గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
11-పంచశతి రచించిన మూక కవి -3 (చివరిభాగం )
4-కటాక్ష శతకం
1-‘’మొహా౦దకార నివహం వినిహంతు మీడే-మూకాత్మనామది మహాకవితా వదాన్యాన్
శ్రీ కాంచి దేశ శిశిరీకృత జాగరూకా –నేకామ్రనాధ తరుణీ కరునణావ లోకాన్ ‘’
భావం – కాంచీనగర ప్రాంతాన్ని చల్లబరచటానికి మేల్కొనేవి ,మూగ పోయిన మనసుకలవారికి సైతం గొప్ప కవిత్వాన్ని ప్రసాదించేవి ,అయిన ఏకామ్రేశ్వరుని భార్య కామాక్షీ దేవి చల్లని చూపులను నాకు ఉన్న మోహమనే చీకటిరాశిని నశి౦పజేయమని స్తుతిస్తాను.
47- ‘’కైవల్యదాయ కరుణారస కి౦కరాయ –కామాక్షి కందళిత విభ్రమ శంకరాయ
ఆలోకనాయ తవ భక్త వశ౦కరాయ మాతర్నమోస్తు పరతంత్రిత శంకరాయ ‘’
భావం –మోక్ష దాయినీ ,కరుణ రసమే సేవకునిగా కలిగి ఉన్నది ,అంకురించిన విలాసాలతో సుఖాన్నిచ్చేది ,భక్తపరాదీనుడైన పరమేశ్వరుని వశం చేసుకోన్నదీ అయిన నీ దివ్య కటాక్షం కోసం నేను నమస్కరిస్తున్నాను .
74 –‘’మూకో విరించతిపరం పురుషః –కందర్పతి త్రిదశ రాజతి కింప చానః
కామాక్షి కేవల ముపక్రమకాల ఏవ –లీలాతరంగిత కటాక్ష రుచః క్షణం తే ‘’
భావం –నీ విలాసవంత కటాక్ష కాంతి కొద్దిగా ప్రసరించటం ప్రారంభం కాగానే మూగవాడు బ్రహ్మగా ,వికృత రూపుడు మన్మదుడుగా ,పేదవాడు ఇంద్రుడుగా మారిపోతున్నారు .
93-‘’ఏషా తవాక్షి సుషమా విషమాయుధస్య –నారాచ వర్ష లహరీ నాగరాజ కన్యే
శంకే కరోతి శతధా హృది ధైర్య ముద్రాం-శ్రీకామకోటి యదసౌ శిశిరా౦శుమౌళే ‘
భావం –పార్వతీ కామకోటీ కామాక్షీ !నీ కటాక్ష కాంతి మన్మధుడి బాణవర్షం .ఎందుకంటె చంద్ర రేఖను శిగలో ధరించిన శివుని మనసులోని ధైర్యాన్ని వందముక్కలు చేస్తోందని నేను శంకిస్తున్నాను .
101-పాతేన లోచన రుచే స్తవ కామకోటి –పోతేన పాతక పయోధి భయాతురాణా౦
పూతేన తేన నవకా౦చన కుండ లాంశు-వీతేన శీతలయ భూధర కన్యకే మాం ‘’
భావం –పాపాల సముద్రం ముంచేస్తుంది అని భయపడేవారికి నీ చూపు ఓడలా రక్షిస్తుంది .అది నీ చెవులకున్న నూతన కుండలాల కాంతితో పవిత్రమైనది .అలాంటి పావన మైన నీ కంటి ప్రసారం తో నన్ను ము౦చెయ్యి తల్లీ.
5-మందస్మిత శతకం
1-బధ్నీమో వయ మంజలిం ప్రతిదినం బంధచ్చిదే దేహినాం –కదర్పాగమ మంత్రం మూల గురవే కళ్యాణ కేళీ భువే
కామాక్ష్యా ఘనసార పంజ రజసే కామద్రుహ శ్చ క్షుషాం-మందార స్తబక ప్రభా ముద ముషే మందస్మిత జ్యోతిషే’’
భావం –సకల ప్రాణ భవబంధ విమోచని ,మన్మదానురాగ తంత్రానికి గురు స్థానం లో ఉన్నదీ ,కల్యాణం అనే ఆట ఆడుకొనే శివుడి కనులకు ముద్ద కర్పూరం పొడి వంటిది ,మందార పూల మకరందాన్ని దొంగిలించేది అయిన కామాక్షీ దేవి చిరునవ్వు అనే వెలుగు కోసం ప్రతిరోజూ మేము దోసిలి ఒగ్గుతాము .
34-‘’క్రమేణ స్నాపయస్వ కర్మ కుహనా చోరేణ మారాగమ –వ్యాఖ్యా శిక్షణ దీక్షితేన విదుషా మక్షీణలక్ష్మీ పుషా
కామాక్షి స్మిత కందళేన కలుష స్పోటక్రియా చు౦చునా –కారుణ్యామృత వీచికా విహరణ ప్రాచుర్య దుర్యేణమాం .’’
