భక్త కనకదాసు
‘’మీలో మోక్షానికి ఎవరు అర్హులు ?“‘అని శిష్యులను గురువు వ్యాసరాయలవారు ప్రశ్నిస్తే ‘’నేనే అర్హుడిని ‘’ ‘’అని ధైర్యంగా చెప్పిన కురుబ గౌడ దాస కుటుంబం లో పుట్టిన మహా భక్తుడు కనకదాసు .కర్ణాటకలో హవేరీ జిల్లా బాద గ్రామంలో యుద్ధ సైనికాధ్యక్ష కుటుంబం లో బీర్ గౌడ ,బీచమ్మ దంపతులకు కనకదాసు 1509 లో జన్మించాడు .తనకీర్తనలు ,ఉపభోగాల వలనకర్ణాటక సాహిత్యాన్ని సుసంపన్నం చేసి బాగాప్రసిద్ధమయ్యాడు.
తిమ్మప్ప కనకదాసైన విధం
అసలు పేరు తిమ్మప్ప నాయకుడు బాగా చదువుకొని సమాజాన్ని అన్ని కోణాలలో సూక్ష్మ పరిశిలన చేశాడు కనకదాసు .అతని కీర్తనలో ఒకదాని ప్రకారం కనకదాసు’’ కనక నాయకుడు’’అనేసైన్యాధ్యక్షుడు . ఒక యుద్ధంలో తీవ్రం గా గాయపడ్డాడు కానీ అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది .దీనితో సైన్యానికి గుడ్ బై చెప్పివ్యాసరాయల శిష్యుడై ‘’కనకదాసు ‘’అని గురువు పెట్టిన పేరుకు సార్ధకత తెచ్చి సామాన్యులకు అర్ధమయ్యే కన్నడ భాషలో కీర్తనలు రాస్తూ రచనలు చేస్తూ వేదాంతాన్ని అభ్యసించి మహా కృష్ణ భక్తుడయ్యాడు
నేనే మోక్షానికి అర్హుడిని
యవ్వనం లోనే కనకదాసు నృసింహ స్తోత్రం ,రామధ్యాన మంత్రం ,మోహన తరంగిణి రచించాడు ఆయన ముఖ్య బోధన’’నేను అనేది పోతే అంతా పోతుంది ‘’ఒక రోజు గురువు వ్యాసరాయలు కనకదాసుతో సహా తన శిష్యులను ‘’మీలో మోక్షానికి ఎవరు అర్హులు ?’’అని ప్రశ్నించగా క్షణం ఆలోచించకుండా ‘’నేనే కాదు వీళ్ళెవ్వరూ అర్హులు కాదు ‘’అన్నాడు .గురువు రెట్టించి అడిగినా అదే సమాధానం చెప్పటమేకాదు ‘’నేను మోక్షానికి వెడతానా ?’’అనిగురువు అడిగితె ‘’మీరూ వెళ్ళలేరు ‘’అని ఖచ్చితంగా చెప్పాడు .దీనికి శిష్యులతో సహా గురువుకు కూడా విపరీతమైన కోపం వచ్చింది దాసుమీద. చివరికి గురువు దాసును ‘’నీకు మోక్షానికి వెళ్లాలని లేదా “అని అడగగా ‘’నేను అనేది పోతే అంతాపోతుంది-మోక్షం వస్తుంది ‘’అన్నాడు .శిష్యుడి పరమ వేదాంత భావనకు గురువు పరమానందం పొందాడు .ఆతర్వాత రమణ మహర్షి కూడా ‘’నే నెవరు అని తెలుసుకొంటే అంతా తెలుస్తుంది ‘’అని చెప్పిన సంగతి మనకు తెలుసు .
కనకదాసుకోసం తూర్పు నుంచి పడమరకు తిరిగినఉడిపి శ్రీకృష్ణ విగ్రహం
వ్యాసరాయలు శ్రీ కృష్ణ దేవరాయల గురువు .ఉడిపి లో ఉండేవాడు కనకదాస్సుకూడా గురువుతో అక్కడే ఉన్నాడు .ఉడిపి శ్రీ కృష్ణ దర్శనానికి కనకదాసును బ్రాహ్మణ పూజారులు వ్యాసరాయలు చెప్పినా అనుమతి నిరాకరించారు .కనకదాసు గుడిబయటపడమర వైపు కూర్చుని శ్రీకృష్ణ కీర్తనలుకొన్ని రోజులపాటు భక్తితో పారవశ్యంతో గానం చేశాడు .కానీ కర్కశ హృదయులైన పూజారులకు కనికరం కలగలేదు లోనికి అనుమతించలేదు .ఒక రోజు తూర్పున ఉన్న కృష్ణ విగ్రహం తన భక్తుడికి దర్శనం ఇవ్వాలని ఒక్కసారిగా పడమర వైపుకు తిరగటం, ఆలయం గోడ కూలిపోయి కనకదాసుకు కనకమహాలక్ష్మీ విభుడైన శ్రీ కృష్ణస్వామిదివ్య దర్శనం లభించింది .పూజారులు అప్రతిభులయ్యారు కనకదాసు మహా భక్తికి నీరాజనాలు పలికి సగౌరవంగా ఆలయ ప్రవేశం చేయించారు ..ఉడిపి కృష్ణాలయం ముఖద్వారం తూర్పు వైపున ఉంటుంది .మొదట్లో కృష్ణ విగ్రహమూ తూర్పుకె ఉండేది . కనక దాసుకు దర్శనం ఇవ్వటానికి కృష్ణుడే దిశను మార్చుకున్నాడు .అప్పటి నుంచి ముఖద్వారం తూర్పుకు ఉన్నా ,కృష్ణ విగ్రహం పడమటి వైపే ఉంటోంది .భక్తవరదుడు అంటే ఇదే .ఇప్పుడు ఇక్కడ ఉన్న కిటికీ ని ‘’కనకదాస కిటికీ ‘’అంటారు .ఈ కిటికీ లోంచే ఉడిపి కృష్ణుని దర్శిస్తారు .అంతటి చరిత్ర సృష్టించాడు
కనక మందిరం
మహాభక్తుడైన కనక దాసు . ఆలయ గోపురం ముందు చిన్న గుడిసెలో ఉండేవాడు .తర్వాత దాన్ని ఒకమందిరం లాగా కట్టి ‘’కనక మందిరం ‘’అని పిలుస్తున్నారు మహా భక్తుడైన పురందర దాసు వ్యాసరాయలూ కృష్ణ భక్తులే అయినా కనక దాసుకూ కృష్ణ స్వామికి ఉన్న అనుబంధం అన్నిటికన్నా మించినది .
