ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -179
69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో
‘’పెయింటింగ్ అంటే అపార్ట్ మెంట్ లకు అలంకారం తెచ్చేదికాదు . ఛీకటి ,క్రూరత్వాలపై యుద్ధం ‘’అన్న మహా చిత్రకారుడు పికాసో .సాధారణం గా యే ఆర్టిస్ట్ అయినా మొదట్లో అనుకరణ స్థాయి నుంచి ప్రారంభిస్తాడు ,క్రమంగా తనదైన విధానాన్ని అవలంబించి ప్రతిభ చూపిస్తాడు .అప్పుడు ఏమీ తెలియని వాడైనా అది ఫలానా వాడి చిత్రం అని గుర్తిస్తాడు .కాని పికాసోఒక అసాధారణ చిత్రకారుడు .ఆయన వేసే చిత్రం సాధారణం గా ఉండదు .కనీసం అందులో అర డజన్ శైలీ భేదాలుంటాయి .ఆయన అనేక తీవ్ర మార్పులకు లోనయ్యాడు .అన్నిటిలో ఆయన ఉత్కృష్ట చిత్రకారుడని పించుకొన్నాడు .ఒక ప్రయోగం తర్వాత మరొకటి చేస్తూ ముందు దాన్ని వదిలేస్తూ సాగింది ఆయన చిత్ర కదా పయనం .అయినా తానూ పూర్తిగా పరిణతి చెందలేదని భావించేవాడు .ఒకే మూసలో వస్తువులు స్థలాలు మనుష్యులు చిత్రింప బడటం ఆయనకు అసంతృప్తి కలిగించింది .అన్నికాలాల్లోనూ అస్థిర ,అత్యుత్సాహ ఆర్టిస్ట్ పికాసో .మేధో సృష్టి కర్త పికాసో .ప్రయోగ శిఖరారోహకుడు .
5-10 -18 81న స్పెయిన్ లోని మాలగా లో పుట్టిన పికాసో అసలు పేరు చర్చి లోరాసిన దానిప్రకారం ‘’పాబ్లో నేపెనూసేనో క్రిస్పినియానో డి లా సా౦టిస్మా ట్రినిడాడ్ రూయిజ్ యపికాసో ‘’.స్నేహితులు ఈ చాంతాడు పేరును పాబ్లో రూయిజ్ గా కుదించారు .తండ్రి జోసె రూయిజ్ బ్లాస్కో ,బాస్క్ వంశానికి చెందిన ఆర్ట్ టీచర్ .కుర్ర పికాసో మొదటి పెయింటింగ్ గీసి తల్లి ,తండ్రి పేర్లు వచ్చేట్లు పి.రూయిజ్ పికాసో అని సంతకం చేశాడు .ఇరవై వ ఏట తండ్రి పేరు సామాన్యమైనదే అని భావించి దాన్ని వదిలి అసాధారణం ,శ్రావ్యం అయిన ఆతల్లి పేరు నే ఉ౦చేసుకొన్నాడు .కొన్ని కధనాల ప్రకారం పికాసో చేతిలో పెన్సిల్ తో జన్మించాడు .కనుకనే నిర్దుష్టమైన డ్రాఫ్ట్స్ మన్ గా ,నిర్ణయాత్మక ఆర్టిస్ట్ గా ఎదిగాడు .14వ ఏట పోర్ట్రైట్ లను చిత్రించాడు .వాటిని ఎక్స్ప్రేసివ్ రియలిజం కు లోతైన మోడలింగ్ కు ఉదాహరణలుగా భద్రపరచి రక్షిస్తున్నారు .కుటుంబం బార్సెలోనా కు మారినప్పుడు ,అక్కడ ప్రొఫెసర్ గా ఉన్న తండ్రి కొడుకును స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేర్పించాడు .అత్యంత కఠిన మైన ఎంట్రెన్స్ పరీక్షలకు సిద్ధం కావటానికి ఒక నెల మాత్రమె గడువు ఇచ్చారు .కాని మనవాడు ఒకే ఒక్క రోజులో వాటిని పూర్తీ చేశాడు .పదారేళ్ళ వయసులో మాడ్రిడ్ లో జరిగిన ఫైన్ ఆర్ట్స్ ఎక్సి బిషన్ లో చిత్ర ప్రదర్శన లో పాల్గొని అవార్డ్ పొందాడు .కొన్ని నెలలతర్వాత స్వంత స్టూడియో ఏర్పాటు చేసుకొన్నాడు .చిత్రం వేసుకొనే ఏటవాలు బల్ల (ఈజేల్ )కాక ఆ రూమ్ లో ఒక మంచం ఒక కుర్చీ మాత్రమె ఉండేవి .అందుకని గోడలపై విలాసవంతమైన ,అలంకరించ బడిన ఫర్నిచర్ ను పెయింట్ చేసి సంతృప్తి చెందేవాడు .వీధుల వెంట తిరుగుతూ కేబెరాలు ,రేవులు చూస్తూ కనిపించిన ప్రతిదాన్నీ చిత్రించేవాడు ,ఆయన చిత్రించన వాటిలో సోమరిపోతులు ,నన్స్ ,వేశ్యలు ,రేవు పనివాళ్ళు ,కుక్కలు ,అందం ఫాషన్ ఉన్న స్త్రీలు ,నీరసించిన ముసలి ముతకా జనం ,బలిసిన కాబ్ డ్రైవర్లు ఉన్నారు .వీరి కారికేచర్ నే చిత్రించేవాడు .
