వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -25
మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-4
కిరాతార్జునీయం లో నిదర్శనాలంకారానికి గొప్ప ఉదాహరణ ఉన్నది .అర్జునుడు ధనుర్బాణాలను వదిలేసి సన్యాసం తీసుకొంటాను అన్నప్పుడు ఇంద్రుడు చెప్పిన హితం –‘’యాః కరోతి విద్యోదర్క నిః శ్శ్రేయ స్కరీఃక్రియాః –గ్లాని దోషచ్చిదః స్వచ్చాః స మూఢః పంగకచ్చాపః ‘’–అని చెప్పినసందర్భం లో ‘’తన పోరాట పటిమను ప్రదర్శించాల్సిన వాడు విముక్తి కి ప్రయత్నిస్తే చివరికి సర్వనాశనానికి సహాయకారి అవుతాడు ‘’నీటిని శుభ్రం చేయక అలసత్వం చూపినట్లు అష్కల్మష మనస్కుడు అలసట పొందరాదు ‘’.ఇందులో నిదర్శనాలంకారం ఉందని మల్లినాధుడు గుర్తించాడు .
మల్లినాధుని అలంకార శాస్త్ర పాండితీ గరిమ చూస్తె మహాశ్చర్య మేస్తుంది .అనంతంగా ఉన్న సమాచారం నుంచి ఉదాహరణలను ఎన్నుకొని అన్వయించటం బహు కష్టమైన పని .అంతేకాదు ఒకటికంటే ఎక్కువ అలంకారాలు ఉంటె ఈ పని మరీ కష్టమౌతుంది .వాటినన్నిటినీ యాసిడ్ టెస్ట్ చేసినట్లు పరీక్షించి నిగ్గు తేల్చి న్యాయం చేకూర్చి , మరీ ఉదాహరించాడు .దీనికి ఎంతో లోతైన అవగాహన ,పాండిత్యం జమిలిగా ఉండాలి అలా ఉన్నది కనుకనే మల్లినాధుడు వ్యాఖ్యాన చక్రవర్తి అయ్యాడు .కిరాతార్జునీయం 2-31 శ్లోకం లో మరో ఉదాహరణ గమనిద్దాం –‘’అభి వర్షతి యోనృపాలయం విధి వీజాని వివేక వారిణా-స సదా ఫలశాలినీం క్రియో శరద౦ లోక ఇవాధితిస్టతి’’దీనిపై మల్లినాధుడు –‘’సాహసి కరస్య కాకతాలీయ న్యాయేన ఫలసిద్ధిర్వివేక నస్తునియతేతి భావః –అన్న ఫల శబ్దేన సస్య హేతు క్రుతయోరర్ధయో రభే రాభేదాధ్య వసయాత్ శ్లేష మూలాతిశయోస్యోక్తి స్తదను గృహీతా చోపమేత్యను సంద ఏం’’.ఈ సర్గ ప్రారంభం లో యుధిష్టిరుడు ,భీముని రౌద్ర భీమ వచనాలు విన్నతర్వాతకూడా చలించకుండా శాంతి వచనాలే పలికాడు .తీవ్ర స్వభావమున్నవాడు కూడా విజయం సాధిస్తే ప్రశాంతతకు నిలువ ఎక్కడ ఉంటుంది ?ఈ ప్రశ్నకు ధర్మ రాజు సమాధానం చెప్పాడు –‘’ఎవరు విధి అనే విత్తనాలువివేకమనే జలం తో కలిపి చల్లుతాడో అతడు శరదృతువులో పంటకు వచ్చినట్లు ఫలాలను గ్రహిస్తాడు .