి ,’’ఆయారాం గయారాం ‘’లకు గురు తుల్యుడు చర్చిల్ అనిపిస్తాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-5-16-ఉయ్యూరు