19ఏళ్ళ వయసులో మొదటి సారి పారిస్ వెళ్ళాడు .అక్కడ పికాసో విజయం సాధించటం సామాన్యమైన విషయమే .నెల లోపల మూడు కాన్వాసులను అమ్మాడు .మాడ్రిడ్ తిరిగొచ్చి ,’’య౦గ్ ఆర్ట్ ‘’అనే మేగజైన్ ప్రారంభించాడు .తన పాస్టెల్స్ ప్రదర్శించి మళ్ళీ పారిస్ చేరాడు .అక్కడ బాగా ప్రచారం లో ఉన్న తోలోసే లాట్రేస్ బోహీమియన్ స్టూడియో తో ,వాన్ గో బ్రష్ వర్క్ ,గాగిన్ కలర్ మాస్ చిత్రాలతో ప్రభావితుడయ్యాడు .,తర్వాత మృదు త్వం తగ్గించి అస్పష్ట అవుట్ లైన్స్ తో ,వివక్షా పూరిత పాలెట్ తో చిత్రించాడు .అనేక రీతులను అధ్యయనం చేసి ,తానే విభిన్న శైలులు అవలంబించి చివరికి తనదైన సృజనాత్మక చిత్రాలకు ప్రాణం పోశాడు .ఇరవై ఏళ్ళకే బీద ,అసంతృప్త శుష్కించిన ఎముకలు పొడుచుకు వచ్చిన చేతులు పొడవైన బొమి కల్లాంటి వేళ్ళు ,విషాద మాత్రుమూర్తులు ,వారి శరీరాలకు అతుక్కుపోయిన పసి పిల్లలు ,బిచ్చగాళ్ళు ,దీనులైన శ్రమ జీవులు ,అ౦గవిహీనులు ఆకలితో అలమటించే జంటలు ,సంఘ బహిష్కృతులు అయిన స్త్రీ పురుషులను సీరియల్ గా గీశాడు .విషాదానికి చిహ్నమైన నీలి రంగు తో వ్యంగ్య చిత్రాలుగా కాకుండా లోకం లో ఉన్న దరిద్రం అలసత్వం కాపట్యం కారుణ్య హీనత కు అద్దం పట్టేట్లు చూపించాడు .ఒక మానవ సజీవ చిత్ర శాల అది .తాడిత పీడిత దీన గాదా చిత్రమాలిక అది .పికాసో స్నేహితుడు అవి మనుషులపై ఆయనకున్న మమకారం సానుభూతి సహవేదనకు చిహ్నాలు అన్నాడు
23వ ఏట పికాసో చిన్న ,నల్లగా బలంగా ,అశాంతిగా ,చింత తో ,నిరుత్సాహపులోతైన కళ్ళతో ,గుచ్చే చూపులతో వింతగా కదలిక లేని వాడుగా ఉండేవాడు .దుబ్బ జుట్టు నుదిటిపై పడుతూ వికారంగా ,సున్నితమైన స్త్రీ చేతులతో ,నిర్లక్ష్యంగా డ్రెస్ వేసుకొని కనిపించేవాడు .మేధావి నుదురు, దానిపై నల్లని కనుబొమలతో సగం బోహిమియన్ లాగా ,సగం వర్కర్ లాగా కనిపించేవాడు .రాత్రి వేళల్లోనే పెయింట్ చేసేవాడు .డైవ్స్ ప్రైజ్ ఫైట్స్ తిరిగి చూస్తూ సర్కస్ మోజులో పడ్డాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-16-ఉయ్యూరు

