గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
11-పంచశతి రచించిన మూక కవి
మూకం కరోతి వాచాలం
‘’పరమపద వదూటీం-పాతుమాం కామకోటీ ‘’అని ఒక మూగవాడు అమ్మవారి దర్శన భాగ్యం తో నోరు తెరచి పరవంశం తో స్తుతించాడు .ఆయనే కంచి కామాక్షీదేవిపై ‘’పంచశతి ‘’రచించి మూక కవిగా జగత్ ప్రసిద్ధు డైనాడు .’’ప్రకృత్యా మూకానామపిచ కవితా కారణతయా ‘’అమ్మవారి తాంబూల రాసనా లేశ స్పురణ మాత్రం ‘’చేత సిద్ధకవి గా రూపాంతరం చెంది కామాక్షీ దేవిపై 1-ఆర్యా శతకం 2-పాదార వింద శతకం 3-స్తుతి శతకం 4-కటాక్ష శతకం 5-మందస్మిత శతకం అనే 5 శతకాలు ఆర్యా వృత్తం లో రాసిన మహా భక్తుడు మూక కవి .కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు తమ ఉపన్యాస లహరిలో తరచుగా మూక కవి కవితా వైభవాన్ని అమ్మవారిపై ఆయనకున్న భక్తీ తాత్పర్యాన్ని బహుదా ప్రశంసించే వారు .కంచిలో అమ్మవారి దేవాలయం లోపలి ప్రాకారంలో మూక పంచ శతి శ్లోకాలను దేవనాగర లిపి లో చెక్కించి అమ్మవారి మహిమను భక్తులకు విశదమయేట్లు చేశారు .మూక పంచశతిని శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులుగారు తెలుగులోకి అనువదించి ఆకవి భక్త్యావేశాన్ని ఆంధ్రులకు అవగాహన కలిగించారు . .
మూక కవి జీవిత విశేషాలు
మూకకవి అమ్మవారి తాంబూల రస మధుర బిందువులచే ధన్యుడై శతకాలు రాసి జగద్విఖ్యాతుడై కంచి కామకోటి పీఠానికి 20 వ పీఠాదిపతిగా క్రీ శ.398లో అధిరోహించి 27 సంవత్సరాలు437 వరకు సేవ చేసి అద్వైత మత ప్రచారం లో జన్మ చరితార్ధం చేసుకొని గోదావరీ తీరం లో సిద్ధి పొందినట్లు కంచి మఠ వివరాల వలన తెలుస్తోంది . ఖగోళ జ్యోతిష శాస్త్ర వేత్త విద్యా వతి కుమారుడు .పుట్టు మూగ చెవిటి వాడైన ఈ కవిఅనునిత్యం ఇరుగు వారు తోటి పిల్లలు అవహేళన చేస్తూ ఏడిపిస్తుంటే నిత్యం కంచిలోని శ్రీ కామాక్షీ దేవిని దర్శింఛి సాష్టాంగ నమస్కారం చేసిముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చి అమ్మవారిని ధ్యానం చేస్తూ మౌనంగా రోదిస్తూ మనశ్శాంతి పొందేవాడు .అతని అనన్య సామాన్యమైనదని అమ్మగ్రహించి అనుగ్రహించాలని భావించింది .అతని మూగ తనాన్ని పోగొట్టి అద్భుత వాక్శక్తి ప్రసాదించాలని ,అతనిద్వారా లోకానికి మహత్తర మైన గ్రంధాన్ని కానుకగా ఇవ్వాలని సంకల్పించింది . .
. కామాక్షి కరుణా కటాక్షం
. ఒక రోజు మూక కవితో పాటు మరొక సాధకుడు అమ్మవారి ఎదుట కూర్చుని ధ్యానం లో ఉన్నారు .అమ్మవారు వీరి భక్తికి మెచ్చి అనుగ్రహించాలనే తలంపుతో ఒక సాధారణ స్త్రీగా దర్శనమిచ్చితననోటిలోని తాంబూలం ముద్ద(పిడచ )కొంత తీసి మూకకవి ప్రక్కనే ఉన్న సాధకునికి ఇచ్చింది .ఆయన ఆమెను ఒక మామూలు స్త్రీ అనుకోని దాన్ని ఎంగిలిగా భావించి తీసుకోలేదు .వెంటనే జగదంబ దానిని మూకకవిని అనుగ్రహించి చేతిలో పెట్టింది .దాన్ని మహా ప్రసాదంగా భావించిన మూకకవి భక్తిగా కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకొన్నాడు .అంతే మూకకవికి మాట వచ్చి మహా ప్రవాహంగా ఆశువుగా కవిత జాలువారి అమ్మవారి దివ్య సుందర విగ్రహాన్ని కనులారా దర్శిస్తూ 500 శ్లోకాలు ఏకధాటిగా చెప్పాడు .అదే మూక పంచశతి అయింది .