ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -177

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -177

68-పెనిసిలిన్ ప్రదాత –అలేక్సాండర్ ఫ్లెమింగ్   

  అణుశక్తి పై విప్లవాత్మక పరిశోధనలను అడ్డుకొంటున్న కాలం లో ,మెడికల్ సైన్సులో విప్లవ పరిశోధనలను ప్రపంచ ప్రజలందరూ ఆహ్వానించారు .న్యూక్లియర్ పవర్ మానవ జీవితాలను కుంచింప జేస్తుంటే ,లేక పూర్తీ సర్వ నాశనం చేస్తుంటే కొత్తగా కని పెట్టిన అద్భుత మైన మందులు వ్యాధి నిరోధకతను పెంచి మానవ జీవితకాలాన్ని మరింతగా వృద్ధి  మేలు చేశాయి.శరీరం లో జబ్బు పడి పడిన కణాలను బాగా ఆరోగ్యంగా సజీవం గా ఉన్న కణాలకు నష్టం రాకుండా నాశనం చేసే సమస్య పరిష్కృతం కాలేదు .కాని ఆశ్చర్యకరమైన యాంటి బయాటిక్స్ , సల్ఫా డ్రగ్స్ ,హార్మోన్లు తో సమకాలీన విజయాలు సాధిస్తూ భద్రమైన మానవ భవిష్యత్తుకు భరోసా నిచ్చాయి .

             లూయీ పాశ్చర్ తర్వాత వైద్య విధానం లోవచ్చిన పెనుమార్పు  పెనిసిలిన్ ఆవిష్కరణ .దీని ప్రదాత స్కాట్లాండ్ దేశపు బాక్టీరియాలజిస్ట్ అలేక్సాండర్ ఫ్లెమింగ్ కే ఈ కీర్తి దక్కింది .స్కాట్ లాండ్ లోని అయిర్ షైర్ లో లోచ్ ఫీల్డ్ డార్వేల్ లో  6-8-1881న ఫ్లెమింగ్ జన్మించాడు .రైతు అయిన తండ్రి 8మంది సంతానం లో చివరి వాడు.రెండవ భార్యకొడుకు .తనలాగా వ్యవసాయమే చేస్తాడని తండ్రి ఆశించాడు .కొడుకూ అలాగే అనుకొన్నాడు .పొలం పని మాంచి హుషారుగా ఉండేది .చేపలు పడుతూ కుందేళ్ళను పెంచుతూ ,గొర్రెల్ని మేపుతూ సరదాగా గడిపాడు .తాము గ్రామం లో మిగిలిన వారికంటే కొద్దిగా బాగానే బతుకుతున్నామని అనుకొన్నాడు .తానూ బాగా వ్యవసాయం చేసి తండ్రి పేరు నిలబెట్టాలని ,అ గ్రామం లో తమకుటుంబంవ్యవసాయం లో  అగ్రగామి కావాలని ఆశించాడు .

   14వ ఏట అతని జీవిత నేపధ్యం అకస్మాత్తుగా తలకిందు అయింది .పెద్దన్నలతో పాటు చదువుకోమని లండన్ పంపారు  .కిల్ మార్ నాక్ అకాడెమి లోరాబర్ట్ బర్న్స్ ,రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ లు చదివిన చోట  చేరి,ఇంగ్లాండ్ తన దేశం ,లండన్ తన కేంద్ర స్థానం అయినా కూడా స్కాటిష్ ఆక్సేంట్ ను మాత్రం మార్చుకోలేదు .పాలిటెక్నిక్ లో చదువు పూర్తీ చేసి స్కాటిష్ వాలంటీర్ గా మేరు నమోదు చేయి౦చుకొని ఈతలో అద్భుతంగా రాణించాడు .ఈ ఈతే అతని గీత మార్చింది .మార్లేబోన్ రోడ్ లో అన్న ధామస్ జనరల్ ప్రాక్టీషనర్  ,మరిద్దరు అన్నలు జాన్ ,రాబర్ట్ లు ‘’ఆప్టోమెట్రి ‘’అంటే కంటి దోషాలు గుర్తించి నివారించే కోర్సు చదువుతున్నారు ‘’మా అన్న ధామస్ నన్ను మెడిసిన్ లోకి తోశాడు .నేను మెడికల్ స్కూల్ ను ఎంచుకోవాలి .అలాంటివి లండన్ లో డజన్ ఉన్నాయి .వాటి గురించి నాకేమీ తెలియదు .అయితే నేను సెయింట్ మేరీ స్కూల్ వాళ్ళతో వాటర్ పోలో ఆడాను కనుక అక్కడే చేరాను ‘’అని చెప్పాడు ఫ్లెమింగ్ .