సామాన్యుల మాన్యకవి ,సంస్కర్త
కనకదాసు ఏది రాసినా సామాన్యులకు అర్ధమయేటట్లు వారికి అందుబాటులో ఉండేటట్లే రాశాడు .ఆయన రాసిన ‘’రామ ధ్యాన చరిత ‘’లో రాగి ధాన్యానికి బియ్యానికి ఉన్న స్పర్థను చక్కగా అభి వర్ణించాడు . రాగి పేద వాళ్ళ ఆహారం. బియ్యం ధనవంతుల ఆహారం .బియ్యం గొప్పదే అయినా రాగిలో పోషకాహార విలువ ఎక్కువ .దీన్నే ఆయన అందులో నిరూపించాడు బీద ,ధనిక భేదాన్ని పేదయైనా వ్యక్తిత్వం లో మిన్న గా ఉండే విధానాన్ని ఇందులో సింబాలిక్ గా చెప్పాడు . .ఆ నాటి సమాజం లో హరిదాసు ఉద్యమం బాగా ఉండేది. దాస సంప్రదాయానికి చెందిన కనకదాసు విస్తృతంగా పర్యటించి ఆ సంప్రదాయ వ్యాప్తి చేస్తూ ప్రజలలో భక్తి ,సామాజిక బాధ్యతా ,సమత్వం పెంపొందించాడు .సామాజిక అంశాలను నీతిని భక్తితో జోడించి చెప్పాడు .తనకీర్తనలలో వర్ణ వ్యవస్థను ఏకిపారేశారు .అందరూ సమానమే అన్నాడు .’’కులకుల వేందు హోడె దాదరి ‘’అన్న కీర్తనలో కులం కులం అని ఎందుకు మొత్తుకొంటారురా అని చివాట్లు పెట్టాడు
కినేగెలే ఆదికేశవ కృతి ముద్ర
ఇవాళ కర్ణాటక హవేరి జిల్లా లోని కాగినేలి లో కొలువై ఉన్న ఆదికేశవ స్వామి కి అత్యంత భక్తుడు కనకదాసు .కనకదాస విరచిత 240 కృతులు సజీవంగా ఉండి కర్ణాటక సంగీత గాయకుల నోటప్రచారమవుతున్నాయి .ఈ కీర్తనలో ముద్ర ‘’కిగినెలే ఆదికేశవ ‘’అని ఉంటుంది . కీర్తనలు రచించటమే కాదు అదో జగత్ సహోదరుల ను ఉన్నతస్థితికి తీసుకు రావటానికి సంఘ సంస్కరణ ఉద్యమాలు చేశాడు .
నిర్యాణం
కనకదాసు జీవిత చరమాంకం లో తిరుపతి లో బాలాజీ సన్నిధి లో గడిపి ,నూరేళ్లు నిండు జీవితాన్ని అనుభవించి 1609 లో శ్రీ కృష్ణ సన్నిధానం చేరుకొన్నాడు .
కనకదాసు 1-నలచరిత్ర 2-నృసింహ స్తోత్రం 3-హరిభక్తిసార 4-రామధ్యాన చరిత్రే 5-మోహన తరంగి కన్నడం లో రచించాడు
విజయనగరమే ద్వారకా నగరం
.కనకదాసు కవిత్వం చక్కని ఉపమానాలతో సహజ సుందరం గా సరళంగా ఉంటుంది .శ్రీ కృష్ణుని ద్వారకా నగరాన్ని విజయనగరం గా పోల్చి విదేశీ రాయబారులు విజయనగరాన్ని వర్ణించిన తీరును దృష్టిలో పెట్టుకొని గొప్పగా వర్ణించాడు .
కనకదాస జయంతి నిర్వహిస్తున్న కర్ణాటక ప్రభుత్వం
కనక దాస జయంతిని కర్ణాటక ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి ప్రభుత్వ కార్యక్రమంగా ప్రతి ఏడాదీ నిర్వహించి ఆమహా భక్త కవిని చిరస్మరణీయుని చేస్తోంది . తీర్ధ యాత్రలు చేసేవారువెయ్యేళ్లనాటి ఉడిపిశ్రీ కృష్ణ దేవాలయానికి వెళ్లి ‘’కనక దాస కిండే(కిటికీ ) ద్వారా ఉడిపి కృష్ణుని సందర్శించి ధన్యులవమని కోరిక.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-9-17-కాంప్ -షార్లెట్-అమెరికా