అమ్మవారి గొప్ప తనాన్ని వర్ణించినది ఆర్యా శతకం ,అమ్మవారిని స్తుతిస్తూ చెప్పింది స్తుతి శతకం .,కనులను వర్ణించేది కటాక్ష శతకం .అమ్మవారి నవ్వును వర్ణిస్తూ చెప్పింది మందస్మిత శతకం ,పాదాలను వర్ణిస్తూ చెప్పింది పాదార వింద శతకం . మధుర మంజుల భావ గర్భిత శతకాలివి .అణువణువునా భక్తీ కదం తొక్కింది అందులో .మహిమాన్విత మైన,మంత్రపూతమైన ఆ శ్లోకాలను అమ్మ మహా పరవశంగా ఆలకించి తానూ పులకించింది . అయిదు శతకాలు చెప్పిన తర్వాత అమ్మవారుప్రత్యక్షమైంది . కవిని వరం ఏదైనా కోరుకోమన్నది . కనులనుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా గడగడ స్వరం తో మూకకవిఏదో అనబోయాడు .అతని ఆంతర్యం గ్రహించి౦ది అమ్మ. బిడ్డ కోరిక తల్లికి తెలియదా ! అయినా అతని నోటి నుండి వినాలని చెప్పమని కోరి ఆసక్తిగా విన్నది ‘’ ‘అమ్మా! జీవితాంతం మూగవాడిగానే వుండిపోతాననుకున్నాను. అదృష్టవశాత్తు మీ అనుగ్రహం వల్ల వాక్‌శక్తి సిద్ధించింది. మాట్లాడే శక్తి ఏర్పడడం భగవదనుగ్రహం చేతనే సాధ్యమవుతుందన్న విషయం స్వానుభవంతో గ్రహించాను. ఈ శ్లోకాలను శ్రద్దా భక్తులతో పఠించే మూగవారికి చక్కని వాక్ శక్తిని ప్రసాదించు తల్లీ! నత్తిగా మాట్లాడే వారికి, తడబడుతూ మాట్లాడేవారిక సైతం ఈ పంచశతిని పఠించడంవల్ల ఆ దోషం తొలగిపోయేలా అనుగ్రహించు మాతా! నేను ఎవరినో, నా పేరు ఏమిటో, నేను ఏ కాలానికి చెందిన వాడినో ఈ లోకానికి తెలియనవసరం లేదు. ఈ శ్లోకాలు మూగకవి నోటినుండి వెలువడ్డాయని మాత్రం ప్రపంచానికి చాటిచెప్పుతల్లీ!’ ముకుళిత హస్తాలతో అమ్మను వేడుకున్నాడు.మూక కవి .. పరుల శ్రేయస్సును కాంక్షిస్తున్న అతని కోరిక నెరవేరేలా కామాక్షి అనుగ్రహించింది. వరాలు లోకహితానికి ఉపయోగపడాలి కానీ స్వప్రయోజనానికి ఉద్దేశించినవి కావని గ్రహిచిన వివేకవంతుడైన అతన్ని అభినందనగా చూసింది జగన్మాత. ‘అలాగే నాయనా! మంత్రశక్తితో కూడిన ఈ శ్లోకాలనుపఠించడంవల్ల మూగతనం, నత్తి, మాటలో తడబాటు తొలగిపోయి మధుర మంజులవాక్కు, కీర్తి,సిరిసంపదలు సిద్ధిస్తాయి. మంత్రపూరితమైన ఈ శ్లోకాల్లోని అక్షరాల విన్యాస వరసలో అంతటి శక్తి దాగి వుంది. నీవు కోరిన విధంగానే ఈ నామధేయంతో కాకుండా మూక మహాకవి పేరుతోనే ఈ పంచశతి విశ్వవ్యాప్తమవుతుంది. మూక పంచశతి పఠించేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం, సరస్వతీదేవి ఆశీస్సులు లభిస్తాయని వరమిస్తున్నాను’ మరక్షణం కామాక్షి తాయి అతని ఎదుటనుండి అదృశ్యమైంది. విగ్రహంలోనుండి చల్లని చూపులతో దేవి కనిపిస్తోంది అతనికి. ఆర్య శతకము, పాదారవింద శతకము, స్తుతి శతకము, కటాక్ష శతకము,మందస్మిత శతకము అనే ఐదు శతకాలతో కూడిన మూకపంచశతిలోని శ్లోకాలను భక్తి శ్రద్ధలతో పఠిస్తూ విశుద్ధి చక్రంలోని దోషాలను అధిగమించి ఎందరో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. ఆ విధంగా లక్ష్మీ సరస్వతుల అనుగ్రహానికి ఏకకాలంలో పాత్రులవుతూ జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందుతున్నారు. మూక కవిని గురువుగా భావిస్తూ కామాక్షీ మహాదేవి పట్ల భక్త్భివంతో శుభ దాకమైన మూకపంచశతిలోని శ్లోకాలను పఠిస్తూ హరిప్రియ అనుగ్రహానికి వాగ్దేవి శుభాశీస్సులకు పాత్రులవుతున్నారు.