     ఈ స్కూల్ లో చాలా ప్రసిద్ధి చెందిన బాక్టీరియాలజిస్ట్ ఆల్మత్ రైట్ వద్ద చదివాడు .నిశిత పరిశీలన ,మంచి జ్ఞాపక శక్తి ,పనిలో పొదుపరితనం ఈయన వలన నేర్చాడు .చివరి గుణం అయిన పొదుపరితనం గురించి ఫ్లెమింగ్ చెబుతూ ‘’నేను తెలివిగల స్కాట్ లాండ్ వాడిని కనుక ,మా దేశస్థులు దేన్నీ అనవసరంగా పార వేయరు కనుక ,చివరికి కలుషితమైన ఆహారాన్ని కూడా చూస్తూ చూస్తూ పారేసే లక్షణం మా జాతి లో లేదు కనుక పొడుపు రక్తగతమై అలవడింది ‘’అని చెప్పాడు .అన్ని ఆటలలోనూ పాల్గొనేవాడు .ఫిజియాలజీ,హైజీన్ ,మెడిసిన్ ,పాదాలజి ,ఫార్మకాలజీ మొదలైన అనుబంధ సబ్జెక్ట్ల  లో  ఏర్పరచిన ప్రతి ప్రైజ్ ను స్కాలర్ షిప్  నూ సాధించు కొన్నాడు .అప్రెంటిస్ పూర్తీ చేశాక లాబరేటరీ లో పని చేసి ,28ఏట తన పరిశోధనలకు ,రోగనిర్ణయ విధానాలకు ఒకదాని తర్వాత మరొక గౌరవాలు, ప్రశంసలు పొందాడు.

  మొదటి ప్రపంచ యుద్ధం ఫ్లెమింగ్ ను లండన్ కు దూరం చేసింది .1914లో 33వ పుట్టిన రోజున రైట్ తో కలిసి కాసినో లో తానె ఏర్పాటు చేసిన ‘’రాయల్ ఆర్మీ మెడికల్ కార్ప్స్’లో ఆఫీసర్ గా బోలోన్ వెళ్ళాడు .అక్కడ నిత్యం విపరీతంగా గాయపడిన ,బాధలతో అరుపులు ,కేకలు వేస్తున్న సైనికులతో మహా రద్దీగా ఉండేది .అందులో ఎక్కువ మంది  ‘’గాంగ్రీన్ ‘’అంటే కండరాల మాంసం కుళ్ళి వచ్చే జబ్బు తో బాధ పడేవాళ్ళే . మెరుగు పరచిన రెండు బాత్ రూమ్ లున్నా మురుగు వ్యర్ధ పదార్ధాలతో కంపుకోడుతూ ఉండేవి .యుద్ధం మాట దేవుడెరుగు .ఈ నరకం లోనే అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవటం ఎక్కువైందని గమనించాడు .గాయాలు నయం కాక  జరుగుతున్న చావులే అవి .బాగా శక్తి కలయాంటి సెప్టిక్ లను వాడినా బాక్టీరియా ను అరికట్ట లేక పోతున్నారు .అందుకే అవి తమ ప్రతాపం చూపిస్తూ సైనికులను బలి తీసుకొంటున్నాయి .పై అధికారులకు విషయాలు తెలియ జేస్తున్నా స్పందన లేక పోవటం తో కుంగి పోయాడు ఫ్లెమింగ్ .నయం చేయటానికి తాను  చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని బాధ పడ్డాడు .

