కృష్ణాజిల్లా రచయితల సంఘం తోడ్పాటు
విజయవాడ పుస్తక మహోత్సవంలో రచయితల స్వీయ ప్రచురణల అమ్మకం. విజయవాడ పుస్తక మహోత్సవం (బుక్ ఎగ్జిబిషన్) సాహితీ సాంస్కృతిక వేదికగా గత 28యేళ్ళుగా పుస్తక సేవ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే! నిర్వాహకులు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారు జనవరి 1 నుండీ 11వరకూ నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవాన్ని ఈ ఏడాది సాహితీ మహోత్సవంగా నిర్వహించే సంకల్పం చెప్పుకున్నారు. అందుకు వారికి అభినందనలు.
ఈ మహోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లా రచయితల సంఘం తన వంతుగా ఈ సాహితీ సేవలో భాగస్వామి అవుతోంది.
ఈ రచయితలు స్వంత ఖర్చుతో అచ్చు వేసుకున్న సాహితీ విలువలు కలిగిన పుస్తకాలను ఈ పుస్తక ప్రదర్శనలో అమ్మకం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ బుక్‘ఫెష్టివల్ సొసైటీ వారు స్టాలును ఉచితంగా ఇచ్చి సహకరిస్తున్నారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
కృష్ణాజిల్లా రచయితల సంఘం ఇప్పటివరకూ 15కు పైగా బృహద్గ్రంథాలను ప్రచురించి, అనేకమంది పరిశోధనాత్మక రచయితలకు చక్కని వేదికను కల్పించింది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను 3 పర్యాయాలు నిర్వహించింది. అసంఖ్యాకంగా జాతీయ సదస్సులు, సభలు, సమావేశాలు నిర్వహించి, భాషోద్యమానికి బాటలు వేసింది. విజయవాడ బుక్ ఫెష్టివల్ సొసైటీ వారి సహకారంతో రచయితల కోసం ఇప్పుడు ఈ పుస్తక విక్రయ సేవా కార్యక్రమం చేపడుతోంది.
రచయితలు స్వంతంగా ప్రచురించుకున్న పుస్తకాలను 50% ధరకే పాఠకులకు అందించాలని, తక్కిన 50% సొమ్మును రచయితకే ఇవ్వాలని కృష్ణాజిల్లా రచయితల సంఘం భావిస్తోంది. స్టాలు నిర్వహణా వ్యయాన్ని కృష్ణాజిల్లా రచయితల సంఘమే భరిస్తుంది.
స్వీయ ప్రచురణలను రచయితలు 10 కాపీలను మాత్రమే పంపవలసిందిగా కోర్తున్నాము. అమ్మకాన్ని బట్టి ఎప్పటికప్పుడు అదనపు కాపీలు అడిగి తెప్పించుకునే అవకాశం ఉంది. ఉన్నత సాహితీ విలువలు కలిగిన పుస్తకాలకు, చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన పుస్తకాలకు ప్రాధాన్యతనీయ వలసిందిగా ప్రార్థన. అనేక రచనలను స్వంతంగా ప్రచురించుకుని ఉంటే, ఒక్కోదానికీ 10 కాపీలకు మించకుండా అన్ని పుస్తకాలనూ పంపవచ్చు.
ప్రాంతాల కతీతంగా తెలుగు రచయిత లందరికీ తమ పుస్తకాలను ఈ ష్టాలులో అమ్మకానికి ఉంచవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. మరిన్ని వివరాలకు అధ్యక్షుడు గుత్తికొండసుబ్బారావు (99440167697), ప్రధాన కార్యదర్శి డా. జి వి పూర్ణచందు (9440172642) లను సంప్రదించవచ్చు.