ఇక్కడ శ్లేషతో కూడిన అతిశయోక్తి అల౦కారముందని చెప్పాడు .ఫలం అంటే పంట అని ,ఫలితం అని రెండు అర్ధాలున్నాయి .ఇవి భేదార్ధం ఉన్నవికావు .వీటిలో భావం ‘’ఫలితం ‘’ఉపమేయంగా ,పంట ఉపమానం గా భావించాలి .అర్ధం చేసుకోవటానికి రెండర్ధాలు తెలియాలికనుక శ్లేష ఇక్కడ ఉన్నట్లు చెప్పుకోవాలి .విధి బీజాని వివేక వారినః పదాలు సందర్భానికి ఉపమేయ ,ఉపమానాలుగా ప్రవర్తిస్తాయి . నిశ్చల పవిత్ర జలాలలో పడవపై వెడుతూ దాన్ని మురికి చేయటం లాగా బలవంతపు సన్యాసం లేక తపస్సు చావుకుకారణ మౌతుంది .ఇందులో ఒక వాక్యం యొక్క అర్ధం వేరొక వాక్యార్ధం పై బలంగా పడింది .వస్తువు కున్న సంబంధం లో ఏకత ఉంది .మల్లినాధుడు నిదర్శన అలంకారం విషయం లో కూడా ఇలానే చెప్పాడు .సంబంధం లేనివి ఒకదానిపై ఒకటి రెండు విభిన్న వాక్యాలలో ఉండటం చేత ఇది ‘’వాక్యార్ధ వ్రుత్తి నిదర్శనలంకారం ‘’అని వివరించాడు –‘’యత్ర వస్తుసంబందేన ప్రతిబి౦బనం గమ్యతే సా నిదర్శనా ‘’అని తెలియ జేశాడు .
భట్టికావ్యం లో ప్రత్యెక విషయాలు తెలుసుకోవాలి .జయమంగళ వ్యాఖ్యాత ఇందులోని 10 వకాండం లోని అలంకారాలను మాత్రమె గుర్తించి చెబితే మల్లినాధుడు అన్ని కా౦డలలోని అలంకారాల గురించి పూర్తిగా వివరించి చెప్పాడు.సుమారు 25 అర్దాలంకారాలను మల్లినాధుడు నిర్వచించాడు .దీనికి విద్యానాధుడు రాసిన ‘’ప్రతాప రుద్రీయం ‘’నుచక్కగా వినియోగించుకొన్నాడు .కొన్ని అలంకారాలు ముఖ్యంగా 6 అలంకారాలు భట్టికాలం నాటికీ వాడుకలో లేవని చెప్పాడు .అవే కారణ మాల ,కావ్య లింగ ,ప్రతీప ,భ్రాన్తిమాన్ ,సమ ,దృష్టాంత .భట్టికాలం లో చలామణి లో ఉన్న ‘’విభావన ,సమాసోక్తి , రసవత్ ,ఊర్జవి ,ఆశిష్ ,పర్యాయోక్తి ,వ్యాజస్తుతి ,సమాహిత ,విశేషోక్తి ,హేతు ,కావ్య లింగ ,ఉపమారాపక ,నిదర్శన ,పరి వ్రుత్తి ,ఉత్ప్రేక్ష ,తుల్య యోగిత అలంకారాలను గురించి మల్లినాధుడు పేర్కొనలేదని లాల్యే పండితాభిప్రాయం. 10 వ కాండలో లోని అన్ని శ్లోకాల అలంకారాలు జయమంగళ తెలిపాడు .అలాగే మల్లినాదుడూ చేసాడు .కాని ఈ రెండిలో భేదాలున్నాయి .ఆ తేడాలేమిటో గమనిద్దాం.
