గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
15-మహామహోపాధ్యాయ ,భారత రత్న పాండు రంగ వామన్ కాణే
7-5-1880న జన్మించి 8-5-1972 న 9 2 వ ఏట మరణించిన మహా మహోపాధ్యాయ ,భారత రత్న పాండురంగ వామన్ కాణే గొప్ప ఇండాలజిస్ట్ .సంస్కృత మహా విద్వాంసుడు .విద్యా రంగం లో 40 ఏళ్ళు సుదీర్ఘం గా విజయవంతంగా గడిపిన కాణే కు భారత ప్రభుత్వం 1963 లో6,500పేజీల ఉద్గ్రంధం ‘’ధర్మ శాస్త్ర చరిత్ర ‘’(హిస్టరీ ఆఫ్ ధర్మ శాస్త్ర ) రచించి నందుకు భారత దేశ అత్యున్నత జాతీయ పురస్కార౦ ‘’భారత రత్న ‘ ‘అందజేసి గౌరవించింది .చరిత్రకారుడు రాం చరణ్ శర్మ ‘’గొప్ప సంస్కృత పండితుడైన పాండు రంగ కాణే సాంఘిక సంస్కరణలను ప్రోత్సహిస్తూనే సంప్రదాయ శాస్త్రౌన్నత్యాన్ని పరి రక్షించాడు ‘’అని మెచ్చాడు .5 భాగాలుగా ప్రచురింపబడిన ‘’ధర్మ శాస్త్ర చరిత్ర ‘’ప్రాచీన సాంఘిక న్యాయాలు ,ఆచారాలకు విజ్ఞానసర్వస్వం గా నిలిచింది .ప్రాచీన భారతం లో సాంఘిక మార్పు సోపానాన్ని విస్పష్టంగా ఈ గ్రంధం తెలియ జేసింది .
ధర్మ శాస్త్ర చరిత్రను ఇంగ్లీష్ లో రాసి దానికి ఉప శీర్షికగా ‘’ భారత దేశం లో ప్రాచీన ,మధ్యయుగాల మతాలు ,పౌర న్యాయాలు’’ అని పేరు పెట్టాడు. ఈ ఉద్గ్రంధం ఆయన ‘’మాగ్నం ఓపస్’’గాఅంటే – మేధో సర్వస్వం గా భావిస్తారు . పరిశోధనాత్మకమైన ఈ మహా గ్రంధం భారతీయ శిక్షా స్మృతి యొక్క పరిణామ దశలను అనేక శతాబ్దాల లోని గ్రంధాలను వ్రాత ప్రతులను పరిశీలించి రాయ బడింది .1932 లో మొదటిభాగం 1962 అంటే 30 ఏళ్ళ తర్వాత చివరిదైన 5 వ భాగం ప్రచురింప బడ్డాయి .తన రచనకు ఆధారాలను ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే ,భండార్కర్ ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ మొదలైన చోట్ల ల నుండి సేకరించాడు .మహాభారతం ,పురాణాలు, చాణక్యం మొదలైన వన్నీ తిరగేసి లోతుగా తరచి ,సారాన్ని నిక్షిప్తం చేశాడు .ఎంత కఠోర శ్రమ చేశాడో అర్ధమవుతుంది .నిగూఢంగా ఉన్న అనేక రహస్యాలను వెలుగులోకి తెచ్చాడు .రచనలో నాణ్యత ఆయనకు సంస్కృత భాషలో ఉన్న లోతైన పరిజ్ఞానానికి,అవగాహనా శక్తికి దర్పణమై నిలిచింది .వ్యతిరేక భావాలున్న గ్రంధాలను కూడా తృణీకరించి వదిలి వేయకుండా వాటినీ సమగ్రంగా అధ్యయనం చేయటం కాణే పండితుని గొప్ప సంస్కారం .అదేవిజయమై నిలిచి౦ది కూడా .
