–
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
12-నడయాడే దైవం ,ఆధునిక ఆదిశంకరులు -కంచిపరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి
కంచి కామకోటి 68 వ పీఠాదీశ్వ రులు శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ మహా స్వాములవారు సర్వ దేవతా స్వరూపులు .నేలమీద నడిచే దైవం .స్వామి ఉనికి కృత యుగం కంటే గొప్పది –‘’కృతా దవ్యతి రిచ్యతే ‘.స్వామి భక్తిజ్ఞాన వైరాగ్యాల అవతారమే .స్వామి దర్శనం సర్వ దేవతా దర్శనమే .స్వామిని గురి౦చి ఒక భక్త కవి –‘’సమాగతో నా భావ దీక్షణ-ప్రక్షీణ సర్వాక్షమలోమలాన్తరః –నిక్షిప్త చిత్తో భాగవత్యధోక్షజే –ముముక్షు వర్యో భవతి క్షణేన వై ‘’అని స్తుతించాడు –అంటే –‘’మీ కడగంటి చూపులు ప్రసరిస్తే చాలు ఇంద్రియ చాపల్యం నశిస్తుంది .మనస్సు పరి శుద్ధమవుతుంది .అంతఃకరణం మీ పాదపద్మ సంలగ్న మౌతుంది .ఇదంతా మీ కడగంటి చూపు ప్రసరించిన క్షణ కాలం లోనే జరిగిపోతుంది .కంచిలో శ్రీ కామాక్షీదేవి అమ్మవారు స్వామి రూపం లో మనమధ్య నడయాడుతుంది .కాంచీ కామకోటి యతి రాజ దర్శనం తో పునరపి జననం పునరపి మరణం ఉండదని గాఢ మైన విశ్వాసం .చందోలు లోని మహాతపస్సంపన్నులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు స్వామిని ‘’నడుస్తున్న బ్రహ్మ పదార్ధం .వారిని గూర్చి అసలు చెప్పటం అసాధ్యం ‘’.యతో వాచో నివర్తన్తే ‘’అన్న ఉపనిషద్వాక్యం మహా స్వాముల యెడ పూర్ణ సత్యం ‘’అన్నారు .
సూర్యుడు అధి దేవతయై వృశ్చిక రాశికి చెందిన అనూరాధ నక్షత్రం లో మహా స్వామి జన్మించారు .’’నాన్ మురుగన్ ‘’అంటే నేను షణ్ముఖుడు అయిన సుబ్రహ్మణ్య స్వామిని ‘’అని వారే చెప్పుకొన్నారు .స్వామి పూర్వాశ్రమనామం స్వామి నాధుడే అనగా సుబ్రహ్మణ్యేశ్వరుడే .స్వాములందరికి స్వామి స్వామినాధుడు –సుబ్రహ్మణ్యుడే.మధురకవి శ్రీ కాటూరి వెంకటేశ్వర రావు గారు స్వామివారిని ‘’శ్రీమద్భారత కాంచీ –దామాయిత కా౦చి నగర దామునకు నవి –ద్యామయ హరణ సుదాకల-శీ మంజుల దర్శనునకు సిద్ధ పదునకున్ ‘’అని –‘’పరమశమ నిరతునకు శం –కర దేశిక కామకోటి కల్పిత పీఠ-స్థిర మంగళ దీపశ్రీ –చరణునకున్ మాద్రుశ ప్రసన్న శివునకున్ ‘’ అని కైమోడ్పు పలికారు .ఎవరైనా తలిదండ్రులతో స్వామి దర్శనానికి వెడితే ముందుగా తలిదండ్రులకు నమస్కరింప జేసి తరువాత తమకు నమస్కరి౦చ మని సంస్కార యుతంగా చెప్పేవారు .స్వామివారు శంకర భగవత్ పాదుల వారిలా అద్వైత మత ప్రచారాన్ని చేసినా సర్వమత ములు స్వామివారికి సమ్మతములే .ఇతరమతాలకు అద్వైతం అంటే కన్నేర్రగా ఉన్నా అద్వైతానికి దేనిలోనూ విరోధం కనిపించదు .అద్వైతం అంటే ‘’సర్వతః సంఫ్లుతోదక స్థితి ‘’అన్నారు .శివ విష్ణువుల అభేదాన్ని స్వాములవారు తరచుగా చెబుతూకాళిదాస మహాకవి శ్లోకం ఉదహరిస్తారు అని శ్రీ విశాఖ తెలియ జేశారు –‘’ఏకైవ మూర్తి ర్బిభిధే త్రిదాసా –సామాన్య మేషాం ప్రధమావరత్వం – విష్ణో ర్హరస్తస్య హరిః కదాచిత్ –వేదాస్తయోస్తావపి ధాతురాద్యాః’’.’