భట్టికావ్యం 10-22 శ్లోకం లో ‘’ఆది దీపక ‘’10-24లొ అంతా దీపిక అల౦కారాలున్నాయని జయమంగళ వ్యాఖ్య .కాని అవి కారణమాల ,కావ్య లింగ అలంకారాలని మల్లి నాధుడు గుర్తించాడు .10-40లో ప్రియ అలంకారం ఉందని జయమంగళ అంటే ప్రతీప అలంకారం అని సూరి చెప్పి దానికి తగిన బలమైన సాక్ష్యాలను తెలియజేశాడు –‘’మధుకర విస్తానాం సరసీరుహాణా౦ చోపమానాము యమే యత్వ కల్పపాద నాద్వితీయ ప్రతీపాలంకారః ‘’అని స్పష్టం చేశాడు .అలాగే భట్టి కావ్యం లో నిదర్శనాలంకారాన్ని –‘’వాక్యార్దానాం పరాజయ వాక్యార్దేన సమానాధిక రణ్యా భావాత్ సాదృశ్య క్షేపాద్ బహూనాం మాలయా నిబంధనాచ్చా స౦భవస్తు సంబందో వాక్యార్ధ నిష్టామాలా నిదర్శనా ‘’అంటూ బలంగా చెప్పాడు .మూడు అసాధ్య విషయాలు ఒక చోట చేర్చబడ్డాయి –అవే నీటిపైరాయి తేలటం ,సూర్యుని నుంచి చీకట్లు రావటం ,చంద్రుని నుంచి అగ్ని బయల్దేరటం మరియు మహా పరాక్రమ శాలి అయిన రావణుడిపై విజయం సాధించటం –‘’శిలా తరిష్యదుదకే న పర్ణా౦ –ద్వాన్తః రవేః .శామ్యతి వహ్ని రి౦దోః-జతా పరేహం యుధి జ్జ్యేష్యమాణాస్తుత్యాని –మన్యక పులస్య నప్తః ‘’.జయ మంగళ ‘’బ్రహ్మ ‘’ను అనుసరిస్తే మల్లినాధుడు అలంకార సర్వస్వ కర్త ‘’రుయ్యకుని’’ అనుసరించాడు .
అలంకార విషయం లో మరో ముఖ్య విషయం గమనించాలి .కొన్ని చోట్ల అలంకార నిర్వచన ప్రస్తావనలో మల్లినాధుడు దాన్ని తాను ఎక్కడనుంచి తెచ్చి చెప్పాడో తెలియ జేయలేదు .అవసరం మేరకు వాక్యాలు ఉదాహరించి ‘’తదుక్తం ‘’అని తేల్చేశాడు .కనుక ఎక్కడో ఒక గ్రంధం నుంచి దాన్ని పొందాడని గ్రహించాలి .చాలా సందర్భాలలో కర్త పేరు తెలియ జేసినా సూరి ఇలా ఎందుకు చేశాడు అన్నది ఒక పెద్ద ప్రశ్న .దీనికి సంతృప్తి కర సమాధానం చెప్పటం కష్టం అన్నాడు లాల్యే .అయినప్పటికీ ,ఆ ఉల్లేఖనం (కొటేషన్ )చాలావరకు ఏక రీతిగా నే ఉంది .సంకోచం లేకుండా ఈ చర్చలోని అలంకార శీర్షికలకు కొన్నిపదాలకు ముందే ఉన్న నిర్వచనాలు విద్యానాధుని ప్రతాప రుద్రీయం నుండి గ్రహించినట్లు భావించాలి .కాకతీయ ప్రతాపరుద్ర చక్ర వర్తి ఆస్థానకవి విద్యానాధుడు అని మనకు తెలుసు …మల్లినాదునికుమారుడు కుమారస్వామి ప్రతాపరుద్రీయం పై ‘’రత్నాపన ‘’వ్యాఖ్యానం రాశాడని ముందే చెప్పుకొన్నాం .
‘’ తదుక్త౦ ‘’ అంటూ ముక్తాయింపు ఇచ్చిన మల్లినాడుడు విద్యానాధుని అలంకారాలను గురించి ఎలాచేప్పాడో తరువాత తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-16-ఉయ్యూరు


అయ్యా మీరు నాకు సహాయం చేయగలరు నిదర్శన అలంకారమునాకు లక్షణం ఉదా!తెలుపగలరు
LikeLike