ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -152
59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -5
కొత్త ఉద్యోగం చర్చిల్ ఊగిసలాడే ధోరణిని ,అస్థిర తను సూచిస్తుంది .’’మనవాడు ఎవరి వైపు ఉంటాడు అంటే తనవైపే ‘’అని ‘’జోకారు ‘’..ఫ్రీట్రేడ్ ను నిషేధించినపుడు ‘’అదేమీ తప్పుకాదు .సరైనమార్గం లో తీసుకొన్న నిర్ణయమే .అభి వృద్ధి అంటే మార్పే .లోపం లేకుండా ఉండటం అంటే అనేకసార్లు మార్చుకోవటమే ‘’అని నాన్ స్టాప్ గా వాయి౦ చేశాడు .దీన్ని చూసి లార్డ్ ఆక్స్ ఫర్డ్ ‘’తీర్పులేని జీనియస్ ‘’అన్నాడు (ఎ జీనియస్ వితౌట్ జడ్జి మెంట్ ).దీన్ని నిజం చేశాడేమో అన్నట్లు చలా సార్లు తీవ్ర అంత్య స్థితి లో(ఎక్స్ ట్రీం) ఉండేవాడు .కొత్త బిచ్చ గాడు పొద్దెరగడు అన్న సామెత ప్రకారం కన్జర్వేటివ్ ల కంటే ఇంకా కన్జర్వేటివ్ గా ఉండేవాడు .టోరీలకే టోపీ పెట్టి ముందుండేవాడు .1929లో లేబర్ పార్టీ లిబరల్స్ ఇచ్చిన తోడ్పాటుతో ఎన్నికలలో టోరీలతో పోటీ చేసి తోఘన విజయం సాధించింది .బాల్డ్విన్ ను మళ్ళీ ప్రధానిగా నియమించి చర్చిల్ కు కేబినేట్ లో స్థానం ఇవ్వకూడదని షరతు పెట్టారు .58వ ఏట ప్రాభవం కోల్పోయి మంత్రి వర్గం లో స్థానం పొందలేదు .మళ్ళీ గద్దేనేక్కటానికి పదేళ్ళు నిరీక్షించాల్సి వచ్చింది పాపం .
ఈ నిరీక్షాకాలాన్ని సోమరి కాలం (ఐడిల్ డికేడ్)అన్నాడు .అవే ఆయనకు ‘’లోటస్ యియర్స్ ‘’అయ్యాయి .తనపల్లెటూరు చార్ట్ వెల్ కు వెళ్లి రచనా వ్యాసంగం లో మునిగిపోయాడు .అతి ప్రసిద్ధి చెందిన
రాజకీయ చారిత్రిక సాక్షాధార పత్ర (డాక్యుమెంట్ )రచన చేసి ఎన్నో విషయాలు తవ్వి తీశాడు .’’ది వరల్ద్ క్రైసిస్ ‘’పేర వచ్చిన నాలుగు భాగాలు చర్చిల్ ను మహా వక్తలలో ఒకనిగా ,అతనిది ఒక మహాద్భుత అనితర సాధ్యమైన ప్రత్యేకమైన శైలిగా –అదే ‘’ప్యూర్ చర్చిలియనిజం ‘’గా గుర్తింపు పొందింది .ఈ పుస్తకం అమ్మకాలవలన చర్చిల్ కు లక్ష డాలర్ల పైకం లభించింది .ఈ రాబడి ఆయన రాసిన ‘’మాల్ బరో ‘’జీవిత చరిత్ర ,అనేక పత్రికలకు రాసిన సీరియల్ వ్యాసాలవలన ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోయింది .మరొక వ్యాసంగం గా తాపీ పని (మేసన్రి) హాబీ గా చేసుకొని అందులోనూ విజయస్తంభాన్ని కట్టాడు .కాని ‘’బ్రిక్ లేయర్స్ యూనియన్ ‘’వ్యతిరేకించింది .వెంటనే అందులో మెంబర్షిప్ తీసుకొని గోడ కట్టటం లో పై కప్పు నేయటం లో తన సామర్ధ్యాన్ని నిరూపించాడు .దేశ భవిష్యత్తునే నిర్మించిన వాడికి ఇదొక లెక్కా !ప్రజా జీవితం నుంచి చర్చిల్ విరమించుకోవటాని ఎవరూ ఒప్పుకోలేదు .పదేళ్ళు నియోజక వర్గానికి దూరంగా ఉన్నా పిలిచి నిలబెట్టి గెలిపించి పార్ల మెంట్ కు పంపారు .