భావం – కమ్మగా ఉండి ,కర్మఅనే కపతాన్ని దొంగిలించేది ,మన్మధ తంత్ర వ్యాఖ్యానం లో దిట్ట ,అపారజ్ఞాని ,పాప హరణం లో అత్యంత సమర్ధురాలు ,కరుణ అనే అమృత తరంగాలలోవిహరించటానికి ముందుకు వచ్చేది ,అయిన నీ చిరునవ్వు మొలకలతో నన్ను స్నానం చేయించు తల్లీ .
58-‘’యన్నాకంపిత కాలకూట కబళీకారేచుచుంబేనయ –గ్లాన్యా చక్షుషి రూక్షితానల శిఖే రుద్రస్య తత్తాద్రుశం
చేతో యత్ప్రసభం స్వరజ్వర శిఖి జ్వాలేన లేలిహ్యతే –తత్కామాక్షీ తవస్మితాం శుకణికా హేలాభవం ప్రాభవం ‘’
భావం –కాలకూట విషాన్ని మింగటానికి ఏమాత్రం భయపడలేదో ,కన్ను అగ్ని జ్వాలలు కక్కుతున్నా హాని పొందలేదో ,అలాంటి రుద్రుని మనసు ఈనాడు మన్మదాగ్ని తో చుట్టుముట్ట బడింది .దీనికి కారణం నీ మధుర దరహాస వైభవమే .
92-శ్రీ కామాక్షి తవస్మితై౦ దవమహః పూరే పరిస్పూర్జతి –ప్రౌఢాం వారిది చాతురీ౦ కలయతే భాక్తాత్మనాం ప్రాతిభం
దౌర్గత్య ప్రసరాస్తమః పటలికా సాధర్మ్య మా భిభ్రతే –కిం కిం కైరవ సాహచర్య పదవీరీతిం నధత్తే పదం .
భావం –నీ దరహాస చంద్రికా ప్రవాహం చల్లగా ఉండగా ,భక్తులైన జీవుల ప్రతిభా వ్యుత్పత్తులు సముద్రంలాగా పొంగిపోతాయి .దరిద్రం లాంటి దుర్గతులు చీకటి గుంపులో కలిసిపోతాయి .ఈ విధంగా జీవులకు చంద్రత్వం అంటే తెల్లకలువల సాహ చర్యం కలిగినపుడు ఏ కార్యాలు జరక్కుండా ఉంటాయి ?
101-‘’ఆర్యామేవ విభాయన్మనసి యః పాదార వి౦ద౦ పురః –పశ్యన్నారభతే స్తుతిం స నియతం లబ్ధ్వా కటాక్షచ్చవిం
కామాక్ష్యా మృదుల స్మితాంశులహరీ జ్యోత్స్నా వయస్యాన్వితా –మారోహత్య పవర్గ సౌద వలభీ మానంద వీచీమయీం ‘’
భావం-మనసులో ఎవరు ఆర్యాదేవి అయిన శ్రీ కామాక్షీ దేవిని భావిస్తాడో ,ఆమె పాదకమలాల ఎదుట నిలబడి స్తోత్రం ప్రారంభిస్తాడో ,అతడు దేవీ కటాక్షాన్ని తప్పక పొందుతాడు .కామాక్షీదేవికి మందస్మిత కాంతి ప్రవాహం అనే ఒక స్నేహితురాలు ఉన్నది .ఆమె మోక్షం అనే భవనం లో నివశిస్తుంది. శ్రీ దేవి అనుగ్రహ ,కటాక్షాలను పొందిన సాధకుడు ,ఆ మోక్ష భవనం పై అంతస్తు లోనిమొదటి భాగానికి అంటే అమ్మవారి పద సన్నిధికి చేరుకుంటాడు .
అంటూ మూక కవి తన మూక పంచశతిని పూర్తి చేశాడు .
ఆర్యాలో 101,పాదారవింద లో 103 ,స్తుతిలో 102 ,కటాక్ష లో 101,మందస్మిత శతకం లో 101 శ్లోకాలున్నాయి మొత్తం 508 శ్లోకాలు మూక పంచశతి లో ఉన్నాయి .ప్రతి శ్లోకం ఆణిముత్యమే .ఊహాపోహ సౌందర్యమే భక్తీ భావ విలసితమే .అమ్మ కరుణా కటాక్ష రసస్నానమే .
భావానికి ఆధారం –డాక్టర్ జయంతి చక్రవర్తి సరళ తాత్పర్యాలతో రచించి గొల్లపూడి వీరాస్వామి సన్స్ ప్రచురించిన ‘’మూక పంచశతి ‘’.
మరొక కవితో కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-16 –ఉయ్యూరు