ఆతను మృదు మధురమైన మాటలతో ‘’అమ్మా !మూగ వాడికి మాట ఇచ్చి అనుగ్రహించి నాలో ప్రవేశంచి నా చేత పంచశతి శతకం చెప్పించావు .ఈ నోటితో నీ స్వరూప స్వభావాలను వర్ణించేట్లు చేశావు .ఈ అనుగ్రహం చాలు .నిన్ను స్తుతించిన నోటితో వేరే మాటలు మాట్లాడలేను .దయతో మళ్ళీ నన్ను మూగ వాడిని చేయి ‘’అని సవినయంగా కోరాడు .అమ్మ అతనిని మళ్ళీ మూగవానిగా చేసింది అని ఒక కద ప్రచారం లో ఉన్నది .
మూక కవి మూక శంకరులైన విధం
ఈ విషయం తెలిసిన 19 వ కంచి పీఠాదిపతులు శ్రీ శ్రీ మార్తాండ విద్యా ఘనేంద్ర సరస్వతీ స్వాములవారు ఆ బాలుడి తలిదండ్రులకు కబురు చేసి పిలిపించారు .మూక కవిని ఉత్తరాధికారిగా అంటే 20 వ పీఠాదిపతిగాచేయాలని సంకల్పించానని వారి అనుమతి ని, బాలుడి అనుమతి కోరగా వారు సంతోషంగా అనుమతించారు . .యుక్త వయసు రాగానే వేద శాస్త్రాలలో మహా విద్వాంసు డయ్యాడు .19 వ పీఠాదిపతులైన శ్రీ శ్రీ మార్కండేయ విద్యాఘన స్వాములవారు మూక కవికి దీక్షనిచ్చి ‘’మూక శంకర ‘’నామ ధారణ చేశారు .మూక కవి ఊహా చిత్రాన్ని కంచి పీఠం చిత్రి౦ప జేసింది .మూక కవి సామర్ధ్యం, ప్రభావం వర్ణనాతీతం .ఆయన ఎదుట పడిన అక్షర జ్ఞాన శూన్యులైన పశువుల కాపరులు కూడా మహా కవులై పోయారు .కాశ్మీర రాజు మాతృ గుప్తుడు ,ప్రవర సేనుడు మొదలైన రాజులు అనన్య భక్తితో మూక శంకర సేవలో ధన్యులయ్యారు .కామాక్షీ కటాక్ష సిద్దితో పీఠాదిపతులైన మూక శంకరులు ధాతు నామ సంవత్సర శ్రావణ పౌర్ణమినాడు గోదావరీ నదీ తీరం లో ముక్తిని పొంది శ్రీ కామాక్షీ- ఏకాంబరేశ్వర స్వామి వారలలో ఐక్యమయ్యారు .
మూక పంచశతి ప్రాశస్త్యం
మూక పంచశతిలో తంత్ర శాస్త్ర ప్రాధాన్యం ఉన్నది .బీజాక్షరాల తో కూడిన మంత్రములతో కూడిన శ్లోకాలు ఉన్నట్లు పరిశోధకులు తెలియ జేశారు .ఆధ్యాత్మిక కుండలినీ యోగ రహస్యాలూ దీనిలో ఉండటం మరొక విశేషం .కంచి పరమేశ్వరి కొందరికి కాళికా మాత లా దర్శనమిస్తే మూక కవికి ఆ అమ్మ ‘’కారణ పరచిద్రూపా కాంచీపురా సీమ్నికామ పీఠ గతా –కాచన విహరతి కరుణా కాశ్మీర స్తబ కోమలాంగ లతా ‘’గా దివ్య దర్శనమిచ్చింది .అంటే’’ కాంచీ పురం లో ఒకానొక’’ కరుణ ‘’యెర్రని శరీరం తో తిరుగుతోంది ‘’అన్నాడు కవి .ఆమెను అమ్మ అనలేదు శక్తి అనీ అనలేదు .అనిర్వచనీయమైన కరుణకు మూర్తిస్వరూపం అని అర్ధం .అపార ,అనంత ,అనిర్వచనీయ దయాంత రంగ ఆమె .అఖండ మైన కరుణ అరుణగా కంచి పట్టణం లో విహరిస్తోందని మూక కవి భావన చేశాడు .అమ్మ వారి దివ్య తేజో స్వరూపాన్ని భక్త్యావేశం తో పరమాద్భుతంగా వర్ణించాడు మూకకవి .లీలాశుకుని శ్రీ కృష్ణ కర్ణామృతానికి సాటి మూక పంచశతి అని విజ్ఞుల అభిప్రాయం .అద్వైత స్థాపనాచార్యులైన జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్య పై మూకకవి ‘’ప్రాచీన శంకర విజయం ‘’రాశాడు.ఇందులో కంచి మఠ ప్రాచీనత తో పాటు, శ్రీ శంకరుల కాల నిర్ణయమూ ఉన్నది .ద్విసహస్రావధాని డా శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మగారు ఆర్యా శతకాన్ని గానం చేసి కేసెట్ లుగా సి. డి.లుగా విడుదల చేసి మూకకవికి ,మూక పంచశతికి గొప్ప ప్రచారం తెచ్చారు .
మూక పంచశతి లో కవి గీర్వాణ కవితా వైభవాన్ని తరువాత తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-16 –ఉయ్యూరు