హిట్లర్ మొదటి సారిగా జర్మని ఆయుధ సంపత్తి సేకరణ చేయాల్సిందే అన్నప్పుడు ,చర్చిల్ కు హిట్లర్ పై జాతీయ పక్ష పాత ధోరణి కనిపించలేదు .’’గాదరింగ్ స్టార్మ్’’లో రాస్తూ చర్చిల్ ‘’హిట్లర్ సిద్ధాంతాలు ఆలోచనలు ,రికార్డ్ ,ప్రవర్తనా శీలం గురించి నాకేమీ తెలియదు .ఎవరైనా ఓడిపోయినతన దేశం కోసం నిలబడితే నేను అవతలి పక్షం లో ఉన్నా వారిని మెచ్చుకొంటాను ‘’అన్నాడు హిట్లర్ రాసిన ‘’మీన్ కాంఫ్ ‘’పుస్తకాన్ని చర్చిల్ పూర్తిగా చదివి అర్ధం చేసుకొన్నాడు .రాబోయే కాలం లో ప్రపంచ విజేత కావాలన్న హిట్లర్ ఆశయం ,దానికోసం జరుగ బోయే తీవ్ర యుద్ధాలను ,వాటివలన ప్రపంచానికి జరగా బోయే అనర్ధాన్ని ముందే పసి గట్టాడు.జర్మన్ సైన్యం ఇంకొక 7ఏళ్ళలో చిన్న దేశాలను కబళించే ఉద్దేశ్యంతో జర్మన్ వీధుల్లో కవాతు నిర్వహిస్తున్నప్పుడే చర్చిల్ హౌస్ ఆఫ్ కామన్స్ లో తీవ్ర స్వరం తో రాబోయే ప్రళయాన్ని వివరిస్తూ ‘’ ఈ యువ బలీయ మైన సైనికులు కవాతు చేయటం చూస్తె హిట్లర్ కోరిన సమాన హోదా కోసం కాదని ,ఆ విషయం వారి కళ్ళల్లో ఆయుదాలకోసమే అన్న భావం ప్రతిఫలిస్తోంద’’నిచెప్పాడు .జర్మనీ అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా జలాంతర్గాములను తయారు చేసుకోన్నాదని ,సైన్యానికి ఆధునిక యుద్ధ టాంకు లు నిర్మించి అజేయంగా తయారైందనీ సభలో నెత్తీ నోరూ పెట్టుకొని అరిచాడు ఆవేశ పడ్డాడు ,వాదించాడు గర్జించాడు .తనమాటలు యదార్ధమేనని విశ్వాసం కలిగించాడు అప్పటికి చర్చిల్ నాజీలకు ఎదురు నిల్చిన’’ఏక వ్యక్తీ బ్రిటిష్ సైనికుడు’’ , దీనితో మిగిలిన వారికి విసుగు కోపం వచ్చాయి ఆయన మీద .ప్రతిపక్షం నిద్రలో జోగుతూ ‘’ఎస్ ‘’అని ఈ హెచ్చరిక దారుని తోసేసింది .
1934లో పార్లమెంట్ లో చర్చిల్ మాట్లాడుతూ నాజీ జర్మనీ హిట్లర్ నాయకత్వం లో ఆకాశాన్ని విమానాలతో ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ,అలక్ష్యం చేస్తే లండన్ పై జర్మన్ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తాయని హెచ్చరించాడు .ప్రధాని స్టాన్లీ బాల్డ్విన్ ,ఎడ్వర్డ్ రాజు ఒక సామాన్యఅమెరికన్ స్త్రీని పెళ్లి చేసుకో వద్దు అంటూ నచ్చ చెప్పే ప్రయత్నం లో ఉన్నాడేకాని హిట్లర్ కొంప ముంచుతాడనే ఆలోచనలో లేడు.నేవెల్లి చామ్బర్లేన్ మాత్రం హిట్లర్ ను తక్కువ అంచనా వేశాడు .లీగ్ ఆఫ్ నేషన్స్ వెన్నులో బాకు గుచ్చినట్లుగా ఇంగ్లాండ్ ఇటలీ ముందు మోకరిల్లి అబిసీనియా ని నిర్లక్ష్యం చేసింది .చర్చిల్ ఉద్విగ్న దీర్ఘోపన్యాసం కూడా ఫలించలేదు .అప్పటికే చేతులు కాలాయి ఆకులతో పని లేక పోయింది. జర్మని రైన్ లాండ్ ను వశం చేసుకొని ,తూర్పు యూరప్ లో జర్మనీ హవా ను ఆపలేక నిస్తేజమైంది .ప్రధాని బాల్డ్విన్ ‘’ఇంతకంటే గొప్ప ఆయుధాలున్న దేశం ఉందా ,మనకేమీ భయం లేదు ‘’అంటూ చర్చిల్ ను దుయ్య బట్టాడు .చాంబర్లేన్ సిగ్గుమాలిన షరతులతోహిట్లర్ ముందు మ్యూనిచ్ లో మోకరిల్లాడు.ఏడాది దాటేసరికి జర్మని పోలాండ్ ను స్వాధీనం చేసుకోవటం తో రెండవ ప్రపంచ యుద్ధం ‘’శురూ ‘’అయింది .