  37వ ఏట కెప్టెన్ గా ప్రమోషన్ రాంక్ లభించింది .యుద్ధం పూర్తీ అయి౦ది కాని ఫ్లెమింగ్ ను అక్కడి నుంచి కదల్చ లేదు .లండన్ కు చేరాక ‘’ఇమ్యూనాలజి ‘’-వ్యాధి నిరోధక విజ్ఞానం పై పనిచేయాలని నిర్ణయించుకొన్నాడు .ఆరోగ్యకర టిస్యూ లకు హాని చేయకుండా బాక్టీరియాను పూర్తిగా నాశనం చేసే సమర్ధ బాక్టీరియా సంహారక పదార్ధాన్ని   కనిపెట్టాలని భావించాడు .ప్రయోగాలు ,అనుభవాల వలన శరీరం లోని కణాలే యాంటి బాక్టీరియా ఏజెంట్ లుగా పని చేస్తాయని గ్రహించాడు .అదే ‘’నేచురల్ ఇమ్యూనిటి’’అంటే సహజ రోగ నిరోధకం .అవి శరీరాన్ని సైనికులు లాగా నిత్యం కాపాడుతూ ఉంటాయి .వెంటనే ‘’ఎక్స్ పెరమేంట్ పాదాలజి ‘’పై అనేక పేపర్లు రాసి ప్రచురించాడు .అందులో ఒక ముఖ్యమైన పత్రం లో ‘’.స్రావాలు ,టిస్యూ లలో పులియజేసే బాక్టీరియా ఉంటుందని ,అది కొన్ని రకాల బాక్టీరియాపై దాడి చేసి సమర్ధంగా శక్తి హీనం చేస్తుందని గ్రహించాడు .ఇదే ‘’లైసోజైం’’దీన్ని కనిపెట్టన ఏడాది  ముందే ఫ్లెమింగ్ సారా మెరియన్ మేకేల్రాయ్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ట్విన్ సిస్టర్ ను అన్న జాన్ పెళ్ళాడాడు .

     సాత్వికంగా మాట్లాడే స్వభావం .బూడిద రంగు జుట్టు తో 47ఏళ్ళ సైంటిస్ట్  ఫ్లెమింగ్ కనిపించేవాడు .1928లో ఒక రోజు తన లాబ్ లో ఒక వింత విషయం గమనించాడు .ఒక పెట్రి డిష్ పై స్టాఫిలో కాకస్  జెర్మ్స్ కల్చర్ ఉన్న గ్లాస్ ప్లేట్ పై బూజు లాంటి పదార్ధం ఏర్పడినట్లు గుర్తించాడు .విడ్డూరం తోపరిశీలిస్తేఏర్పడిన  లైసోజై౦ తన చుట్టూ ఉన్న స్టాఫిలోకాకస్ బాక్టీరియాను నాశనం చేసిందని తెలుసుకొన్నాడు .సూక్ష్మ దర్శింతో నిశితంగా పరీక్షిస్తే ఏర్పడిన ఆకు పచ్చని బూజు పని చేయటం ప్రారంభించి బాక్టీరియాను క్రమంగా తొలగిస్తోంది .బాక్టీరియా క్రమంగా అదృశ్యమవటం చూస్తె తప్పక తాను బాక్టీరియా సంహారక పదార్ధాన్ని కనిపెట్టి చికిత్సా విధానం లో ఉపయోగించి మానవ శరీరం లో బాక్టీరియావలన  ఇన్ఫెక్షన్ రాకుండా చేయ గలుగుతాననే నమ్మకం కలిగింది .

Inline image 1Inline image 2

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-16-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.