ఇది విన్నారా ,కన్నారా !-13
26-షట్కాల వీణ వెంకట రమణ దాసు
193-రమణయ్య గారి పూర్వీకులు 7తరాలవారూ వైణికులే.దాసుగారు 1864-లో జన్మించి 1948లో మరణించారు .వీరు వాయించే వీణకుండే కకుభం (కుండ )చాలా చిన్నది .దండం కూడా చాలా ఇరుకైనది .కాని సొరకాయ బుర్ర మాత్రంచాలా పెద్దది .ఇదీ వీరి వీణ ప్రత్యేకత .వీణను నిలబెట్టి వాయించటం దాసు గారి ప్రత్యేకత .ఒక్క బొటన వ్రేలును తప్ప అన్ని వ్రేళ్ళ తోనూ రోజుకు 10గంటలు సాధన చేసేవారు .మహా వేగంగా వాయించటం మరో విశేషం .
194-ఆనంద గజపతి దాసుగారిని ఆస్థాన విద్వాంసునిగా నియమించి గౌరవి౦చటమే కాక తన సింహాసనం లో సగ భాగం లో వారిని కూర్చో పెట్టుకొనేవారు ..వీరితండ్రి చిన గురాచార్యులుగారు .దాసు గారు విజయనగర ఆనంద గజపతి మహా రాజుకు శిష్యులు అవటం మరో ప్రత్యేకత .గజపతి వీణా ,సితార్ లలో ప్రవీణులు .
195-దాసు గారి వీణా వాదనలో ప్రత్యేకతలు మరిన్ని తెలుసు కొందాం .భైరవి రాగ ద్రుత తాళ గీతాన్ని మూడవ స్వరాన్ని అదిమి పట్టి పంచమ తంత్రిని మీటుతూ శ్రోతలను ఉర్రూత లూగించేవారు .సితార్ లోనూ ప్రావీణ్యం సాధించి వీణపై ‘’ఝాలా ‘’ను తానం లో కలిపి వాయించేవారు .మృదంగ సహకారం లేకుండానే కచేరీ చేసేవారు .
196-దాసుగారి వద్ద ఆనంద గజపతి వాయించిన దంతపు వీణ ఉండేది .మాయవరం వీణ వైద్య నాద అయ్యర్ ఒక సారి దాసు గారిని ఆహ్వానించి అయ్యర్ గారి వీణ పై వాయించమని కోరారు. అలా వద్దు అని దాసుగారు చెప్పినా వినక పట్టు బట్టారు .తాను ఆ వీణ వాయిస్తే అది పగిలి పోతుంది అని కూడా చెప్పారు .కాని అయ్యర్ వినక వాయించమంటే వాయించారు .అది విరిగి పోయింది .’’నా వీణ మొగ వీణ .మీది ఆడ వీణ ‘’అన్నారట .
197-ఒక సారి మద్రాస్ సెనేట్ హాల్ లో వీణ వాయిస్తుంటే బయట ఉరుములు ,మెరుపులతో కుంభ వృష్టి కురుస్తోంది .నిర్వాహకులు తలుపులు కిటికీలు మూసేస్తుంటే ,వద్దని దాసు గారు వారించి ,తన వాయిద్యం అందరికీ వినబడుతుందని చెప్పి ,వర్ష ధ్వనికి ఏమాత్రం తీసి పోకుండా వీణ వాయించి వర్షానికే ఆశ్చర్యం హర్షం కలిగించారు .ఘన రాగ పంచకం లో తానం వాయి౦చేసరికి వర్ష ఘోషను మించిన ధ్వని ఆ భవనం అంతా వ్యాపించింది .వర్షాన్ని దాసుగారి వీణా స్వనంను ఓడించింది .అంత గొప్ప ధ్వని ఎలా సృస్టించ గలిగారని అడిగితే వీణ’’ తుంబ’’ లలో గడియారపు స్ప్రింగ్ లాంటి స్ప్రింగ్ లను బిగించానని చెప్పారు . ఆస్ప్రింగులు కుడి తుంబ లో ఉండేవి .ఆ తుంబ ను కొట్టి వీణ కు శ్రుతిపెట్టేవారట .ఇలాంటి వీణను మైసూర్ మహా రాజు దాసు గారికి బహూకరించారు .
198-రమణయ్య గారు పొట్టిగా ఉండేవారు .ఆది భట్ల నారాయణ దాసుగారి కంటే పెద్దవారు .కాషాయ బట్టలు కట్టుకొనేవారు .పిలక ఉండేది .వారికి మంత్రం పీఠం ఉండేది దానిలో వేద పాఠ శాల ఏర్పాటు చేశారు .పీఠాది పతులు ఎవరొచ్చినా అక్కడే వారి విడిది .
199-దాసు గారు వాయి౦చి నంత స్పీడుగా ఎవరూ వాయించ గలిగే వారు కాదు ..1888లో మద్రాస్ సభలో మైసూర్ మహా రాజును మెప్పించి పారితోషికం పొందారు .మద్రాస్ పౌరులు రత్న ఖచిత స్వర్ణ కంకణాన్ని తొడిగి గౌరవించారు .లార్డ్ కర్జన్ బంగారు తోడా బహూక రించాడు .బరోడా వెళ్లి ఆ మహా రాజ ఆస్థానం లో వీణ వాయించి ప్రశంసలు పొందారు .ఆ కచేరీలో ‘’స్కాచ్ ట్యూన్ ‘’వాయిస్తే సభలోని యూరోపియన్లు మహదానందం పొందారు .సహాజీ విహార్ క్లబ్ వీరి కచేరీ ఏర్పాటు చేసి మెచ్చి సువర్ణ పతకం ,వెయ్యి నూటపదహారు రూపాయలు అందించారు .కలకత్తా ,కాశీలలో నూ ప్రశంసల౦దు కొన్నారు .
200-వీణ వెంకట రమణ దాసుగారు సంగీతానికి మరొక అమోఘ కానుక అందించారు .అదే వారు రచించిన ‘’వీణా రహస్య ప్రకాశిక ‘’గ్రంధం .అందులో 16 శ్లోకాలలో గుచ్చ ,నాగబంధ ,తాన విశేషాలను వివరించారు .1926దాసుగారికి జర్మన్ సింఫనీ మాంత్రికుడు బీదోవెన్ కు వచ్చినట్లు మహా చెవుడు వ్యాధి వచ్చింది .భార్యా వియోగామూ కలిగి 8-2-1948న 84వ ఏట దాసుగారు మరణించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-6-16-ఉయ్యూరు