వార్ మేనేజర్ చర్చిల్ ను ఇప్పుడు అందరూ ‘’ప్రాఫెట్ ‘’ప్రవక్త అంటున్నారు .బాల్డ్విన్ స్థానం లో చాంబ ర్లేన్ ప్రధాని అవగానే ,65 ఏళ్ళ చర్చిల్ సమర్ధతకు తగినట్లుగా నేవీ కి చీఫ్ చేసి’’ ఫస్ట్ లార్డ్ ఆఫ్ అడ్మిరాల్టి ‘’పునరుద్ధరించాడు ,నావికారంగం లోని ప్రతి శాఖకూ ‘’Winston is back’’అని మెసేజ్ లు పంపించాడు .చర్చిల్ అంటే ఇంగ్లాండ్ గౌరవ చిహ్నమైన ‘’సింహపు ముఖం ‘’అని కీర్తించారు .రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన కొద్ది నెలల్లోనే బ్రిటన్ రాజు చాంబ ర్లేన్ ను దిగిపొమ్మని చెప్పి చర్చిల్ ను కూటమి ప్రాభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరాడు .10-5-1940న చర్చిల్ బ్రిటిష్ ప్రధానిగా మొదటి ప్రసంగం చేస్తూ బ్రిటిష్ ప్రజలకు ‘’మీకు రక్తం చెమట ,శ్రమ ,కన్నీళ్లు తప్ప నేనేమీ ఇవ్వటం లేదు ‘’అన్నాడు ఉద్వేగం తో.
సమర్ధ నైపుణ్యం ఉన్న చర్చిల్ తాను ప్రజలతో ఏమన్నాడో తెలియని వాడు కాదు అందులోని అంతరార్ధం గ్రహించమని కోరాడు .తన సర్వ శక్తి యుక్తుల్నీ చాతుర్యాన్ని సాహస ధైర్యాలను ప్రదర్శించాడు .జర్మనీ తీర ప్రాంతాలపై దాడి చేయమని సైన్యానికి ఆదేశాలిచ్చాడు .దీనికోసం సైన్యానికి ‘’ఆంఫీబియన్ టాంక్ ‘’-అంటే నీటిలో నేలమీదా నడిచే వాటిని ,వాటికి కావలసిన ఆయుధ సామగ్రిని ,ప్రయోగాత్మక లాండింగ్ క్రాఫ్ట్ ను అందించాడు .తుది సమరానికి ముందే మిత్ర కూటమి ఫ్రాన్స్ పై దాడి చేసి దీనికోసం ఒక కృత్రిమ హార్బర్ ను నిర్మించింది ఇలాంటివి అవసరం ఉన్న చోటల్లా నిర్మించాలని వీటికి ఉక్కు కాకుండా కాంక్రీట్ వాడాలని సూచించాడు. అవి నీటిలో తేలుతూ కృత్రిమ దీవిలాగా కనిపిస్తాయి శత్రుభయం ఉన్నప్పుడు అవి నెమ్మదిగా నీటిలో మునిగి పోతాయి దీనివల ‘’టార్పేడో ప్రూఫ్ వెదర్ ప్రూఫ్ఫ్ ఉన్న కృత్రిమ హార్బర్లు తయారయ్యాయి వీటినుంచి సబ్ మేరీన్లను విమానాలను పంపే వీలు,నాశనం చేసే అవకాశం కలిగింది , ఇదంతా చర్చిల్ మేధో మధనం లో వచ్చినదే .బెల్జియం రాజు లిపోల్ద్ జర్మన్ లకు పాదాక్రాంతుడయ్యాడు .రష్యా ఫ్రాన్స్ ను పట్టుకోన్నది .ఈ సందర్భంగా చర్చిల్ కేబినేట్ మీటింగ్ లో ‘’మనం ఒంటరి వాళ్ళం అయ్యాం నేనొక్కడినే ఉన్నాను .కాని నాకు ఇది చాలా గగుర్పొడిచే సందర్భంగా ఉంది ‘’అన్నాడు జర్మనీ చిరకాల కోరిక బ్రిటన్ ను కబళించటం అని గుర్తు చేస్తూ ప్రజలకు ‘’మనం మన ఇంగ్లాండ్ దీవిని ప్రాణాలకు తెగించి కాపాడుకొందాం .బీచులమీద నిలబడి యుద్ధం చేద్దాం .యుద్ధ భూమిలో వీధుల్లో,కొండల్లో పోరాటం సాగిద్దాం.అంతేకాని లొంగి పోవటం అనేది లేదు చావో రేవో తేల్చుకొందాం. సర్వస్వం ఒడ్డి పోరాడుదాం విజయమో వీర స్వర్గమో తేలుద్దాం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమవుదాం ‘’అని ప్రబోధించాడు ప్రజలను చేతనతో సమాయత్తం చేశాడు వాళ్ళ గుండెల నిండా దేశ భక్తీ ప్రవహింప జేశాడు .జన జాగృతి కలిగించి దేనికైనా సిద్ధం చేశాడు .’’Let us brace ourselves to our duties ,and so bear ourselves that ,if the British Empire and common wealth last for a thousand years ,men will say ‘’this was their finest hour ‘’అని పిలుపునిచ్చి కర్తవ్యోన్ముఖులను చేశాడు చర్చిల్.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-5-16-ఉయ్యూరు

