గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
12-నడయాడే దైవం ,ఆధునిక ఆదిశంకరులు -కంచిపరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి -2
జనన విద్యాభ్యాసాలు
కంచికామకోటి 68 వ పీతాదిపతులు శ్రీ శ్రీ చంద్ర శేఖర మహా స్వామి వారు 20-5-1894 న అనూరాధా నక్షత్రం లో తమిళనాడు దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విల్లిపురం లో సనాతన సద్బ్రాహ్మణ కుటుంబం లో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి అనే జిల్లా విద్యాశాఖాధికారి గారి కి ధర్మపత్ని శ్రీమతి మహా లక్ష్మి కి జన్మించారు .ఇలవేల్పు పేరు గా స్వామినాధన్ అనే పేరుపెట్టారు .దక్షిణ ఆర్కాటు జిల్లా లోని తిండివనం లోని అమెరికన్ మిషన్ హైస్కూల్ లో ప్రాధమిక విద్య నేర్చారు .అపూర్వ మేధావి అవటం తో అన్నిటా మొదటి స్థానం పొందేవాడు .1905 లో ఉపనయనం జరిగింది .అన్న సదాశివ శాస్త్రిని అందరూ ‘’శివం సార్ ‘’అని పిలిచేవారు .
మహార్జాతకులు -68 వ పీఠాదిపతులు
తండ్రి స్వామినాధన్ కొడుకు జాతకాన్ని ఒక గొప్ప జ్యోతిష్ శాస్త్ర వేత్తకు చూపించాడు. ఆయన అమాంతం కుర్రాడి పాదాలపై వ్రాలి ‘’ఏదో ఒక రోజు ప్రపంచమంతా ఈ కుర్రాడి పాదాలపై వ్రాలుతుంది ‘’అని చెప్పాడు .కంచి 66 వ పీఠాధిపతి తిన్దీవనం సమీపం లో చాతుర్మాస్య దీక్ష చేస్తున్నారు ..తండ్రి ఈ పిల్లాడితో స్వామి దర్శనం చేసుకొనగా స్వామి ఈ బాలుని పై అవ్యాజ కటాక్షం చూపారు .1907 లో ఈ బాలుడి తండ్రికి అతనిమేనమామ కొడుకుని 67 వ పీఠాదిపతిగా ఎంపిక చేశామని కబురు చేసి రమ్మని ఆహ్వానించారు .అప్పటికే స్వామివారు మసూచికం తో తీవ్రంగా బాధ పడుతున్నారు ఎక్కువ కాలం జీవించే పరిస్థితి లేక చనిపోగాకొత్తగా వచ్చిన 67వ స్వామి కూడా వెంటనే చనిపోగా వెంటనే స్వామినాధన్ ను68 వ అధిపతిగాచంద్ర శేఖర సరస్వతి దీక్షా నామధేయం తో 9-5-1907 న అప్పటికప్పుడు కుంభకోణం మఠంలో పట్టాభిషేకం చేసేశారు .గార్డియన్ గా శ్రీ వెంకట రమణ అయ్యర్ ఉన్నారు .స్వామికి 21 వ సంవత్సరం రాగానే 1915 శంకర జయంతి నాడు పూర్తీ బాధ్యతలతో పీఠాదిపతి అయ్యారు .1913 నుండి 15 వరకు వేద వేదాంగాలను కుంభ కోణం మఠం లో అభ్యసించారు .మహా విద్యావంతులై తపస్సాదనలో ఆధ్యాత్మికాను భవం పొంది జగద్గురువులయ్యారు .ధర్మ శాస్త్రాలన్నీ స్వయం గా చదివి మదించి నిష్ణాతులయ్యారు .
ఆధ్యాత్మిక కార్యక్రమ పరంపర
కాలినడకన ఆసేతు హిమాచల పర్యంతం అనేక సార్లు ప్రయాణం చేసి గ్రామ సీమలలో అద్వైత మత ప్రచారాన్ని చేశారు .ఎన్నో పురాతన దేవాలయాలను పునరుద్ధరించారు .ముఖ్యంగాశ్రీ కాళహస్తి దేవాలయ చరిత్రను త్రవ్వి తీయించి లోకానికి చాటారు .సదాశివ బ్రహ్మేంద్ర యతి సమాధిని మనమదురైలో గుర్తించి వైభవం తెచ్చారు .వేద పాఠ శాలలను నెలకొల్పి వేద విద్యా వ్యాప్తి చేశారు .దీనికోసం వేద రక్షణ నిధిని ఏర్పాటు చేశారు .అన్ని వేద శాఖలలో విద్యార్ధులు చేరేట్లు చేసి శాఖలను పునరుజ్జీవింప జేశారు .అధర్వ వేదం లోని శౌనిక శాఖను ,సామవేదం లోని రనయయిన శాఖలను శిధిలం కాకుండా కాపాడారు .కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ ఏర్పాటు కు నాటి ముఖ్యమంత్రి భక్త వత్సలం అడ్డు పడుతుంటే దాని రూప శిల్పి శ్రీ ఏకనాద్ రానడే పరమాచా ర్యను కలిసి వివరించగా భక్తవత్సలం వెంటనే ఒప్పుకున్నాడు .తిరుపతిలో వేద పరిరక్షణ స్కీం ను తిరుమల తిరుపతి దేవస్థానం తో ఏర్పాటు చేయించిన ఘనత పరమాచార్యుల వారిదే ‘స్వామి వారు రచంచిన ‘’మైత్రీం భజతా ‘’అనే సంస్కృత గీతాన్ని ఐక్య రాజ సమితిలో 23-10-1965 న ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం నాడు భారత రత్న సంగీత సామ్రాజ్ఞి శ్రీమతి ఎం ఎస్. సుబ్బు లక్ష్మి గారు గానం చేసి చిరస్మరణీయం చేశారు .
ఆది శంకరుల దివ్య సేవలో పరమాచార్య
ఆది శంకరాచార్య అంటేమహా స్వామికి అవిపరీతమైన ఆరాధనా భావం ఉంది .అందుకనే శంకరాచార్య జన్మించిన కాలడి ,తిరిగిన ప్రదేశాలైన శ్రీ శైలం ,ప్రయాగ ,రామేశ్వరం లలో స్మ్రుతి చిహ్నాలను నెలకొల్పారు.కాలడి లో కంచి మఠం తరఫున కీర్తి స్థంభంఅనే 8 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఆచార్యుల పాదుకలు మొదలైనవి భద్ర పరచారు .కంచిదగ్గర ఎనతూర్ లో 60 అడుగుల ఆది శంకరాచార్య విగ్రహం ప్రతిస్టిం చారు .స్వామి వారు పీఠాదిపతులుగా ఉన్నకాలాన్ని స్వర్ణ యుగం అంటారు .8-1-19 9 4 న మహా స్వామి మహా సమాధి చెందారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-12-16-ఉయ్యూరు
.