కాణే పండితుడు సంస్కృతం లో ‘’వ్యవహార మయూఖా ‘’అనే గ్రంధాన్ని రాశాడు .అంతే కాక తన ధర్మ శాస్త్ర చరిత్ర కు విస్తృత ఉపోద్ఘాతం రాసి అందులో తన గ్రంధం లో చెప్పబడిన ముఖ్య విషయాలను తెలియ జేసి దానిపై గొప్ప అవగాహన కల్పించి గ్రంధం పై అభిమానం కలిగేట్లు చేశాడు .ఇంత కష్ట పడి రాసినా సంస్కృతం లోని ‘’ధర్మ ‘’అనే పదానికి ఇంగ్లీష్ లో సమానమైన సరైన పదం దొరకలేదని బాధ పడ్డాడు మహామహోపాధ్యాయ కాణే పండితుడు .సంస్కృత౦ , ఇంగ్లీష్, మరాటీ భాషలలో కాణే పండితుని రచనా సర్వస్వం 15,౦౦౦పేజీలు ఉండటం మహాశ్చర్యం కలిగిస్తుంది.
మూడు భాషలలో చేసిన సాహిత్య కృషికి కాణే పండితుడు ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు నందుకొన్నాడు .బొంబాయ్ యూని వర్సిటి వైస్ చాన్సెలర్ గా పని చేశాడు .కురుక్షేత్రం లో భారతీయ భాషాధ్యయనం కోసం ‘’కురుక్షేత్ర విశ్వ విద్యాలయం ‘’ఏర్పాటు చేయటం లో కాణే పండితుని అకు౦ఠిత దీక్షా ,పట్టుదల, విజయము కనిపిస్తాయి .ధర్మ శాస్త్ర చరిత్ర గ్రంధ౦ 4 వ భాగానికి సంస్కృత అనువాదం విభాగం పరిశోధనకు గాను లో 1956 లో సాహిత్య అకాడెమి అవార్డ్ పొందాడు .భారతీయ విద్యా భవన్ కు గౌరవ సభ్యులుగా కాణే పండితుని నియమించి గౌరవించారు .విద్యా రంగం లో చేసిన సుదీర్ఘ కృషికి కాణే పండితుని రాజ్య సభ సభ్యత్వమిచ్చారు .అన్నిటి కంటే అత్యున్నత మైన ‘’భారత రత్న’’ పురస్కారాన్ని భారత ప్రభుత్వం 1963లో అందించి ఆ మహామహోపాధ్యాయుని భారత రత్నను చేసింది .
భారత రాజ్యాంగం ఇండియాలో ఉన్న సనాతన భావ పరంపరకు గండి కొట్టి భారత ప్రజలకు హక్కులే కాని బాధ్యతలు లేవు అన్న అభిప్రాయం కలిగించింది అని కాణే పండితుని నిశ్చితాభిప్రాయం .సాధికారిక విజ్ఞాన సర్వస్వం అయిన కాణే బృహద్రచన అనేక రాజకీయ దుమారాలకు ఆయువు పట్టు అయింది .కేంద్రం లో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం అధికారం లో ఉండగా ప్రాచీన భారతీయులు ఆవు మాంసం తిన్నారు అన్న విషయం పై రెండు వర్గాలు ఏర్పడి రెండు వైపుల వారూ కాణే గారి ఉద్గ్రంధ౦ లోని భాగాలనే విస్తృతంగా ఉదహరించటం తమాషా అయిన విశేషం .ఈ సమస్య గోవును మాతఃగా పవిత్రంగా చూసే హిందువుల కు చాలా ముఖ్యమై , గోమాంసాన్ని తినటం పై నిషేధం విధించాలని గట్టి పట్టు బట్టారు .రెండవ సమస్య- ప్రాచీన భారతం లో బాలికలకు యజ్ఞోప వీతం వేసుకొనే హక్కు అయిన ఉపనయనం చేసేవారు అని ,కాలక్రమం లోఇటీవలి కాలం లోనే అది మగ పిల్లలకు మాత్రమే హక్కు గా మారింది అనేది …
మహా మహోపాధ్యాయ కాణే పండితుని స్మృతి చిహ్నంగా ఆయన మరణానంతరం ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ము౦బే వారు’’ప్రాచ్య భాషాధ్యయనాన్ని ప్రోత్సాహించటం కోసం ,1974 లో ‘’డా.పి .వి.కాణే ఇన్ స్టి ట్యూట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అండ్ రిసెర్చ్ ‘’సంస్థను స్థాపించారు .అంతేకాక వేద ధర్మ శాస్త్రం,లేక అలంకార శాస్త్రం లో అత్యద్భుత కృషి చేసిన వారికి మూడేళ్ళ కోక సారి డా.పి.వి కాణే స్వర్ణ పతకాన్ని ప్రదానం చేస్తున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-12-16- ఉయ్యూరు
.
—