మనం ఏదో మూట కట్టుకొని ఈలోకానికి వచ్చామని ,ఆ మూటను ఇక్కడే దులిపేసుకొని వెళ్ళిపోవాలని ,దానికి దారి చూపేది త్రిపుర సుందరి అని ,ఆమె అనుగ్రహం కోసం పరితపించమని బోధిస్తారు స్వామి .’’ఆమ్ర తరుమూల వసతే-రాదిమ పురుషస్య నయన పీయూషం –ఆరబ్ద యవ్వనోత్సవ –మామ్నాయ రహస్య మంతరవలంబే’’అన్న మూక కవి శ్లోకాన్ని పదే పదే గుర్తు చేస్తారు .శ్రీ వారి జ్ఞాపక శక్తి పరమాద్భుతం .ఆర్యా ద్విశతి గురించి చెబుతుండగా అదెక్కడ దొరుకుతుందని శ్రీ విశాఖ అడిగినప్పుడు అలవోకగా ‘’వందే గజేంద్ర వదనం –వామాకా రూఢ వల్లభాశ్లిస్టం –కుంకుమ పరాగ శోణ౦-కువలయి నీరజకోరకాపీడం ‘’తో మొదలుపెట్టి చాలా శ్లోకాలు చెప్పారట .ఇది శ్రీ శంకరాచార్యుల ‘’ప్రపంచ సారం ‘’లో ఉన్నదని ఆర్యా వృత్తం లో వ్రాయబదిందని ఎరుక పరచారు .’’వ్యక్తాన్ని సాధన గా చేసుకొని అవ్యక్తాన్ని సాధించాలి ‘’అన్నది స్వామి ముఖ్య బోధ అంటే గురువుద్వారా నే ఏదైనా సాధించాలని భావం .ఉపాసనం అంటే ధ్యానమే –‘’ధ్యానమేవ ఉపాసనం ‘’అంటారు .’’మనం చేసే అన్వేషణే ఆనందం సుఖం ‘’అంటారు .శివాజీ మహారాజు కంచి ఆచార్యులవారికి కనకాభిషేకం చేసి కప్పిన శాలువాను భద్రంగా దాచి తనకు కనకాభి షేకం చేసే సమయం లో బయటకు తీసి కప్పుకొని ఇంతకంటే గొప్ప కనకాభిషేకం ఉంటుందా అని ప్రశ్నించారు .స్వామి నిత్య ఉపవాస కృశి.ఉజ్వల తపోనిస్టాగరిస్టులు,మహా తేజస్వి ,మౌని ,బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవర్తకులు ,మంత్రం ద్రష్ట అయిన రుషి పుంగవులు .ఇవే వారి లోవేలుగుకు ముఖ్య కారణం అంటారు శ్రీ విశాఖ .
మహా తపో సంపన్నులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు పరమాచార్యులపై ‘రచించిన ’ఉపాస్తి ‘’లో
1-స్వస్మై నమః పదమహం కరవాణి వాణి-మత్తో నహీతర దనేక మధైకకం వా
అస్మాదసత్తదధివా స్వరస ప్రాసారా –దావివత్వమాకమః ప్రతి యోగి త్వం త్వం .
2-శ్రీచంద్ర శేఖర పదా౦కిత సంయమీంద్ర-శ్రీ పూజ్య పాద మహనీయ వపుర్విశేషే
నారాయణాధిపద రాఘవ పూర్వ నామ –ప్రహ్వం వపుర్భవతు సంవ్యవహారి హారి .అని సంస్తుతించారు .’అలాంటి మహాస్వాముల జీవిత చరిత్ర తెలుసుకొన్న జీవితం ధన్యం .ఆ చరిత్రతోపాటు వారి గీర్వాణ కవితనూ తరువాత దర్శిద్దాం.
ఆధారం –సాధన గ్రంధ మండలి తెనాలి వారు శ్రీ విశాఖ తో అనువాదం చేయించి ప్రచురించిన ‘’సద్గురు బోధలు -10 వ భాగం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-16 –ఉయ్యూరు
.

